ఇక్కడ పచ్చళ్లు అంటూ పార్సిల్ చేతిలో పెడతారు.. అక్కడ విమానం దిగగానే జైల్లో పెడతారు!

  • దీప్తి బత్తిని
  • బీబీసీ ప్రతినిధి
ముంబై ఎయిర్‌పోర్టులో రజాక్ తన చేతికి ఒక ప్యాకెట్ ఇచ్చి.. అది పచ్చడి ప్యాకెట్ అని, తన స్నేహితుడికి ఇవ్వాలని చెప్పాడని ఉస్మాన్ వివరించాడు. ఆ పాకెట్లో గంజాయి ఉందని హమద్ ఎయిర్‌పోర్టులోనే తెలిసిందని చెప్పాడు
ఫొటో క్యాప్షన్,

ముంబై ఎయిర్‌పోర్టులో రజాక్ తన చేతికి ఒక ప్యాకెట్ ఇచ్చి.. అది పచ్చడి ప్యాకెట్ అని, తన స్నేహితుడికి ఇవ్వాలని చెప్పాడని ఉస్మాన్ వివరించాడు. ఆ పాకెట్లో గంజాయి ఉందని హమద్ ఎయిర్‌పోర్టులోనే తెలిసిందని చెప్పాడు

‘‘నేను బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఉన్నప్పుడు.. ఏజెంట్ మూసా ఒక డ‌బ్బా తీసుకువ‌చ్చి నా చేతిలో పెట్టాడు. బేక‌రీ ఐటెమ్ అనీ.. తనకి తెలిసిన వారి కోసం పంపుతున్నాన‌నీ చెప్పాడు. నేను ఖతార్‌లో దిగిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ డబ్బాలో నాలుగు కిలోల గంజాయి ఉందంటూ.. అది రవాణా చేసినందుకు నన్ను అరెస్ట్ చేశారు."

భారత దౌత్యాధికారుల సాయం కోరుతూ ఖతార్ జైల్లో ఉన్న హైదరాబాద్ వాసి సయ్యద్ అహ్మద్ ఖాద్రి రాసిన లేఖలోని అంశమిది. ఒక్క ఖాద్రీయే కాదు.. హైదరాబాద్‌కే చెందిన.. షేక్ సొహైల్‌, ఉస్మాన్ అలీ, షేక్ రిజ్వాన్‌.. ఇలా ఎందరో ఖతార్, దుబాయ్ జైళ్లలో మగ్గుతున్నారు.

వీరందరిదీ ఒకే రకమైన ప్రయాణం. బతుకు బాగుపడుతుందన్న ఆశతో విదేశాల్లో ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నించటం, కొందరు ఏజెంట్లను ఆశ్రయించటం, అప్పో సప్పో చేసి వారు కోరిన ఫీజులు కట్టటం, ఉద్యోగం వచ్చిందని వారు చెప్తే కోటి ఆశలతో బయల్దేరటం.

ఎయిర్‌పోర్టులో వారు కొన్ని పార్శిళ్లు ఇచ్చి.. అవి బేకరీ కేకులని, పచ్చళ్లని నమ్మబలికి.. ఖతార్‌లోనో దుబాయ్‌లోనో తమకు తెలిసిన వారికి ఇవ్వాలని చెప్తే.. అమాయకంగా తీసుకెళ్లటం. అక్కడ పోలీసుల తనిఖీల్లో అవి గంజాయి పార్సిళ్లని తేలి జైలు పాలవటం!!

తెలంగాణలోని హైదరాబాద్‌ నుంచి, కర్ణాటక నుంచి కూడా ఇలా గల్ఫ్ దేశాలకు ప్రయాణమవుతున్న చాలా మంది యువకులను.. వారికి తెలియకుండానే కొందరు ‘ఏజెంట్లు’ డ్రగ్స్ - మాదకద్రవ్యాలు, మత్తుపదార్థాలు - అక్రమ రవాణాకు పావులుగా వాడుకుంటున్నట్లు కనిపిస్తోంది.

ఇలా మోసపోయి విదేశాల్లో ఐదేళ్లు, పదేళ్లు జైలుశిక్ష పడిన కొందరు యువకులు.. సాయం కోసం భారత ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులతో బీబీసీ మాట్లాడింది. ఆ వివరాలివీ...

ఫొటో సోర్స్, Andia

అమెరికాలో ఉద్యోగమంటే ఆరు లక్షలు ఇచ్చారు. కానీ...

అంబర్‌పేట్‌లోని ఓ కాలనీలో రెండు గదుల ఇంట్లో అద్దెకి ఉంటుంది నఫీస్ ఫాతిమా. భర్త దుబాయ్‌లో ధామంలో సేల్స్ పర్సన్‌గా పని చేస్తూ పదేళ్ళుగా అక్కడే ఉన్నారు. వీరికి నలుగురు సంతానం. పెద్ద కూతురికి రెండేళ్ల క్రితం పెళ్లి చేసింది. చిన్న కూతురు స్కూల్‌కి వెళ్తోంది. రెండో కొడుకు ఇంజినీరింగ్ చదువుతున్నాడు. వీరి బాధంతా పెద్ద కొడుకు గురించే.

"మా జీవితాలు బాగుంటాయి, సొంత ఇల్లు తీసుకోవచ్చు అనుకొని నా 20 ఏళ్ల కొడుకు బయట దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేశాడు. కానీ ఇప్పుడు జైల్లో ఉన్నాడు" అని బీబీసీ ప్రతినిధికి విచారంగా చెప్పారు 45 ఏళ్ల‌ ఫాతిమా.

సయ్యద్ అహ్మద్ ఖాద్రి డిగ్రీ చదివాడు. 2016 నుంచి హైదరాబాద్‌లో ఒక ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో పని చేసేవాడు. నెలకు ఎనిమిది వేలు జీతం వచ్చేది. కానీ అది వారి అవసరాలకు సరిపోదని బయట దేశాలకు పని కోసం వెళ్దామనుకున్నాడు. బాబాయి వరుస అయిన సయ్యద్ మూసాని కలిశాడు. మూసా ఒక ట్రావెల్ ఏజెంట్.

"మూసా మా వాడిని అమెరికా, కెనడాలకు పంపుతానన్నాడు. అందుకు 6 లక్షల రూపాయల వరకూ ఖర్చవుతుందన్నాడు. రెండు మూడు సార్లుగా మేం డబ్బిచ్చాం. 2017 నవంబర్ 27న మూసా ఫోన్ చేసి మా అబ్బాయిని త్వరగా రెడీ అయ్యి ఉండమని చెప్పాడు. రెండు రోజులకి ఖతార్ వెళ్లి రావాలి అన్నాడు. ఆలా ఎందుకని ప్రశ్నిస్తే.. పిల్లాడు మిగతా దేశాలు తిరుగుతూ ఉంటాడని పాస్‌పోర్టులో స్టాంప్ ఉంటే అమెరికా వీసా త్వరగా వస్తుంది అని చెప్పాడు’’ అని ఫాతిమా తెలిపారు.

ఫొటో క్యాప్షన్,

"నా కొడుకు నాకు నేరుగా ఫోన్ చేశాడు. అప్పుడు తెలిసింది, నా కొడుకుని డ్రగ్స్ రవాణా చేసినందుకు అరెస్ట్ చేశారు అని."

ఎయిర్‌పోర్టులో ప్యాకెట్ ఇచ్చి పంపాడు...

మూసా వచ్చి బెంగళూరు తీసుకువెళ్లాడు. అక్కడి నుంచి ఖతార్‌కి ఫ్లైట్ అని చెప్పాడు. అలా వెళ్లాక వారం పది రోజులకి కూడా ఎటువంటి కబురూ లేదు. మూసాకి ఫోన్ చేసి అడిగితే.. ‘అంతా బాగానే ఉంది. ఖతార్‌లోనే ఉద్యోగం వెతుక్కుంటున్నాడు. అందుకే రావట్లేదని చెప్పాడు’’ అని ఆమె చెప్పారు.

ఐదు నెలల తర్వాత ఫాతిమాకు ఏదో తేడాగా అనిపించింది. మూసా ఇంటికి వెళ్లి గట్టిగా అడిగారు. అప్పుడతడు చెప్పింది విని ఆమె షాకయ్యారు.

‘‘నా కొడుకు జైల్లో ఉన్నాడని చెప్పాడు. అక్కడ ఎవరితోనో గొడవ పడినందుకు జైల్లో పెట్టారు అన్నాడు. కానీ.. మే నెలలో నా కొడుకు నాకు నేరుగా ఫోన్ చేశాడు. అప్పుడు తెలిసింది, నా కొడుకుని డ్రగ్స్ రవాణా చేసినందుకు అరెస్ట్ చేశారని" అంటూ ఫాతిమా వెల్లడించారు.

దుహాయిల్ జైలు నుంచి అహ్మద్ ఖాద్రి భారత అధికారులకు సహాయం కోరుతూ ఒక లేఖ రాశాడు. ఆ లేఖలో తాను ఈ నేరం చేయలేదనీ, తనని మూసా ఇరికించాడని పేర్కొన్నాడు.

"నేను బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఉన్న‌ప్పుడు.. మూసా ఒక డ‌బ్బా తీసుకువ‌చ్చి నా చేతిలో పెట్టాడు. బేక‌రీ ఐటెమ్ అనీ.. తనకి తెలిసిన వారి కోసం పంపుతున్నాన‌నీ చెప్పాడు. నేను ఖతార్‌లో దిగి మూసా ఇచ్చిన నెంబర్‌కి ఫోన్ చేశాను. వాళ్ళింటికి రమ్మన్నారు. డబ్బా ఇచ్చాను. నన్ను అక్కడ ఉండమన్నారు. ఈలోపు పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. ఆ డబ్బాలో నాలుగు కిలోల గంజాయి ఉందంటూ.. అది నేను రవాణా చేసినందుకు నన్ను అరెస్ట్ చేశారు" అని బీబీసీకి చెప్పారు అహ్మద్ ఖాద్రి.

‘‘సొంత బాబాయి అయ్యుండీ మ‌మ్మ‌ల్ని మోసం చేశాడు మూసా" అంటూ కనీళ్లు పెట్టుకున్నారు ఫాతిమా. ఆమె హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో మే 16న ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐపీసీ సెక్షన్ 420 కింద మూసాపై కేసు నమోదు చేసి జూన్ 7న మూసాను అరెస్ట్ చేశారు.

ఫొటో క్యాప్షన్,

వెళ్లిన మూడు రోజులకి కూడా ఫోన్ రాక‌పోవడంతో మేం కంగారు పడి మూసా దగ్గరికి వెళ్ళాం. కానీ అతడు తనకు ఏమీ తెలియదని చెప్పాడు. అక్కడి ఎంబసీ వారికి మెయిల్ పెట్టాము. అప్పుడు తెలిసింది మా కొడుకు అరెస్ట్ అయ్యాడని

సొహైల్ అరెస్టు విషయం రాయబార కార్యాలయం ద్వారా తెలిసింది...

అంబర్‌పేట్‌లో‌నే ఉంటున్న షేక్ సొహైల్‌ కూడా.. ఖతార్‌లో ఒక క్యాష్ కౌంటర్‌లో ఉద్యోగం వచ్చిందంటే 2018 ఫిబ్రవరి ఒకటిన బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి ఖతార్ బయల్దేరాడు. అతడిని కూడా ఏజెంట్ మూసానే పంపాడు.

‘‘వెళ్లిన మూడు రోజులకి కూడా ఫోన్ రాక‌పోవడంతో మేం కంగారు పడి మూసా దగ్గరికి వెళ్ళాం. కానీ అతడు తనకు ఏమీ తెలియదని చెప్పాడు. అక్కడి ఎంబసీ వారికి మెయిల్ పెట్టాము. అప్పుడు తెలిసింది మా కొడుకు అరెస్ట్ అయ్యాడని’’ అని సొహైల్ తండ్రి షేక్ ఆయూబ్ బీబీసీకి చెప్పారు.

సొహైల్‌ వద్ద 2.5 కేజీల గంజాయి ఉన్నందున అతడిని హమద్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసి దుహాయిల్ జైలుకు పంపినట్టు ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులు అతడి తల్లి మెహ‌రున్నీసాకి పంపిన ఈమెయిల్‌లో తెలిపారు.

ఆ తరువాత సొహైల్ జైలు నుంచి తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. ‘‘బెంగళూరు ఎయిర్‌పోర్టులో మూసా తనకు ఒక ప్యాకెట్ ఇచ్చాడని, అది వాళ్ళ స్నేహితుడికి ఇవ్వమన్నాడని తెలిపాడు. అందులో గంజాయి ఉందన్న విషయం మా అబ్బాయికి తెలియదు. మోసం చేసింది మూసా" అని వాపోయారు ఆయూబ్.

మెహరున్నీసా, ఆయూబ్‌లకు ఇద్దరు సంతానం. సొహైల్ పెద్ద కొడుకు. కూతురు చదువు పూర్తయింది. 21 ఏళ్ళ సొహైల్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతూ, తన తండ్రి పనుల్లో సాయం చేసేవాడు. తండ్రి భవన నిర్మాణాలకు ఇసుక సరఫరా చేస్తాడు. పని దొరికితే 5,000 రూపాయల దాకా వస్తాయి.

"మా జీవితాలు బాగుపడతాయి, చెల్లికి పెళ్లి చేయొచ్చు అన్న ఆత్రుతతో నా కొడుకు ఉండేవాడు. ఏ చిన్న ఉద్యోగ అవకాశం దొరికినా పని చేసేవాడు. బయట దేశాలకి వెళ్తే ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని మూసాని కలిశాడు. ఇప్పుడు నా కొడుకు తిరిగి వస్తే చాలు" అని చెప్పారు మెహరున్నీసా.

ఫొటో క్యాప్షన్,

వీరందరిదీ ఒకే రకమైన ప్రయాణం. బతుకు బాగుపడుతుందన్న ఆశతో విదేశాల్లో ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నించటం, కొందరు ఏజెంట్లను ఆశ్రయించటం, అప్పో సొప్పో చేసి వారు కోరిన ఫీజులు కట్టటం, ఉద్యోగం వచ్చిందని వారు చెప్తే కోటి ఆశలతో బయల్దేరటం.

పచ్చడి ప్యాకెట్ అని ఇచ్చారు.. పట్టుకుని జైల్లో పెట్టారు...

ఉస్మాన్ అలీ 2017 జూన్‌లో నిజామాబాద్ నుంచి ముంబై వెళ్లాడు. అక్కడి నుంచి ఖతార్ విమానం ఎక్కాడు. ఇప్పుడతడు దుహాయిల్ జైల్లో ఉన్నట్టు అతడి తమ్ముడు అమీర్ అలీ చెప్పాడు.

‘‘దుబాయ్‌లో ఉద్యోగం కోసం రజాక్ అనే ఒక ఏజెంట్‌కి డబ్బు ఇచ్చాం. అన్నయ్యకి ఉద్యోగం వచ్చింది అన్నాడు. అరెస్ట్ అయిన తరువాత జైలు నుంచి ఉస్మాన్ ఫోన్ చేశాడు. తనకి ఏమీ తెలియదని.. ముంబై ఎయిర్‌పోర్టులో రజాక్ తన చేతికి ఒక ప్యాకెట్ ఇచ్చి.. అది పచ్చడి ప్యాకెట్ అని, తన స్నేహితుడికి ఇవ్వాలని చెప్పాడని ఉస్మాన్ వివరించాడు. ఆ పాకెట్లో గంజాయి ఉందని హమద్ ఎయిర్‌పోర్టులోనే తెలిసిందని చెప్పాడు" అని బీబీసీకి తెలిపాడు అమీర్ అలీ.

భారత విదేశాంగ శాఖ నడిపే 'మదద్'కు అమీర్ ఈ-మెయిల్ చేశాడు. వారి నుంచి అందిన వివరాల ప్రకారం.. జూన్ 19న దోహా ఎయిర్‌పోర్టులో మత్తుపదార్థాలు ఉన్నందుకు ఖతార్ అధికారులు ఉస్మాన్‌ని అరెస్ట్ చేసి పదేళ్ల జైలు శిక్ష వేశారు.

హైదరాబాద్‌కే చెందిన షేక్ రిజ్వాన్‌ది కూడా ఇదే కథ. అమీర్ అలీ వెళ్లిన రోజే అతడూ హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లి అక్కడ్నుంచి ఖతార్ వెళ్లాడు. రిజ్వాన్ కూడా జైల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అతడి కుటుంబ సభ్యులు మాట్లాడటానికి విముఖత వ్యక్తం చేశారు. అతడి పిన్ని సాజిదాబేగం తెలంగాణ రాష్ట్ర ఎన్‌ఆర్ఐ వ్యవహారాల మంత్రి కె.టి.రామారావుకి రాసిన లేఖ బీబీసీ ప్రతినిధికి లభించింది.

