లోక్‌సభలో వీగిన అవిశ్వాసం.. మోదీ ప్రభుత్వానిదే విజయం

 • 20 జూలై 2018
లోక్ సభ Image copyright loksaba tv

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాసానికి వ్యతిరేకంగా 325 ఓట్లు రాగా, అనుకూలంగా 126 ఓట్లు మాత్రమే వచ్చాయి.

దీంతో తీర్మానం వీగిపోయిందని స్పీకర్ తెలిపారు. సభను వచ్చే సోమవారం ఉదయం 11 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

అవిశ్వాస తీర్మానం మీద లోక్‌సభలో ఉదయం 11:00 గంటలకు చర్చ ప్రారంభకాగా, రాత్రి 10: 59 గంటల వరకు కొనసాగాయి.

పార్లమెంటు వర్షాకాల సమావేశాల ఆరంభంలోనే తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం నోటీసు ఇవ్వగా.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా నోటీసు ఇవ్వటంతో పాటు టీడీపీ అవిశ్వాసానికి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.

కాగా, లోక్‌సభ చరిత్రలో ఇది 27వ అవిశ్వాస తీర్మానం. 15 ఏళ్ల తర్వాత తొలిసారిగా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగింది.

2003లో వాజ్‌పేయి ప్రభుత్వంపై కాంగ్రెస్ అవిశ్వాసం పెట్టింది. ఇప్పటి వరకు ఇందిరాగాంధీ ప్రభుత్వం అత్యధిక సంఖ్యంలో 15 సార్లు అవిశ్వాసం ఎదుర్కొన్నారు.

Image copyright loksaba

22 :50

ఆంధ్రప్రదేశ్ విషయంలో ప్రధాన మంత్రి అవాస్తవ గణాంకాలు, సమాచారంతో మాట్లాడుతున్నారని టీడీపీ ఎంపీ కేశనేని నాని అన్నారు. రైట్ టు రిప్లై కింద ఆయన అవిశ్వాసం చర్చలో మాట్లాడారు.

ఈ రోజు సభలో ప్రధాన మంత్రి గొప్ప హావభావాలతో నటిస్తూ మాట్లాడారని, బాలీవుడ్ సినిమా చూసినట్లు తనకు అనిపించిందని పేర్కొన్నారు. 2014కు ముందు కూడా ఆయన ఇలానే మాట్లాడారని విమర్శించారు.

21 :30

‘సంఖ్యాబలం లేకుండా అవిశ్వాసం ఎందుకు పెట్టారు’

అవిశ్వాస తీర్మానం అనేది ప్రజాస్వామ్యం కల్పించిన గొప్ప వరమని అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అవిశ్వాస తీర్మానంపై జరుగుతున్న చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.

(అవిశ్వాస తీర్మానంపై సభలో చర్చ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తుండగా టీడీపీ ఎంపీలు అడ్డుకున్నారు. ‘సేవ్ ఏపీ’, విభజన హామీలు అమలు చేయాలి. వియ్ వాంట్ జస్టిస్ అంటూ పోడియం వద్దకు దూసుకొచ్చారు. స్పీకర్ వారించినప్పటకీ టీడీపీ ఎంపీలు తమ నిరసనను కొనసాగించారు. ఒక దశలో మోదీ కొద్దిసేపు తన ప్రసంగాన్ని నిలిపివేశారు. అనంతరం వారి నినాదాల మధ్యే తన ప్రసంగాన్ని కొనసాగించారు. )

30 ఏళ్ల తర్వాత పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ పెడితే భూకంపం వస్తుందని ప్రతిపక్షాలు చెప్పాయిని, భూకంపం ఏదీ అని ప్రశ్నించారు. అహంకారపూరిత ధోరిణితోనే ప్రతిపక్షాలు అవిశ్వాసం వైపు వెళ్తున్నాయని విమర్శించారు. సంఖ్యాబలం లేకుండా ప్రతిపక్షాలు ఎందుకు అవిశ్వాసం పెట్టాయని ప్రశ్నించారు.ఇంకా ఆయన ఏమన్నారంటే..

 • నన్ను ప్రధాని సీట్లు కూర్చోబెట్టేది 125 కోట్ల మంది ప్రజలు. ప్రతి పక్షాలు ప్రధాని సీట్లో కూర్చొడానికి తొందర పడుతున్నాయి. విపక్షంలో నాయకత్వ లేమి కనిపిస్తోంది. మోదీని దించేందుకు వాళ్లు ప్రయాస పడుతున్నారు.
 • మేకన్ ఇండియా, జీఎస్టీలపై కూడా ప్రతిపక్షాలకు నమ్మకం లేదు. 18 వేల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం అందించాం. 32 కోట్ల జన్‌ధన్ ఖాతాలు తెరిపించాం. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే చర్యలు చేపట్టాం.
 • దేశ భద్రతకు సంబంధించిన డోక్లాం విషయంలోనూ ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. ఇది సరికాదు. రఫెల్ ఒప్పందం రెండు దేశాల మధ్య జరిగింది. రెండు వ్యాపారుల మధ్య కాదు. సర్జికల్ స్ట్రయిక్‌ను ఎవరైనా తప్పు పడితే దేశం క్షమించదు.
 • అధికారంలో వేరే పార్టీ ఉంటే గద్దె దించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తూనే ఉంటుంది. చంద్రశేఖర్, దేవగౌడ, గుజ్రాల్‌కు ముందు మద్దతిచ్చి వారిని ప్రధాని సీట్లోంచి దింపిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉంది.
 • దేశంలో అస్థిరతను సృష్టించేందుకు వారు ప్రయత్నిస్తూనే ఉన్నారు. వాజ్ పాయ్‌ ప్రభుత్వాన్ని ఒక్క ఓటుతో ఓడించినా తిరిగి ఆయనను ప్రజలు ప్రధాని సీట్లో కూర్చొబెట్టారు.
 • రిజర్వేషన్లు పోతాయి. అట్రాసిటీ చట్టాన్ని తొలిస్తారని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి.
 • పార్లమెంట్ తలుపులు మూసి కాంగ్రెస్ ఏపీని విభజించడం సరైందేనా? తల్లిని చంపి బిడ్డను బతికించారని నాడు చెప్పా.. ఇప్పుడు చెబుతున్నా. తెలుగు తల్లి స్ఫూర్తిని కాపాడాలని ఇప్పుడూ అంటున్నా.
 • ఏపీ, తెలంగాణల మధ్య విభజన వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మేం ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నాం.
 • ప్రత్యేక రాష్ట్ర హోదా విషయంలో 14వ ఆర్థిక సంఘం సిఫారసులు మాకు పరిమితి విధించాయి.
 • 2016 సెప్టెంబర్‌లో ఏపీకి ప్రత్యేక ప్రాకేజీని ప్రకటించాం. అప్పుడు హోదా కన్నా ప్యాకేజీనే ముద్దు అని ఒక టీడీపీ నేత చెప్పారు. ప్యాకేజీని చంద్రబాబు కూడా ఆహ్వానించారు. తరువాత యూటర్న్ తీసుకున్నారు.
 • టీడీపీ మా కూటమి నుంచి బయటకు వచ్చినప్పుడు చంద్రబాబుకు ఫోన్ చేసి వైసీపీ ఉచ్చులో పడ్డారని చెప్పాం.

20:33

పార్లమెంట్‌పై ఏపీ ప్రజలకు నమ్మకం పోతుంది

ఎన్నికల సమయంలో ప్రచారం సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని, ఆంధ్రా ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తామని మోదీ హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటి వరకు నెరవేర్చలేదు అని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక అన్నారు.

చర్చ సందర్భంగా మాట్లాడుతూ, ’’రాష్ట్ర విభజన రోజు ఏపీ చరిత్రలోనే బ్లాక్ డే. పార్లమెంట్ తలుపులు మూసి 20 నిమిషాలలోనే రాష్ట్రాన్ని విభజించారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే మాట మార్చింది. నాలుగేళ్లు అవుతున్నా ప్రత్యేక హోదా పై స్పందించడం లేదు. వెనుకబడిన జిల్లాలకు ఇస్తామన్న నిధులు కూడా ఇవ్వలేదు’’ అని విమర్శించారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే పార్లమెంట్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందని అన్నారు.

