ఎన్‌ఐఎన్: హైదరాబాద్‌ ఆహారంలో ఎక్కువగా ‘పురుగు మందులు’, పిల్లలపై అధిక ప్రభావం

child

ఫొటో సోర్స్, Getty Images

హైద‌రాబాద్‌లో పెరిగే పిల్ల‌లపై ఆర్గానోఫాస్ఫేట్ (ఓపీ) పురుగు మందుల ప్ర‌భావం ఎక్కువగా ఉన్న‌ట్టు జాతీయ పోష‌కాహార సంస్థ (ఎన్ఐఎన్) శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. ఎన్ఐఎన్‌కు చెందిన డాక్టర్ సుకేశ్ నారాయ‌ణ సిన్హా, డాక్టర్ బండ వెంకటరెడ్డి పిల్లలపై పురుగుమందుల ప్రభావం గురించి ప‌రిశోధ‌నా ప‌త్రాన్ని వెలువరించారు.

'ఆహార ప‌దార్థాల్లో పురుగు మందులు - శ‌రీరంపై వాటి ప్ర‌భావం' పేరుతో దీనిని ప్ర‌చురించారు.

హైద‌రాబాద్‌కు చెందిన 377 మంది పిల్ల‌ల‌పై ఈ అధ్య‌య‌నం జ‌రిగింది. వారి మూత్ర న‌మూనాల‌ను ప‌రిశీలించడం ద్వారా వారి శ‌రీరంపై ఆర్గానోఫాస్ఫేట్ పురుగు మందుల ప్ర‌భావాన్ని అధ్య‌య‌నం చేశారు.

ఫొటో సోర్స్, NIN/FACEBOOK

అబ్బాయిలకన్నా అమ్మాయిల్లోనే ఎక్కువ..

6 నుంచి 15 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న 188 మంది అబ్బాయిలు, 189 మంది అమ్మాయిల‌పై ఈ అధ్య‌య‌నం చేశారు. ఈ ప‌రిశోధ‌న కోసం హైద‌రాబాద్‌ను ఐదు మండ‌లాలు (ఉత్త‌ర‌, ద‌క్షిణ‌, తూర్పు, పడ‌మ‌ర‌, మ‌ధ్య‌)గా విభజించారు. ఈ ఐదు ప్రాంతాల‌ నుంచి పిల్ల‌ల‌ను ఎంపిక చేసుకున్నారు. ప్ర‌తీ జోన్ నుంచి కొన్ని కూర‌గాయ‌ల దుకాణాలు, రైతు బ‌జార్ల‌ను ఎంపిక చేసుకుని అక్కడి నుంచి అర కేజీ కూర‌గాయలు న‌మూనాగా తీసుకున్నారు.

వాటిని తిన్న పిల్ల‌ల నుంచి మూత్రం నమూనాలు తీసుకుని, వాటి ద్వారా మెట‌బాలైట్ లెవల్స్ పరిశీలించారు.

"24 గంట‌ల పాటూ శ‌రీరక్రియ‌ల‌ను అధ్య‌య‌నం చేయ‌డానికి రోజులో మొదటిసారి బ‌య‌ట‌కు వ‌చ్చే మూత్ర న‌మూనాలు అవ‌స‌రం" అని డాక్టర్ సిన్హా బీబీసీకి తెలిపారు.

పిల్ల‌ల శ‌రీర జీవక్రియ‌ల‌పై పురుగుమందుల ప్ర‌భావం గురించి ఇప్ప‌టి వ‌ర‌కూ అందుబాటులో ఉన్న వివరాలకు ఈ అధ్య‌య‌నం మ‌రింత సమాచారాన్ని జోడించిందని ఆయ‌న అన్నారు.

పరిశోధనలో అబ్బాయిల‌తో పోలిస్తే అమ్మాయిల్లో 87 శాతం ఎక్కువ పెస్టిసైడ్ మెట‌బాలైట్ లెవెల్స్ ఉన్నట్లు తేలిందని ఆయ‌న వెల్లడించారు.

"11 నుంచి 15 ఏళ్ల వ‌య‌సున్న అమ్మాయిల్లో అబ్బాయిల కంటే ఎక్కువ పెస్టిసైడ్ మెట‌బాలైట్ లెవల్స్ ఉన్నాయి. అదే స‌మ‌యంలో 6 నుంచి 10 ఏళ్ల వ‌య‌సున్న అబ్బాయిల్లో అది చాలా త‌క్కువగా ఉంది" అని ఆయన వివరించారు.

అమ్మాయిలు అబ్బాయిల కంటే ఎక్కువ పళ్లు తిన‌డం, హార్మోన్ల మార్పుల వ‌ల్లే వారిలో ఈ లెవల్స్ ఎక్కువ ఉన్నాయ‌ని ఆయ‌న వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images

అమెరికాతో పోలిస్తే 10-40 శాతం ఎక్కువ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ‌ల్లోని ఆహార ప‌దార్థాల్లో పురుగు మందుల అవ‌శేషాల స్థాయి ఎక్కువని ఆ అధ్య‌య‌నం వెల్లడించింది.

"దేశంలో వాడే మొత్తం పురుగు మందుల్లో 24 శాతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ‌ల్లోనే వాడుతున్నారు" అని సిన్హా తెలిపారు.

అమెరికా, ఇట‌లీ, కెన‌డా దేశాల్లోని ఓపీ పెస్టిసైడ్ మెట‌బాలైట్ స్థాయుల‌తో పోలిస్తే హైద‌రాబాద్ పిల్ల‌ల్లో ఈ లెవల్స్ 10-40 శాతం ఎక్కువగా ఉన్నాయి.

"ఓపీ పెస్టిసైడ్స్ లెవల్స్‌కు సంబంధించి భార‌త‌దేశంలో ఎటువంటి స‌మాచారం లేదు. అందువల్లే ఇతర దేశాలతో పోల్చాల్సి వచ్చింది. ప్ర‌స్తుత అధ్య‌య‌నం ఆధారంగా కేవలం హైద‌రాబాద్ న‌గ‌రం గురించి మాత్ర‌మే చెప్ప‌గ‌లం" అన్నారు సిన్హా.

ఫొటో సోర్స్, Getty Images

పిల్లలకు వచ్చే సమస్యలు

పురుగు మందుల అవశేషాల వల్ల పిల్లల్లో నాడీ సమస్యలు వస్తాయని సిన్హా వెల్లడించారు.

ఈ అవశేషాల ప్రభావం మరీ ఎక్కువైతే పిల్లల్లో ఆందోళన, ఆటిజం, మెదడు ఎదుగుదల లోపం తదితర సమస్యలు వస్తాయని ఆయన వివరించారు.

హైదరాబాద్ వాసులు దీనిపై ఆందోళన చెందుతున్నారు.

ఏడేళ్ల మనవడు ఉన్న రమాదేవి అన్న మహిళ ఈ పరిశోధనపై ఆందోళన వ్యక్తం చేశారు.

"ఇదివరకు ఏ కాలానికి ఆ కాలం పళ్లు, కూరగాయలు ఉండేవి. (సీజనల్). మేం అన్నీ తింటూ పెరిగాం. కానీ ఇప్పుడు అన్ని పళ్లూ, కూరగాయలు ఏడాదంతా దొరుకుతున్నాయి. అలా దొరకుతున్నాయంటేనే పురుగు మందులు వాడుతున్నారని అర్థం. మన తిండిలో పురుగుమందులు రాకుండా ఆపలేం. ఎదిగే పిల్లలకు రకరకాల పోషకాలు కావాలి. పచ్చివాటి కంటే బాగా ఉడికిన, బాగా వండిన కూరగాయలు తినడం మేలని నా ఉద్దేశం. పళ్లు కూడా అంతే. పళ్లకు తొక్క (పై పొర) తీసేస్తాను లేదా వేడి నీళ్లలో కడిగే పిల్లలకు పెడతాను. అలా అయినా పురుగు మందులు పోతాయా అనేది అనుమానమే. కానీ అంతకు మించి వేరే దారి లేదు" అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)