‘చంద్రబాబు మా మిత్రుడే.. కాంగ్రెస్‌తో టీడీపీ జతకట్టడం చూసి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది’

  • 20 జూలై 2018
హరిబాబు Image copyright LOKSABA TV

ఏ పార్టీకి వ్యతిరేకంగా తెలుగు దేశం పార్టీ ఏర్పడిందో ఇప్పుడు అదే పార్టీతోనే కలిసి నడుస్తోందని బీజేపీ ఎంపీ హరిబాబు అన్నారు. కాంగ్రెస్ పార్టీతో టీడీపీ కలిసిపోవడం చూసి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని ఆయన చెప్పారు.

కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్, టీడీపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో జరిగిన చర్చలో హరిబాబు ప్రసంగిస్తూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనకు చంద్రబాబు లేఖ ఇచ్చి ఇప్పుడు విమర్శిస్తున్నారని అన్నారు.

హోదాతో వచ్చే ప్రయోజనాలన్నీ ప్యాకేజీగా ఇచ్చామని తెలిపారు.

టీడీపీ ఈ రోజు తీసుకున్న నిర్ణయం ఏపీకి మంచిది కాదని అన్నారు. కాంగ్రెస్ నాయకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రాన్ని విభజించిన రోజే ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించారు.

‘ఎన్డీయే నుంచి వైదొలిగినా చంద్రబాబు మా మిత్రుడే.. ప్రత్యేక హోదా రాష్ట్రాలు ఉండవు‘

ఎన్డీయే కూటమి నుంచి విడిపోయినా చంద్రబాబు నాయుడు తమకు మిత్రుడేనని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ విభజన చట్టం అమలు పురోగతిని వివరించారు.

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.1500 కోట్లు ఇచ్చామని ఆయన తెలిపారు.

పోలవరం ప్రాజెక్టుకు 6,750 కోట్లు మంజూరు చేశామని వివరించారు. విభజన చట్టంలోని చాలా అంశాలను అమలు చేశామని తెలిపారు. గుంటూరు, విజయవాడ పట్టణాల అభివృద్ధికి రూ.1,000 కోట్లు ఇచ్చామని గుర్తు చేశారు.

2014-15 లో రెవెన్యూ లోటు కింద ఏపీకి 4,117 కోట్లు ఇచ్చామన్నారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రస్తావించిన పలు అంశాలను పరిశీలిస్తామన్నారు.

14వ ఆర్థిక సంఘం సూచన ప్రకారం ప్రత్యేక హోదా రాష్ట్రాలు అనేవి ఉండవని స్పష్టం చేశారు. ఏపీ, తెలంగాణ అభివృద్ధికి సహాయం అందిస్తూనే ఉంటామని తెలిపారు.

Image copyright LOKSBA TV

‘ప్రజాస్వామ్యంలో అవిశ్వాసం ప్రజల హక్కు‘

యూపీఏ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు తామెప్పుడూ అవిశ్వాసం ప్రకటించలేదని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

వాజ్‌పేయి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అవిశ్వాసం పెట్టిందని గుర్తు చేశారు. ప్రధాని మోదీ తమ అందరితో చర్చించి అవిశ్వాసాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారని తెలిపారు.

పాతికేళ్ల కిందట బీజేపీ అడుగుపెట్టని చోట కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చిందని, తమ నాలుగేళ్ల పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్సేతర ప్రభుత్వం ఏర్పడిందని చెప్పారు.

ప్రజాస్వామ్యంలో అవిశ్వాసం ప్రజల హక్కు అని తెలిపారు.

అయితే, రాజ్‌నాథ్ ప్రసంగానికి పదే పదే టీడీపీ ఎంపీలు అడ్డుతగలడంతో స్పీకర్ సభను సాయంత్రం నాలుగన్నరకు వాయిదా వేశారు.

నాలుగన్నరకు సభ మళ్లీ ప్రారంభమయ్యాక రాజ్‌నాథ్ సింగ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

Image copyright LSTV

ఏపీ విభజన చట్టాన్ని సవరించాలి: టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్

మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలిపిందని, తెలంగాణ ఆకాంక్షలకు విరుద్ధంగా ఇది జరిగిందని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు.

అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నేరవేర్చలేకపోయిందని అన్నారు. విభజన చట్టాన్ని సవరించి ఏపీలో కలిపిన ఏడు మండలాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని కోరారు.

‘‘ఏపీ విభజన చట్టంలో రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం 180 ఎకరాల భూమిని కేటాయించింది.కానీ, ఇప్పటి వరకు వర్సిటీ ఏర్పాటుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలాగే, బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై కూడా కేంద్రం ఇప్పటి వరకు స్పందించ లేదు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగేళ్లలోనే సచివాలయం, శాసన సభ నిర్మించింది. కానీ, ఉద్దేశపూర్వకంగానే హైకోర్టు ఏర్పాటు చేయడంలో తాత్సారం చేస్తోంది’’ అని అన్నారు.

ఈ కథనాలు కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)