20:12

దిల్లీ రాష్ట్ర పరిపాలనలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆప్ ఎంపీ భగవత్ మాన్ అన్నారు. చర్చ సందర్భంగా మాట్లాడుతూ,

‘అచ్చే దిన్’ ఎప్పుడొస్తాయిని ప్రశ్నించారు. కాపాలాదారు చూస్తుండగానే బ్యాంకుల నుంచి కోట్లు కొల్లగొడుతున్నారు. అంటూ మోదీ పాలనపై ఒక కవిత వినిపిస్తూ విమర్శలు చేశారు.

Image copyright loksaba tv

20:00

నాలుగేళ్లు అయినా స్పందన లేదు

నాలుగేళ్లు అయినా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌పై స్పందించడం లేదని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు.

అవిశ్వాస చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లు కాదు 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆనాడు వెంక్యనాయుడు, అరుణ్ జైట్లీ చెప్పారు. ఇప్పుడు ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ, కేంద్రం నాలుగేళ్లైన ప్రత్యేక హోదాపై స్పందించడం లేదు. రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో ఇబ్బంది ఏంటో చెప్పడం లేదు.’’ అని తెలిపారు.

‘‘ ప్రస్తుతం సర్కారు మీదే కానీ, ప్రత్యేక హోదాపై చేసిందేమీ లేదు. విభజన చట్టం అమలులోకి వచ్చి నాలుగేళ్లు అవుతోంది. కానీ, మా సీఎం ఎన్నిసార్లు దిల్లీకి వచ్చినా కేంద్ర మంత్రులు రాష్ట్రానికి ఏమీ చేయడం లేదు.’’ అని విమర్శించారు.

ఒక ప్రధాని ఇచ్చిన మాటను మరో ప్రధాని గౌరవించకపోతే ఎక్కడికి పోవాలని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ పై వాస్తవ విరుద్ధమైన మాటలు మాట్లాడుతున్నారని రామ్మోహన్ నాయుడు అన్నారు.

Image copyright LOKSABA TV

18:36

‘హోదాతో వచ్చే ప్రయోజనాలన్నీ ప్యాకేజీగా ఇచ్చాం‘

ఏ పార్టీకి వ్యతిరేకంగా తెలుగు దేశం పార్టీ ఏర్పడిందో ఇప్పుడు అదే పార్టీతోనే కలిసి నడుస్తోందని బీజేపీ ఎంపీ హరిబాబు అన్నారు.

కాంగ్రెస్ పార్టీతో టీడీపీ కలిసిపోవడం చూసి ఎన్డీయార్ ఆత్మ క్షోభిస్తుందని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనకు చంద్రబాబు లేఖ ఇచ్చి ఇప్పుడు విమర్శిస్తున్నారని అన్నారు.

హోదాతో వచ్చే ప్రయోజనాలన్నీ ప్యాకేజీగా ఇచ్చామని తెలిపారు.

టీడీపీ ఈ రోజు తీసుకున్న నిర్ణయం ఏపీకి మంచిది కాదని అన్నారు. కాంగ్రెస్ నాయకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ రోజే ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు.

‘రాష్ట్ర విభజన జరిగితే రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని బీజేపీ భావించి విభజనకు మద్దతిచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు ఎలాంటి అడ్డంకులు రాకూడదనే మోదీ ప్రభుత్వం తెలంగాణ నుంచి ఏడు మండలాలను తీసుకొని ఏపీలో కలిపింది‘అని హరిబాబు తెలిపారు.

Image copyright LOKSBA TV

16:30

‘విభజన చట్టంలో చాలా అంశాలు అమలు చేశాం‘

నాలుగన్నరకు సభ మళ్లీ ప్రారంభమయ్యాక రాజ్‌నాథ్ సింగ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

ఎన్డీయే కూటమి నుంచి విడిపోయినా చంద్రబాబు తమకు మిత్రుడేనని అన్నారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.1500 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు.

పోలవరం ప్రాజెక్టుకు 6,750 కోట్లు మంజూరు చేశామని వివరించారు. విభజన చట్టంలోని చాలా అంశాలను అమలు చేశామని తెలిపారు. గుంటూరు, విజయవాడ పట్టణాల అభివృద్ధికి రూ.1,000 కోట్లు ఇచ్చామని గుర్తు చేశారు.

2014-15 లో రెవెన్యూ లోటు కింద ఏపీకి 4,117 కోట్లు ఇచ్చామన్నారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రస్తావించిన పలు అంశాలను పరిశీలిస్తామన్నారు.

