భారత మహిళలు గృహహింసను ఎందుకు భరిస్తారు?

  • 23 జూలై 2018
గృహహింస, మహిళలు, విడాకులు Image copyright Science Photo Library

''అది మా పెళ్లైన మూడో రోజు. మేం హనీమూన్ కోసం మనాలి వెళ్లాం. ఆరోజు రాత్రే అతను తాగి వచ్చి నన్ను కొట్టడం ప్రారంభించాడు.''

ఇది చెబుతుంటే సప్నా (పేరు మార్చాము) కంఠం పూడుకుపోయింది. బలవంతాన గొంతును కూడదీసుకుంటూ ఆమె, ''పెళ్లి జరిగినప్పుడు నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను. నేను బాగా చదివేదాన్ని. కానీ మా నాన్న నాకు పెళ్లి చేసేయాలనుకున్నాడు. ఆయనే ఈ సంబంధాన్ని చూశారు.'' అని తెలిపారు.

రాజస్థాన్‌కు చెందిన సప్నా పెళ్లికి ముందే తన ఖర్చులు తానే సంపాదించుకునేవారు.

అయితే పెళ్లి ఆమె కలలన్నీ నాశనం చేసింది. పెళ్లి అయిన నెలలోపే ఆమె భర్త దగ్గర నుంచి తల్లిదండ్రుల వద్దకు వచ్చేశారు.

Image copyright PA

బంధువులు, ఇరుగుపొరుగు, సమాజమే దోషులు

పెళ్లయ్యాక భర్త ఇల్లే భార్య ఇల్లు అనే సమాజంలో కూతురు ఇంటికి వస్తే, ఆ తండ్రి దానిని ఎలా స్వీకరిస్తారు?

ఆ రోజులను గుర్తు చేసుకుంటూ సప్నా, ''నేను శారీరకంగా, మానసికంగా కూడా చాలా బాధలు అనుభవించాను. నాకు నా తల్లిదండ్రుల వద్దకు వెళ్లడం మినహా వేరే గత్యంతరం లేకపోయింది. కానీ మా బంధువులంతా నేను తిరిగి వస్తే కుటుంబం పరువుపోతుందనేవాళ్లు'' అని తెలిపారు.

తనకు జరిగిన విషయాలన్నీ సప్నా తన తల్లిదండ్రులకు చెప్పుకున్నారు. అయినా ఆమె తండ్రి తిరిగి భర్త దగ్గరకు వెళ్లాల్సిందే అని తీర్మానించారు. అంతే కాకుండా ఆమె భర్తను ఇంటికి పిలిపించి మాట్లాడారు.

ఎందుకు తల్లిదండ్రులు ఆడపిల్లల బాధను అర్ధం చేసుకోకుండా తిరిగి ఆమెను మళ్లీ ఆ నరకంలోకే పంపాలనుకుంటారు?

దీని గురించి సప్నా.. ''దీనికి బంధువులు, ఇరుగుపొరుగు, సమాజం అందరూ బాధ్యులే. పెళ్లయిన కూతురు పుట్టింటికి వస్తే, అందరూ ఏమైందని అడగడం ప్రారంభిస్తారు. ఇంటి వాళ్లకు ఏం చెప్పాలో అర్థం కాదు. అందుకని ఎలాగైనా సరే కూతుర్ని మళ్లీ భర్త దగ్గరకు పంపేందుకు ప్రయత్నిస్తారు.'' అని వివరించారు.

Image copyright Science Photo Library

జులై 13న దిల్లీలో 39 ఏళ్ల ఎయిర్ హోస్టెస్ అనీసియా బాత్రా ఆత్మహత్యకు పాల్పడినపుడు భర్త ఆమెను హింసించడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని బంధువులు ఆరోపించారు.

బాగా చదువుకున్న అనీసియా, వృత్తిలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ ఘటన విన్న తర్వాత ఆర్థికంగా స్వతంత్రులైన మహిళలు కూడా ఎందుకు గృహహింసను నిశబ్దంగా భరిస్తారు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

ఉత్తరాఖండ్‌లో నివసించే దీప్తి (పేరు మర్చాము) వైవాహిక జీవితం పెళ్లైన కొన్నేళ్లకే పట్టాలు తప్పింది. అయితే ఇక్కడ గృహహింస భర్త వైపు నుంచి కాదు, మామయ్య రూపంలో ఎదురైంది.

దీప్తి పెళ్లి ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఆమె మామయ్యకు రాజకీయంగా చాలా పలుకుబడి ఉండేది. పెళ్లి సమయానికి ఆమె అత్తామామలు వేర్వేరుగా జీవిస్తున్నారు.

''పెళ్లయిన ఏడాది వరకు అంతా సవ్యంగా నడిచింది. ఒకరోజు మద్యం మత్తులో మా మామయ్య నాపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఈ విషయం నా భర్తకు చెబితే అతనేమీ జవాబివ్వలేదు. అతనలా మౌనంగా ఉంటాడని నేను కలలో కూడా ఊహించలేదు'' అని దీప్తి తెలిపారు.

అయినా తన వైవాహిక జీవితాన్ని అతనితోనే కొనసాగించాలని ఆమె భావించారు. కానీ కొన్నేళ్ల తర్వాత ఆమె మామగారు మరోసారి ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో ఆమె భర్త ఇంటి నుంచి పుట్టినిల్లు చేరుకున్నారు.

కొన్నేళ్లు న్యాయపోరాటం చేశాక, దీప్తి భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న ఏడాదిలోపే ఆమె భర్త మరో పెళ్లి చేసుకుంటే,దీప్తి మాత్రం ఒంటరిగా నివసిస్తున్నారు.

భర్త మరో పెళ్లి చేసుకుంటే, ఆమె కూడా మరో పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదా?

దీనికి జవాబిస్తూ దీప్తి, ''నా మొదటి పెళ్లి అనుభవం కారణంగా, నాలో ప్రేమలాంటి భావాలు పుట్టడం లేదు. నేను ఇప్పుడు ఎవరినీ అంత సులభంగా నమ్మలేకున్నాను'' అని తెలిపారు.

Image copyright Science Photo Library

వైవాహిక బంధాన్ని ఉంచుకోవాలా, తెంచుకోవాలా?

పైన పేర్కొన్న అనుభవాల ఆధారంగా మేం మా బీబీసీ హిందీ ఫేస్‌బుక్ పేజీలో 'గృహహింస అనంతరం కూడా వైవాహిక బంధాన్ని కొనసాగించాలా?' అని ప్రశ్నించాం.

దీనికి సమాధానంగా చాలా మంది మహిళలు, దాని నుంచి బయట పడాలని సమాధానం ఇచ్చారు. అయితే కొందరు మాత్రం వైవాహిక బంధాన్ని కొనసాగించేందుకు మరో అవకాశం ఇచ్చి చూడాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

వైవాహిక బంధాలు ఇలా విచ్ఛినమవుతున్న నేపథ్యంలో ఇటీవల పట్టణాలలో మ్యారేజ్ కౌన్సిలర్ల సహాయం కూడా తీసుకుంటున్నారు. దిల్లీకి చెందిన సైకియాట్రిస్ట్ నిశా ఖన్నా, ఇటీవల గృహహింసకు సంబంధించిన కేసులు చాల తగ్గిపోయాయని తెలిపారు. వచ్చే కొన్ని కేసుల్లో కూడా రెండు వైపుల నుంచి హింస ఉంటోందని తెలిపారు. అయితే మహిళలే వైవాహిక బంధాన్ని కొనసాగించే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారని ఆమె వెల్లడించారు.

దీనికి నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయని ఆమె తెలిపారు.

''మొదటిది - మగవాళ్లకన్నా ఆడవాళ్లు ఎక్కువ ఎమోషనల్‌గా ఉంటారు. రెండోది - ఆర్థికంగా వాళ్లు స్వతంత్రులు కారు. మూడోది - వాళ్లకు తల్లిదండ్రుల నుంచి మద్దతు లభించదు. నాలుగోది - భర్త నుంచి దూరంగా ఉండే మహిళలు ఎప్పుడూ అందుబాటులో ఉంటారనే దురభిప్రాయం సమాజంలో ఉంది. అందుకే కష్టమైనా వాళ్లు భర్తతోనే ఉండాలనుకుంటారు.''

అయితే చాలాసార్లు ఆర్థికంగా స్వతంత్రులైన మహిళలు కూడా వైవాహిక బంధాన్ని తెంచుకోలేకపోతున్నారు. దీనికి కారణం ఏమిటి?

Image copyright Getty Images

బ్యాకప్ లేకుంటే చాలా సమస్యలు

దీనికి జవాబిస్తూ అనూజా కపూర్ అనే న్యాయవాది, ''మహిళలు ఆర్థికంగా స్వతంత్రులా కాదా అన్నదానికి దీనితో సంబంధం లేదు. భర్త లేని జీవితాన్ని స్త్రీలు ఊహించుకోలేరు. అంతే కాకుండా వైవాహిక బంధం తెంచుకున్న స్త్రీలను మరో పురుషుడు ప్రేమించడని వాళ్లు భావిస్తారు. అందుకే గృహహింసను భరిస్తూ కూడా అతనితోనే జీవిస్తారు.''

మ్యారేజ్ కౌన్సెలర్ డాక్టర్ నిశా, చివరి దారిగా మాత్రమే విడాకుల వరకు వెళ్లాలని సూచించారు. ''మానసికంగా, ఆర్థికంగా బలంగా ఉండాలని నేను నా క్లయింట్స్‌కు చెబుతాను. బ్యాకప్ లేకుండా విడాకులు తీసుకున్న మహిళలు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది'' అని తెలిపారు.

మేం నోయిడాలోని మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లినపుడు అక్కడ అంజు అనే మహిళా పోలీసు అధికారి, తమ వద్దకు రోజూ ఐదారు గృహహింస కేసులు వస్తుంటాయని తెలిపారు. చాలా మంది బాధితులు, తమ వైవాహిక బంధాన్ని కొనసాగించడానికే ప్రయత్నిస్తారు. మరీ భరించలేనపుడే విడాకులకు సిద్ధపడతారు. వైవాహిక జీవితం కొనసాగించాలా వద్దా అన్న విషయంలో వారి సామాజిక పరిస్థితి కూడా ముఖ్యపాత్ర పోషిస్తుందని ఆమె వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు