అవిశ్వాస తీర్మానం: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటం సాధ్యం కాదు.. - నరేంద్ర మోదీ

  • 20 జూలై 2018
నరేంద్ర మోదీ Image copyright LSTV

తనను ప్రధానమంత్రి పదవి నుంచి లేపాలని రాహుల్ గాంధీ తొందరపడుతున్నారని, కానీ తనను ఆయన తప్పించలేరని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు మోదీ సమాధానం ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యల్లో కొన్ని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

‘చంద్రబాబుకు ఫోన్ చేసి చెప్పా’

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఏ మాత్రం తక్కువ చేయం. ఈ విషయంలో మేం కట్టుబడి ఉన్నాం. టీడీపీ ఎంపీ ఒకరు చేసిన ప్రకటన ఇది.. ‘‘ప్రత్యేక హోదా కంటే ఎక్కువ లాభం ప్రత్యేక ప్యాకేజీతో లభిస్తుంది’’ అని. ప్రత్యేక హోదా రాష్ట్రాల కారణంగా ఇతర రాష్ట్రాలకు ఆర్థిక ఇబ్బంది కలగకూడదని 14వ ఆర్థిక సంఘం చెప్పింది. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు, ఆకాంక్షలను గౌరవిస్తుంది. అయితే, 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన సిఫార్సుల కారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యే హోదా విషయంలో ఏమీ చేయలేదు. ప్రత్యేక హోదా ఇవ్వలేం. దాని ద్వారా లభించే ప్రయోజనాలన్నీ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఇస్తాం. ఈ ప్రత్యేక ప్యాకేజీని ముఖ్యమంత్రి కూడా స్వాగతించారు. రాష్ట్ర విభజన చట్టంలో చేసిన హామీలు, ప్రత్యేక ప్యాకేజీలో పేర్కొన్న ప్రతి అంశాన్నీ కేంద్రం అమలు చేస్తుంది.

ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లినప్పుడు చంద్రబాబుకు నేను ఫోన్ చేశాను. ‘‘చంద్రబాబూ నువ్వు వైఎస్సార్ కాంగ్రెస్ ఉచ్చులో చిక్కుకుంటున్నావు’’ అని చెప్పాను. అక్కడ గొడవ.. దానికి పార్లమెంటును వాడుకుంటున్నారు. ఎన్నికలు దగ్గరపడటంతో ఆలోచన మారుతోంది. ఏ ఒక్క రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చినా దాని ప్రభావం వేరే రాష్ట్రంపై పడుతుంది. ఇదే సభలో వీరప్ప మొయిలీ ప్రసంగిస్తూ ప్రత్యేక హోదాను వ్యతిరేకించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం విషయంలో వెనక్కు తగ్గం. వారికి ఏమేం చేయాలో అదంతా చేస్తాం. అభివృద్ధి విషయంలో ఏ అవకాశాన్నీ వదిలిపెట్టం.

Image copyright LSTV

‘టీడీపీది పోరాటం.. టీఆర్ఎస్‌ది పెద్దరికం’

నాకు బాగా గుర్తుంది.. విభజన జరిగిన మొదటి సంవత్సరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ విభజనపై చాలా ఘర్షణ పడేవారు. గవర్నర్, హోం మంత్రి, ఒక్కోసారి నేను వాళ్లతో సమావేశం కావాల్సి వచ్చేది. అప్పుడు తెలుగుదేశం పార్టీ తన శక్తినంతా తెలంగాణకు వ్యతిరేకంగా ప్రదర్శించింది. దాంతో పోరాడేది. దానిని శాంతింపజేసేందుకు, నచ్చజెప్పేందుకు మేం చాలా ప్రయత్నించాం. టీఆర్ఎస్ పెద్దరికాన్ని ప్రదర్శించింది. వాళ్లు అభివృద్ధి చేసుకోవటంలో మునిగిపోయారు. అక్కడ (ఆంధ్రప్రదేశ్‌లో) ఏం జరిగిందో మీకు తెలుసు.