14వ ఆర్థిక సంఘం సూచన ప్రకారం ప్రత్యేక హోదా రాష్ట్రాలు అనేవి ఉండవని స్పష్టం చేశారు. ఏపీ, తెలంగాణ అభివృద్ధికి సహాయం అందిస్తూనే ఉంటామని తెలిపారు.

15:55

‘ప్రజాస్వామ్యంలో అవిశ్వాసం ప్రజల హక్కు‘

యూపీఏ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు తామెప్పుడూ అవిశ్వాసం ప్రకటించలేదని కేంద్ర‌ హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.

వాజ్‌పేయి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అవిశ్వాసం పెట్టిందని గుర్తు చేశారు. ప్రధాని మోదీ మా అందరితో చర్చించి అవిశ్వాసాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారని తెలిపారు.

పాతికేళ్ల కిందట బీజేపీ అడుగుపెట్టని చోట కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చిందని తెలిపారు. తమ నాలుగేళ్ల పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్సేతర ప్రభుత్వం ఏర్పడిందని చెప్పారు.

ప్రజాస్వామ్యంలో అవిశ్వాసం ప్రజల హక్కు అని తెలిపారు.

అయితే, రాజ్‌నాథ్ ప్రసంగానికి పదే పదే టీడీపీ ఎంపీలు అడ్డుతగలడంతో స్పీకర్ సభను సాయంత్రం నాలుగన్నరకు వాయిదా వేశారు.

నాలుగన్నరకు సభ మళ్లీ ప్రారంభమయ్యాక రాజ్‌నాథ్ సింగ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

Image copyright loksaba tv

14:52

ఏపీ విభజన చట్టాన్ని సవరించాలి: ఎంపీ వినోద్

మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలిపిందని, తెలంగాణ ఆకాంక్షలకు విరుద్ధంగా ఇది జరిగిందని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు.

అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నేరవేర్చలేకపోయిందని అన్నారు. విభజన చట్టాన్ని సవరించి ఏపీలో కలిపిన ఏడు మండలాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని కోరారు.

‘‘ఏపీ విభజన చట్టంలో రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం 180 ఎకరాల భూమిని కేటాయించింది.కానీ, ఇప్పటి వరకు వర్సిటీ ఏర్పాటుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలాగే, బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై కూడా కేంద్రం ఇప్పటి వరకు స్పందించ లేదు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగేళ్లలోనే సచివాలయం, శాసన సభ నిర్మించింది. కానీ, ఉద్దేశపూర్వకంగానే హైకోర్టు ఏర్పాటు చేయడంలో తాత్సారం చేస్తోంది.’’ అని అన్నారు.

14:20

రఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. యూపీఏ ప్రభుత్వం సమయంలోనే రఫెల్ ఒప్పందం జరిగిందని తెలిపారు. సంప్రదాయం ప్రకారం ఒప్పందం వివరాలను బహిర్గతం చేయడం లేదన్నారు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నారు.

14:10

మీరు నన్ను పప్పూ అన్నా.. మీపై నాకు ద్వేషం లేదు: రాహుల్

‘‘రాజ్యాంగాన్ని మార్చాలని మీ మంత్రి మాట్లాడటమంటే.. అది అంబేడ్కర్ మీద దాడి.. అది ఇండియా మీద దాడి’’ అని రాహుల్ అభివర్ణించారు.

‘‘మీలో నా మీద ద్వేషం ఉంది. మీరు నన్ను పప్పు అని ఇంకా అనేక దూషణలు చేయొచ్చు. కానీ నాలో మీ పట్ల ద్వేషం లేదు’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.

అలా చెప్పిన అనంతరం రాహుల్ నడుచుకుంటూ ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లి.. కూర్చునే ఉన్న ఆయనను ఆలింగనం చేసుకున్నారు.

