మ్యూచువల్ ఫండ్స్‌కి  ఏమైంది?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

మార్కెట్ల దూకుడు .. మ్యూచువల్ ఫండ్స్‌‌ నత్తనడక

  • 21 జూలై 2018

షేర్ మార్కెట్లు ఇప్పుడు దూకుడు మీద ఉన్నాయి. సెన్సెక్స్ రికార్డు స్థాయిలో ట్రేడ్ అవుతోంది.

నిఫ్టీ కూడా అదే స్థాయిలో ఉరకలెత్తుతోంది. అయితే గత ఆరు నెలలుగా లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌ను పక్కన పెడితే మిగిలిన మ్యూచువల్ ఫండ్స్ ప్రదర్శన అంతగా ఆశాజనకంగా లేదు.

మార్కెట్లు అద్భుతంగా దూసుకెళ్తున్నా ఈ మ్యూచువల్ ఫండ్స్ మాత్రం ఎందుకు ఆ దూకుడు ప్రదర్శించలేకపోతున్నాయి?

గత ఆరు నెలల్లో చిన్న, మధ్యస్థ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన పలు మ్యూచువల్ ఫండ్ల రిటర్నులు నిరాశాజనకంగా ఉన్నాయి.

షేర్ మార్కెట్లలో పెట్టుబడిదారులు.. రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి పెద్ద కంపెనీల షేర్లు భారీగా కొనుగోలు చేస్తున్నారు. సెన్సెక్స్ 30 ఫేర్ ఇండెక్స్‌లో ఈ కంపెనీల వెయిటేజీ ఎక్కువ. అందుకే సెన్సెక్స్ పైపైకి దూసుకెళ్తోంది.

మ్యూచువల్ ఫండ్స్ కొంతకాలంగా పేలవ ప్రదర్శన చేస్తున్నప్పటికీ సాధారణ మదుపరులకు వాటిపై ఆసక్తి తగ్గట్లేదు. గతేడాది ఈక్విటీలతో ముడిపడిన మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి.

2016-17 ఆర్థిక సంవత్సరానికి క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళికలో రూ. 43,921 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది 2017-18తో పోల్చితే 53% వరకు పెరిగింది.

నాలుగేళ్లుగా ఈక్విటీ అండ్ బ్యాలన్స్‌డ్ సిప్‌ల ద్వారా వచ్చే పెట్టుబడి స్టాక్ మార్కెట్లలోని దేశీయ పెట్టుబడికి వెన్నుముకగా పరిగణిస్తున్నారు.

మార్చి 2018 లో, సిప్ నుంచి రూ. 7,110 కోట్ల రికార్డు పెట్టుబడులు వచ్చాయి.

అసలు మ్యూచువల్ ఫండ్ అంటే..

మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు మీరిచ్చే డబ్బును షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెడతాయి.

మ్యూచువల్ ఫండ్స్ అనేది మ్యూచువల్ ఇంటరెస్ట్ లాంటిదన్నమాట- అందరికి లాభాలు రావాలి. మ్యూచువల్ ఫండ్ కంపెనీలు కొన్ని ప్లాన్‌లు ఆఫర్ చేస్తాయి.

వాటి ద్వారా ప్రజల నుంచి డబ్బు తీసుకుని ఈ కంపెనీలు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడతాయి. దీనికి సంబంధించి పెట్టుబడిదారులైన ప్రజల నుంచి కొంత రుసుము కూడా తీసుకుంటాయి.

అంటే మనకి షేర్ మార్కెట్లలో ఎలా పెట్టుబడులు పెట్టాలో తెలియదు కానీ పెట్టుబడి పెట్టాలన్న కోరిక, డబ్బు, రెండు ఉన్నప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ మంచి మార్గమేనన్నమాట.

పెట్టుబడిదారులు వారి వారి ఆర్థిక లక్ష్యాల ప్రకారం మ్యూచువల్ ఫండ్ పథకాలను ఎంచుకోవచ్చు.

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు ఎలా పెట్టాలి?

వెబ్‌సైట్ ద్వారా నేరుగా పెట్టుబడి పెట్టచ్చు. మ్యూచువల్ ఫండ్స్ సలహాదారుని సహాయం తీసుకోవచ్చు.

అయితే మీరు నేరుగా పెట్టుబడులు పెట్టాలనుకుంటే, మీరు ఆ మ్యూచువల్ ఫండ్ వెబ్‌సైట్‌లో డైరెక్ట్ ప్లాన్‌లో పెట్టుబడులు పెడితే, మీకు కమిషన్ చెల్లించాల్సిన అవసరం లేదు.

అందుకే దీర్ఘకాలిక పెట్టుబడులలో మీ రాబడి చాలా పెరుగుతుంది. కాకపోతే ఈ రకంగా పెట్టుబడులు పెట్టాలనుకుంటే సొంతంగా పరిశోధన చేయాల్సి ఉంటుంది.

మీరు కూడా షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయోచ్చు. అయితే, పెట్టుబడి పెట్టే ముందు అన్ని విషయాలను పరిశీలించి అడుగు ముందుకు వేయండి.

(ఆర్థిక నిపుణులు అందించిన సమాచారం ఆధారంగా ఈ కథనం రాశాం. మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు కేవలం ఈ కథనాన్నే ఆధారం చేసుకోకుండా మీ సొంత అధ్యయనం.. లేకుంటే నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)