అవిశ్వాస తీర్మానం అంటే ఏమిటి? లోక్‌సభలో ఏం జరుగుతుంది?

  • పృథ్వీరాజ్
  • బీబీసీ తెలుగు
నరేంద్రమోదీ, చంద్రబాబు

ఫొటో సోర్స్, Nara chanrababu naidu/FACEBOOK

అవిశ్వాస తీర్మానం అంటే.. అధికారంలో ఉన్న ఒక వ్యక్తి కానీ వ్యక్తుల సముదాయం (మంత్రివర్గం/ప్రభుత్వం) కానీ ఆ అధికారాన్ని లేదా పదవిని నిర్వర్తించటానికి అనర్హులని తాము భావిస్తున్నట్లు ప్రవేశపెట్టే తీర్మానం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎన్నికయిన పార్లమెంటుకు నియమిత ప్రభుత్వం మీద ఇక విశ్వాసం లేదని చెప్పే తీర్మానం.

అయితే భారత రాజ్యాంగంలో విశ్వాస తీర్మానం లేదా అవిశ్వాస తీర్మానం అనే ప్రస్తావన ఎక్కడా లేదు. కానీ.. మంత్రి మండలి ఉమ్మడిగా లోక్‌సభకు బాధ్యత వహిస్తుందని 75వ అధికరణ స్పష్టంచేస్తోంది. అంటే.. ప్రధానమంత్రి, ఆయన మంత్రిమండలిని లోక్‌సభలో మెజారిటీ సభ్యులు వ్యతిరేకించరాదని దీనర్థంగా చెప్పుకోవచ్చు.

భారతదేశంలో పార్లమెంటు దిగువ సభ, ప్రత్యక్షంగా ఎన్నికయిన పార్లమెంటు సభ్యులు గల లోక్‌సభలో మాత్రమే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. లోక్‌సభ కార్యకలాపాల నియమావళిలోని 198వ నిబంధన.. అవిశ్వాస తీర్మానం విధివిధానాలను నిర్దేశిస్తోంది.

దీని ప్రకారం.. లోక్‌సభ సభ్యుడు ఎవరైనా సరే రాతపూర్వకంగా అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వవచ్చు. స్పీకర్ ఈ అవిశ్వాస తీర్మానం నోటీసు నిర్దేశిత విధానంలో ఉందని భావిస్తే దానిని సభలో చదవాలి. దీనిని చర్చకు చేపట్టటానికి మద్దతు ఇచ్చేవారందరూ నిలబడాలని కోరాలి.

ఫొటో సోర్స్, Getty Images

అవిశ్వాసం నోటీసుకు కనీసం 50 మంది ఎంపీలు మద్దతు లభించకపోతే ఆ తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరిస్తారు. తీర్మానం ప్రవేశపెట్టటానికి కనీసం 50 మంది ఎంపీలు మద్దతు తెలిపినట్లయితే.. స్పీకర్ తీర్మానాన్ని స్వీకరించి, దానిపై చర్చకు ఒక తేదీ లేదా తేదీలను నిర్ణయిస్తారు. ఆ తేదీ.. నోటీసు ఇచ్చిన పది రోజుల లోపే ఉండాలి.

ఈ తీర్మానంపై చర్చలో ప్రసంగాలకు స్పీకర్ అవసరమని భావిస్తే కాలపరిమితి కూడా నిర్ణయించవచ్చు. ఈ చర్చలో అవిశ్వాస తీర్మానం పెట్టిన వారు, దానికి మద్దతు ఇచ్చిన వారు ప్రసంగిస్తారు. ప్రభుత్వంపై వారు చేసిన ఆరోపణలకు సాధారణంగా ప్రధానమంత్రి కానీ, మంత్రి మండలి సభ్యులు కానీ సమాధానం ఇస్తారు.

ఈ చర్చ ముగిసిన అనంతరం అవిశ్వాస తీర్మానంపై స్పీకర్ ఓటింగ్ నిర్వహిస్తారు. మూజువాణి ఓటు ద్వారా కానీ, సభ్యుల విభజన ద్వారా కానీ ఈ ఓటింగ్ ఉండవచ్చు. అందులో మెజారిటీ సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తే.. ప్రభుత్వం దిగిపోవాల్సి ఉంటుంది. మెజారిటీ సభ్యులు తీర్మానాన్ని వ్యతిరేకిస్తే తీర్మానం వీగిపోతుంది.

ఫొటో సోర్స్, DRSIVAPRASAD/YSAVINASHYOUTH/FB

మోదీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందా?

అవిశ్వాస తీర్మానాన్ని ప్రభుత్వం ఓడించాలంటే.. కనీస మెజారిటీ సభ్యులు ఆ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటువేయాలి. ప్రస్తుత లోక్‌సభ సభ్యుల సంఖ్య 534 గా ఉంది. మరో 10 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అంటే.. ప్రభుత్వం మెజారిటీని నిరూపించుకునేందుకు అవసరమైన సభ్యుల సంఖ్య 268 మంది.

లోక్‌సభలో బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉంది. అందులో బీజేపీకే సొంతంగా స్పీకర్ కాకుండా.. 273 మంది సభ్యులు (ఇద్దరు నామినేటెడ్ సభ్యులతో కలిసి) ఉన్నారు. ఇది కనీస మెజారిటీకన్నా ఐదుగురు ఎక్కువ. టీడీపీ వైదొలగిన తర్వాత కూడా.. మిత్ర పక్షాలతో కలిపి మోదీ సర్కారుకున్న బలం 312 మంది సభ్యులు.

ఈ పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందని, ప్రభుత్వం కూలిపోతుందని ఊహించేవారు ఎవరూ ఉండరు. అయినా.. ప్రస్తుత పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజునే తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా అవిశ్వాస తీర్మానాన్ని ఇవ్వడంతో పాటు టీడీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికింది.

ఫొటో సోర్స్, RAHUL GANDHI/FACEBOOK

నిజానికి గత సమావేశాల్లోనూ టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు అవిశ్వాస తీర్మానాలు ఇచ్చినప్పటికీ అవి చర్చకు రాలేదు. ఈసారి మాత్రం స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించి శుక్రవారం (జూలై 20) ఉదయం 11 గంటల నుంచి రోజంతా చర్చ జరిపేందుకు అంగీకరించారు.

చర్చ ముగిసిన తరువాత తీర్మానంపై ఓటింగ్ ఉంటుంది. దీంతో పాలక, విపక్ష కూటమిలోని పార్టీలన్నీ తమ సభ్యులకు విప్ జారీ చేస్తున్నాయి.

అప్పుడూ ఇప్పుడూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా డిమాండ్‌తో పాటు విభజన చట్టంలోని హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ మోదీ సర్కారుపై టీడీపీ ఈ అవిశ్వాస తీర్మానం ఇచ్చింది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యులు ఇటీవల తమ పార్లమెంటు సభ్యత్వాలకు రాజీనామా చేయటం.. వాటిని స్పీకర్ ఆమోదించటంతో లోక్‌సభలో ప్రస్తుతం ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేనట్టే. అయినా మోదీ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించింది వైసీపీ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)