'సాయం చేయాల్సింది పోయి మోదీ మమ్మల్ని అవమానిస్తున్నారు'

 • 21 జూలై 2018
చంద్రబాబు Image copyright Facebook/Chandrababu Naidu

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.

అవిశ్వాసానికి వ్యతిరేకంగా 325 ఓట్లు రాగా, అనుకూలంగా 126 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు దిల్లీలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతున్నారు. తాము నిన్న మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రవేశపెట్టామో చెబుతున్నారు. ఆ ప్రెస్ మీట్ లైవ్ అప్‌డేట్స్. చంద్రబాబు మాటల్లోనే..

 • నేను అవిశ్వాసం ఎందుకు ప్రవేశపెట్టామో.. ప్రభుత్వం నుంచి ఏమి ఆశించామో చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టాను.
 • అవిశ్వాసానికి మద్దతు ప్రకటించి అన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ సభ్యులకు ధన్యవాదాలు.
 • ప్రధాని నోట్ల రద్దు ప్రకటించారు. ఏటీఎంలలో మీకు డబ్బులు దొరుకుతున్నాయా? (విలేఖర్లనుద్దేశించి). ఏపీలో దొరకడం లేదు. పింఛనుదారులకు, ఉపాధి హామీ కూలీలకు నగదు దొరకడం లేదు. కొత్త చట్టం వల్ల ప్రజలకు బ్యాంకులపై నమ్మకం పోతోంది.
 • అహ్మదాబాద్ టు ముంబయి మెట్రోకి లక్షకోట్లు ఇస్తున్నారు. అక్కడ వయబులిటీ గురించి ప్రశ్నలేదు. కానీ మా విషయంలో అడుగుతున్నారు.
 • ఇతర రాష్ర్టాలకు పెద్దఎత్తున ఇచ్చారు. మాకు చాలా తక్కువ ఇస్తున్నారు. కడప స్టీల్ ప్లాంట్ లాభదాయకం. కానీ వారు 60 శాతం ఐఆర్ఆర్ అడుగుతున్నారు. అది సాధ్యమా?
 • విభజన వల్ల 16వేల కోట్లు మేం నష్టపోయాం. దాన్నడిగితే కేంద్రం 4వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. దిల్లీకన్నా గొప్ప రాజధానని చెప్పి కేవలం రూ.1500 కోట్లు ఇచ్చారు. కానీ నాపై శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అమరావతి వల్ల లాభం కేంద్రానికే. పారిశ్రామికీకరణ, పట్టణీకరణతో వారు లాభం పొందుతున్నారు. మరి సాయం చేయడానికి బాధ్యతలేదా?
 • పోలవరానికి కేంద్రం 100 శాతం నిధులు ఇవ్వాలి. 57 శాతం పని పూర్తయింది. కేంద్రం నిధులిస్తే వెంటనే ప్రాజెక్టు పూర్తవుతుంది. 2300 కోట్లు మేం ఖర్చు పెట్టాం. కేంద్రం నుంచి రావాల్సి ఉంది.
 • మేం గాయపడ్డాం. చాలా బాధపడ్డాం. కానీ మీరు (మోదీ) మమ్మల్ని అవమాన పరుస్తున్నారు. మీరు మద్రాస్ రాష్ర్టం నుంచి ఏపీని ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత విభజించారు. మళ్లీ మేం భారీ లోటుతో ప్రయాణం ప్రారంభించాం. మీరు (మోదీ) మాకు సాయం చేయాల్సింది పోయి.. అవమానించడం సరికాదు.


Image copyright FACEBOOK/AndhraPradeshCM
 • మేం 5 కోట్ల మంది ఉన్నాం. ఆయనకు పూర్తి మెజారిటీ వచ్చింది. అప్పుడు ఆ ప్రభుత్వంలో మేం భాగస్వాములం కూడా. అదే సమయంలో 15 ఏళ్ల తర్వాత ప్రతి పక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టాయి. వారికి మెజారిటీ ఉందని తెలుసు.
 • గతంలో మేం ఎప్పుడూ కేంద్ర కేబినెట్‌లో జాయిన్ కావాలని అనుకోలేదు. వాజ్‌పేయి ప్రభుత్వంలోనూ మేం కేవలం స్పీకర్‌గా ఉన్నాం. ఈ సారి మేం ఏపీకి అన్యాయం జరిగిందని కేంద్ర కేబినెట్‌లో చేరాం. 29 సార్లు నేను దిల్లీకి వచ్చి పదేపదే ఏపీకి న్యాయం చేయండని కోరాను.
 • ఈశాన్య రాష్ర్టాలకు ఇచ్చిన రాయితీలు మాకు ఎందుకు ఇవ్వరని అడుగుతున్నాను? కనీసం అయిదేళ్లు కూడా మాకు ఎలాంటి సాయం చేయలేదు.
 • ఎన్డీయే నుంచి బయటకు వచ్చేటపుడు ప్రధాని కార్యాలయానికి ఫోన్ చేశాను.. ఆలస్యం వల్ల ఆయన అందుబాటులోకి రాలేదు. తర్వాతి రోజు మోదీ కాల్ చేశారు. మీరు వైకాపా ట్రాప్‌లో పడుతున్నారు అని మోదీ చెప్పారు. నేను మంచి చేస్తున్నన్ని రోజులూ ఏం కాదని చెప్పాను. ప్రధాని టీడీపీని వైకాపాతో ఎలా పోల్చుతారు? ప్రధాని నన్ను అవినీతిపరులతో ఎలా పోల్చుతారు?
 • హైదరాబాద్ నా బ్రెయిన్ చైల్డ్. హైదరాబాద్‌ను నేను అభివృద్ధి చేశాను. అది నా విజన్. హార్డ్ వర్క్. ఇప్పుడు హైదరాబాద్ ఒక ఉత్తమ నగరం. ఒక స్థాయిలో బిల్ గేట్స్.. నాకు 10 నిమిషాలు టైం ఇచ్చి 40 నిమిషాలు భేటీ అయ్యారు. అప్పుడు భారత్ ఐటీలో చాలా స్ర్టాంగ్ అని చెప్పాను.
 • ఆర్థిక సంఘం.. జీఎస్టీ గురించి ప్రధాని చెప్పారు. కానీ గతంలో 11 రాష్ర్టాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు. ఆర్థిక సంఘం ఏం చెప్పింది.. వారు ఎక్కడా ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పలేదు.
 • మీరిచ్చిన (మోదీ ఇచ్చిన) హామీలను నిలబెట్టుకునే బాధ్యత మీకు లేదా? మీరు ఎలా సమర్థించుకోగలరు. గతంలో 18 హామీలు ఇచ్చారు. మొదటి హామీ ప్రత్యేక హోదా. కానీ ఇప్పుడు వీరు కొన్ని వివరణలు ఇస్తున్నారు. నిన్న కూడా లోక్‌సభలో కాంగ్రెస్ ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించింది. బిడ్డను కాపాడాలని తల్లిని చంపారని ప్రధాని మోదీ అన్నారు. మరి ఇప్పుడు ఆ తల్లిని కాపాడాలని కోరుతున్నాం.
 • జీఎస్టీ గ్రోత్‌లో ఏపీ నంబర్ 1. నాలుగేళ్లలో మేం 10 శాతంపైగా వృద్ధి నమోదు చేశాం.
Image copyright Getty Images

24న రాష్ట్ర బంద్: జగన్

లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా సభలో వివిధ పార్టీల వైఖరికి నిరసనగా వైసీపీ అధ్యక్షుడు జగన్ మంగళవారం(24న) రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ బంద్‌కు అందరూ స్వచ్ఛందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాకినాడలో జరిగిన మీడియా సమావేశంలో జగన్ మాట్లాడారు.

‘‘ప్రత్యేక హోదాకు, ఆంధ్రప్రదేశ్‌కు మద్దతిస్తూ మాట్లాడిన బీజేపీ నుంచి కాంగ్రెస్ వరకూ సభలో ఒక్కరు కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత, ఆయన ఆమోదంతోనే హోదాకు బదులు ప్యాకేజీ ఇచ్చామన్న ప్రధాని మాటలు చాలా బాధకలిగించాయి.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగంలో అర నిమిషం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన లేదు. ప్రత్యేక హోదా ఇవ్వడం ధర్మమే. మేం వస్తే ఇస్తాం, మీరెందుకు ఇవ్వలేదు అని ఆయన సభలో ప్రశ్నించలేదు.

అవిశ్వాసం వీగిపోయింది. ఇప్పుడు మీ ఎంపీలతో కూడా రాజీనామా చేయించండి. మొత్తం 25 మంది ఎంపీలు మరోసారి నిరాహారదీక్ష చేద్దాం. కేంద్రం దిగిరాదేమో చూద్దాం. దేశం మనవైపు చూడదేమో చూద్దాం. యుద్ధం అలాగే చెయ్యాలని సామాన్యుడు అడుగుతున్నాడు.‘‘ అని జగన్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు