రఫేల్ విమానాల విషయంలో ఎవరి మాటల్లో నిజముంది?

రాఫేల్

ఫ్రాన్స్‌కు చెందిన డాసో ఏవియేషన్ కంపెనీకి చెందిన రఫేల్ యుద్ధ విమానాలపై మరోసారి వివాదం మొదలైంది.

మోదీ సర్కారుపై శుక్రవారం అవిశ్వాస తీర్మానం మీద చర్చ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రసంగిస్తూ 36 రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంలో మోదీ ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడిందని ఆరోపణలు చేశారు.

ఈ ఒప్పందం విలువెంతో చెప్పడానికి ప్రభుత్వం వెనుకాడుతోందని రాహుల్ అన్నారు. అయితే రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో గోప్యత ఒక షరతుగా ఉంది కాబట్టి తాము ఈ విమానాల కొనుగోలు ధరల్ని వెల్లడించటం లేదని ప్రభుత్వం చెప్తోంది.

ఫ్రాన్స్‌తో కుదిరిన ఒప్పందం ఈ విమానాల ధరెంతో బయటకు చెప్పడానికి వీలు లేనంత గోప్యమైందా? రాహుల్ గాంధీ ఇంకా ముందుకు వెళ్లి తాను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్‌తో మాట్లాడాననీ, ఈ ఒప్పందంలో గోప్యత వంటిదేమీ లేదని ఆయన చెప్పారని కూడా అన్నారు. ఇంతకూ రఫేల్ విమానాల విషయంలో ఎవరు అబద్ధమాడుతున్నట్టు?

2015 ఏప్రిల్ 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 36 రఫేల్ యుద్ధ విమానాల్ని కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ వ్యాపార ఒప్పందంతో రెండు దేశాల మధ్య విశ్వాసం పెరుగుతుందని డాసో కంపెనీ సీఈఓ ఎరిక్ ట్రాపియర్ ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికతో అన్నారు.

కంపెనీ ఆడిట్ నివేదికలో ఏముంది?

రఫేల్ విమానాల ధర విషయంలో విపక్షాలు లేవనెత్తిన సందేహాలు పలుమార్లు భారత మీడియాలో కనిపించాయి. మునుపటికన్నా చాలా ఎక్కువ ధరలకు కొనుగోలు జరిగినట్టు వార్తలొచ్చాయి. కాగా డాసో కంపెనీ భారత్‌లో 108 ఫైటర్ జెట్ విమానాలు తయారు చేస్తానని హామీ ఇచ్చింది.

ఈ యుద్ధ విమానాలను భారత్‌లో నిర్మించడానికి మొదట ప్రభుత్వరంగానికి చెందిన హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌తో కాంట్రాక్టు కుదిరింది. దాని ప్రకారం.. ఈ కంపెనీ డాసోతో కలిసి విమానాలను తయారు చేయాలి. కానీ ఆ తర్వాత ఈ కాంట్రాక్టును రిలయన్స్ డిఫెన్స్‌కు ఇచ్చేశారు.

డాసో ఏవియేషన్ వార్షిక రిపోర్ట్ 2016లో పేర్కొన్న వివరాల ప్రకారం, 2016 డిసెంబర్ 31 వరకు రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించిన 20,03,23,000 యూరోల పాత ఆర్డర్లుండగా, 2015 డిసెంబర్ 31 నాటికి 14,01,75,000 యూరోల ఆర్డర్లే ఉన్నాయి.

2016లో భారత్‌తో 36 రఫేల్ విమానాల కొనుగోలు ఒప్పందం కుదిరిన తర్వాతే ఈ పెంపుదల నమోదైనట్టు డాసో పేర్కొంది.

ఈ డీల్ కుదుర్చుకోవడానికి ప్రభుత్వం అనుసరించిన పద్ధతుల మూలంగానే ఎక్కువ ధర చెల్లించాల్సి వచ్చిందనేది చాలా మంది విమర్శకుల అభిప్రాయం.

2005లో స్కార్పీన్ సబ్‌మెరైన్ ఒప్పందంలో కూడా భారత ప్రభుత్వం ఎక్కువ డబ్బు చెల్లించిందన్న ఆరోపణలు వచ్చాయి.

ద డిప్లొమాట్ కథనం ప్రకారం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, భారత అణు సామర్థ్యాలను బట్టి భారత్‌కు ఫ్రాన్స్ మిరేజ్ 2000 రకం విమానాలు అందించింది. బ్రిటిష్ స్పేస్‌జెట్ జాగ్వార్లు ఎక్కువ ఎత్తుకు వెళ్లినపుడు వేగం మందగించడం, అట్లాగే వాటిలో అణుబాంబుల్ని తీసుకెళ్లడం వీలు కాదు కాబట్టి భారత్‌కు ఈ ఒప్పందం అవసరమైంది.

