ఈ ట్రాన్స్‌జెండర్ జడ్జి సుప్రీం కోర్టుకు వెళ్లారు.. ఎందుకంటే

  • 22 జూలై 2018
ట్రాన్స్ జెండర్ Image copyright DILIP KUMAR SHARMA
చిత్రం శీర్షిక సుప్రీంకోర్టులో అసోం తొలి ట్రాన్స్‌జెండర్ జడ్జి పిటిషన్

"ఎక్కువ మంది ట్రాన్స్‌జెండర్లు పెద్దగా చదువుకుని ఉండరు, వాళ్లకు సరైన పని కూడా ఉండదు. అందుకే వాళ్లు రైళ్లలో భిక్షమెత్తుకోవడం, లేదా సెక్స్ వర్కర్‌ కావడం జరుగుతుంటుంది".

అసోంలో మొదటి ట్రాన్స్‌జెండర్ జడ్జిగా నియమితులైన స్వాతి బిధాన్ బరువా మాట్లాడుతూ మధ్యలో ఒక్క క్షణం ఆగారు.

"అంత కష్టపడ్డా ఒక్కోసారి వాళ్లకు కడుపు నిండా తిండి కూడా దొరకదు. అందుకే వాళ్ల జీవితాల్లో మార్పు వచ్చేవరకూ నా పోరాటం కొనసాగిస్తానని" ఆమె చెప్పారు.

2018 జులై 14న స్వాతి బిధాన్ బరువాను గువహటీలోని కామరూప్ జిల్లాలో లోక్ అదాలత్‌ జడ్జి పదవిలో నియమించారు.

అక్కడ లోక్ అదాలత్ 20 మంది జడ్జిల బ్యాచ్‌లో స్వాతి కూడా ఒకరు. దీంతో స్వాతి అసోం తొలి, భారత్‌ మూడో ట్రాన్స్‌జెండర్ జడ్జి అయ్యారు.

Image copyright DILIP KUMAR SHARMA
చిత్రం శీర్షిక లోక్ అదాలత్‌లో జడ్జి స్వాతి

ట్రాన్స్‌జెండర్ జడ్జి

26 ఏళ్ల స్వాతి ట్రాన్స్‌జెండర్ జడ్జిగా నియమితులయ్యారు. కానీ ఈ ఘనతను ఆమె తన అంతిమ విజయంగా అనుకోవడం లేదు.

"2014లో సుప్రీంకోర్టు ట్రాన్స్‌జెండర్‌కు థర్డ్ జెండర్ హోదా ఇచ్చింది. దాంతో ఇక ట్రాన్స్‌జెండర్ల జీవితాల్లో మార్పు వస్తుందని మాకు అనిపించింది. కానీ అలా ఏం జరగలేదు. అందుకే నా నియామకంతో ట్రాన్స్‌జెండర్ల సమస్యలు తొలగిపోయాయని మనం చెప్పలేం". అని స్వాతి చెప్పారు.

"ఇది కచ్చితంగా ఒక చిన్న, పాజిటివ్ అడుగే. ఇది ముందు ముందు మా సమాజంలో మరింత ధైర్యం నిపుతుంది. కానీ, ట్రాన్స్‌జెండర్స్ సంక్షేమం కోసం ఇలాంటి ఎన్నో ఉదాహరణలను సమాజం ముందు ఉంచాల్సుంటుంది. అప్పుడే వారిలో ఒక కొత్త మైండ్‌సెట్ ఏర్పడుతుంది" అని స్వాతి అన్నారు.

ఎన్ఆర్‌సీలో ట్రాన్స్‌జెండర్

అసోంలో ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడిన స్వాతి "అసోంలో ఎన్ఆర్‌సీ(నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్) అప్‌డేట్ చేస్తున్నారు. ఈ నెల 30న దీని ఫైనల్ డ్రాఫ్ట్ ప్రచురిస్తారు. కానీ చాలామంది ట్రాన్స్‌జెండర్ల పేర్లు అందులో రావు. ఈ ట్రాన్స్‌జెండర్లు అందరూ స్థానికులే. కానీ తమ ఇళ్లు వదిలి వెళ్లిపోవడంతో వారి పేర్లు ఓటరు లిస్టు నుంచి తొలగించారు". అని చెప్పారు.

"అయినా, పోలీసుల భయంతో వీళ్లు(ట్రాన్స్‌జెండర్లు) దూరంగా పారిపోతుంటారు. ఇక ఏదో ఒక కారణంతో లిస్టులో పేర్లు కూడా రాకపోతే వాళ్ల కష్టాలు మరింత పెరుగుతాయి. అందుకే నేను సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయాలని నిర్ణయించా" అని స్వాతి తెలిపారు.

థర్డ్ జెండర్ వారికి ఎన్ఆర్‌సీ నుంచి వస్తున్న సమస్యేంటి?

"ట్రాన్స్‌జెండర్లకు వచ్చిన ఈ సమస్య గురించి మేం ఎన్ఆర్సీ నోడల్ అధికారులను కలిశాం, వాళ్లు మాకు పోయిన జనవరి రెండో వారంలో జరిగే ఒక సమావేశానికి పిలుస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జులై కూడా వచ్చింది. అందుకే సుప్రీంకోర్టు మాత్రమే మా సమస్యలను పరిష్కరించగలదు" అని స్వాతి జవాబిచ్చారు.

Image copyright DILIP KUMAR SHARMA
చిత్రం శీర్షిక ట్రాన్స్‌జెండర్ జడ్జ్ స్వాతి

సెక్స్ రీఎసైన్మెంట్ సర్జరీ

స్వాతికి చిన్నప్పటి నుంచీ తన ఆత్మ వేరే శరీరంలో ఉన్నట్టు అనిపిస్తుండేది. ఆమె తనను అబ్బాయిగా అనుకునేది కాదు. అమ్మాయిలు ఆకర్షణగా కూడా అనిపించేవారు కాదు.

దాంతో ఆమె తన మనసులో నేనొక అమ్మాయినే అనుకుంటూ వచ్చింది.

"నాకు 12 ఏళ్ల వయసుకే లిప్‌స్టిక్ వేసుకోవడం, గోళ్లు పెంచుకోవడం, అమ్మాయిల్లా బట్టలు వేసుకోవడం, అందంగా అలంకరించుకోవడం బాగా అనిపించేది. కానీ ఇంట్లో వాళ్లకు ఆ విషయం తెలిసి నన్ను చితకబాదారు. ఆ తర్వాత ఒక రకంగా నన్ను ఇంట్లోనే బంధించారు". అని స్వాతి చెప్పారు.

"ఎవరైనా బంధువులు వస్తే నన్ను వాళ్లతో కలవనిచ్చే వారు కాదు. నేను నా వాస్తవ రూపం సాధించుకోడానికి ప్రతి వ్యక్తితో పోరాటం చేయాల్సి వచ్చింది". అని స్వాతి అంటారు.

తర్వాత రీఎసైన్‌మెంట్ సర్జరీ చేసుకుని అబ్బాయి నుంచి అమ్మాయిగా మారాలని ఇంటి నుంచి పారిపోయానని, ముంబయి చేరుకున్నానని స్వాతి చెప్పారు.

స్వాతి కుటుంబం

కానీ స్వాతి కుటుంబ సభ్యులు ఆమె నిర్ణయాన్ని ఒప్పుకోలేదు. దాంతో ఆమె అమ్మాయిగా మారేందుకు బాంబే హైకోర్టుకు అపీల్ చేసుకోవాల్సి వచ్చింది.

చివరికి 2013లో సర్జరీ జరిగిన తర్వాత బిధాన్ నుంచి స్వాతిగా మారింది. చాలాకాలం పాటు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులు కూడా స్వాతిని దగ్గరికి తీసుకున్నారు.

స్వాతి తన అమ్మనాన్నలతో గువహటీ నగరంలోని పాండులో ఉంటుంది. ఆమె తల్లి గృహిణి. నాన్న రైల్వే శాఖలో ఉద్యోగి. ఆమె అన్నయ్య ఒక బ్యాంక్ అధికారి.

స్వాతి బీకాం చేశాక లా చదివారు. ప్రస్తుతం ఆమె లోక్ అదాలత్‌లో నగదు లావాదేవీలకు సంబంధించిన కేసులను విచారిస్తున్నారు.

జడ్జిగా తన తొలి రోజు అనుభవాన్ని గుర్తు చేసుకున్న స్వాతి "నేను మా ఇంటి నుంచి టాక్సీలో కోర్టుకు వెళ్లాను. కోర్టు పదిన్నరకు మొదలవుతుంది. కానీ నేను అరగంట ముందే అక్కడికి వెళ్లా, అక్కడ తమ కేసుల విషయమై వచ్చిన వాళ్లంతా నాతో మామూలుగా ఒక జడ్జితో మాట్లాడినట్టే మాట్లాడారు. నేను నా మొదటి రోజు 25 వివాదాస్పద కేసులు విచారించాను. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. మనం ఏదైనా గౌరవప్రదమైన స్థానంలో ఉంటే ప్రతి ఒక్కొక్కరి దృష్టీ మారుతుంది" అన్నారు.

Image copyright DILIP KUMAR SHARMA
చిత్రం శీర్షిక లోక్ అదాలత్‌లో కేసుల విచారణ

ట్రాన్స్‌జెండర్ సమాజం

"స్వాతి బిధాన్ బరువా నియామకం మొత్తం ట్రాన్స్‌జెండర్ల సమాజానికి చాలా సంతోషకరమైన విషయం. ఆమె ఈ సమాజం కోసం చాలా చేశారు. న్యాయపోరాటం కూడా చేశారు. స్వాతి బిధాన్ బరువాను అంగీకరించడం అంటే మొత్తం ట్రాన్స్‌జెండర్ల సమాజాన్ని ఆమోదించినట్టే" అని ట్రాన్స్‌జెండర్స్ హక్కుల సాధన కోసం పని చేస్తున్న ఆశిష్ కుమార్ అన్నారు.

ఆయన "మేం చాలా ఆశావాదులం. అసోంలో ఇకమీదట ట్రాన్స్‌జెండర్లను గౌరవంగా చూస్తారనే అనుకుంటున్నాం" అన్నారు.

"ఏదైనా ఒక సమాజంలో వారిని ఇలాంటి పదవుల్లో నియమిస్తే, ఆ సమాజం మనోబలం మరింత పెరగడానికి అవి తోడ్పడుతాయి" అని గువహటీ హైకోర్ట్ సీనియర్ వకీల్ హఫీజ్ రషీద్ అహ్మద్ చౌధరి కూడా అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)