ముంబైకి చెందిన ఒక ఏజెంట్ దోహాలో ఉద్యోగం వచ్చిందని చెప్పి రిజ్వాన్‌ని ఖతార్ పంపినట్టు ఆ లేఖలో రాశారు సాజిదా. ఎయిర్‌పోర్టులో రిజ్వాన్‌కి రెండు ప్యాకెట్లు ఏజెంట్ ఇచ్చాడని.. వాటిలో ఏముందో రిజ్వాన్‌కి తెలియదని.. ఏజెంట్ మోసం చేశాడని మొరపెట్టుకున్నారు. "అక్కడ న్యాయపోరాటానికి అయ్యే ఖర్చు పెట్టుకునే స్తొమత మాకు లేదు. ప్రభుత్వం సాయం చేయాలి" అని కోరారు.

ఫొటో సోర్స్, Getty Images

నిషేధిత మందులు కూడా అక్రమ రవాణా...

వీరందరు గంజాయి రవాణా చేస్తూ అరెస్ట్ అయితే.. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లాకి చెందిన నకీబ్ అనే వ్యక్తిని.. 'లిరికా 150 ఎంజీ' అనే మందులు తీసుకెళ్లినందుకు 2017 మే 21న దుబాయ్‌లో అరెస్ట్ చేశారు. ఈ మందు దుబాయ్‌లో నిషేధిత మందుల్లో ఒకటి.

"ఇమ్రాన్ అని మాకు తెలిసిన వ్యక్తి మెడికల్ షాప్ నడిపేవాడు. నకీబ్‌కి ఆ మందులు ఇచ్చి పంపాడు. ఎయిర్‌పోర్టుకి తనకు తెలిసిన వ్యక్తి వచ్చి తీసుకుంటాడని చెప్పాడు ఇమ్రాన్. కానీ ఎయిర్‌పోర్టులో మా తమ్ముడిని అరెస్ట్ చేశారు. అవి నిషేధిత మందులని మాకు తెలియదు. ఇప్పుడు పోలీస్ కేసు పెట్టినా ఇమ్రాన్ తప్పించుకుని తిరుగుతున్నాడు" అని నకీబ్ సోదరుడు ముజీబ్ వివరించాడు.

లిరికా అన్న మందు 'సైకోట్రోఫిక్ పదార్థంగా' వర్గీకరించి 1987లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ వంటి దేశాలు నిషేధించాయి. అయినప్పటికీ పలుసార్లు ఈ మందు బిళ్లలను అక్రమంగా ఆ దేశాలకు వెళ్లే వారితో పంపుతున్నారు.

2016 అక్టోబర్ 27న హైదరాబాద్‌కి చెందిన హబీబ్ దుబాయ్ వెళ్ళాడు. అతడికి తన స్నేహితుడొకరు లిరికా మందులు కొన్ని ఇచ్చి పంపాడు. హబీబ్‌ని దుబాయ్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు. దాదాపు రెండు సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత కుటుంబ సభ్యుల సహాయంతో బయటికి వచ్చాడు.

"హబీబ్‌కి అవి నిషేధిత మందులని తెలియదు. మేము కేంద్ర ప్రభుత్వాన్ని సాయమడిగాం. ఎట్టకేలకు మా అన్నయ్య జైలు నుంచి విడుదలయ్యాడు" అని హబీబ్ సోదరుడు చెప్పాడు.

ఫొటో సోర్స్, Getty Images

ఏజెంట్లపై ఫిర్యాదుకు ముందుకు రాని బాధిత కుటుంబాలు

తెలంగాణ, కర్ణాటకల నుంచి ఉద్యోగ అవకాశాల కోసం గల్ఫ్ దేశాలకు బయలుదేరి.. ఇలా మోసపోయి జైళ్లలో ఉన్న వారి సంఖ్య గణనీయంగానే ఉంది. వీరు అక్కడ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నప్పటికీ.. వీరిని ఇలా పంపుతూ మోసం చేస్తున్న ఏజెంట్ల మీద భారతదేశంలోని బాధిత కుటుంబాలు ఫిర్యాదు చేస్తున్న ఉదంతాలు తక్కువగా ఉన్నాయి. ఇందుకు ఈ కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఒక కారణమైతే.. ఫిర్యాదు చేస్తే దానివల్ల తమకు ఎటువంటి ఇబ్బందులు వస్తాయో అన్న భయం మరో కారణంగా తెలుస్తోంది.

