ప్రెస్ రివ్యూ: ‘కేసీఆర్ మోదీ ఏజెంట్..’

  • 22 జూలై 2018
Image copyright uttam kumar/facebook

కేసీఆర్.. మోదీ ఏజెంట్! : ఉత్తమ్

కేసీఆర్‌కు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారని ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం మేరకు..

పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చ సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దోస్తానా మరోసారి బయటపడింది. మోదీకి కేసీఆర్‌ ఏజెంట్‌ అని, టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే.. బీజేపీ, మోదీకి వేసినట్లేనన్న విషయాన్ని రాష్ట్రంలోని మైనారిటీలు సహా అన్ని వర్గాలూ గుర్తించాలని కోరారు.

హైదరాబాద్‌కు తాగు నీటి కోసం గోదావరి నీటిని తరలించే పథకాన్ని మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్మిస్తే ఆ పథకం తనదేనంటూ ప్రధానితో ప్రారంభోత్సవం చేయించారని విమర్శించారు.

ఏపీలోని టీడీపీ ప్రభుత్వం పోరాడుతున్నా బుద్ధి తెచ్చుకోవడం లేదని మండిపడ్డారు. తెలంగాణకు రావాల్సిన బయ్యారం ఉక్కు పరిశ్రమ, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీని ప్రధాని ఇవ్వరని.. సీఎం కేసీఆర్‌ కూడా అడగరు అని ఉత్తమ్ కుమార్ అన్నట్లు ఆంధ్రజ్యోతి పేర్కొంది.

విద్యార్థులు Image copyright Getty Images

‘సిలబస్ మారింది’

గ్రూప్ 1 ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు ఏపీపీఎస్సీ.. కొత్త సిలబస్ రూపొందించిందంటూ సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

కొత్త సిలబస్‌ను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్లో పొందుపరిచారు. దీనిపై ప్రజలనుంచి, నిపుణుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించిన అనంతరం మార్పులు చేర్పులతో తుది సిలబస్‌ను ఖరారు చేయనుంది. గ్రూప్‌1 ప్రిలిమ్స్, మెయిన్స్‌లో కమిషన్‌ పలు మార్పులు చేసింది.

గ్రూప్‌1 మెయిన్స్‌లో గతంలో జనరల్‌ ఇంగ్లిష్‌తో పాటు అయిదుపేపర్లు డిస్క్రిప్టివ్‌ తరహాలో ఉండేవి. ఇప్పుడు అదనంగా తెలుగు సబ్జెక్టును కమిషన్‌ జతచేసింది.

ప్రిలిమ్స్‌నుంచి అర్హత సాధించిన వారిని మెయిన్స్‌కు ఎంపిక చేయడానికి కటాఫ్‌ మార్కులను నిర్ణయించే అధికారాన్ని ప్రభుత్వం ఇప్పడు కమిషన్‌కు అప్పగించింది.

గతంలో ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసేవారు. ఇందులో కేటగిరీలకు సంబంధం లేకుండా అభ్యర్థులు ఎంపికయ్యేవారు.

కానీ ఈసారి యూపీఎస్సీ తరహాలో కేటగిరీల వారీగా ఆయా రిజర్వుడ్‌ పోస్టుల సంఖ్యకు అనుగుణంగా అభ్యర్థులను నిర్ణీత నిష్పత్తిలో ఎంపిక చేయనున్నారు.

కటాఫ్‌ను నిర్ణయించి 1:15 లేదా అంతకు మరికొంత ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులను పరిమితం చేసి మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నారని సాక్షి పేర్కొంది.

Image copyright Getty Images

‘ఈసారి 250 ఉపగ్రహాలను ప్రయోగిస్తాం’

ఇస్రో.. ఒకేసారి 250 ఉపగ్రహాలను ప్రయోగిచనుందంటూ, ఇస్రో ఛైర్మన్ డా.కె.శివన్‌తో చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూను ఈనాడు దినపత్రిక ప్రచురించింది. అందులో..

చంద్రుడిపై తొలిసారిగా నీటి పరమాణువుల ఉనికిని వెలుగులోకి తెచ్చిన తాము.. త్వరలో చంద్రయాన్‌-2 ప్రయోగం ద్వారా చందమామ దక్షిణ ధ్రువం గుట్టుమట్లను ప్రపంచం ఎదుట ఆవిష్కరిస్తామని సంస్థ ఛైర్మన్‌ డాక్టర్‌ కె.శివన్‌ ధీమా వ్యక్తంచేశారు.

ఒకేసారి 104 ఉపగ్రహాలను కక్ష్యల్లో ప్రవేశపెట్టిన ప్రపంచ రికార్డు ఇస్రో పేరిట ఉంది. దాన్ని బద్దలుకొట్టే ఆలోచన ఏదైనా ఉందా అన్న ఈనాడు ప్రశ్నకు స్పందిస్తూ..

‘‘తన రికార్డులను తానే బద్దలు కొట్టడం ఇస్రోకు ఎప్పుడూ సంతోషదాయకమే. భవిష్యత్‌లో ఒకే ప్రయోగంలో 250 ఉపగ్రహాలను ప్రయోగించేందుకు యోచిస్తున్నాం. ఈ దిశగా చర్చలు జరుగుతున్నాయి. అది ప్రతిపాదనల దశలోనే ఉంది. ఒకే ప్రయోగంలో అనేక ఉపగ్రహాలను ఎలా ప్రయోగించాలన్నది మనకు ఇప్పటికే తెలుసు కాబట్టి.. వాటి సంఖ్యను మరింతగా పెంచడం మనకు సాధ్యమే!’’ అని శివన్ వివరించారు.

Image copyright Twitter/Telangana CMO

కథ కంచికేనా?

‘ప్రాణహిత- చేవెళ్ల’పై మొదట్నుంచీ శీతకన్ను వేసిన సర్కారు ఇదిగో.. అదిగోనంటూ ప్రాజెక్టుకు రూట్‌ మార్చే ప్రయత్నం చేస్తోందని నవ తెలంగాణ దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

ఆదిలాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌, రంగారెడ్డి జిల్లాలను సస్యశామలం చేయాలన్న సంకల్పంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ 2008లో ప్రాణహిత నదిపై ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు.

ప్రాణహిత నది జన్మస్థలమైన కొమురంభీం జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద 200 టీఎంసీల నీటి లభ్యత అంచనా వేసింది. అక్కడే డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి పేరుతో 2008 డిసెంబర్‌ 16న శంకుస్థాపన చేశారు.

రూ.17,875 కోట్ల అంచనా వ్యయంతో 19 ప్యాకేజీ పనుల ద్వారా ఆదిలాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌, రంగారెడ్డి జిల్లాల్లోని 16 లక్షలా 40వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత తక్కువగా ఉందన్న సాకుతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాజెక్టును రీడిజైన్‌ చేసింది. కాళేశ్వరం పేరుతో భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలం మేడిగడ్డకు మార్చడంతో ప్రాణహితపై నీలినీడలు కమ్ముకున్నాయంటూ నవ తెలంగాణ పత్రిక తన కథనంలో పేర్కొంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)