రాహుల్ తిరిగి వెళుతుండగా మోదీ ఆయనను వెనక్కు పిలిచి కరచాలనం చేస్తూ వీపు తట్టి అభినందిస్తూ మాట్లాడారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: మోదీని ఆలింగనం చేసుకుని తిరిగి తన సీట్లోకి వచ్చి కూర్చున్న రాహుల్ గాంధీ సహచర ఎంపీల వైపు చూస్తూ కన్ను కొట్టారు

11:45

దేశంలో మహిళలకు రక్షణ లేదు: రాహుల్

వాయిదా తర్వాత సభ తిరిగి సమావేశమయింది. స్పీకర్ మాట్లాడుతూ.. అవిశ్వాసంపై చర్చ కనుక ఇందులో నేరుగా ఆరోపణలు చేయరాదని.. ఒకవేళ చేసినట్లయితే అందుకు ఆధారాలు ఉండాలని చెప్పారు. మంత్రుల పేర్లు ప్రస్తావించి ఆరోపణలు చేస్తే వారు సమాధానం చెప్పటానికి అవకాశం ఇవ్వాలన్నారు.

రాహుల్ తిరిగి ప్రసంగం ప్రారంభించారు. వాస్తవాలను చూసి భయపడొద్దని వ్యాఖ్యానించారు. దేశంలో మనుషులను కొట్టి చంపుతున్నారు. మహిళలపై దాడులు జరుగుతున్నాయని ప్రస్తావించారు.

‘‘కొన్ని రోజుల కిందట ద ఎకానమిస్ట్ కవర్ పేజీ కథనంలో.. భారతదేశం తన మహిళలకు భద్రత కల్పించలేకపోతోందని పేర్కొంది. విదేశాల్లో ఒక అభిప్రాయం ఉంది.. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సారిగా అది తన మహిళలకు భద్రత లేకుండాపోయింది. మహిళలపై సామూహిక అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇది ఇప్పుడు ఇండియా మీద విదేశాల్లో ఏర్పడుతున్న గౌరవం’’ అని ఆయన విమర్శించారు.

‘‘ఎక్కడ చూసినా దళితులు, ఆదివాసీలు, మైనారిటీలను కొడుతున్నారు.. చంపుతున్నారు. ఈ మైనారిటీలు, ఆదివాసీలు, మహిళలు భారతదేశంలో భాగం కాదా?’’ అని ప్రశ్నించారు.

13:35

ప్రధాని సన్నిహితుడికి రఫేల్ ఒప్పందం కట్టబెట్టారు: రాహుల్

‘‘ప్రధానమంత్రికి కొందరు ధనిక వ్యాపారవేత్తలుకు గల సంబంధం గురించి అందరికీ తెలుసు. వారిలో ఒకరికి రఫేల్ ఒప్పందం ద్వారా రూ. 45,000 కోట్ల మేర ప్రయోజనం చేకూరింది. ఈ కాంట్రాక్టును హాల్ నుంచి, కర్ణాటక యువత నుంచి ఎందుకు లాగేసుకున్నారో ప్రధాని వివరణ ఇవ్వాలి’’ అని రాహుల్ విమర్శించారు.

‘‘తన జీవితంలో ఒక్క విమానం కూడా నిర్మించని, రూ. 35,000 కోట్ల అప్పు ఉన్న ఒక వ్యాపారవేత్తకు.. ఆయకు ప్రధానితో ఉన్న బంధం వల్ల రఫేల్ ఒప్పందం కట్టబెట్టారు’’ అని ఆయన ఆరోపించారు.

‘‘ధనిక వ్యాపారవేత్తలకు ప్రధాని రుణాలు ఇచ్చాక.. రైతుల రుణాల మాఫీ చేయబోమని ఆర్థిక మంత్రి చెప్పారు. పేదలు కష్టాలు పడుతోంటే ధనికుల జేబుల్లో డబ్బులు పెట్టాలని ప్రధాని కోరుకుంటున్నారు’’ అని విమర్శించారు.

‘‘మోదీ చైనా అధ్యక్షుడితో కలిసి గుజరాత్‌లో ఒక నది పక్కన ఊయలలో కూర్చున్నారు. చైనా అధ్యక్షుడు వెనక్కు వెళ్లి డాక్లాంలోకి సైన్యాన్ని పంపిస్తారు. మన సైనికులు తమ శక్తిని చాటి వారిని నిలువరించారు. ఆ తర్వాత మోదీ చైనా వెళ్లి ఎజెండా లేని చర్చలు జరుపుతామని, డోక్లామ్ అంశాన్ని అక్కడ లేవనెత్తబోమని చెప్తారు. అది అజెండా లేని సదస్సు కాదు.. అది చైనా అజెండా. సైనికులు చేసిన పని ప్రధాని చేయలేకపోయారు’’ అని రాహుల్ విమర్శలు ఎక్కుపెట్టారు.

రాహుల్ విమర్శలపై సభలో గందరగోళం చెలరేగటంతో స్పీకర్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.

Image copyright Getty Images

13:30

ఆయన నా కళ్లలోకి చూడలేకపోతున్నారు: రాహుల్

‘‘రఫేల్ ఒప్పందం మీద ఫ్రాన్స్‌తో రహస్య ఒప్పందం ఉందని రక్షణ మంత్రి చెప్పారు. నేను ఫ్రాన్స్ ప్రధానమంత్రిని స్వయంగా కలిశాను. అలాంటి రహస్య ఒప్పందం ఏదైనా ఉందా అని అడిగాను. ఏ ఒప్పందం లేదని ఆయన స్పష్టంగా చెప్పారు’’ అని రాహుల్ పేర్కొన్నారు.

రఫేల్ యుద్ధవిమానాల ఒప్పందం విషయంలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అబద్ధం చెప్పారని రాహుల్ ఆరోపించారు.

‘‘ప్రధానమంత్రి ఒత్తిడి కారణంగా నిర్మలా సీతారామన్ దేశానికి అబద్ధం చెప్పారు. మీరు ఎవరికి సాయం చేస్తున్నారు? ప్రధాని గారూ, నిర్మలా గారూ మాకు చెప్పండి’’ అని వ్యాఖ్యానించారు.

దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. బీజేపీ ఎంపీ అనంత్‌కుమార్ జోక్యం చేసుకుంటూ.. రాహుల్ వ్యాఖ్యలు పరువునష్టం కలిగించేవిగా ఉన్నాయంటూ లోక్‌సభ నియమనిబంధనలను ఉటకించారు.

రఫేల్ ఒప్పందం గురించి తాను ప్రస్తావించిన అంశాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ నవ్వుతూ ఉండటం తాను చూస్తున్నానని రాహుల్ పేర్కొన్నారు.

‘‘కానీ ఆ పెద్దమనిషిలో కంగారు కనిపిస్తోంది. ప్రధాని నా కళ్లలోకి కళ్లు పెట్టి చూడలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన నిజాయితీగా లేరు. ఆయన చౌకీదార్ కాదు.. భాగీదార్ (పరారీ)’’ అని వ్యాఖ్యానించారు.

13:10

ఏటా రెండు కోట్ల ఉద్యోగాలన్నారు.. 4 లక్షల ఉద్యోగాలే ఇచ్చారు: రాహుల్

ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ ప్రసంగం ప్రారంభించారు. ‘‘ప్రతి వ్యక్తి బ్యాంకు ఖాతాలో రూ. 15 లక్షలు.. ఏటా రెండు కోట్ల మంది యువతకు ఉపాధి.. హామీలు ఇచ్చారు’’ అని ప్రస్తావించారు.

‘‘భారతదేశ యువత ప్రధానమంత్రి మీద విశ్వాసం ఉంచారు. కానీ.. కానీ కేవలం నాలుగు లక్షల మందికి మాత్రమే ఉపాధి లభించింది. ఇది వారి హామీల అసలు వాస్తవం’’ అని చెప్పారు. ‘‘ఉపాధి గురించి అడిగితే మీరు ‘పకోడీలు చేసుకోండి.. దుకాణం పెట్టుకోండి’ అని చెప్తారు’’ అని ఎద్దేవా చేశారు.

‘‘మీరు ఏం చేశారు? నల్లధనం తేవటానికి బదులు రాత్రి 8 గంటలకు నోట్లు రద్దు చేశారు ప్రధానమంత్రి. రైతులు, కూలీలు, పేదలు డబ్బు ద్వారా లావాదేవీలు జరుపుకుంటారు. ప్రధానమంత్రి తమను అందరికన్నా పెద్ద దెబ్బ తీశారని సూరత్ ప్రజలు చెప్పారు. నేను చెప్తున్నది కాదు’’ అని పేర్కొన్నారు.

రాహుల్ ప్రసంగించేటపుడు బీజేపీ ఎంపీలు తీవ్ర అభ్యంతరాలు, నిరసనలు వ్యక్తమయ్యాయి.

‘‘మీరు ఐదు జీఎస్‌టీ స్లాబులు తీసుకొచ్చారు. చిన్నపాటి దుకాణదారులపైకి ఆదాయపన్ను అధికారులను ఉసిగొల్పారు. మీరు వారిని నాశనం చేశారు. ఆయన విదేశీ ప్రయాణాలకు, ధనికులైన వ్యాపారవేత్తలతో మాట్లాడటానికే ప్రాధాన్యం ఇస్తారు. కానీ చిన్న వ్యాపారులతో ఎన్నడూ మాట్లాడలేదు. ప్రధానమంత్రి మార్కెటింగ్‌కు ఎంత డబ్బు వ్యయమవుతోందో అందరికీ తెలుసు.. చూస్తున్నారు’’ అని రాహుల్ విమర్శించారు.

12:20

నాడు విభజించిన కాంగ్రెస్‌తోనే ఇప్పుడు టీడీపీ కలిసింది: బీజేపీ

చర్చలో భాగంగా బీజేపీ ఎంపీ రాకేశ్‌సింగ్ మాట్లాడటం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును రూపొందించింది కాంగ్రెస్ పార్టీ అయితే.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అదే పార్టీతో కలిసి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిందని ఆయన విమర్శించారు.

బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరిస్తూ.. కాంగ్రెస్ మీద విమర్శలు ఎక్కుపెట్టారు. దేశంలో అట్టడుగు వర్గాల వారు 70 ఏళ్ల పాటు బాధలు పడ్డారని.. ఇప్పుడు భారతదేశం ప్రపంచ శక్తిగా మారుతోందని పేర్కొన్నారు. 2019లో బీజేపీ మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

అయితే.. మోదీని ఉద్దేశించి టీడీపీ ఎంపీ పరుష పదం ఉపయోగించారంటూ బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఆ పదాన్ని రికార్డుల నుంచి తొలగించాలని రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని తాను పరిశీలిస్తానని స్పీకర్ హామీ ఇచ్చారు.

Image copyright LOKSABHA.NIC.IN/BBC

12:00

లోక్‌సభలో మారిన తాజా బలాబలాలు...

అవిశ్వాసంపై చర్చ ప్రారంభానికి ముందే బిజూ జనతాదళ్ వాకౌట్ చేయటం, తీర్మానంపై ఓటింగ్‌కు దూరంగా ఉండాలని శివసేన నిర్ణయించగా.. జేడీయూ, అన్నా డీఎంకేలు ప్రభుత్వానికి మద్దతు తెలిపాయి.

దీంతో సభలో అధికార, విపక్షాల బలాబలాలు స్వల్పంగా మారాయి.

దేశ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు: మోదీ ట్వీట్

అవిశ్వాస తీర్మానం మీద చర్చపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉదయం ట్విటర్‌లో స్పందిస్తూ.. ‘‘ఈ రోజు మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి చాలా ముఖ్యమైన రోజు. నా సహచర ఎంపీలు నిర్మాణాత్మకమైన, సమగ్రమైన, ఆటంకాలు లేని స్వేచ్ఛాయుత చర్చ జరిగేలా చూస్తారని నేను విశ్వసిస్తున్నా’’ అని పేర్కొన్నారు.

‘‘భారతదేశ ప్రజలను మనల్ని నిశితంగా గమనిస్తుంటారు’’ అని కూడా ఆయన పేర్కొన్నారు.

11:50

మా మద్దతు ప్రభుత్వానికే: నితీశ్

అవిశ్వాస తీర్మానంపై జేడీయూ వైఖరి గురించి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ను ప్రశ్నించగా.. ‘‘మేం ప్రభుత్వం వైపు ఉన్నాం’’ అని ఆయన బదులిచ్చినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది.

అలాగే.. ఈ అవిశ్వాస తీర్మానం కాంగ్రెస్, డీఎంకేలు ప్రవేశపెట్టాయి కాబట్టి దానికి అన్నా డీఎంకే మద్దతిచ్చే ప్రసక్తే లేదని ఆ పార్టీ ఎంపీ వి.మైత్రేయన్ చెప్పినట్లు పేర్కొంది.

మరోవైపు శివసేన ఎంపీలను ఓటింగ్‌లో పాల్గొనకుండా గైర్హాజరు కావాలని ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే నిర్దేశించినట్లు ఆయన సన్నిహితుడొకరు తెలిపారని పీటీఐ వార్తా సంస్థ చెప్పింది.

Image copyright Getty Images

11:40

తానయితే తల్లిని కూడా రక్షించేవాడినన్నారు మోదీ: జయదేవ్

ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం ముఖ్యం అంటూ ‘భరత్ అనే నేను’ సినిమా కథను వివరిస్తూ జయదేవ్ తన ప్రసంగం మొదలుపెట్టారు.

‘‘కాంగ్రెస్ పార్టీ తల్లిని చంపి బిడ్డను రక్షించించింది. నేను ఉన్నట్లయితే తల్లిని కూడా రక్షించేవాడిని’ అని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాలుగేళ్ల పాటు తమ తల్లిని రక్షిస్తారని వేచిచూశారు’’ అని గల్లా జయదేవ్ పేర్కొన్నారు.

‘‘ఇప్పుడు మీరు (ప్రధాని) స్వరం మార్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తగినవిధంగా సమాధానమిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను దగా చేస్తే కాంగ్రెస్ తరహాలోనే బీజేపీ కూడా మట్టికరుస్తుంది. ప్రధాని గారూ ఇది హెచ్చరిక కాదు. ఇది వాస్తవం’’ అని ఆయన పేర్కొన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అప్రజాస్వామికంగా విభజించారని గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు అభ్యంతరం తెలిపారు. తమ తమ స్థానాల్లో నిలుచుని నిరసన తెలిపారు.

‘‘ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని నిర్మించటం కోసం కన్నా.. విగ్రహాల నిర్మించటానికి ఎక్కువ నిధులు ఇచ్చారు. అవసరమైన నిధుల్లో రెండు, మూడు శాతం మాత్రమే ఇవ్వటం హామీలు నిలబెట్టుకోవటం కిందికి రాదు. బీజేపీ జాప్యం చేస్తోంది. తప్పుదోవ పట్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో మా ప్రత్యర్థులతో కుమ్మక్కవుతోంది’’ అని జయదేవ్ విమర్శించారు.

11:20

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అవిశ్వాస తీర్మానం మీద చర్చ ప్రారంభించారు.

అంతకుముందు బిజూ జనతాళ్ లోక్‌సభ నుంచి వాకౌట్ చేసింది.

బీజేపీకి మూడున్నర గంటలు.. టీడీపీకి 13 నిమిషాలు...

లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చకు ఆయా పార్టీల బలాల ప్రాతిపదికగా సమయం కేటాయించారు.

అధికార బీజేపీకి 3:33 గంటల సమయం కేటాయించగా.. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన టీడీపీకి 13 నిమిషాలు సమయం ఇచ్చారు.

ఇక ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి 38 నిమిషాలు, ఏఐఏడీఎంకేకి 29 నిమిషాలు, తృణమూల్ కాంగ్రెస్‌కి 27 నిమిషాలు, బిజూ జనతాదళ్‌కి 15 నిమిషాలు, తెలంగాణ రాష్ట్ర సమితికి 9 నిమిషాలు సమయం కేటాయించారు.


ఈ కథనాలు కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

వారణాసి నుంచి మోదీ, గాంధీనగర్ నుంచి అమిత్ షా.. బీజేపీ జాబితాలో కనిపించని అడ్వాణీ పేరు

టీఆర్ఎస్ అభ్యర్థులు: జితేందర్ రెడ్డి సహా ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు దక్కని టికెట్లు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య: ‘ఎవరి ఒత్తిడి లేని పారదర్శక దర్యాప్తు మాకు కావాలి’

న్యూజీలాండ్ కాల్పులకు ప్రతీకారంగా పాకిస్తాన్‌లో చర్చిని తగలబెట్టారా?

‘మా ఊరిలో పిల్లల్ని కనకూడదు, ఎవరైనా చనిపోతే పూడ్చకూడదు’

గంగా మైదానంలో ‘హిందుత్వ’ పరిస్థితి ఏమిటి

న్యూజీలాండ్ ప్రధాని: ‘అలాంటి వారికి ఆ అవకాశం ఇవ్వం. మాది సురక్షితమైన దేశం’

సిత్రాలు సూడరో: డీకే అరుణ, జయ సుధల.. కండువా మారింది, స్వరం మారింది