మూసా అనే ఏజెంట్ మీద నఫీస్ ఫాతిమా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడిని పోలీసులు అరెస్ట్ చేయగా బెయిలుపై విడుదలయ్యాడు. సొహైల్ తండ్రి ఆయూబ్ మాత్రం.. మూసా మీద పోలీసులకు ఫిర్యాదు చేయాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నాడు. "నాకు ఆర్థిక స్తోమత లేదు. ఉన్న కాస్త డబ్బు అక్కడ న్యాయవాదులకు ఇచ్చేశాను. ఇప్పుడు కేసు పెట్టి స్టేషన్ చుట్టూ తిరిగినా ఎటువంటి ఫలితం ఉంటుందో తెలియదు" అంటారు ఆయూబ్.

అమీర్ అలీది కూడా ఇదే ఆలోచన. "మా కుటుంబానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక సహాయం చేయగలిగింది కేంద్ర ప్రభుత్వమే. మంత్రి సుష్మాస్వరాజ్ గారికి లేఖ రాశాము. కానీ ఇంకా సమాధానం రాలేదు. మాకా పెద్ద చదువులు లేవు. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం" అని అన్నారు అమీర్.

ఫొటో సోర్స్, Getty Images

‘తెలిసి వెళ్లారా.. తెలియక వెళ్లారా.. అనే కోణంలో దర్యాప్తు’

"ఈ అబ్బాయిలు తెలిసి వెళ్లారా, తెలియక వెళ్లారా అన్న కోణంలో కూడా విచారిస్తున్నాం. వెళ్లిన వారిలో చాలా మంది మొదటిసారి బయటి దేశాలకు వెళ్లిన వారు. అసలు వీరికి ఏజెంట్లు ఆ ప్యాకెట్లను ఎలా ఇచ్చి పంపారు అన్నది దర్యాప్తు చేస్తున్నాం. విచారణ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది" అని చెప్పారు హైదరాబాద్‌లో ఏజెంట్‌ మూసాపై వచ్చిన ఆరోపణల మీద దర్యాప్తు చేస్తున్న పోలీసు ఉన్నతాధికారి ఒకరు.

ఇందులో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మాఫియా కోణం ఉందా అన్న ప్రశ్నకి.. అది ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని బదులిచ్చారు. అయితే.. ఇక్కడి విమానాశ్రయాల నుంచి మాదకద్రవ్యాలు తీసుకుని వెళ్లడం అసాధ్యమని చెప్పారు.

ఈ అంశం మీద 2015 అక్టోబర్‌లో కువైట్‌లోని భారత దౌత్యకార్యాలయం ఒక నోటీసు జారీ చేసింది. "భారత దేశం నుంచి కువైట్ వెళ్లే ప్రయాణికులు ఏజెంట్ల ప్రలోభాలకు లోనుకావద్దు. ఈ ఏజెంట్లలో కొంతమంది ప్రయాణికులకు డబ్బు, ఉద్యోగం వంటి ఆశలు చూపి మాదక ద్రవ్యాలను పార్శిళ్ల రూపంలో పంపుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రయాణికులకు తెలియకుండానే వారికి పార్శిళ్లు ఇచ్చి పంపుతున్నారు. ఇలాంటి ఏజెంట్లతో జాగ్రత్త" అని ఆ నోటీసులో హెచ్చరించారు.

"ఇలాంటి ఏజెంట్లు.. ఏదైనా జరిగితే గొడవ చేసే పరిస్థితిలో లేని కుటుంబాలను చూసి యువకులను ఎంపిక చేసుకుని పంపుతుంటారు. విదేశాలకు వెళ్లాలనుకునే ముందు ఏజెంట్లకు డబ్బిచ్చేసి ఊరుకోకుండా.. ఇంటర్నెట్‌లో వెతికితే అన్ని వివరాలు లభిస్తాయి. అవి చదుకోవాలి" అని సూచిస్తున్నారు.. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి సహాయం చేసే ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి చాంద్ పాషా.

హైదరాబాద్ పోలీసులు కూడా ఈ అంశంపై అవగాహనా సదస్సులు నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నారు.

(ఇలస్ట్రేషన్స్: పునీత్ బర్నాలా)

వీడియో క్యాప్షన్,

‘నాన్న నన్ను పాతిక వేలకు అమ్మేశారు’

ఇవికూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)