ప్రెస్ రివ్యూ: కొత్త '100 నోటు' ఏటీఎంలోకి రావాలంటే '100 కోట్లు' కావాలి

  • 21 జూలై 2018

కొత్త వంద రూపాయల తయారీకి వంద కోట్ల భారం పడింది. కొత్తగా తయారైన నోటు కోసం దాదాపు రెండున్నర లక్షల ఏటీఎమ్‌లకు మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనికి 12 నెలల సమయం పడుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నట్టు 'ఈనాడు' కథనం తెలిపింది. ఆ కథనం ప్రకారం

కొత్త నోట్ల విడుదలలో పొరపాట్లు కొనసాగుతున్నాయని తెలిపారు. కొత్తగా విడుదల చేస్తున్న నోట్ల పరిమాణానికి, ప్రస్తుత నోట్లకు తేడాలున్నందు వల్ల ఏటీఎమ్‌లలో మార్పులు చేయాల్సి వస్తోందని చెప్పారు. దీనివల్ల భారీ వ్యయం, సమయం అవసరం అవుతోందని తెలిపారు. దేశంలోని చాలా ఏటీఎంలు పాత 100, 500, 1000 నోట్ల పరిమాణానికి అనుగుణంగా రూపొందించడంతో వీటికి మార్పులు చేస్తే తప్ప కొత్త నోట్లను అందించే అవకాశం బ్యాంకులకు లభించడం లేదన్నారు.

దేశంలోని ఏటీఎమ్‌లలోకి కొత్త 100 రూపాయల నోట్లు రావాలంటే మొత్తం 2.4 లక్షల ఏటీఎమ్‌లలో మార్పులు చేయాలని, దానికి 100 కోట్ల పెట్టుబడి అవసరమని ఏటీఎమ్‌ కార్యకలాపాల పరిశ్రమ వెల్లడించింది. దీనికి 12 నెలల సమయం పడుతుందని, కొత్త నోట్లతో తమకు సవాళ్లు పెరుగుతూనే ఉన్నాయని వారు అభిప్రాయపడుతున్నారు.

ఏటీఎం కార్యకలాపాలు చూసే సంస్థలు ఇంకా 200 నోటుకు తగ్గట్లు ఏటీఎమ్‌లలో మార్పులే పూర్తి చేయలేదని.. ఇప్పుడు కొత్త 100 నోట్ల జారీకి అనుగుణంగా వాటిని తీర్చిదిద్దాలంటే వారిపై ఒత్తిడి మరింత పెరిగినట్లేనని కథనం చెబుతోంది. కొత్త 100 నోట్లతో పాటు, పాత 100 నోట్లకు కూడా ఏటీఎంలో స్థానం కల్పిస్తూ మార్పులు చేయడం సవాలేనని చెబుతున్నారు.

అత్యున్నత భద్రతా ప్రమాణాలతో సరికొత్త నోటు తీసుకురావడం గర్వించదగ్గ అంశమే కానీ నోటు పరిమాణంలో మార్పుల వల్ల ఏటీఎమ్‌ ద్వారా వాటిని ప్రజలకు అందించడం సంస్థలు కష్టంగా భావిస్తున్నారు.

Image copyright Getty Images

విదేశీ ప్రైవేట్ సంస్థలకు కారు చౌకగా భూముల కేటాయింపు

టీడీపీ ప్రభుత్వం విశాఖ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్‌కు 406 కోట్ల విలువైన 40 ఎకరాల భూమిని 13 కోట్లకే ఔట్ రేట్ సేల్‌కు రాసిచ్చేసిందని సాక్షి దినపత్రిక ఒక కథనంలో తెలిపింది. కమిటీ సూచనలను లెక్క చేయని ముఖ్యమంత్రి, ఐటీ మంత్రి విలువైన భూములను కారుచౌకగా కేటాయించారని ఆరోపించింది.

'సాక్షి' కథనం ప్రకారం… రాష్ట్రంలోని అత్యంత విలువైన భూములను విదేశీ ప్రైవేట్‌ సంస్థలకు కారుచౌకగా కేటాయించడమే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం పని చేస్తోంది. భూముల అప్పగింత వ్యవహారంలో ఉన్నతాధికారుల అభ్యంతరాలు, సూచనలను సైతం ప్రభుత్వ పెద్దలు లెక్కచేయడం లేదు. ఐటీ కంపెనీల పేరిట తక్కువ ధరకే విలువైన భూములను పరాధీనం చేస్తున్నారు. తాజాగా విశాఖపట్నంలో ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ సంస్థకు ఏపీ ప్రభుత్వం 40 ఎకరాలు కేటాయించింది.

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ ప్రధాన కార్యాలయం కేవలం 10 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, ఏపీలో ఆ సంస్థకు 40 ఎకరాలు కేటాయించవద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ ప్రభుత్వానికి చెప్పినట్టు ఈ కథనం తెలిపింది.

