అవిశ్వాసం ఆటలో ఎవరికెన్ని పాయింట్లు?

  • 21 జూలై 2018
ప్రధాని మోదీ Image copyright LSTV

లోక్‌సభలో తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస పరీక్షలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 199 మంది సభ్యుల ఓట్ల తేడాతో సునాయసంగా గట్టెక్కింది.

కానీ.. ఈ గెలుపు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబిస్తోందా? ఇప్పటికిప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్తే ఇంతే భారీ విజయాన్ని బీజేపీ సొంతం చేసుకోగలగుతుందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అదేసమయంలో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఈ అవిశ్వాసం ఎవరికి ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందనే విషయమూ చర్చనీయమవుతోంది. అవిశ్వాసం వీగిపోయినా తెలుగుదేశం పార్టీ ప్రజల ముంగిట తన చిత్తశుద్ధిని నిరూపించుకుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

మరోవైపు ఏపీకి తామెంతో చేశామని బీజేపీ ఎప్పటిలా చెప్పుకొంటుండగా.. నాలుగేళ్లుగా మడమ తిప్పకుండా పోరాడుతున్నది తామేనన్నది వైఎస్సార్ కాంగ్రెస్( వైసీపీ) మాట.

మొత్తంగా చూస్తే, ''ఎటూ వీగిపోయే తీర్మానమే కదా అని పాలక, ప్రతిపక్షాలు ఎలాంటి ఒత్తిడికి గురవకుండానే చర్చలో పాల్గొన్నాయి. ముగింపు తెలిసిన కథలో సస్పెన్సు ఎందుకనుకున్నారో ఏమో అప్పుడప్పుడూ తమ చేతలతో నవ్వులు పువ్వులు పూయించే ప్రయత్నం కూడా చేశారు'' అని సీనియర్ పాత్రికేయులు భండారు శ్రీనివాసరావు ఈ అవిశ్వాసపర్వం గురించి ఒక్క మాటలో చెప్పారు.

అవిశ్వాసంలో అంతిమ ఫలితం ఏంటన్నది పక్కనపెడితే ఈ సందర్భంగా నిర్వహించిన చర్చను ఎవరు ఎలా ఉపయోగించుకున్నారన్నదీ కీలకమే. సంఖ్యాబలమే బలిమిగా పాలక బీజేపీ ఈ చర్చలో అత్యధికంగా మూడున్నర గంటల సమయం తీసుకోగా.. అవిశ్వాసం పెట్టిన తెలుగుదేశం పార్టీకి సభ్యులు తక్కువగా ఉండడంతో కేవలం 13 నిమిషాల సమయమే దక్కింది.

Image copyright loksaba tv

అయితే.. అవిశ్వాసంపై చర్చను ఆ పార్టీయే ప్రారంభించడంతో ఆ సమయం అదనంగా దొరికింది.

పార్టీ పరంగా దక్కిన సమయం, చర్చను ప్రారంభించిన సందర్భంగా దొరికిన అవకాశం.. రెండింటినీ తెలుగుదేశం పార్టీ బాగా ఉపయోగించుకుందన్నది ఆ పార్టీ అభిప్రాయం. నాలుగేళ్ల కిందట వీచిన గాలి కారణంగా సాధించుకున్న సంఖ్యాబలమే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని గట్టెక్కించిందన్నది టీడీపీ నేతల వాదన.

''అవిశ్వాసాన్ని చర్చకు తీసుకోవడమే మేం సాధించిన తొలి విజయం.. ఆపై చర్చలో మాకు దొరికిన అతి తక్కువ సమయాన్ని కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాం'' అని టీడీపీ ఎంపీలు బీబీసీకి తెలిపారు.

Image copyright LSTV

'ఏపీ ప్రజల ఆవేదన అందరికీ చేరింది'

నిజానికి తెలుగుదేశం పార్టీ నుంచి ప్రస్తుత (16వ) లోక్‌సభలో ఉన్న ఎంపీల్లో.. విభజన సమయంలో ఎంపీలుగా ఉన్నది కేవలం ముగ్గురే. కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, ఎన్.శివప్రసాద్ మాత్రమే 15వ లోక్‌సభలో ఉన్నారు.

