రాజస్థాన్‌లో మళ్లీ మూకదాడి - గోరక్షకుల చేతిలో మరో ముస్లిం హత్య

  • 21 జూలై 2018
గోరక్ష, గోవధ పేరుతో హత్యలు Image copyright Getty Images

రాజస్థాన్‌లోని అల్వర్‌లో గోరక్షణ పేరుతో కొందరు దుండగులు ఓ వ్యక్తి ప్రాణాలు తీశారు. హర్యాణాలోని నూహ్ ప్రాంతానికి చెందిన అక్బర్‌పై మూక దాడి చేసి విపరీతంగా కొట్టడంతో ఆయన అక్కడే ప్రాణాలు విడిచారు.

పోలీసులు ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు.

అల్వర్‌లో ఇలా తమను తాము గోరక్షకులుగా చెప్పుకునే వాళ్లు గుంపుగా దాడి చేసి కొట్టి చంపిన మూడో వ్యక్తి అక్బర్.

గతేడాది సరిగ్గా ఇదే విధంగా, ఇవే ఆరోపణలపై పహలూ ఖాన్ అనే వ్యక్తినీ, ఆ తర్వాత ఉమర్ అనే మరో వ్యక్తినీ గుంపుగా దాడిచేసి కొట్టి చంపారు. ఈ ఘటనపై ముస్లిం మేవ్ సముదాయం ఆక్రోశం వెలిబుచ్చింది.

ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఈ ఘటనపై స్పందిస్తూ మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. "రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఆవుకు జీవించే మౌలిక హక్కుంది. ముస్లింనైతే కొట్టి చంపొచ్చు. ఎందుకంటే అతడికి జీవించే నైతిక హక్కు లేదు. మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ నాలుగేళ్లలో లించింగ్ (మూకదాడుల) రాజ్యమే నడుస్తోంది" అని ఆయనన్నారు.

రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఈ ఘటనను ఖండించారు. దీనికి బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

శనివారం అక్బర్ మృతదేహాన్ని ఆయన ఇంటికి తీసుకెళ్లగా అక్కడ శోక వాతావరణం నెలకొంది.

అక్బర్ పిల్లలు అనాథలయ్యారనీ, ఆయన తల్లిదండ్రులకు ఆసరా లేకుండా పోయిందనీ కోల్‌గాంకు చెందిన అస్హాక్ అహ్మద్ అన్నారు.

Image copyright Getty Images

ఈ హత్య ఎక్కడ, ఎలా, ఎప్పుడు జరిగింది?

అక్బర్‌ శుక్రవారం అర్ధరాత్రి రెండు ఆవుల్ని తీసుకొని హర్యాణాకు నడిచి వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. ఆయన వెంట అస్లమ్ అనే మరో వ్యక్తి కూడా ఉన్నారు. అస్లం పారిపోయి ప్రాణాలు కాపాడుకోగలిగారు. కానీ, దాడికి పాల్పడ్డ గుంపు అక్బర్‌ను ఆవుల దొంగగా భావించి విపరీతంగా కొట్టడంతో ఆయన ఆసుపత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు విడిచారు.

‘‘ఇద్దరు వ్యక్తులు ఆవుల్ని దొంగిలించి తీసుకెళ్తున్నారని రామ్‌గఢ్ పోలీస్ స్టేషన్‌కు అర్ధరాత్రి సమాచారం అందింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోగా అక్బర్ గాయపడి ఉన్నాడు. ఘటనకు సంబంధించిన ఆయనే పోలీసులకు వివరాలు అందించారు.’’ అని జైపూర్ పోలీస్ రేంజ్ ఏడీజీ హేమంత్ ప్రియదర్శి ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.

అక్బర్‌ను ఆసుపత్రికి తరలించామనీ, అయితే డాక్టర్లు ఆయన అప్పటికే చనిపోయినట్టు ప్రకటించారని పోలీసులు తెలిపారు.

ఈ సంఘటన గురించిన సమాచారం తెలియగానే మేవ్ సముదాయానికి చెందిన వాళ్లు ఆసుపత్రి వద్ద గుమిగూడారు. దీనిపై నిరసన తెలిపారు.

సమాచారం తెలియగానే అక్బర్ కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. పోలీసులు చాలా సేపు నచ్చజెప్పిన తర్వాతే అక్బర్ కుటుంబ సభ్యులు పోస్ట్‌మార్టం చేయడానికి ఒప్పకున్నారు.

Image copyright Getty Images

మూక మోదీ మాటనూ పట్టించుకోదు.. కోర్టు మాటా వినదు

శుక్రవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో మాట్లాడుతూ ఈ తరహా ఘటనలపై విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రాలు ఇలాంటి ఘటనల్ని అరికట్టాలని కోరారు.

అంతకు ముందు సుప్రీంకోర్టు కూడా మూకలు పాల్పడుతున్న హింసాత్మక ఘటనల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, వీటిని అరికట్టడం కోసం స్పష్టమైన నిర్దేశాలు జారీ చేసింది.

'అధికారుల నిర్లక్ష్యం వల్లే అక్బర్ మృతి'

అల్వర్ ఆసుపత్రి ఆవరణలో గుమిగూడిన వారిలో ఒకరైన మౌలానా హనీఫ్ బీబీసీతో మాట్లాడుతూ, "పహలూ ఖాన్ కేసులో అధికారులు కఠిన చర్యలు తీసుకొని ఉంటే ఉమర్ చనిపోయేవాడు కాదు. ఉమర్ హత్య జరిగాకనైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి ఉంటే ఇప్పుడు అక్బర్ చనిపోయేవాడు కాదు. ఈ ఘటనలతో భయాందోళనలు పెరుగుతున్నాయి" అన్నారు.

"ఈ విషాద సమయంలో మెజారిటీ సముదాయానికి చెందిన ప్రజలు మాతో నిలబడ్డారు. ఇదే మాకు బలాన్నిస్తోంది" అని మౌలానా చెప్పారు.

కోల్‌గాంకు చెందిన ఇస్హాక్ తన ఆవేదన వెలిబుచ్చుతూ, "అక్బర్ భార్యాపిల్లల దయనీయ పరిస్థితి చూడలేకుండా ఉన్నాం. అక్బర్‌కు ఏడుగురు పిల్లలు. ఈ గ్రామంలో అన్ని సముదాయాల వాళ్లుంటారు" అని చెప్పారు.

"కుటుంబ సభ్యులకు సానుభూతి తెలపడానికి అన్ని సముదాయాల వాళ్లు వచ్చారు. అక్బర్‌ది చాలా పేద కుటుంబం" అని ఇస్హాక్ చెప్పారు.

అక్బర్ తండ్రి పాలు అమ్మేవాడని ఇస్హాక్ చెప్పారు. ఆయన తన ఇంట్లో డెయిరీ నడిపేవారు. గత కొంత కాలంగా తన తండ్రి వ్యాపారాన్ని అక్బర్ నడిపిస్తున్నారు. పాల వ్యాపారం కోసమే ఆయన ఆవుల్ని కొని తెస్తుండగా ఈ ఘటన జరిగింది.

మేవ్ సముదాయానికి చెందిన సద్దామ్ మాట్లాడుతూ, తమ సముదాయానికి చెందిన వారు పశుపాలన, వ్యవసాయం చేస్తూ జీవిస్తారని చెప్పారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం అల్వర్ జిల్లాలో రెండు లక్షలకు పైగా పశువులున్నాయి. ఈ ప్రాంతం మేవాత్‌లో భాగం. ఇది హర్యాణా దాకా విస్తరించి ఉంటుంది.

Image copyright MANSI THAPLIYAL

ఒక్క వారంలో రెండో మూకదాడి ఘటన

గోరక్షకుల చేతిలో పహలూ ఖాన్ హతుడైన తర్వాత మానవ హక్కుల సంఘాలు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించాయి. పోలీసులు పహలూ ఖాన్ హత్యకు సంబంధించి 9 మందిపై కేసు నమోదు చేశారు. కానీ ఆ తర్వాత తగిన సాక్ష్యాలు లేవంటూ పోలీసులు ఆరుగురికి క్లీన్ చిట్ ఇచ్చారు.

రాజస్థాన్‌లో గత ఐదు రోజుల్లో గోరక్షకులు ఇలా చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని గుంపుగా దాడి చేసిన రెండో ఘటన ఇది. ఐదు రోజుల క్రితం కోటా అనే చోట ఇలాంటి ఘటన జరిగింది.

మధ్యప్రదేశ్‌లో పాల వ్యాపారం చేసుకునే ప్రవీణ్ పండిత్, ఆయన డ్రైవర్ అహ్మద్‌లను ఇలాగే చుట్టముట్టి కొట్టారు. ప్రవీణ్ తన పాల వ్యాపారం కోసం జైపూర్‌లో ఆవును కొని దేవాస్‌కు తీసుకువెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

ప్రవీణ్ తాను బ్రాహ్మణుడిని అంటూ ఎంత మొరపెట్టుకున్నా మూక పట్టించుకోలేదు. ఆయనపై ఏ మాత్రం జాలి చూపలేదు. కోటా ఘటనలో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)