కేరళ: 'కూర్చునే హక్కు' సాధించుకున్న సేల్స్ గర్ల్స్
- ఇమ్రాన్ ఖురేషీ
- బీబీసీ కోసం

ఫొటో సోర్స్, Getty Images
కొంతమందికి ఇది అసాధారణ విషయం అనిపించవచ్చు. కొంతమందికి ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ కేరళలోని కొందరు మహిళలకు మాత్రం ఇది ఒక యుద్ధంలో భారీ విజయంతో సమానం.
షాపుల్లో, మాల్స్‌లో సేల్స్ గర్ల్స్‌గా పనిచేసే ఈ మహిళలందరికీ అంతకు ముందు తమ పని గంటలలో కూర్చోవడానికి అనుమతి లేదు.
రాష్ట్రంలో అమలవుతున్న ఈ నిబంధనను మార్చడంలో ఈ మహిళలు విజయం సాధించగలిగారు. ఆ నియమం ప్రకారం రీటెయిల్ అవుట్‌లెట్‌లో ఉద్యోగం చేసే మహిళలను కూర్చోకుండా అడ్డుకునేవారు. దీంతో మహిళలందరూ కలిసి దీనికి వ్యతిరేకంగా ఉద్యమం చేశారు.
"జరగకూడని పొరపాట్లు చాలా జరుగుతున్నాయి. అందుకే నిబంధనలను మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు మహిళలకు తప్పకుండా కూర్చోవడానికి చోటు దొరుకుతుంది. దీనితోపాటు మహిళలకు బాత్రూం వెళ్లడానికి కూడా తగినంత సమయం లభిస్తుంది" అని రాష్ట్ర కార్మిక శాఖ అధికారి బిజు బీబీసీకి చెప్పారు.
ఫొటో సోర్స్, AMTU KERALA @FACEBOOK
నిబంధనల్లో మార్పుల ప్రకారం మహిళలకు ఇక తాము పనిచేస్తున్న చోట రెస్ట్ రూం సౌకర్యం కల్పిస్తారు. కొన్ని గంటల తర్వాత తప్పనిసరి బ్రేక్ కూడా ఇస్తారు. మహిళలతో ఎక్కువ సేపు పనిచేయించే ప్రాంతాల్లో, వారికి హాస్టల్ సౌకర్యం కూడా అందిస్తారు.
"ఈ నియమాలను ఉల్లంఘిస్తే పరిశ్రమలకు 2 వేల నుంచి లక్ష రూపాయల జరిమానా విధిస్తాం" అని అధికారులు చెబుతున్నారు.
"ఇది ప్రాథమిక అవసరం. దీని గురించి చెప్పడం అవసరం అని ఎవరూ అనుకోలేదు. ప్రతి ఒక్కరికీ కూర్చునే, బాత్రూం వెళ్లే, నీళ్లు తాగే హక్కు ఉంటుంది" అని ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ జనరల్ సెక్రటరీ, న్యాయవాది మైత్రేయి తెలిపారు.
ఫొటో సోర్స్, COURTESY VIJI PALITHODI
'కూర్చునే హక్కు' కోసం మహిళా సంఘాల ఉద్యమం
ఎనిమిదేళ్ల తర్వాత కూచునే హక్కు
మహిళల హక్కులకు సంబంధించిన ఈ అంశాన్ని మొదట 2009-10లో కోజికోడ్‌కు చెందిన పలితోడి విజీ లేవనెత్తారు.
"కూర్చోవడంపై కూడా చట్టం చేయడం అనేది ఉద్యోగం ఇచ్చే యజమానుల అహంకారం వల్ల జరిగింది. వాళ్లు కూర్చోమని చెప్పడానికి మీకు ఏదైనా రూల్ ఉందా అని మాతో అనేవారు. వారి ఆ అహంకారం వల్లే ఈ కొత్త నియమం వచ్చింది" అని విజి చెప్పారు
"కేరళలో మండు వేసవిలో మహిళలను నీళ్లు కూడా తాగనిచ్చేవారు కాదు. ఎందుకంటే వాళ్లకు షాపు వదిలి వెళ్లడానికి అనుమతి ఉండదు. వారికి కనీసం బాత్రూం వెళ్లడానికి కూడా సమయం ఇవ్వరు. దాహాన్ని, బాత్రూం వెళ్లాలనే కోరికను బలవంతంగా భరిస్తూ వాళ్లు పనిచేస్తుంటారు. అది ఎన్నో వ్యాధులకు కారణం అవుతుంది".
