ప్రెస్‌రివ్యూ: '70 స్థానాలకు పోటీ చేస్తానంటే ఓట్లు చీల్చొద్దని చంద్రబాబు చెప్పారు' - పవన్ కల్యాణ్

  • 23 జూలై 2018
Image copyright JANASENA/FACEBOOK

2014 ఎన్నికల్లో 60-70 సీట్లలో పోటీ చేయాలని తాను నిర్ణయించుకున్నానని, అయితే పార్టీపెట్టి విడిగా పోటీచేస్తే ఓట్లు చీలిపోతాయని, ఆ ఆలోచన చేయవద్దని చంద్రబాబు తనకు సూచించారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పినట్లు సాక్షి పేర్కొంది.

2012 లోనే రాజకీయాలపై మాట్లాడేందుకు తాను చంద్రబాబును కలిసినట్లు ఆయన చెప్పారు. తనకు రాజ్యసభ సీటు ఇస్తానని కూడా చెప్పారని, మరుసటి రోజు అదే విషయాన్ని రెండు పత్రికల్లో రాయించారని తప్పుపట్టారు.

అప్పడే చంద్రబాబుపైన, టీడీపీపైన నమ్మకం పోయిందన్నారు. ఆ పార్టీకి దండం పెట్టి ఆ తర్వాత బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్ధి నరేంద్రమోదీని కలిసినట్టు చెప్పారు.

అప్పట్లో తాను 60-70 సీట్లలో పోటీచేసి ఉంటే ఇప్పుడు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాడే అవకాశం తనకు ఉండేదన్నారు.

రాష్ట్రంలో వేలాది ఎకరాల భూసేకరణ జరుగుతుందిగాని నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన మాత్రం లేనేలేదన్నారు.

ఆయన కుమారుడు లోకేశ్‌ ఒక్కరికే ఉద్యోగం వస్తే సరిపోద్దా.. రాష్ట్రంలో అందరికీ ఉపాధి కల్పించాల్సిన అవసరం లేదా అని నిలదీశారు.

భవిష్యత్‌లో లోకేష్‌ సీఎం అయినా తనకేమీ అభ్యంతరం లేదు కానీ, ఆయన సీఎం అయితే మాత్రం రాష్ట్రం ఏమవుతుందో అనేదే తన భయమన్నారు.

లోకేష్‌ సీఎం అయితే రాష్ట్రంలో భూముల పరిస్థితి ఏమిటోనని భయపడుతున్నానని చెప్పారు. తనను అనుభవం లేని రాజకీయ నాయకుడిని అంటున్నారని.. తనను విమర్శించే వారు రాజకీయ అనుభవంతోనే పుట్టారా అని ప్రశ్నించారు.

రాజకీయాల్లో కిందపడతాం, పైన ఎక్కుతాం, ఆఖరికి జనసేన పార్టీ అధికారం సాధించకుంటుందని చెప్పారని సాక్షి వెల్లడించింది.

Image copyright Andhra Pradesh State Civil Supplies Corporation Lt

మండే ధరలు.. సరుకులు ఉండవు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రన్న గ్రామీణ మాల్స్‌ లక్ష్యానికి దూరంగా ఉన్నాయా?.. అంటే అవుననే సమాధానమే వస్తోందంటూ ఈనాడు ఒక కథనాన్ని ప్రచురించింది.

క్షేత్రస్థాయి పరిస్థితులూ అదే స్పష్టం చేస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణాల్లో సామాన్యులు ఎక్కువగా ఉపయోగించే ఉప్పు, పప్పు వంటి నిత్యావసరాల ధరలు బయట కంటే వీటిలో అధికంగా ఉండడం.

అమ్ముడవుతున్నవి కాక, సరఫరాదారు పంపిన సరకునే ఇక్కడ విక్రయించాలనే పరిస్థితి రావడం.. ఇవికాక, ఈ మాల్స్‌ ఏర్పాటు ఆలోచనకు, ఆచరణకు నడుమ అనేక తేడాలుండడం సమస్యకు దారితీస్తున్నాయి.

ఫలితంగా గత నెలాఖరుకే రాష్ట్రవ్యాప్తంగా 6500 చంద్రన్న గ్రామీణ మాల్స్‌ను ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినా 70కి మించి అందుబాటులోకి రానేలేదు.

పప్పుదినుసులు, వంటనూనె, చక్కెర వంటి నిత్యావసరాల ధరలు బయట మార్కెట్‌ కంటే చంద్రన్న మాల్స్‌లో ఎక్కువగా ఉంటున్నాయి.

సరఫరాలో జాప్యం కారణంగా.. కావాల్సిన సరకులు దొరకడం లేదంటూ వినియోగదారులు వెనుదిరుగుతున్నారు.

ప్రకాశం జిల్లా మద్దెపాడులో జూన్‌ 14న ప్రారంభమైన మాల్‌కు బియ్యం తప్ప ఇతర సరకుల సరఫరా జరగలేదు.

ఆర్డరు పెట్టి నెలవుతున్నా ఇంతవరకూ సరకులు పంపలేదని కృష్ణా జిల్లాలోని మాల్‌ డీలరు ఒకరు తెలిపారు. జనం ఎక్కువగా తీసుకుంటున్న సరకుల కోసం ఆర్డరు పెడితే సరఫరాదారు వేరేవి పంపుతున్నారని డీలర్లు ఆరోపిస్తున్నారు.

అయితే, ఈ సమస్యలపై రాష్ట్ర పౌరసరఫరా సంస్థల ఎండీ సూర్య కుమారి స్పందించారు. కొత్త మాల్స్ ప్రారంభం నిదానంగా చేస్తున్నామని తెలిపారు. మాల్స్ ధరలు బయటకంటే తక్కువగానే ఉంటున్నాయని తెలిపారు. విజయవాడ వంటి ప్రాంతాల్లోనే హో‌ల్‌సేల్ మార్కెట్‌తో పోలిస్తే కాస్త అటుఇటుగా ఉన్నాయని తెలిపారని ఈనాడు వెల్లడించింది.

Image copyright VINODKUMAR B/FACEBOOK

‘తెలంగాణపై కాంగ్రెస్ నేతల మరో కుట్ర'

కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పన్ను మినహాయింపులు ఇస్తామంటోందని, దీనిని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష ఉపనేత బి.వినోద్‌కుమార్‌ అన్నారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

అవిశ్వాసంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున ఖర్గే ఈ హామీ ఇచ్చారని, అదే జరిగితే హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని పరిశ్రమలన్నీ ఏపీకి తరలిపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు అంగీకరిస్తున్నారా? అని ప్రశ్నించారు.

తెలంగాణలోని ప్రాజెక్టులకు సాయమందించే విషయాన్ని విభజన చట్టంలో చేర్చకుండా మోసం చేసిన కాంగ్రెస్‌.. ఏపీకి పన్ను మినహాయింపుల రూపంలో తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు.

ఆదివారం తెలంగాణ భవన్‌లో వినోద్‌కుమార్‌ విలేకరులతో మాట్లాడారు. ఖర్గే వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమాధానం చెప్పాలని, దమ్ముంటే రాహుల్‌గాంధీతో ప్రకటన చేయించాలని డిమాండ్‌ చేశారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

బంగారం పేస్టు స్మగ్లింగ్ Image copyright Getty Images

పేస్టుగా మార్చి కొత్తదారిలో బంగారం స్మగ్లింగ్

బంగారాన్ని పేస్టుగా మార్చి తరలిస్తున్న వ్యక్తిని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారని నమస్తే తెలంగాణ వెల్లడించింది.

డీఆర్‌ఐ అడిషనల్ డీజీ ఎంకే సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం శంషాబాద్ విమానాశ్రయంలో మధురై నుంచి హైదరాబాద్‌కు వస్తున్న స్పైస్‌జెట్ విమానం (నంబర్ 1314)లో ఒక వ్యక్తి బంగారం తీసుకొస్తున్నట్టు సమాచారం అందింది.

దీంతో డీఆర్‌ఐ అధికారులు ఆదివారం తెల్లవారుజామున రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మాటువేశారు. విమానంలో వచ్చిన ప్రయాణికుల్లో అనుమానితుడిని గుర్తించి లగేజీని తనిఖీచేశారు.

అతడి వద్ద ఉన్న సంచిలో రెండు ప్యాకెట్లను పరిశీలించగా బంగారాన్ని పేస్ట్ రూపంలోకి మార్చి అక్రమంగా తీసుకొస్తున్నట్టు గుర్తించారు.

1,850 గ్రాముల బరువున్న దానిని కరిగించగా 1,120 గ్రాముల బంగారం బయటపడింది. నిందితుణ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. కొలంబో నుంచి మధురైకి విమానం లో వచ్చిన ఓ వ్యక్తి.. ఈ ప్యాకెట్లను కస్టమ్స్ తనిఖీల్లో పట్టుబడకుండా బయటకు తీసుకొస్తే ఉద్యోగం ఇప్పిస్తానని తనకు చెప్పినట్టు తెలిపాడు.

స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.34,57,606 ఉంటుందని డీఆర్‌ఐ అధికారులు వెల్లడించారని నమస్తే తెలంగాణ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)