మిగతావారిలో సీనియర్ నేతలున్నప్పటికీ లోక్‌సభకు వారూ కొత్తే. దక్షిణాది రాష్ట్రాల నేతల్లో చాలామందికి ఉన్నట్లే వీరిలో అత్యధికులకు లోక్‌సభలో మాట్లాడేందుకు భాషా సమస్య ఉంది.

ఈ పరిస్థితుల్లో సభకు కొత్తవారైనప్పటికీ ఎంపీలు గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహన్‌నాయుడులకు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ వాదన వినిపించే అవకాశం కల్పించారు.

తెలుగుదేశం పార్టీ  తరపున చర్చను ప్రారంభించిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్రసంగ పాఠం చదువుతూ పోవడం వల్ల ఆయన చెప్పిన విషయాలు సభ రికార్డులకు ఎక్కి ఉండవచ్చు కానీ సభను ఆకట్టుకోలేకపోయారని పాత్రికేయుడు భండారు శ్రీనివాసరావు విశ్లేషించారు.

అయితే ఈ లోటును టీడీపీకి చెందిన మరో యువ నాయకుడు రామ్మోహన్ నాయుడు భర్తీ చేశారని.. హిందీలో అనర్గళంగా మాట్లాడుతూ ట్వంటీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్‌ని తలపించారని ఆయన అన్నారు.

కానీ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తలపోసినట్టు ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు ఈ చర్చ ద్వారా యావత్ జాతి దృష్టిని ఆకట్టుకున్నాయా అంటే వెంటనే అవునని చెప్పలేమని భండారు శ్రీనివాసరావు బీబీసీతో అన్నారు.

Image copyright LSTV

విమర్శలతో ఎదురుదాడి

ఇక బీజేపీ విషయానికొస్తే అత్యధిక సమయం తీసుకున్నప్పటికీ దాన్నంతా రాజకీయ విమర్శలకే సరిపెట్టారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను విమర్శించడానికే అధిక సమయం వెచ్చించి ఏపీ అంశాలను సూచన ప్రాయంగా ప్రస్తావించి వదిలేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఆరోపించారు.

''సభలో సంఖ్యాపరంగా ఉన్న బలం, దానికి తోడు మోదీకి స్వతహాగా ఉన్న ప్రసంగ పాటవం రెండూ జత కలిసి ఆయన ప్రభుత్వాన్ని ఒడ్డున పడేశాయి. ఇప్పట్లో మళ్లీ అవిశ్వాస తీర్మానం బెడద మోదీ ప్రభుత్వానికి ఉండదు కాబట్టి ఆంధ్రప్రదేశ్‌కు కొత్త హామీలు పెద్దగా ఇవ్వకుండానే, రాజకీయంగా అటు కాంగ్రెస్‌ను దెబ్బతీయడానికి ఎక్కువ సమయాన్ని, తెలుగు దేశం పార్టీ విమర్శలను ఎదుర్కోవడానికి తక్కువ సమయాన్ని తీసుకుని మొత్తం మీద 'మమ' అనిపించి ముగించారు'' అని భండారు శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.

Image copyright Getty Images

‘రాహుల్‌ను విశ్వసించిన టీడీపీ’

కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడిన రాహుల్ గాంధీ సైతం జాతీయ స్థాయి అంశాలకు.. బీజేపీ, మోదీలపై విమర్శలకు పరిమితమయ్యారే తప్ప ఏపీ సమస్యలపై పెద్దగా దృష్టిపెట్టలేదని టీడీపీ నేతలు విమర్శించారు.