ఫ్రాన్స్‌కు చెందిన డిఫెన్స్ కంపెనీలు భారతదేశంలోని ప్రైవేటు కంపెనీలతో కూడా ఒప్పందాలు చేసుకుంటున్నాయి. కొన్ని ఫ్రెంచ్ కంపెనీలు టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌కు కూడా సిద్ధమయ్యాయని 'ద డిప్లొమాట్' తెలిపింది.

ఫ్రాన్స్ నుంచి రఫేల్ విమానాల కొనుగోలు కోసం 2012 నుంచి చర్చలు జరుగుతున్నాయి. అయితే ధర విషయంలో విభేదాలు తలెత్తాయి. అలాగే వీటిని ఏ మేరకు భారత్‌లో నిర్మిస్తారు అనే విషయంలో కూడా వివాదం ఉండేది.

ఒక సమయంలోనైతే ఈ ఒప్పందం రద్దయ్యే పరిస్థితి కూడా తలెత్తింది. ఎందుకంటే భారత ప్రభుత్వ రంగ కంపెనీ అయిన హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌కు టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఫ్రాన్స్ సిద్ధపడలేదు.

నరేంద్ర మోదీ ప్రధానిగా అధికారం చేపట్టాక ఈ ఒప్పందం బాధ్యతల్ని ఆయనే చేపట్టారు. ఫ్రాన్స్ నుంచి భారత్ 36 రఫేల్ విమానాలు కొనుగోలు చేస్తుందని ఆయన ప్రకటించారు.

ఒప్పందం ఎప్పుడు జరిగింది?

రెండు దేశాల ప్రభుత్వాల్లో ఏ ఒక్కటీ ఈ ఒప్పందం విలువెంతో వెల్లడి చేయనప్పటికీ, దీని విలువ 8.7 బిలియన్ డాలర్లని విమానయాన పరిశ్రమకు చెందిన అధికారుల కథనం.

రక్షణ పరిశ్రమకు సంబంధించిన ఓ అధికారి 2016 సెప్టెంబర్ 22న ఫైనాన్షియల్ టైమ్స్‌తో మాట్లాడుతూ, "ఇందులో అంతా ఫ్రాన్స్‌ పాత్రే ఉంది. ఈ విమానాల తయారీలో భారతీయ కంపెనీల భాగస్వామ్యానికి సుముఖంగా లేదు" అని చెప్పారు.

ఈ ఒప్పందంపై రెండు దేశాలూ మౌనం వహించాయి. ఈ ఒప్పందం గోప్యమైందని, కాబట్టి దీనికి సంబంధించిన వివరాలు వెల్లడి చేయలేమని ఫ్రాన్స్ అధికారులు ఫైనాన్షియల్ టైమ్స్‌తో చెప్పారు. సమర్థవంతమైన యుద్ధ విమానాలు కావాలన్న డిమాండ్ భారతీయ వాయుసేన నుంచి చాలా కాలంగా వినిపిస్తోంది.

ఏవియేషన్ వీక్‌లో ప్రచురితమైన కథనం ప్రకారం, మొట్టమొదటి రఫేల్ విమానం భారత్‌కు 2019 చివరలో చేరుతుంది. మిగతా 35 రఫేల్ విమానాలు 60 నెలల వ్యవధిలో వస్తాయి. వీటిలో 28 సింగిల్ సీట్ విమానాలు కాగా, 8 విమానాల్లో రెండు సీట్లుంటాయి.

రఫేల్ విమానాలను అధికారికంగా అణ్వాయుధాలతో జోడించలేదు. అంతర్జాతీయ ఒప్పందాల కారణంగా అలా చేయలేదు. అయితే మిరేజ్ 2000 విమానాల లాగానే వీటిని కూడా భారత్ తనదైన పద్ధతిలో అభివృద్ధి చేసుకోగలదని చాలా మంది నిపుణుల అభిప్రాయం.

భారత్‌తో జరిగిన రఫేల్ కొనుగోలు ఒప్పందంపై డాసో ఏవియేషన్ 2016 సెప్టెంబర్ 23న ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. భారత ప్రధాన మంత్రి 2015లో ఫ్రాన్స్ పర్యటనకు వచ్చారని, అప్పుడే ఆయన ఈ ఒప్పందానికి తుది రూపునిచ్చారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

అయితే ఈ ఒప్పందం విలువెంత అనే విషయం ఆ ప్రకటనలో చెప్పలేదు. అలాగే ఇది రహస్య ఒప్పందం అని గానీ, దీనికి సంబంధించిన వివరాలు బహిరంగంగా వెల్లడించబోం అని గానీ ఆ ప్రకటనలో పేర్కొనలేదు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)