పాకిస్తాన్ ఎన్నికలు: విజయంపై ఇమ్రాన్ ఖాన్ ధీమా

  • 21 జూలై 2018
ఇమ్రాన్ ఖాన్

తమ ప్రత్యర్థి పార్టీలన్నీ ఎన్నికల్లో ఓటమి చవిచూస్తాయని పాకిస్తాన్ ప్రధాన ప్రతిపక్షనేత, పీటీఐ (పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ''ఇన్నాళ్లు అధికారం అనుభవించిన పార్టీలు అసమర్థ పాలనను అందించాయి. వచ్చే వారం జరిగే ఎన్నికల్లో అవి ఓడిపోవడం తథ్యం'' అని పేర్కొన్నారు.

ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవని వస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు.

''ఎన్నికలు సక్రమంగా జరగవని ప్రధాన పార్టీలు అకస్మాత్తుగా ఆందోళన చెందుతున్నాయి. దానికి కారణం ఒకటే. ఒపినియన్ పోల్స్ అన్నీ ఎన్నికల్లో పీటీఐ ( పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్) పార్టీ దూసుకెళ్తోందని చెబుతున్నాయి'' అని ఇమ్రాన్ చెప్పారు.

మరోవైపు, పీటీఐ పార్టీ గెలిచేలా పాకిస్తాన్ మిలిటరీ ప్రణాళికలు వేస్తోందని పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) పార్టీ మద్దతుదారులు, మానవ హక్కుల సంఘాల సభ్యులు ఆరోపిస్తున్నారు.

‘అవినీతిపై పోరాడుతా’

ప్రస్తుతం ఎన్నికల ప్రచారం చూస్తే , మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్), ఇమ్రాన్ ఖాన్‌ నాయకత్వంలోని పీటీఐ పార్టీల మధ్యే ప్రధానంగా పోటీ కనిపిస్తోంది.

'పాకిస్తాన్ మరోసారి లేచి నిలబడాలి' అనే లక్ష్యంతో మా పార్టీ ప్రచారం చేస్తోందని ఇమ్రాన్ ఖాన్ బీబీసీకి తెలిపారు. దేశంలో అవినీతిపై పోరాడటమే మా ప్రధాన పాలసీ అని ఆయన చెప్పారు.

ఇటీవలే ఆయన ఎన్నికల ప్రత్యర్థి, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు కోర్టు శిక్ష విధించింది. అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో 10 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

అయితే, షరీఫ్ జైలు పాలవడం వెనుక అసలు కారణం వేరని విశ్లేషకులు చెబుతున్నారు.

షరీఫ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనకూ, పాకిస్తాన్ ఆర్మీకి మధ్య విదేశాంగ, భద్రతా విధానాల్లో విభేదాలు వచ్చాయని, దాని కారణంగా ఆయన జైలు పాలయ్యారని చెబుతున్నారు.

తన మొత్తం పాలనాకాలంలో సగ భాగం పాకిస్తాన్ మిలిటరీనే ప్రత్యక్షంగా దేశాన్ని పాలించిందని షరీఫ్ ఆరోపించారు. ఇప్పుడు కూడా తమ పార్టీ అధికారంలోకి రాకుండా రిగ్గింగ్ చేసేందుకు మిలిటరీ సిద్ధమవుతోందని విమర్శించారు.

షరీఫ్‌కు చెందిన పీఎంఎల్-ఎన్ పార్టీని వదిలి వెళ్లాలని ఇంటెలిజెన్స్ అధికారులు బెదిరిస్తున్నారని ఆ పార్టీ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. జైలు పాలైన షరీఫ్‌పై సానుభూతి కలిగేలా ఎలాంటి కథనాలు రాయొద్దని ఆర్మీ నుంచి ఆదేశాలు వచ్చాయని జర్నలిస్టులు చెబుతున్నారు.

అయితే, రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలను పాకిస్తాన్ మిలిటరీ ఖండించింది.

Image copyright EPA

‘మార్పు’ తెచ్చే వ్యక్తిగా చూస్తున్న ఓటర్లు

అవినీతి అరోపణలను పక్కదారి పట్టించే వ్యూహంలో భాగంగానే మిలిటరీపై షరీఫ్ ఆరోపణలు చేస్తున్నారని లాహోర్‌లో నిర్వహించిన ఒక ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు చెప్పారు.

ఖాన్‌ను పరిపాలనలో మార్పును తీసుకొచ్చే వ్యక్తిగా చాలా మంది ఓటర్లు చూస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల మాదిరిగా ఆయనకు రాజకీయ వారసత్వం లేదు. అలాగే, ఆయన పార్టీ ఇప్పటి వరకు అధికారంలోకి రాలేదు.

అయితే, డబ్బు, అంగబలంతో పార్టీలు మారే వారిని ఇమ్రాన్ తన పార్టీలో చేర్చుకుంటున్నారని ఆయనపై ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ ఆరోపణలను ఖాన్ కొట్టిపారేశారు. గెలిచేవారికే టికెట్లు ఇస్తున్నామని, పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదని, హంగ్ పార్లమెంట్ ఏర్పడే అవకాశం ఉందని ఎన్నికల సర్వేల్లో కనిపిస్తోంది.

''ఆ పరిస్థితి వస్తే కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, కానీ, పీఎంఎల్-ఎన్, పీపీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రసక్తే లేదు'' అని ఖాన్ స్పష్టం చేశారు.

''వాళ్లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లయితే, అధికారంలోకి రావడానికి ఇన్నాళ్లు మేం చేసిన పోరాటాన్ని మేమే ఓడించినట్లు అవుతుంది'' అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)