24న ఏపీ బం‌ద్‌‌కు పిలుపు: జగన్ ప్రెస్‌మీట్‌లో 9 ముఖ్యాంశాలు

  • 21 జూలై 2018
జగన్ Image copyright Getty Images

లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా సభలో వివిధ పార్టీల వైఖరికి నిరసనగా వైసీపీ అధ్యక్షుడు జగన్ మంగళవారం(24న) రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ బంద్‌కు అందరూ స్వచ్ఛందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాకినాడలో జరిగిన మీడియా సమావేశంలో జగన్ మాట్లాడారు. ఆ ప్రెస్‌మీట్‌లో 9 ముఖ్యాంశాలు.

1.ప్రత్యేక హోదాకు, ఆంధ్రప్రదేశ్‌కు మద్దతిస్తూ మాట్లాడిన బీజేపీ నుంచి కాంగ్రెస్ వరకూ సభలో ఒక్కరు కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత, ఆయన ఆమోదంతోనే హోదాకు బదులు ప్యాకేజీ ఇచ్చామన్న ప్రధాని మాటలు చాలా బాధకలిగించాయి.

2. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగంలో అర నిమిషం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన లేదు. ప్రత్యేక హోదా ఇవ్వడం ధర్మమే. మేం వస్తే ఇస్తాం, మీరెందుకు ఇవ్వలేదు అని ఆయన సభలో ప్రశ్నించలేదు.Image copyright facebook

3. సభలో గల్లా జయదేవ్ మాట్లాడినవి గత నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాపై మేం అసెంబ్లీలో, యువభేరిలో, దీక్షల్లో చేసిన ప్రసంగాల్లో మాటలే కదా. కాదా.. అని చంద్రబాబును సూటిగా అడుగుతున్నా.

4. 2014 జూన్‌లో చంద్రబాబు సీఎం అయ్యాక ప్లానింగ్ కమిషన్ డిసెంబర్ 31 వరకూ అమలులో ఉంది. ఏడు నెలలపాటు ఆయన ప్రత్యేక హోదా గురించి ఎందుకు పట్టించుకోలేదు. క్యాబినెట్ తీర్మానం చేసినపుడు దాన్ని పట్టించుకోకపోవడం అన్యాయం అని ఆయనకు అనిపించలేదా?

5. నాలుగు నెలల క్రితం చివరి బడ్జెట్ సమావేశాలు చివరి రోజున వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసి దీక్షకు కూచున్నప్పుడు, చంద్రబాబు కూడా తన ఎంపీలతో రాజీనామా చేయించి దీక్ష ఉంటే దేశమంతా మనవైపే చూసేది. ప్రత్యేక హోదాపై కేంద్రం దిగి వచ్చేది.

6. చంద్రబాబు ఒకవైపు బీజేపీతో యుద్ధం అంటూనే మరోవైపు సామాన్యులకు కూడా సందేహాలు వచ్చేలా ప్రవర్తిస్తున్నారు. మహారాష్ట్ర బీజేపీ ఆర్థిక మంత్రి భార్యకు టీటీడీ సభ్యత్వం ఇచ్చారు. ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్‌లో బాలకృష్ణ పక్కనే వెంకయ్య ఉంటారు. పరకాల ఆయన దగ్గర, నిర్మాలా సీతారామన్ కేంద్రంలో ఉన్నారు. రాజ్‌నాథ్ లాంటి వారు చంద్రబాబుతో బంధం దృఢమైనదని చెబుతున్నారు. ఇది యుద్ధం కాదు, లోపాయికారీగా వేరే జరుగుతున్నాయి.

Image copyright YS Jagan Mohan Reddy/Facebook

7. చంద్రబాబు ఎన్నికలకు ముందు నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసి ప్రత్యేక హోదాకు తూట్లు పొడుస్తారు. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు విడాకులు తీసుకుని ప్రత్యేక హోదాపై తనే పోరాటం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు, అందులో కూడా నిజాయితీ లేదు.

8. అవిశ్వాసం వీగిపోయింది. ఇప్పుడు మీ ఎంపీలతో కూడా రాజీనామా చేయించండి. మొత్తం 25 మంది ఎంపీలు మరోసారి నిరాహారదీక్ష చేద్దాం. కేంద్రం దిగిరాదేమో చూద్దాం. దేశం మనవైపు చూడదేమో చూద్దాం. యుద్ధం అలాగే చెయ్యాలని సామాన్యుడు అడుగుతున్నాడు.

9. విభజన బిల్లులో అన్నీ మే, మే , మే అని పెట్టారు. ఆ రోజున షల్, షల్, షల్ అని పెట్టుంటే ఇప్పుడు బీజేపీకి ఈ వెసులుబాటు ఉండేది కాదు. కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. అందరినీ నమ్మి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు అలిసిపోయారు.

Image copyright facebook/Kalava Srinivasulu
చిత్రం శీర్షిక ఏపీలోని కరవు జిల్లా అనంతపురాన్ని ఆదుకోవాల్సిన కేంద్రం వివక్ష చూపుతోందంటూ ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, ఇతర టీడీపీ నేతలు ఇటీవల దీక్ష చేశారు.

యుద్ధభూమి నుంచి పారిపోయిన పిరికి సైనికులు వైసీపీ వారు : ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు

పార్లమెంటులో పోరాడాల్సిన ఎంపీలను యుద్ధభూమి నుంచి పారిపోయి ఆంధ్రప్రదేశ్‌కు రమ్మని పిలవడం వల్ల ప్రయోజనం ఏముంటుందని ఏపీ మంత్రి, సీనియర్ టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు 'బీబీసీ'తో అన్నారు.

''టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించాలని జగన్ అనడం హాస్యాస్పదం. పోరాడాల్సిన వేదిక పార్లమెంటు.. అలాంటి యుద్ధ భూమిని వదిలేసి ఇంటికి వచ్చేయమంటే ఎలా?

జగన్ అలా చేయడమే కాకుండా యుద్ధం చేస్తున్న మమ్మల్ని కూడా కత్తులు పక్కన పడేసి ఇంటికొచ్చేయమంటున్నారు. ఇప్పుడు రాజీనామాలు చేయించడం వల్ల ఫలితం ఏమొస్తుంది? ఎన్నికలు వస్తాయా? రావు. జగన్ చేయించినట్లే మేం కూడా ఎంపీలతో రాజీనామాలు చేయిస్తే లోక్‌సభలో ఏపీ గళం వినిపించేదెవరు? రాజీనామాలతో సభలో కుర్చీలు ఖాళీ అవడం తప్ప లాభం లేదు'' అని ఆయన అన్నారు.

ప్రత్యేక హోదా, కడప ఉక్కు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి విషయంలో తాము ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మపోరాట దీక్షలు చేశారని.. అవిశ్వాసం తరువాత కూడా తమ పోరాటాలు కొనసాగుతాయని మంత్రి చెప్పారు.

అవిశ్వాసం సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసలు ఉనికిలేకుండా పోయిందని.. ఎంపీలతో రాజీనామా చేయించడమనేది ఆ పార్టీ చేసిన అతి పెద్ద తప్పని ఆయన అన్నారు. ఆ పరిస్థితి చూశాక కూడా పోరాటంలో ఉన్న టీడీపీ ఎంపీలను రాజీనామాలు చేయమనడం నవ్వు తెప్పిస్తోందన్నారు.

బీజేపీ ఏం చెబితే దానికి జగన్ పార్టీ డాన్స్: రఘువీరా

కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తే వారితో కలిసి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధిస్తామంటూ చంద్రబాబు, జగన్ కొత్త పాట అందుకున్నారని కాంగ్రెస్ ఏపీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు.

చంద్రబాబుతో మా సంబంధాలు తెగిపోలేదని హోమంత్రి రాజ్‌నాథ్ చెబితే దానిని కాదని టీడీపీ చెప్పలేకపోయిందన్నారు. బీజేపీ ఏం చెబితే జగన్ పార్టీ దానికి డ్యాన్స్ చేస్తోందని అన్నారు.

వర్షాకాల సమావేశాల్లో అవిశ్వాసం వస్తుందని తెలిసే ఆ పార్టీ తన ఎంపీలతో రాజీనామా చేయించిందని అన్నారు. బీజేపీ హోదా ఇచ్చేది లేదని తేల్చిచెప్పినా, టీడీపీ, వైసీపీ ఉద్యమాన్ని అడ్డు పెట్టుకుని ఓట్ల కోసం నాటకాలు ఆడుతున్నాయని అన్నారు. 2019లో యూపీఏ ప్రభుత్వం వస్తే హోదాపై మొదటి నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)