మొదట 10 ఎకరాలే కేటాయించాలని, తర్వాత అవసరమైతే మరికొంత భూమిని ఇవ్వచ్చని సూచించిందని చెప్పింది. విశాఖలో ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌కు ఇచ్చే భూమి ధర ఎకరా 10 కోట్లకు పైగా ఉందని, సంస్థ కోరినట్టు ఎకరా 32.50 లక్షలకే కేటాయించవద్దని కమిటీ స్పష్టంగా చెప్పిందని ఈ కథనంలో చెప్పారు. ఏపీఐఐసీ నిర్ణయించిన ధర ప్రకారం ఎకరాకు 2.70 కోట్ల చొప్పున అయినా వసూలు చేయాలని కమిటీ సూచించిందన్నారు.

పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ చేసిన సూచనలను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ పట్టించుకోలేదని ఈ కథనం తెలిపింది. ఫ్రాంక్టిన్‌ టెంపుల్టన్‌ కోరినట్టు ఎకరా 32.50 లక్షల చొప్పున మొత్తం 40 ఎకరాలను ఇచ్చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారని అన్నారు.

మొత్తం 406 కోట్ల విలువైన భూమిని కేవలం 13 కోట్లకే విదేశీ సంస్థకు కేటాయించారని ఆరోపించారు. ఆ భూమిని వెంటనే ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌కు అప్పగించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌ శుక్రవారం జీవో కూడా జారీ చేసినట్టు కథనంలో తెలిపారు. కమిటీ సలహా ప్రకారం ఏపీఐఐసీ నిర్ణయించిన ధరకు భూములను కేటాయించి ఉంటే ప్రభుత్వ ఖజానాకు 108 కోట్లు వచ్చేవని అధికారులు అంటున్నారని చెప్పారు.

విశాఖ రూరల్‌ మండలం మధురవాడలో గతంలో పర్యాటక శాఖకు కేటాయించిన సర్వే నంబర్‌ 409లో 28.35 ఎకరాలు, సర్వే నంబర్‌ 381లో 11.65 ఎకరాలను ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌కు కేటాయించారని ఈ కథనం చెబుతోంది. ఇందులో ఆ సంస్థ ఐటీ కంపెనీలను ఏర్పాటు చేస్తుందని, 2,500 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని ప్రభుత్వం చెబుతోందని తెలిపింది.

రెగ్యులర్‌ కేటాయింపులతో సంబంధం లేకుండా తక్షణం ఆ 40 ఎకరాలను ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌కు ఇచ్చేయాలని జీవోలో స్పష్టం చేసినట్టు చెప్పింది. ఔట్‌ రైట్‌ సేల్‌కు ఇస్తుండడంతో ఆ భూమిపై ప్రభుత్వానికి ఎలాంటి హక్కు ఉండదని, ఐటీ పరిశ్రమలు రాకముందే ఔట్‌ రైట్‌ సేల్‌ చేయడం సరి కాదని అధికారులు అంటున్నట్టు సాక్షి తమ కథనంలో పేర్కొంది.

Image copyright ISC105.Org
చిత్రం శీర్షిక ఓయూ క్యాంపస్‌లోని ఆర్ట్స్ కాలేజీ భవనం

విశ్వవిద్యాలయాల్లో.. పోస్టుల భర్తీ లేనట్లే!

తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీ ఇప్పట్లో లేదని తేలిపోయినట్టు ఆంధ్రజ్యోతి ఒక కథనంలో తెలిపింది. మూడేళ్లుగా వర్సిటీ కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆశలపై యూజీసీ నీళ్లు చల్లిందని చెప్పింది.

ఈ కథనం ప్రకారం... తెలంగాణ ప్రభుత్వ ప్రకటనలతో యూనివర్సిటీ ఖాళీగా ఉన్న ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆశలపై యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ నీళ్లు పోసింది. నియామకాలు చేపట్టవద్దంటూ యూనివర్సిటీలను ఆదేశించింది. రిజర్వేషన్ల యూనిట్‌కు సంబంధించి.. అలహాబాద్‌ హైకోర్టులో దాఖలైన ఓ పిటిషన్‌ ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరడంతో.. యూజీసీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిందని, కోర్టు తీర్పు వచ్చేవరకు.. నియామకాలకు బ్రేక్‌ తప్పదని చెప్పకనే చెప్పిందని ఈ కథనంలో చెప్పారు.

