శానిటరీ న్యాప్‌కిన్లపై జీఎస్టీ రద్దు వెనకున్నది ఈ అమ్మాయే

  • 22 జూలై 2018
జర్మీనా Image copyright జర్మీనా

‘నాకు చాలా సంతోషంగా ఉంది. నేను సంతోషపడడం కాదు, ఖరీదైన శానిటరీ న్యాప్‌కిన్ కొనలేకపోయిన లక్షల మంది మహిళలు సంతోషపడటం నాకు ఇంకా ఎక్కువ ఆనందాన్నిస్తోంది.’

బీబీసీతో ఫోన్లో మాట్లాడిన జర్మీనా ఇస్రార్ ఖాన్ ఎంత సంతోషంగా ఉన్నారో ఆమె గొంతు చెబుతోంది.

జీఎస్టీ పరిధి నుంచి శానిటరీ న్యాప్‌కిన్స్‌ను తొలగించినందుకే ఆమెకా సంతోషం.

శనివారం జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత శానిటరీ న్యాప్‌కిన్స్‌ను జీఎస్టీ నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

అంతకు ముందు శానిటరీ న్యాప్‌కిన్స్‌పైన 12 శాతం జీఎస్టీ ఉండేది.

జవహర్ లాల్ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో పీహెచ్‌డీ చేస్తున్న 27 ఏళ్ల జర్మీనా దిల్లీ హైకోర్టులో శానిటరీ న్యాప్‌కిన్స్‌పై జీఎస్టీ ఎత్తివేయాలని ప్రజాహిత వ్యాజ్యం వేశారు.

Image copyright ZARMINA ISRAR KHAN/FACEBOOK
చిత్రం శీర్షిక జర్మీనా ఇస్రార్ ఖాన్

శానిటరీ న్యాప్‌కిన్స్‌పై కోర్టు వరకూ ఎందుకు?

‘నేను ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫిలిభిత్ లాంటి చిన్న ప్రాంతం నుంచి వస్తుంటాను. పేద మహిళలు నెలసరి సమయంలో న్యూస్ పేపర్లు, బూడిద, ఇసుక లాంటివి ఉపయోగించడం చూశాను.

నేను వాళ్ల బాధను అర్థం చేసుకోగలను. నేను ఒక అమ్మాయిని, సోషియాలజీ విద్యార్థిని. సమాజంలో ఉన్న మహిళల పరిస్థితి ఏంటో నాకు బాగా తెలుసు. పేదరికంలో ఉన్న మహిళలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారో నాకు తెలుసు. శానిటరీ న్యాప్‌కిన్స్‌ గురించి నేను కోర్టుకు వెళ్లడానికి కారణం అదే.

జేఎన్‌యూలో కూడా ఈ అంశంపై చాలా చర్చ జరిగేది. కానీ ఎవరూ చొరవ చూపి ముందుకు వచ్చేవారు కాదు. దాంతో చివరికి నేనే సిద్ధమయ్యా.’ అని జర్మీనా అన్నారు.

Image copyright GIRLS AT DHABAS/FACEBOOK

కోర్టులో ఎలాంటి వాదన వినిపించారు?

‘సిందూరం, బొట్టు, కాటుక, కండోమ్స్ లాంటి వస్తువులను జీఎస్టీ పరిధి నుంచి తొలగించినప్పుడు, దాన్ని శానిటరీ న్యాప్‌కిన్స్‌పై కూడా ఎందుకు తీసేయకూడదని నేను వాదించాను.

ఈ నిర్ణయం తీసుకోడానికి ప్రభుత్వం ఇంత ఆలస్యం చేసుండకూడదు. అయితే ఆలస్యంగానైనా, ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకున్నందుకు సంతోషిస్తున్నా.’ అని ఆమె వివరించారు.

ఆమె పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న దిల్లీ హైకోర్టు దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించింది. 31 మంది సభ్యులున్న జీఎస్టీ కౌన్సిల్లో ఒక్క మహిళ కూడా లేకపోవడంపై న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. శానిటరీ న్యాప్‌కిన్స్‌ను జీఎస్టీ పరిధిలో పెట్టడానికి ముందు మహిళా, శిశు సంక్షేమ శాఖను సంప్రదించారా? అని కేంద్రాన్ని ప్రశ్నించింది. మహిళలకు చాలా అవసరమైన వస్తువుల్లో శానిటరీ న్యాప్‌కిన్స్ కూడా ఒకటని, దానిపై అంత ఎక్కువ ట్యాక్స్ ఎందుకు వేశారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

Image copyright AMIT GEROGE
చిత్రం శీర్షిక దిల్లీ హైకోర్టులో జర్మీనా న్యాయవాది అమిత్ జార్జ్

న్యాయ వ్యవస్థ పాత్ర

దిల్లీ హైకోర్టులో జర్మీనా తరఫున వాదించిన వకీల్ అమిత్ జార్జ్ కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయం వెనుక న్యాయవ్యవస్థ చాలా కీలక పాత్ర పోషించిందని చెప్పారు.

బీబీసీతో మాట్లాడిన జర్మీనా "కోర్టుల్లో అన్ని పిటిషన్లు రావడంతో ఈ విషయం న్యాయ వ్యవస్థ దృష్టికి వచ్చిందనేది స్పష్టమైంది. కోర్టు దీనిపై తీర్పు ఇవ్వకపోయినా, ప్రభుత్వాన్ని దీని గురించి సూటిగా ప్రశ్నించింది.". అని చెప్పారు.

"కోర్టు కేంద్రంతో దీనిపై మరోసారి ఆలోచించాలని చెప్పింది. దాని ఫలితం ఈరోజు మన ముందుంది".

ఈ కేసులో వాదించిన జర్మీనా వకీల్ అమిత్ జార్జ్ "శానిటరీ ప్యాడ్స్ అనేది లగ్జరీ ఐటమ్ కాదు. అది ప్రతి మహిళకూ అవసరం, చాయిస్ కాదు. అంతే కాదు, దీనిపై వేసే ట్యాక్స్ ప్రభావం కూడా మహిళలపైనే పడుతుంది" అన్నారు.

"భారత రాజ్యాంగం ప్రకారం, అది ట్యాక్స్ అయినా సరే, కేవలం మహిళలపైనే ప్రభావం పడే ఎలాంటి నియమాన్నీ చేయకూడదు. మహిళల ఆరోగ్యం కోసం శానిటరీ న్యాప్‌కిన్స్ చాలా అవసరం. అందుకే ఈ కేసు చాలా ప్రత్యేకమైనది" అని జర్మీనా అన్నారు.

Image copyright Getty Images

ప్రభుత్వ వాదన ఏంటి?

"ప్రభుత్వం రెండు వాదనలు వినిపించింది. శానిటరీ న్యాప్‌కిన్స్ పైన మొదట సర్వీస్ ట్యాక్స్ ఉండేదని, దాన్ని తొలగించి వాటి ధర తగ్గించామని చెప్పింది. ఆ వాదన వాస్తవానికి తప్పుదారి పట్టించడమే. ఎందుకంటే, చాలా రాష్ట్రాల్లో శానిటరీ న్యాప్‌కిన్స్‌పై పడే సర్వీస్ ట్యాక్స్ చాలా తక్కువ. జీఎస్టీ వేయడం వల్ల వాటి ధర మరింత పెరిగింది" అని అమిత్ అన్నారు.

"శానిటరీ ప్యాడ్స్‌ను జీఎస్టీ పరిధి నుంచి తొలగిస్తే, భారత్‌లోని చిన్న కంపెనీలపై దారుణమైన ప్రభావం పడుతుందని. చైనా వస్తువులతో మార్కెట్ నిండిపోతుందని ప్రభుత్వం తమ రెండో వాదన వినిపించింది" అని అమిత్ తెలిపారు.

"ప్రభుత్వం స్వయంగా తన నిర్ణయం మార్చుకోవడంతో, వారు వినిపించిన వాదనల్లో నిజం లేదనే విషయం మరింత స్పష్టమైందని" అమిత్ అంటారు.

గత ఏడాదిగా దిల్లీ హైకోర్టులో ఈ కేసుపై మూడు సార్లు విచారణలు జరిగాయి. మూడు విచారణల తర్వాత కేసును సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ప్రభుత్వం అపీల్ చేసింది. సుప్రీంకోర్టు దీనిపై కొన్ని నెలలు స్టే విధించిందని అమిత్ వివరించారు.

అలా ఎందుకు జరిగిందంటే, బాంబే హైకోర్టులో కూడా ఇదే అంశంపై విచారణలు జరిగాయి. గత మూడు నాలుగు నెలల నుంచీ ఈ కేసు కాస్త చల్లబడింది.

ఇప్పుడు ప్రభుత్వం తన నిర్ణయం ప్రకటించడంతో ఈ అంశంపై వేసిన పిటిషన్లను ఇక వెనక్కు తీసుకుంటామని అమిత్ చెప్పారు.

Image copyright SUSHMITA DEV/FACEBOOK
చిత్రం శీర్షిక సుశ్మితా దేవ్

మహిళల ప్రాణాలు కాపాడే మందు లాంటిది

కాంగ్రెస్ ఎంపీ సుష్మితా దేవ్ కూడా శానిటరీ న్యాప్‌కిన్‌పై 12 శాతం జీఎస్టీకి వ్యతిరేకంగా తన గళం వినిపిస్తూ వచ్చారు.

జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తర్వాత ఆమె బీబీసీతో మాట్లాడారు. "నేను ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. మేం గత ఏడాది నుంచి అదే చెబుతూ వస్తున్నాం. శానిటరీ న్యాప్‌కిన్స్ టాక్స్ వేసేంత రెవెన్యూ వచ్చే ఉత్పత్తి కాదనే చెప్పాం". అన్నారు.

"శానిటరీ న్యాప్‌కిన్స్ మహిళ జీవన హక్కుకు సంబంధించింది. అది వారికి ప్రాణాలు కాపాడే మందుల కంటే ఎక్కువ. దీనిపై ట్యాక్స్ వేయడం అంటే, మహిళల హక్కులను కాలరాయడమే. ఇప్పుడు దీన్ని జీఎస్టీ పరిధి నుంచి తొలగించారు కాబట్టి ఇవి గ్రామాల్లోని మార్కెట్లలో కూడా సులభంగా దొరుకుతాయి" అని ఆమె తెలిపారు.

Image copyright Getty Images

"మహిళలకు సంబంధించిన అంశాల్లో నిర్ణయం తీసుకునేటప్పుడు మహిళలను దృష్టిలో ఉంచుకోవడం లేదు. పాలసీ మేకింగ్‌, రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం లేకపోవడం కూడా దీనికి ఒక కారణం" అంటారు సుష్మిత.

ఏడాది తర్వాత హఠాత్తుగా తన నిర్ణయాన్ని మార్చుకోవడం వెనుక ప్రభుత్వం ఆలోచనేంటి?

దీనికి సమాధానంగా "అసలు జీఎస్టీ అమలు చేయాలనే ప్రభుత్వం నిర్ణయమే ఎలాంటి ప్లానింగ్ లేకుండా జరిగింది. ఇలాంటి అంశాలపై ప్రభుత్వం ఓపెన్‌గా ఆలోచించాలని, అందరి అవసరాలపై దృష్టి పెట్టాలని నాకు అనిపిస్తోంది" అని సుష్మిత అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కుల్‌భూషణ్ జాధవ్‌కు పాకిస్తాన్ విధించిన మరణశిక్షను నిలిపివేసిన అంతర్జాతీయ న్యాయస్థానం

కార్గిల్ యుద్ధం: భారత సైన్యాన్ని ఆపడానికి అమెరికా శరణు కోరిన నవాజ్ షరీఫ్

హఫీజ్ సయీద్‌‌: ముందస్తు బెయిల్ కోసం వెళ్తుండగా పాకిస్తాన్‌లో అరెస్ట్

రిచా భారతీ: ఖురాన్ పంపిణీ చేయాలన్న కోర్టు.. ప్రాథమిక హక్కును కాలరాయడమే అంటున్న ఝార్ఖండ్ యువతి

అపోలో-11 మిషన్: చంద్రుడి మీదకు అమెరికా మనిషిని ఎందుకు పంపించింది...

ఇరాకీ కర్డిస్తాన్‌లోని ఇర్బిల్ నగరంలో కాల్పులు... టర్కీ దౌత్యవేత్త మృతి

డోనల్డ్ ట్రంప్ జాత్యహంకారి అన్న కాంగ్రెస్ మహిళా నేతలు ఎవరు...

అనంతపురం హత్యలు: శివాలయంలో గుప్తనిధుల కోసమే ఈ హత్యలు చేశారా