‘అవిశ్వాసం’తో ఆకాశం ఊడిపడుతుందా?

అవిశ్వాస తీర్మానం ప్రజాస్వామ్యంలోని గొప్ప శక్తి. తెలుగుదేశం పార్టీ ద్వారా ఈ తీర్మానం వచ్చింది. వారితో పాటు మరికొందరు ఎంపీలు కూడా దీన్ని సమర్థించారు.

దేశంలో 30 ఏళ్ల తర్వాత పూర్తి మెజార్టీతో ఏర్పాటైన ప్రభుత్వం మాది. దీనికి పూర్తి మద్దతు, విశ్వాసం ఉంది. ఈ నాలుగేళ్లలో ఏమేం చేశామో చెప్పేందుకు ఇదొక అవకాశం. దేశంలో అభివృద్ధిని ఎలా వ్యతిరేకిస్తున్నారో, కొంతమంది వ్యక్తులు ఎలాంటి వ్యతిరేక రాజకీయాలు చేస్తున్నారో.. వారందరి గుట్టు రట్టవుతుంది.

చాలామందికి అర్థం కాని ప్రశ్న ఏంటంటే.. విపక్షాలకు మెజార్టీ లేకపోయినా ఈ అవిశ్వాస తీర్మానం ఎందుకు? దీనిపై చర్చ ఎందుకు? అని.

ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఈ ప్రయత్నాలేంటి? పెట్టిన కొన్ని గంటల్లోనే అవిశ్వాస తీర్మానంపై చర్చ జరక్కపోతే ఆకాశం ఊడిపడుతుందా? భూకంపం వస్తుందా? ఏదో జరిగిపోతోందన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. మోదీ హఠావ్ (మోదీని తప్పించాలి) అంటూ ఏదేదో చెబుతున్నారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: మోదీని ఆలింగనం చేసుకుని తిరిగి తన సీట్లోకి వచ్చి కూర్చున్న రాహుల్ గాంధీ సహచర ఎంపీల వైపు చూస్తూ కన్ను కొట్టారు

‘మీరు నన్ను లేపలేరు.. కూర్చోబెట్టలేరు’

తీరా చర్చ మొదలైంది.. కానీ, ఇంకా ఓటింగ్ జరగలేదు. జయాపజయాలు తేలలేదు. అయినా (రాహుల్ గాంధీ) నా దగ్గరకు వచ్చి ఎంతో ఉత్సాహంగా (సీట్లోంచి) ‘‘లే.. లే.. లే’’ అంటూ నన్ను ఇక్కడి నుంచి లేపడానికి ప్రయత్నించారు. కానీ, మీరు నన్ను ఇక్కడి నుంచి లేపలేరు. కూర్చోబెట్టలేరు. అలా చేయగలిగేది 125 కోట్ల ప్రజలు మాత్రమే. ప్రజాస్వామ్యంలో ప్రజలపై నమ్మకం ఉండాలే కానీ (ఆయనకు) ఇంత తొందరేంటి?

నేను (మాటమీద) నిలబడ్డాను. నాలుగేళ్లు చేసిన పనులతో (దేశాన్ని) నిలబెట్టాను కూడా. నా ఆలోచన (కాంగ్రెస్) వారికంటే భిన్నమైనది.

2019లో (మోదీని) అధికారంలోకి రానివ్వలేం అంటున్నారు. ప్రజలపై విశ్వాసం లేని వారు, తమను తాము దేవుళ్లుగా భావించే వారి నుంచే ఇలాంటి మాటలు వస్తాయి. కానీ, ప్రజలే దేవుళ్లు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉండాలి. 2019లో కాంగ్రెస్‌కు మద్దతు లభిస్తే నేను ప్రధాని అవుతాను. మరి మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి? దీనిపై

ఇది ప్రభుత్వ మద్దతు తెలుసుకునేందుకు పరీక్ష కాదు. కాంగ్రెస్‌కు మద్దతు ఎంత ఉందో తెలుసుకునే పరీక్ష.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)