''తీర్మానం పెట్టింది తెలుగుదేశం పార్టీ, కానీ ఆ పార్టీకంటే కాంగ్రెస్ కొంత లాభపడింది. అంతకంటే ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరింత లాభపడ్డారని చెప్పాలి. తనను నమ్ముకున్న తెలుగు దేశం పార్టీకి మద్దతుగా ఆయన మాట్లాడింది చాలా తక్కువ. మోదీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తూ, రాబోయే ఎన్నికల్లో రాజకీయంగా లాభపడడానికే రాహుల్ ఈ అవకాశాన్ని ఎక్కువగా ఉపయోగించుకున్నట్టు అనిపించింది. ఒక జాతీయ పార్టీ నేతగా ఆయన శక్తి సామర్థ్యాలను అవహేళన చేస్తూ అనేక కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తన ప్రసంగం మధ్యలో ఆయనా ఈ ప్రస్తావన తెచ్చారు. పార్లమెంటు సమావేశాలు జరిగే తీరు తెన్నులను ప్రత్యక్ష ప్రసారాల్లో చూడగలిగే అవకాశం అంతగా లేని రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి తన పట్ల ఉన్న తేలిక భావాన్ని పటాపంచలు చేయగలిగే మహత్తర అవకాశాన్ని రాహుల్ బాగానే ఉపయోగించుకున్నారు. ఉన్నట్టుండి లేచి వెళ్లి ప్రధాని మోదీని ఆలింగనం చేసుకున్న దృశ్యాలు బుల్లి తెరపై చూసి అనేకమంది యువత ఫిదా అయిపోయారు. అయితే అది జరిగి నిమిషం కూడా గడవక ముందే ఆయన కనబరచిన హావభావాలు చూసి జీర్ణించుకోలేని జనం సంఖ్య  కూడా తక్కువ కాదు'' అని భండారు శ్రీనివాసరావు విశ్లేషించారు.

Image copyright facebook

వైసీపీని ఆదుకున్న మోదీ

రాజీనామాలు చేసి సభ వెలుపలే ఉండిపోయిన వైసీపీకి సభాపర్వంలో పోషించాల్సిన పాత్ర తక్కువ. అయినా 'వైసీపీ పన్నిన ఉచ్చులో పడొద్దని' తాను  చంద్రబాబు నాయుడికి సూచించానని మోదీ సభాముఖంగా చెప్పడం వల్ల ఆ పార్టీ ప్రస్తావన వచ్చింది.

"నలభయ్యేళ్ల అనుభవం ఉన్న చంద్రబాబును కూడా వలలోకి లాగడం అంటే, ఆ విషయాన్ని మోదీ స్వయంగా చెప్పడం అంటే  పెద్ద మెచ్చుకోలు కిందే లెక్క" అని ఆయన విశ్లేషించారు.

రాజకీయ నాయకులకు కేవలం రాజకీయం చేయడం వస్తే కుదరదు, జనాలను ఆకట్టుకునే ఉపన్యాస కళ కూడా అవసరమని ఈ అవిశ్వాస పర్వం తెలుపుతోందని అన్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ విషయానికొస్తే ఆ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేయడంతో వారికి లోక్‌సభలో స్వరం లేకుండా పోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2014 ఎన్నికల్లో 9మంది సభ్యులు గెలవగా అందులో నలుగురు పార్టీ ఫిరాయించారు. బుట్టా రేణుక, ఎస్పీవై రెడ్డి టీడీపీలోకి ఫిరాయించగా కొత్తపల్లి గీత తొలుత టీడీపీకి దగ్గరగా ఉంటూ అనంతరం కొద్దికాలంగా ఏ పార్టీకీ చెందనట్లుగా వ్యవహరిస్తున్నారు.

తెలంగాణలోని ఖమ్మం జిల్లా నుంచి ఎన్నికైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. అయితే, ఈ నలుగురు పార్టీలు మారినప్పటికీ పదవులకు రాజీనామా చేసి మళ్లీ గెలవకపోవడంతో సాంకేతికంగా సభలో వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులుగానే కొనసాగుతున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న అయిదుగురు సభ్యులు రాజీనామాలు చేయడంతో ఈ నలుగురు మాత్రమే వైసీపీ లెక్కలోకి వచ్చారు. వారి తరఫున మాట్లాడిన బుట్టా రేణుక టీడీపీతో అనుబంధంగా ఉండడంతో అవిశ్వాసానికి అనుకూలంగానే మాట్లాడారు.

దీంతో పార్టీలో కీలకంగా ఉన్న నేతలు సభలో లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపించింది.

Image copyright facebook

మోదీ పట్ల వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో చెప్పాం: ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యను జాతీయ సమస్యగా మార్చగలిగామని.. పదిహేను మంది ఎంపీల బలం ఉన్న ఒక పార్టీ పార్లమెంటు వేదికగా అవిశ్వాసం పెట్టడమనేది పెద్ద సాహసమని టీడీపీ నేత, ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు బీబీసీతో చెప్పారు.

తక్కువ సంఖ్యాబలం ఉన్నప్పటికీ తాము పెట్టిన అవిశ్వాసానికి 126 ఓట్లు వచ్చాయని చెప్పారు. శివసేన, బీజేపీ, టీఆర్ఎస్ ఎవరూ మోదీ ప్రభుత్వానికి సపోర్టు చేయకపోవడమనేది వ్యతిరేకత పెరుగుతుందనడానికి స్పష్టమైన సంకేతమన్నారు.

శివసేనతో బీజేపీ పెద్దలు మాట్లాడినా ఫలితం లేకపోయిందని, మోదీ ఇమేజ్ బాగా పడిపోయిందనడానికి ఇదే ఉదాహరణని ఆయన అన్నారు.

మోదీ సభలో మాటల గారడీతో మభ్యపెట్టారే కానీ వ్యక్తిగతంగా తమను ఎదుర్కోలేకపోయారని కాల్వ శ్రీనివాసులు చెప్పారు.

''ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు ప్రధాని సూటిగా సమాధానం చెప్పలేకపోయారు. రాఫెల్ డీల్ విషయానికొచ్చేసరికి రక్షణ మంత్రి ఏం సమాధానం చెప్పలేకపోయారు. డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించిన సీక్రెసీ పాటించొచ్చు కానీ కొనుగోలు ఒప్పందంలో రేట్ల విషయంలో రహస్యం ఏముంటుంది? రేటు ఎందుకు పెరిగిందన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదంటే 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకే ఇవ్వలేకపోయామంటున్నారు. కానీ, ఆర్థిక సంఘం ఛైర్మన్, సభ్యులే తాము అలాంటి సిఫారసులు చేయలేదని చెబుతున్నారు. స్పష్టత లేకుండా కేవలం మాటల గారడీతో, దాటవేత ధోరణితో ఉన్నారే తప్ప పార్లమెంటులో మోదీ బాధ్యతాయుతంగా సమాధానం చెప్పలేకపోయారు'' అని కాల్వ బీబీసీతో అన్నారు.

ఏపీలో ప్రత్యేక హోదా, కడప ఉక్కు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి విషయంలో తాము ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తున్నామని, అవిశ్వాసం తరువాత కూడా ఈ పోరు కొనసాగుతుందని కాల్వ చెప్పారు.

Image copyright ysrcp/facebook

నష్ట నివారణ చర్యల్లో వైసీపీ

లోక్‌సభలో టీడీపీ అవిశ్వాసం పెట్టి దేశం దృష్టిని ఆకర్షించడం, అదేసమయంలో సభలో వైసీపీ ఎంపీలు లేకపోవడంతో ఆ పార్టీ వెనువెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఏపీకి అన్యాయం జరిగిందంటూ ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బంద్‌కు పిలుపిచ్చారు. ఈ నెల 24న వైసీపీ బంద్ తలపెట్టింది.

''బీజేపీ నుంచి కాంగ్రెస్ వరకూ సభలో ఒక్కరు కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగంలో అర నిమిషం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన లేదు. చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత, ఆయన ఆమోదంతోనే హోదాకు బదులు ప్యాకేజీ ఇచ్చామన్న ప్రధాని మాటలు చాలా బాధ కలిగించాయి'' అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహరెడ్డి అన్నారు.

