‘రేపిస్టులకు మరణశిక్ష’ చట్టంతో అత్యాచారాలు ఆగుతాయా?

  • 30 జూలై 2018
అత్యాచారానికి మరణ శిక్ష Image copyright Getty Images

దేశంలో అనేకచోట్ల చిన్నపిల్లలపై అత్యాచారాలు పెరిగిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో పిల్లలపై అత్యాచారాలకు పాల్పడే వారికి అత్యధికంగా మరణశిక్షను విధించే చట్టాన్ని తీసుకువచ్చింది. జులై 30వ తేదీ సోమవారం లోక్‌సభ దీనికి ఆమోదం తెలిపింది.

ఈ చట్ట సవరణ పిల్లలపై అత్యాచారాలను నిలువరిస్తుందని తాను భావిస్తున్నట్లు మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకాగాంధీ తెలిపారు.

2013లో దిల్లీలో ఒక కదిలే బస్సులో ఒక యువతి సామూహిక అత్యాచారానికి గురైన తర్వాత, మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారికి మరణశిక్షను విధించే చట్టాన్ని ప్రభుత్వం తెచ్చింది.

దక్షిణాసియాలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల తర్వాత లైంగిక నేరాలకు మరణశిక్షను విధించే నాలుగో దేశం భారతదేశం.

అయితే దీని వల్ల అత్యాచారాల సంఖ్య తగ్గుతాయా అన్నదానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

లైంగిక అత్యాచారానికి మరణశిక్షను విధిస్తున్న మిగతా మూడు దేశాలలో పరిస్థితిని బీబీసీ పరిశీలించింది.

Image copyright Getty Images

అఫ్గానిస్తాన్

మరణశిక్షను ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు?

2009 వరకు అఫ్గానిస్తాన్‌లో రేప్ నేరం కాదు. అయితే అధ్యక్ష డిక్రీ ద్వారా మహిళలపై హింస నిర్మూలన చట్టం చేశారు.

మహిళలపై అత్యాచారం, కొట్టడం, బాల్య వివాహాలు, బలవంతపు పెళ్లిళ్లు లేదా బలవంతపు ఆత్మాహుతిలాంటి 22 హింసాత్మక ఘటనలకు వ్యతిరేకంగా ఈ చరిత్రాత్మక చట్టాన్ని చేశారు.

మహిళలు, పిల్లలపై అత్యాచారం జరిగి, తత్ఫలితంగా వారు మరణిస్తే, అలాంటి అత్యాచారం కేసుల్లో మరణశిక్ష విధించాలని ప్రతిపాదించారు.

మరణశిక్ష రేప్ కేసుల సంఖ్యను తగ్గించిందా?

  • 2007-08లో రేప్‌లు 51
  • 2016-17లో రేప్‌లు 132

మరణశిక్షను తీసుకొచ్చిన తర్వాత కూడా అఫ్గానిస్తాన్‌లో అత్యాచార కేసులు క్రమంగా పెరుగుతూనే పోయాయి.

ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌లో మరణశిక్షను ఎక్కువగా అమలు చేయడం లేదు.

ప్రజలను బహిరంగంగా వధించే తాలిబన్ పాలన 2001లో అంతరించాక, అఫ్గాన్‌ ప్రభుత్వం చాలా తక్కువసార్లు మాత్రమే ఆ శిక్షను అమలు చేసింది.

దానిని అమలు చేయాలంటే అధ్యక్షుడు స్వయంగా ఆ ఆదేశాలపై సంతకం చేయాలి.

2009 నుంచి ఆ దేశంలో 36 మందికి మరణశిక్షను విధించారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గణాంకాలు చెబుతున్నాయి. కానీ వాటిలో రేప్‌కు విధించిన శిక్షలు ఎన్నో మాత్రం తెలియవు.

Image copyright Getty Images

పాకిస్తాన్

మరణశిక్షను ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు?

దక్షిణాసియాలో లైంగిక నేరాలకు మరణశిక్షను విధించడం ప్రారంభించిన దేశాలలో పాకిస్తాన్ మొదటిది. 1979లో జనరల్ జియా ఉల్ హక్ నేతృత్వంలోని మిలటరీ ప్రభుత్వం - వివాహేతర సంబంధాలు, అత్యాచారాల కేసుల్లో దోషులను బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపాలనే 'హుదూద్ ఆర్డినెన్స్' తీసుకువచ్చింది.

అయితే అలాంటి అత్యాచారాన్ని నిరూపించడానికి 'పెనట్రేషన్' జరిగిందని చెప్పడానికి నలుగురు పురుషుల సాక్ష్యం ఉండాలనే నిబంధన విధించారు. ఇవి మహిళలు, పిల్లలకు న్యాయం లభించేందుకు ఆటంకంగా మారాయి.

2006లో హుదూద్ ఆర్డినెన్స్‌ను సవరించి దాని స్థానంలో మహిళా రక్షణ (నేరపూరిత చట్టం సవరణ) చట్టాన్ని తీసుకువచ్చారు.

దానికి తోడు వివాహేతర సంబంధాలను ప్రత్యేక నేరంగా పరిగణించి, అత్యాచార నేరానికి పాకిస్తాన్ పీనల్ కోడ్ కింద శిక్ష విధించడం ప్రారంభించారు.

మరణశిక్ష రేప్ కేసుల సంఖ్యను తగ్గించిందా?

  • 2005లో రేప్‌లు 338
  • 2017లో రేప్‌లు 3495

అత్యాచారాలకు మరణశిక్షను విధించే చట్టాన్ని తీసుకువచ్చాక పాకిస్తాన్‌లో నమోదైన అత్యాచార కేసుల సంఖ్య 10 రెట్లు పెరిగింది.

2008-14 మధ్యకాలంలో అంతర్జాతీయ ఒత్తిడి కారణంగా అధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీ మరణశిక్షలపై నిషేధం విధించిన కాలంలో తప్పించి, పాకిస్తాన్‌లో క్రమం తప్పకుండా మరణశిక్షలను అమలు చేస్తూ వచ్చారు.

పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ ప్రకారం.. 2006 నుంచి అక్కడ అత్యాచారం, సామూహిక అత్యాచారం నేరాలకు గాను 25 మందికి మరణశిక్ష విధించారు.

''అత్యాచారాన్ని ఉగ్రవాద నేరంతో సమానంగా పరిగణించడం మినహా మారిందేమీ లేదు. అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలు క్రమక్రమంగా పెరుగుతూ పోతే, నేర నిరూపణ రేటు మాత్రం చాలా తక్కువగా ఉంది'' అని లాహోర్‌కు చెందిన జస్టిస్ ప్రాజెక్ట్ పాకిస్తాన్ అనే న్యాయ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి జైనాబ్ మాలిక్ తెలిపారు.

Image copyright Getty Images

బంగ్లాదేశ్

మరణశిక్షను ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు?

బంగ్లాదేశ్ పార్లమెంటు 1995లో మహిళలు, పిల్లలపై అత్యాచారాల నివారణ కోసం అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్‌ దాడులు, పిల్లల అక్రమ రవాణాలాంటి నేరాలను అరికట్టడానికి ప్రత్యేక చట్టం చేసింది.

అయితే ఇంతటి తీవ్రమైన శిక్షలపై విమర్శలు వ్యక్తమయ్యాయి.

2000లో ఈ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో తీసుకొచ్చిన మరో చట్టంలో, మహిళలు, పిల్లలపై అత్యాచారాలకు మరణశిక్షనే కొనసాగించారు. అయితే ఇతర నేరాలకు మాత్రం జీవిత ఖైదు లేదా జరిమానాలు విధించడం ప్రారంభమైంది.

మరణశిక్ష రేప్ కేసుల సంఖ్యను తగ్గించిందా?

  • 1997లో రేప్‌లు 659
  • 2017లో రేప్‌లు 783

24 ఏళ్ల క్రితం అత్యాచారానికి మరణశిక్ష చట్టాన్ని విధించే చట్టాన్ని తీసుకువచ్చాక కూడా బంగ్లాదేశ్‌లో అత్యాచారాల సంఖ్య తగ్గలేదు.

''మరణశిక్షలు అత్యాచారానికి పాల్పడే వారిలో భయాన్ని కలిగిస్తుందని చెప్పడానికి సరైన ఆధారాలు లేవు. అందుకే అత్యాచారం కేసులూ తగ్గలేదు, నేర నిరూపణా పెరగలేదు. దీనికి కారణం సాక్ష్యాధారాలను సరిగా సేకరించలేకపోవడమే. అంతే కాకుండా సాక్షులకు, ఫిర్యాదుదారులకు సరైన భద్రత కూడా ఉండడం లేదు'' అని ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త సుల్తానా కమల్ తెలిపారు.

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకారం గత పదేళ్లలో బంగ్లాదేశ్‌లో 50 మందికి పైగా దోషులకు మరణశిక్షలు విధించారు. అయితే వీటిలో అత్యాచారాలకు విధించిన మరణశిక్షలు ఎన్నో తెలీదు.

అయితే మరణశిక్షలపై నిరసనలు పెరిగిన నేపథ్యంలో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు 2015లో, అత్యాచారం కేసుల్లో తప్పనిసరిగా మరణశిక్షలు విధించాలంటున్న చట్టం రాజ్యాంగ విరుద్ధం అని తీర్పునిచ్చింది.

Image copyright Getty Images

భారత్ నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి?


అత్యాచారం గురించి వెల్లడించేది తక్కువ

మనం పరిశీలించిన అన్ని దక్షిణాసియా దేశాల్లోనూ అత్యాచారానికి గురైనవాళ్లపై సామాజికంగా మచ్చ పడుతుంది. దీంతో అత్యాచారం జరిగినా చాలా మంది ఫిర్యాదు చేయడం లేదు.

అఫ్గానిస్తాన్‌కు ఒక చెందిన ఒక స్వతంత్ర మానవహక్కుల సంస్థ - అత్యాచారానికి గురైన మహిళలను చాలా అరుదుగా మాత్రమే పురుషులు వివాహం చేసుకుంటారని తెలిపింది. ఒకవేళ అత్యాచారం కారణంగా ఆమె గర్భం దాలిస్తే, ఆమె బలవంతంగా తనపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాల్సి రావచ్చు.

అఫ్గానిస్తాన్‌కు చెందిన 'హ్యూమన్ రైట్స్ వాచ్' సంస్థ 2012లో విడుదల చేసిన నివేదిక ప్రకారం, అత్యాచారంపై ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించిన మహిళలపై వివాహేతర సంబంధాల కేసు పెట్టే ప్రయత్నాలు జరిగాయి.

పోలీసులు, న్యాయవ్యవస్థ నుంచి సహాయం అందడం పోయి, అత్యాచార బాధితులే మళ్లీ సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తోందని ఆ నివేదిక పేర్కొంది.

అఫ్గానిస్తాన్‌ మానవ హక్కుల కమిషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మొహమ్మద్ మూసా మహ్మది మాట్లాడుతూ.. మరణశిక్షలు మాత్రమే అత్యాచారాల సంఖ్యను తగ్గించలేవని అన్నారు.

భారతదేశం విషయానికి వస్తే.. మహిళలపై హింస జరిగిన సందర్భంలో ఆ కేసును విచారించే పోలీసులు, అధికారులే సాక్ష్యాల బాధ్యత తీసుకోవాలని చట్టంలో సవరణలు తీసుకురావడం కొన్ని సత్ఫలితాలను ఇచ్చింది.

అయితే మార్పు చాలా నెమ్మదిగా ఉంది. అంతే కాకుండా భారతదేశంలో జరుగుతున్న అత్యాచారాల సంఖ్య, వాటిపై వస్తున్న ఫిర్యాదుల సంఖ్య మధ్య అంతరం కూడా చాలా ఎక్కువగా ఉంది.

Image copyright Getty Images

తగ్గుతున్న నేరనిరూపణ రేటు

2014లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ప్రజాప్రతినిధి సయేదా సుగ్రా ఇమామ్ -పాకిస్తాన్‌లో గత ఐదేళ్లో అత్యాచార కేసుల్లో నేర నిరూపణ రేటు సున్నా అని తెలిపారు.

దీనికి కారణం ఆ నేరానికి ఉన్న కఠినమైన శిక్షే. చాలా కేసుల్లో ఇరుపక్షాలూ రాజీకి వచ్చేలా పోలీసులే మధ్యవర్తిత్వం వహిస్తారు.

మనదేశంలో ఐదేళ్ల క్రితం చట్టాలలో మార్పు చేసినప్పటికీ, మహిళలు, పిల్లలపై అత్యాచారాల కేసుల్లో నేర నిరూపణ రేటు చాలా తక్కువగా ఉంది. దీనికి కూడా కఠినమైన శిక్షలు, రాజీకి అవకాశం లేని నేరం మొదలైన అంశాలే కారణమని అత్యాచారానికి మరణశిక్షను వ్యతిరేకిస్తున్న కార్యకర్తలు అంటున్నారు.

నత్త నడకన న్యాయ విచారణ

కోర్టు వ్యవహారాలకు అయ్యే ఖర్చులు, సుదీర్ఘ విచారణ, అవమానకరమైన రెండువేళ్ల పరీక్షలాంటివి వాటి కారణంగా బాధితులు కోర్టు బయటనే పరిష్కారాల వైపు మొగ్గు చూపుతున్నారని బంగ్లాదేశ్ కార్యకర్తలు చెబుతున్నారు.

రెండు వేళ్ల పరీక్షను భారతదేశంలో నిషేధించారు కానీ, ఇక్కడ కూడా బాధితులను అనేక రకాలుగా పరీక్షిస్తారు. అంతే కాకుండా సుదీర్ఘ న్యాయవిచారణ వల్ల కూడా వారికి తొందరగా న్యాయం అందకుండా పోతోంది.

వీటన్నిటిని బట్టి చూస్తే, మరణశిక్షలాంటి కఠినమైన శిక్షలు బాధితులకు న్యాయం జరగడానికి ప్రతిబంధకంగా మారతాయని తెలుస్తోంది.

కేవలం కఠినమైన చట్టాలతోనే నేరాలు తగ్గిపోవు. వాటితో పాటు పోలీసులు, న్యాయవ్యవస్థ, ప్రభుత్వ అధికారులు, సమాజంలో సంస్కరణలతోనే మార్పు సాధ్యమౌతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం