బిహార్: 'సంరక్షణ గృహంలో 29 మంది బాలికలపై అత్యాచారం'

  • 24 జూలై 2018
తవ్వుతున్న జేసీబీ Image copyright SEETU TIWARI

బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఉన్న ఓ బాలికా గృహంలో 29 మంది బాలికలపై అత్యాచారం జరిగినట్టు ఆరోపణలు రావడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ ఆరోపణలను కొట్టిపారేయలేమని పోలీసులు అంటున్నారు.

బాలికా గృహంలో లైంగిక వేధింపుల అంశాన్ని తొలుత ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌ లేవనెత్తింది. దాంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఆధారాలను కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

తనతోపాటు ఉండే ఓ బాలికను చంపి, ఈ గృహం ఆవరణలోనే మృతదేహాన్ని పూడ్చిపెట్టి ఉంటారని ఓ బాలిక పోలీసుల ముందు అనుమానం వ్యక్తం చేసింది. దాంతో గృహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు తవ్వకాలు జరుపుతున్నారు.

సోమవారం ఏడు అడుగుల వరకు తవ్వగా ఎలాంటి ఆధారాలూ బయటపడలేదు.

Image copyright SEETU TIWARI

నిందితుల్లో మహిళలే ఎక్కువ

గతేడాది బిహార్‌లోని బాలికా గృహాలలో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ తనిఖీలు నిర్వహించింది. బాలికలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆ తనిఖీల్లో అనుమానం వ్యక్తమైంది. ఈ ఏడాది మే 28న ముజఫర్‌పూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ ప్రభుత్వ బాలికా సంక్షేమ గృహం నిర్వహణ బాధ్యతలను 'సేవా సంకల్ప్' అనే స్వచ్ఛంద సంస్థ చూస్తోంది.

ఇందులో మొత్తం 44 మంది బాలికలు ఉండగా.. 34 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వాళ్లంతా 6 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న అనాథలు, మానసికంగా ఎదగని వారు, వివిధ కారణాలతో కుటుంబాల నుంచి దూరమైనవారే.

వైద్య పరీక్షల్లో వెల్లడైన ఫలితాలను బట్టి చూస్తే.. ఆ 29 మంది బాలికలపై లైంగిక వేధింపులు జరగలేదని చెప్పలేమని ముజఫర్‌పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హర్‌ప్రీత్ కౌర్ అన్నారు.

ఈ కేసులో ఇప్పటి వరకు 10 మంది నిందితులను అరెస్టు చేశారు. నిందితుల్లో బాలికా గృహం డైరెక్టర్ బ్రజేష్ ఠాకూర్‌తో పాటు ఏడుగురు మహిళలు కూడా ఉన్నారు.

జిల్లా చైల్డ్ కమిటీ చైర్మన్ పరారీలో ఉన్నారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Image copyright SEETU TIWARI
చిత్రం శీర్షిక బాలికలపై లైంగిక వేధింపులు జరగలేదని చెప్పలేమని ముజఫర్‌పూర్ ఎస్పీ హర్‌ప్రీత్ కౌర్ అన్నారు.

ఆ 44 మంది బాలికలను ముజఫర్‌పూర్ నుంచి పట్నా, మొకామా, మధుబనిలోని కేంద్రాలకు తరలించారు. వారిలో ఎవరెవరిని బాధితులుగా భావిస్తున్నారన్న వివరాలను పోలీసులు వెల్లడించలేదు.

ఈ కేసు నిందితుల్లో ఎక్కువ మంది మహిళలే. కాబట్టి.. బాలికలపై అత్యాచారం జరిగి ఉంటే, దానికి పాల్పడింది ఎవరు? అన్న ప్రశ్న ఎదురవుతోంది.

"ఆ ప్రశ్నకు పోలీసులు సరైన సమాధానం చెప్పడం లేదు. కేవలం బాలికల వాంగ్మూలాల ఆధారంగానే వాళ్లు దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లోనూ లోతుగా దర్యాప్తు చేస్తేనే స్పష్టత వస్తుంది, అనేక మంది పెద్దల పేర్లు కూడా బయటపడే అవకాశముంది" అని స్థానిక పాత్రికేయుడు సంతోశ్ సింగ్ అన్నారు.

అయితే.. ఆధారాలు దొరికితే ఎంత పెద్ద వ్యక్తి మీద అయినా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హర్‌ప్రీత్ కౌర్ చెప్పారు.

Image copyright Getty Images

'మా నాన్నను ఇరికించారు'

ఈ కేసులో తన తండ్రిని అకారణంగా ఇరికించారని ప్రధాన నిందితుడు బ్రజేష్ ఠాకూర్ కుమార్తె ఆరోపించారు.

"గత ఐదేళ్లుగా శిశు సంక్షేమ కమిటీ వారు, జడ్జి, కమిషన్ సభ్యులు ఎప్పుడూ ఈ బాలికా గృహానికి వస్తున్నారు. మరి వాళ్లు ఏమీ గుర్తించలేదా? మా నాన్నను కావాలనే అకారణంగా ఈ కేసులో ఇరికించారు" అని ఆమె అన్నారు.

ఈ కేసు ప్రధాన నిందితుడు, బాలికా గృహం డైరెక్టర్ బ్రజేష్ కుటుంబం 1982 నుంచి 'ప్రతాహ్ కమల్' అనే హిందీ దిన పత్రికను నడుపుతోంది.

ఈ కుటుంబం ఒత్తిడి స్థానిక పాత్రికేయుల మీద కనిపిస్తోంది. అందుకేనేమో.. ఈ కేసు గురించి బహిరంగంగా మాట్లాడేందుకు వారు ఇష్టపడట్లేదు.

వరుస ఫిర్యాదులు

ఈ గృహం నుంచి 2013, 2018 మధ్య కాలంలో ఆరుగురు బాలికలు తప్పిపోయారని గతంలో కేసు నమోదైంది. దానిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

మోతిహరి బాల్ గృహ, కైమూర్ అల్పవాస్ గృహాల్లోనూ లైంగిక వేధింపులు, మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

ఇటీవల ఛాప్రా, హజిపూర్ అల్పవాస్ గృహాలపై కూడా ఫిర్యాదులు వచ్చాయి.

చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

రాజకీయ దుమారం

ముజఫర్‌పూర్ కేసు రాజకీయంగానూ దుమారం రేపుతోంది.

ఎంపీ పప్పూ యాదవ్ ఈ అంశాన్ని లోక్‌సభలో లేవనెత్తారు.

మరోవైపు.. "ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రస్తుత బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కి, ఉపముఖ్యమంత్రి సుషీల్ మోదీకి సన్నిహితుడే" అని మాజీ ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్ ఆరోపించారు.

అంతకు ముందే ఈ కేసుపై స్పందించిన సీఎం నితీష్ కుమార్.. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని, మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని అన్నారు.

ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ పట్నా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి.

రాష్ట్రంలోని అన్ని బాలికా గృహాలపైనా సమగ్ర విచారణ జరిపించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)