అలాంటి మహిళలందరూ ఒక్కతాటిపైకి వచ్చారు. ఒక సంఘం ఏర్పాటు చేశారు. కోజికోడ్ నుంచి ప్రారంభమైన ఈ ఉద్యమం తర్వాత మిగతా జిల్లాలకు కూడా వ్యాపించడం మొదలైంది.
ఫొటో సోర్స్, COURTESY VIJI PALITHODI
'కూర్చునే హక్కు' కోసం విజి సమావేశం( నిలబడిన మహిళ)
ఇలాంటి మరో సంఘానికి అధ్యక్షురాలుగా ఉన్న మాయా దేవి "మొదటి నుంచీ ఉన్న కార్మిక సంఘాలు ఇలాంటి అంశాలను ఎప్పుడూ లేవనెత్తలేదు. అసలు మహిళలకు ఈ హక్కు ఉందనే విషయమే తెలీదు" అని చెప్పారు.
పలితోడి విజీ ఒక బట్టలు కుట్టే షాపులో పనిచేస్తారు. మాయాదేవి త్రిచూర్‌లోని బట్టల షోరూంలో ఉద్యోగం చేస్తారు. అక్కడ వారితోపాటు మరో 200 మందికి పైగా మహిళలు పనిచేస్తున్నారు.
"షాపులో కస్టమర్లు లేనప్పుడు కూడా మమ్మల్ని కూచోనీయరు. పీఎఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ డబ్బులు శాలరీ నుంచి కట్ చేస్తారు. కానీ ఆ డబ్బును ఆ స్కీముల్లో జమ చేయరు". అని మాయా చెబుతారు.
ఫొటో సోర్స్, AMTU KERALA @FACEBOOK
2012లో మాయాకు నెలకు 7500 జీతంతో ఉద్యోగం ఇచ్చారు. కానీ ఆమెకు ఎప్పుడూ 4500 కంటే ఎక్కువ జీతం చేతికి రాలేదు.
ఆమె దానిపై ప్రశ్నించినపుడు, ఉద్యోగమే వదులుకోవాల్సి వచ్చింది. 2014లో ఆమె తనలాంటి మరో 75 మంది మహిళలతో కలిశారు. అందరూ కలిసి ఈ అవకతవకలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించారు.
ఆ తర్వాత మేనేజ్మెంట్ ఆమెను, మరో ఆరుగురు కార్మికులకు బదిలీ చేసింది. తర్వాత వారందరినీ ఉద్యోగం నుంచి తొలగించింది.
ఫొటో సోర్స్, Getty Images
పురుషులకు కూడా ప్రయోజనం
కేరళ ప్రభుత్వం అమలు చేసిన ఈ నిమయాలతో కేవలం మహిళలకే కాదు, పురుషులకు కూడా ప్రయోజనం లభించింది. ఇప్పుడు వాళ్లు కూడా తమ ఉద్యోగంలో కూర్చోగలుగుతున్నారు.
ప్రభుత్వం త్వరలో దీని గురించి ఒక నోటిఫికేషన్ జారీ చేయబోతోంది.
"నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఆ నిమయాలను పరిశీలిస్తాం, వాటిలో ఏదైనా లోటు ఉందనిపిస్తే, మా ఆందోళనలకు కొనసాగిస్తాం" అని విజీ చెబుతున్నారు.
కానీ ప్రస్తుతానికి కూర్చునే హక్కును సాధించుకోవడాన్నికేరళలో మహిళలు తమ విజయంగానే భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)