బహిరంగ ప్రదేశాల్లో తల్లులు పిల్లలకు పాలిస్తే తప్పేంటి?

  • 21 జూలై 2018
అవ్యాన్‌తో నేహా రస్తోగి Image copyright Neha rastogi

‘‘తల్లి కావడం తప్పా? అలాంటప్పుడు బిడ్డకు పాలివ్వడం కూడా తప్పెలా అవుతుంది? మరెందుకు బహిరంగ ప్రదేశాల్లో పిల్లలకు పాలిస్తే ఏదో నేరం చేసినట్లు చూస్తారు?’’ అని ప్రశ్నిస్తున్నారు నేహా రస్తోగి.

బహిరంగ ప్రదేశాల్లో తల్లుల కోసం బ్రెస్ట్ ఫీడింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ దిల్లీ హైకోర్టులో ఆమె ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. కానీ ఈ సమస్య నేహ ఒక్కరిదే కాదు. ఆమెలా ఎంతో మంది తల్లులు బయటికి వెళ్లినప్పుడు తమ పిల్లలకు పాలివ్వడానికి ఇబ్బందులు పడుతున్నారు.

‘అసలిప్పటి వరకూ ఈ విషయం గురించి ఎవరూ ఎందుకు ఆలోచించలేదని నాకు ఆశ్చర్యం కలుగుతోంది. తల్లులు పిల్లలకు పాలివ్వడం కొత్తేమీ కాదు. అలాంటప్పుడు బహిరంగ ప్రదేశాల్లో దానికి అనువైన సౌకర్యాలు ఉండాలన్న ఆలోచన ఇప్పటిదాకా ఎందుకు రాలేదు’ అంటున్నారు నేహ.

ఆమె వేసిన పిటిషన్ పైన దిల్లీ హైకోర్టు స్పందించింది. అరగంట పాటు దానిపై చర్చ జరిపిన అనంతరం ఆ అంశంపై వివరణ ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికీ, దిల్లీ ప్రభుత్వానికీ, దిల్లీ నగర మున్సిపాలిటీకి నోటీసులు పంపింది.

నేహాకు అవ్యాన్ అనే తొమ్మిది నెలల కొడుకున్నాడు. ‘వాడు పుట్టాకే నేను ఈ బ్రెస్ట్ ఫీడింగ్ కేంద్రాల గురించి ఆలోచించడం మొదలుపెట్టా. అవ్యాన్‌ని తీసుకొని బయటకు వెళ్లినప్పుడు వాడికి పాలివ్వడానికి చాలా ఇబ్బందయ్యేది. స్థలం లేక చాలాసార్లు పాలిచ్చేదాన్ని కాదు. దాంతో వాడు ఆకలితో ఏడ్చేవాడు. ఆ పరిస్థితి వల్లే నాకు ఈ పిటిషన్ వేయాలన్న ఆలోచన వచ్చింది’ అంటున్నారు నేహ.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక భారత్‌లో బహిరంగ ప్రదేశాల్లో పిల్లలకు పాలివ్వడం ఇప్పటికీ తల్లులకు సవాలే

నేహతో పాటు ఆమె భర్త కూడా దిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా సేవలందిస్తున్నారు. పాలిచ్చే కేంద్రాలతో పాటు పిల్లలు, తల్లులు దుస్తులు మార్చుకోవడానికి, పిల్లల డైపర్లు మార్చడానికి కూడా అనువుగా బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాట్లు ఉండాలని ఆమె అంటున్నారు.

దిల్లీలో ఉండే గరిమా అనే మహిళ కూడా ఇలాంటి సమస్యల్నే ఎదుర్కొన్నారు. ‘నా కూతురికి ఇప్పుడు మూడేళ్లు. ఇప్పుడైతే ఫర్వాలేదు కానీ, తను చిన్నగా ఉన్నప్పుడు బయటకు వెళ్తే చాలా ఇబ్బంది పడేదాన్ని. చాలాసార్లు నా బిడ్డ ఏడుస్తూ ఉన్నా పాలివ్వలేని నిస్సహాయ స్థితిలో ఉండేదాన్ని. తల్లుల కష్టం మరో తల్లికే తెలస్తుంది’ అని గరిమా చెబుతున్నారు.

దిల్లీ హైకోర్టులో యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ హరి శంకర్‌ ఈ పిటిషన్‌పై విచారణ జరిపారు. నిజానికి నేహ తన తొమ్మిది నెలల కొడుకు అవ్యాన్ పేరు మీద ఈ పిటిషన్ వేశారు. అంటే ఈ కేసులో ప్రధాన పిటిషనర్ ఆ పిల్లాడే. నేహ గార్డియన్‌గా ఈ కేసును పరిశీలిస్తున్నారు.

Image copyright Neha Rastogi

‘బిడ్డ పుట్టగానే అతడికి రాజ్యాంగ పరంగా అన్ని హక్కులూ లభిస్తాయి. కానీ పిటిషిన్‌పైన సంతకం చేయాలంటే 18ఏళ్లు నిండి ఉండాలి. అలా కాని పక్షంలో బిడ్డ తల్లిదండ్రులు అతడి తరఫున పిటిషన్ వేయొచ్చు’ అని కేసును వాదిస్తున్న అనిమేష్ రస్తోగీ చెబుతున్నారు.

‘మన దేశంలో మహిళల సమస్యల్ని పెద్ద సమస్యలుగా గుర్తించరు. మీరే ఆలోచించండి, తొమ్మిది నెలల పాటు బయటి ప్రపంచానికి దూరంగా ఉన్న మహిళ, బయటికి వెళ్లి ఇలాంటి విషయాలపై పోరాడాలంటే ఎంత ధైర్యం కావాలి? ఆమ మానసిక స్థితి ఎంత బలంగా ఉండాలి? అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు. అందుకే ఆ బాధ్యత నేనే తీసుకున్నా.

మన దేశంలో పొగతాగడం కోసం స్మోకింగ్ జోన్‌లనైతే ఏర్పాటు చేస్తున్నారు. కానీ తల్లీబిడ్డల గురించి మాత్రం పట్టించుకోవట్లేదు’ అని నేహా తన ఆవేదనను బయటపెట్టారు.

చిత్రం శీర్షిక పార్లమెంటులో బిడ్డకు పాలిస్తున్న ఆస్ట్రేలియాకు చెందిన సెనెటర్ లారిసా వాటర్స్

2016లో ఆర్జేడీకి చెందిన రాజ్యసభ ఎంపీ మీసా భారతి తన మూడు నెలల కొడుకును పార్లమెంటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ లోపలికి అనుమతించకపోవడంతో చేసేదేమీ లేక బిడ్డను భర్తతోనే వదిలేసి లోపలికెళ్లారు.

అదే ఆస్ట్రేలియాలో లారీసా వాటర్స్ అనే ఎంపీ తన బిడ్డకు పార్లమెంటులోనే పాలిచ్చి వార్తల్లోకెక్కారు.

ప్రతి రోజూ మెట్రోలో ప్రయాణించే చేతనా అనే మహిళ మాట్లాడుతూ, భారత్‌లో బహిరంగ ప్రదేశాల్లో బిడ్డకు పాలివ్వడం అంత సులువు కాదనీ, మగవాళ్లతో పాటు ఆడవాళ్లు కూడా దాన్ని వింతగా చూస్తారనీ చెప్పారు.

భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కరూ శిశువు దశను దాటే వస్తారనీ, ఆ సమయంలో తమ తల్లులు ఎంత ఇబ్బంది పడుంటారో గుర్తు చేసుకోవాలనీ, కాబట్టి ఈ పిటిషన్‌లో ఎంతో న్యాయం ఉందని సూర్య అనే వ్యక్తి అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు