అభిప్రాయం: మోదీ మాటకారితనం ఏమైపోయింది?

  • 22 జూలై 2018
నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, అవిశ్వాస తీర్మానం Image copyright LSTV

మంచి మాటకారిగా పేరొందిన ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం లోక్‌సభలో మాత్రం అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ఒక సుదీర్ఘమైన, నిరర్ధక ప్రసంగం చేశారు.

చాలా నాటకీయంగా ప్రసంగించే మోదీ, కాగితంపై రాసుకున్న ప్రసంగాలను పట్టిపట్టి చదివే రాహుల్ గాంధీల్లో వచ్చిన తేడా స్పష్టంగా కనిపించింది.

బహుశా నాలుగున్నరేళ్ల కాలంలో గట్టి ప్రశ్నలు అడగలేని చీర్‌లీడర్ మీడియాను మాత్రమే ఎదుర్కొన్న మోదీ నిజంగానే జటిలమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేరేమో.

అయితే రాహుల్ గాంధీ మాత్రం అనేక ప్రశ్నలను సంధించారు. మోదీ మాయమాటలు, బిలియనీర్లతో ఆయనకున్న సంబంధాల గురించి రాహుల్ తీవ్రమైన విమర్శనాస్త్రాలు సంధించారు.

అయితే మోదీ ఆ విమర్శలన్నటికీ మరిచిపోలేని సమాధానం ఇస్తారని, 2019 ఎన్నికలకు ముందు అది బాగా ఉపయోగపడుతుందని బీజేపీ భావించింది.

Image copyright LSTV

నిజానికి అవిశ్వాస తీర్మానానికి అనుమతించాలన్న ఆలోచన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాది. ప్రతిపక్షాలలో ఉన్న విభేదాలను బహిర్గతం చేసి, ఎన్డీయే ఏకతాటి మీద ఉందని తెలియజేయాలన్నది షా వ్యూహం.

అయితే 20 ఏళ్లకు పైగా బీజేపీతో స్నేహం చేస్తున్న శివసేన ఈసారి చేయిచ్చింది. తమ 18 మంది ఎంపీలు ఓటింగ్‌కు దూరంగా ఉండాలని ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఆదేశించారు. ఈ అవమానం చాలదన్నట్లు రాహుల్ గాంధీ ప్రధానిని ఆలింగనం చేసుకోవడంపై కూడా సేన హర్షం వ్యక్తం చేసింది. రాహుల్ రాజకీయవేత్తగా పరిణితి చెందాడంటూ పేర్కొంది. తెలుగుదేశం పార్టీ మోదీని 'మోసకారి, 'మంచి నటుడు' అని అన్నపుడు దానిని 'నైతికత వర్సస్ మెజారిటీ' అని వ్యాఖ్యానించింది.

మొదటిసారి పార్లమెంటుకు ఎన్నికైన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తన అమెరికన్ యాసతో కూడిన ఇంగ్లీష్‌లో గణాంకాలతో సహా మోదీ ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ప్రతి హామీని ఎలా విస్మరించారో వివరించారు.

గల్లా ప్రసంగించినంత సేపూ మోదీ కోపంగా కనిపించారు. ఇక రాహుల్ గాంధీ మోదీని ఆకస్మికంగా ఆలింగనం చేసుకున్న తర్వాత బీజేపీ నేతలు.. మోదీ వడ్డీతో సహా బాకీ తీరుస్తారని అనుకున్నారు.

దురదృష్టవశాత్తూ అనుకున్నది జరగలేదు. దాదాపు 90 నిమిషాల మోదీ ప్రసంగం మాయమాటల్లాగే వినిపించాయి.

Image copyright Getty Images

మోదీ తన హోదాను మర్చిపోయి, సోనియా గాంధీ ఇటాలియన్ యాసను ఎద్దేవా చేసినపుడు వాటికి ప్రతిస్పందనగా ట్రెజరీ బెంచీల నుంచి కొన్ని బలవంతపు నవ్వులు మాత్రం వచ్చాయి.

అయితే విచిత్రం ఏంటంటే, రాహుల్ మోదీని ఆలింగనం చేసుకున్నపుడు రాజ్‌నాథ్ సింగ్, అనంత్ కుమార్‌ల మొహాల్లో నవ్వులు విరిసాయి. అయితే రాహుల్ చర్య స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు మాత్రం నచ్చలేదు. రాహుల్ సభాసాంప్రదాయాలను పాటించాలని ఆమె హితవు పలికారు.

మొత్తమ్మీద మోదీ మాటల చాతుర్యంతో రాబోయే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలన్న బీజేపీ వ్యూహం బెడిసికొట్టింది. మోదీ ప్రసంగంలో పస కనిపించలేదు.

Image copyright LSTV

కఠినమైన ప్రశ్నలకు ఎలా ప్రతిస్పందస్తారన్న దానిని బట్టి ఒక నేతను అంచనా వేయొచ్చు. మీడియాకు దూరంగా ఉండే మోదీ ప్రధానిగా ఉండగా ఒక్క పత్రికా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయని ప్రధానిగా పేరొందారు.

ప్రస్తుతం ఎలాంటి ప్రశ్నలనైనా ఎదుర్కొనడం ఆయనకు కష్టం కావచ్చు. అంతే కాకుండా మోదీ ఇప్పటివరకు పార్లమెంటులో కూడా సరైన ప్రశ్నలను ఎదుర్కోలేదు.

ఇక ప్రతిపక్షాలను వ్యక్తిగత వ్యంగ్యోక్తులతో దెబ్బ తీసే విధానం ఆయన హోదాకు తగినది కాదు. అంతే కాకుండా కింది స్థాయి నుంచి వచ్చిన తన గతాన్ని మార్కెట్ చేసుకోవాలన్న ప్రయత్నాలు కూడా ఇటీవల బెడిసికొడుతున్నట్లు కనిపిస్తోంది.

నిజానికి డాక్టర్ మన్మోహన్ సింగ్‌ది కూడా అలాంటి నేపథ్యమే అయినా, ఆయన ఎన్నడూ దాని గురించి చెప్పుకోలేదు.

ఇన్నాళ్లూ ఊహించినట్లు 2019 ఎన్నికల్లో విజయం బీజేపీకి ఇక ఎంత మాత్రమూ సులభం కాదు. అందువల్ల మోదీ తన స్టైల్‌ను మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

తాను కూడా పోటీలో ఉన్నానని రాహుల్ సవాలు విసిరారు. మోదీ ఆయనను ఎలా ఎదుర్కొంటారన్నది చూడాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)