గతంలో విశ్వవిద్యాలయాన్ని యూనిట్‌గా పరిగణనలోకి తీసుకుని పోస్టుల భర్తీలో రిజర్వేషన్లు ఖరారు చేసేవారు. అయితే.. వర్సిటీలోని విభాగాలను యూనిట్లుగా పరిగణించాలంటూ యూజీసీ ఆదేశాలు జారీ చేయడంతో తమకు అన్యాయం జరుగుతుందంటూ పలు వర్గాలు అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించాయి. ఆ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. తాజాగా యూజీసీ ఆదేశాలతో.. తెలంగాణలో ఉన్న 11 విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1,061 అధ్యాపక పోస్టుల భర్తీ ఇప్పట్లో లేదని స్పష్టమైనట్టు ఈ కథనం తెలిపింది.

తెలంగాణ ప్రభుత్వం మూడేళ్ల క్రితమే వర్సిటీల్లో పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకుందని కథనంలో తెలిపారు. 'వారంలో మార్గదర్శకాలు.. నెల రోజుల్లో నోటిఫికేషన్‌.. ఆర్నెల్లలో నియామకాలు..' అంటూ మంత్రి కడియం శ్రీహరితోపాటు.. విద్యాశాఖాధికారులు ప్రకటనలు చేస్తూవచ్చారని అన్నారు. వచ్చేది ఎన్నికల కాలం కావడంతో.. రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇచ్చినా.. పోస్టుల భర్తీకి కోడ్‌ అడ్డంకిగా మారే ప్రమాదాలు లేకపోలేదన్నారు.

ఈలోపు పదవీ విరమణలతో ఖాళీల సంఖ్య పెరగుతుందని, రెండేళ్లలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 90 మంది ప్రొఫెసర్లు రిటైర్‌ అవుతారని గణాంకాలు చెబుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం రెండేళ్ల క్రితమే పోస్టుల భర్తీకి ఆమోదముద్ర వేసిందని, భర్తీ బాధ్యతను ఆయా వర్సిటీల వైస్‌చాన్సలర్లకు అప్పగించిందని ఈ కథనం తెలిపింది. ఏడాదిన్నర క్రితమే ఉత్తర్వులు జారీ అయినా, పోస్టుల భర్తీపై వీసీలు పెద్దగా శ్రద్ధ చూపడం లేదనే ఆరోపణలు ఉన్నాయని చెప్పింది.

చిత్రం శీర్షిక ఉట్నూరులోని ఐటీడీఏ కార్యాలయం

చదువులమ్మ ఒడిలో గిరిపుత్రులు

తెలంగాణలోని గిరిజన విద్యార్థులు చదువుల్లో రాణిస్తున్నారని, వారి అభివృద్ధి కోసం ప్రభుత్వం 3495 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు నమస్తే తెలంగాణ దినపత్రిక తన కథనంలో తెలిపింది. గిరిజన స్కూళ్లు, కాలేజీలో ఉత్తీర్ణత శాతం పెరిగిందని, గిరిజన విద్యార్థులు వివిధ ప్రవేశ పరీక్షలకు హాజరయ్యేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇస్తోందని పేర్కొంది.

ఈ కథనం ప్రకారం... నిన్నమొన్నటి వరకూ సదుపాయాల్లేని స్కూళ్లలో చదువుకున్న గిరిజన విద్యార్థులు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన గిరిజన విద్యాలయాల్లో, మెరుగుపర్చిన హాస్టళ్లలో, అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారని చెప్పారు. కార్పొరేట్ స్కూళ్లతో సమానంగా ఉత్తీర్ణత శాతం సాధించారని తెలిపారు.

కుటుంబం సామాజిక ప్రగతి సాధించడానికి విద్య కీలకమని తెలంగాణ ప్రభుత్వం గుర్తించిందని, గిరిజన విద్యను అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని కథనంలో చెప్పారు. గత నాలుగేళ్లలో ప్రభుత్వం గిరిజన విద్యార్థుల విద్యకు 3,500 వ్యయం చేసిందని పేర్కొన్నారు. దీనిని గిరిజన విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటున్నట్టు చెప్పారు.

గిరిజన విద్యాప్రగతికి కృషి చేస్తున్న ప్రభుత్వం గత నాలుగేళ్లలో విద్యార్థుల ప్రి-మెట్రిక్ స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్, సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ, ఉన్నతవిద్యకు విదేశాలకు వెళ్లిన గిరిజనులకు ఆర్థిక సహాయం, గిరిజన స్టడీ సర్కిళ్ల నిర్వహణ కోసం ఈ నిధులు ఖర్చు చేసినట్టు కథనంలో తెలిపారు.

గిరిజన గురుకుల విద్యాలయాలకే గత నాలుగేళ్లలో 935.34 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. గురుకుల విద్యాలయాల్లో వినూత్న బోధనకు కృషి చేస్తున్న ప్రభుత్వం ఐఐటీ, ఎన్‌ఐటీ, మెడికల్ ప్రవేశపరీక్షలకు తయారయ్యే విద్యార్థులకు ప్రత్యేకశిక్షణ అందిస్తోందని తెలిపారు. తెలంగాణలో గిరిజన విద్యాప్రగతిని పరిశీలించడానికి దేశంలోని కొన్ని రాష్ర్టాలు ఆసక్తి చూపుతున్నట్టు పత్రిక తన కథనంలో పేర్కొంది.

గిరిజన పిల్లల విద్యాభివృద్ధికి వినూత్న విధానాలు అవలంబిస్తున్నామని మంత్రి అజ్మీరా చందూలాల్ చెప్పినట్టు కథనం తెలిపింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా గురుకుల విద్యాలయాలకు నిధులిచ్చి వాటిని అభివృద్ధి చేశామని ఆయన చెప్పారు. వివిధ రంగాల్లో గిరిజనులు అభివృద్ధి సాధించేందుకు సీఎం కేసీఆర్ బడ్జెట్‌లోనూ ప్రాధాన్యం ఇచ్చారన్నారు. 120 మంది గిరిజన విద్యార్థులకు ఐఏఎస్ ప్రిలిమినరీ పరీక్షకు శిక్షణ ఇచ్చామని మంత్రి చెప్పినట్టు కథనం పేర్కొంది.

వ్యవసాయ సంక్షోభం Image copyright AFP

ఆశ నిరాశల నైరుతి

నైరుతి సీజనులో ఆంధ్రప్రదేశ్‌లోని 292 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైనట్టు ప్రజాశక్తి దినపత్రిక ఒక కథనంలో తెలిపింది. సీమలో మూడు వంతులు అనావృష్టి ఉంటే, కడపలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పింది. ఉత్తరాంధ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఊగిసలాడుతోందని కథనంలో పేర్కొంది.

ఈ కథనం ప్రకారం... ప్రస్తుత నైరుతి సీజనులో ఆంధ్రప్రదేశ్‌లో ఆశ, నిరాశలు కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లా నుంచి రాయలసీమ వరకు రాష్ట్రంలోని కింది భాగంలోని ఆరు జిల్లాల్లో వర్షాభావం అంతకంతకూ తీవ్రతరమవుతోంది. కోస్తా మధ్యలోని ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో వర్షాలు ఆశాజనకంగా ఉంటే, ఉత్తరాంధ్ర జిల్లాలు, కృష్ణా, గుంటూరులో ఒకరోజు తక్కువగా, ఒకరోజు ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి.

వారం క్రితం కడప, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదుకాగా ప్రస్తుతం ఆ సంఖ్య ఆరుకు పెరిగినట్టు ఈ కథనం తెలిపింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం జులై 20 సాయంత్రానికి రాష్ట్రంలో మొత్తం 292 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్టు, వాటిలో 74 మండలాల్లో అత్యల్ప వర్షపాతం (లోటు 60 శాతం పైన) నమోదైందని చెప్పింది.

జులై రెండోవారంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ముసురు ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకే పరిమితం కాగా, ప్రస్తుత ద్రోణి ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై ఎక్కువగా ఉందని చెబుతోంది. ఇటు కోస్తాలో ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలోని మొత్తం నాలుగు జిల్లాల్లో తీవ్ర వర్షాభావం కొనసాగుతోందని, కడపలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని కథనం పేకొంది. అత్యల్ప వర్షపాతం నమోదైన కేటగిరీలో ఉన్న కడప జిల్లాలో సాధారణ వర్షంలో 61.3 శాతం లోటు ఉన్నట్టు తెలిపింది.

నైరుతిలో జూన్‌ 1 నుంచి జులై 20 మధ్య సాధారణంగా 189.1 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా 199.6 మిమీ పడింది. రాష్ట్రంలో సగటున 5.6 శాతం ఎక్కువ వర్షం నమోదైంది. కానీ జిల్లాలు, మండలాల విషయంలో పరిస్థితి తారుమారైనట్టు కథనంలో చెప్పారు. ఈ నెల 12 నుంచి వారం రోజుల్లో వర్షాభావం పెరిగిందని, రాయలసీమ అంతటా తక్కువ వర్షం నమోదైందని తెలిపారు.

ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా వర్షాభావం అంతకంతకూ పెరుగుతోంది. సీమలో మొత్తం 234 మండలాల్లో 156 మండలాల్లో (66 శాతం) వర్షాభావంతో ఉన్నాయని కథనం తెలిపింది. సీమలో తక్కువ వర్షపాతం పడిన 156 మండలాల్లో కడప జిల్లాలోని 51 మండలాలున్నాయి. కృష్ణాలో 2, విశాఖలో 6, గుంటూరులో 19, విజయనగరంలో 17, శ్రీకాకుళంలో 12 మండలాల్లో తక్కువ వర్షం నమోదైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)