Image copyright LOKSBA TV

తప్పు రాష్ట్రానిదే: బీజేపీ

అవిశ్వాస తీర్మానం సందర్భంగా చేపట్టిన చర్చలో టీడీపీ ఎంపీలు చెప్పినవన్నీ అవాస్తవాలని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

దుగజరాజపట్నం పోర్టు ఆలస్యానికి, కడప ఉక్కు కర్మాగారం జాప్యానికి ఏపీ ప్రభుత్వమే కారణమని బీజేపీ నేత పురంధేశ్వరి అన్నారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, విశాఖకు రైల్వేజోన్ కచ్చితంగా ఇస్తామని చెప్పిన ఆమె ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.

ఏపీకి కేంద్రం ఏమీ చేయలేదన్నది వాస్తవం కాదని.. దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు నిమిత్తం స్థలం చూపించమని ప్రభుత్వాన్ని కోరామని.. విశాఖకు రైల్వేజోన్ వస్తుందని బీజేపీకి చెందిన మరో నేత, ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు.

Image copyright LSTV

టీడీపీ, బీజేపీలు రెండింటికీ వైఫల్యసాఫల్యాలు

534 మంది సభ్యులున్న లోక్‌సభలో కేవలం 451 మంది మాత్రమే ఓటింగ్‌లో పాల్గొన్నారు. వారిలో 126 మంది అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేయగా.. 325 మంది వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో 199 ఓట్ల ఆధిక్యంతో మోదీ సభ విశ్వాసాన్ని పొందగలిగారు.

అయితే... రాజకీయంగా రెండు పార్టీలూ కొంత వైఫల్యం మూటగట్టుకున్నాయి. అదే సమయంలో మరికొంత సాఫల్యాన్నీ వెతుక్కున్నాయి.

శివసేన సభ్యులు సభకు వచ్చేలా చేయలేకపోవడం బీజేపీ వైఫల్యం కాగా, అకాలీదళ్ సభ్యుడు తెలుగుదేశం డిమాండ్‌ను బలపరచడం టీడీపీ సాఫల్యంగా చెప్పుకోవాలి. అదేసమయంలో బీజేపీతో విభేదిస్తున్న శివసేన మద్దతు పొందలేకపోవడం తెలుగుదేశం వైఫల్యమనే చెప్పాలి.

మరోవైపు టీఆర్‌ఎస్‌ సభ్యులు చర్చలో పాల్గొన్నప్పటికీ ఓటింగ్‌ జరిగే సమయానికి చాలా ముందుగానే సభ నుంచి వెళ్లిపోయారు. ఓటింగ్‌ సమయంలో ఎంపీలు మల్లారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభలో లేరు.

వీరిలో మల్లారెడ్డి టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్‌లో చేరినా విప్‌ను అనుసరించి ఆయన అవిశ్వాసం సందర్భంగా జరిగిన చర్చలో టీడీపీ సభ్యులతో కూర్చున్నారు. కానీ, ఓటింగ్ సమయానికి వెళ్లిపోయారు. ఇక సాంకేతికంగా వైసీపీ సభ్యులైన బుట్టా రేణుక, ఎస్పీవై రెడ్డి అవిశ్వాసానికి మద్దతుగా ఓటేశారు.

అవిశ్వాసం అనంతరం ఏపీ కేంద్రంగా ప్రధాన పార్టీలన్నీ ఎప్పటిలా తమ పాత పాటే పాడేందుకు సిద్ధమవుతున్నాయి. ఎవరికి వారు ఇతర పార్టీలనూ రాష్ట్ర ద్రోహులుగా చూపుతూ జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

మరి.. ప్రజలు వీరిలో ఎవరి పట్ల విశ్వాసం చూపుతారో వచ్చే ఎన్నికల్లోనే తేలాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)