రూ.34 అద్దె చెల్లించలేని స్థితిలో కాంగ్రెస్

  • సమీరాత్మజ్ మిశ్ర్
  • బీబీసీ ప్రతినిధి
అలహాబాద్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయం

ఫొటో సోర్స్, BBC/SAMIRATMAJ MISHRA

ఎక్కడైతే కమలా నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ, పురుషోత్తమ దాస్ టాండన్, ఇందిరా గాంధీలాంటి ప్రముఖులు సమావేశాలు నిర్వహించారో, ఆ నగరంలోని కాంగ్రెస్ కమిటీ కార్యాలయానికి ఇప్పుడు వెంటనే ఖాళీ చేయాలని నోటీసులు వచ్చాయి.

అది కూడా నెలకు 34 రూపాయల అద్దెను ఏడాదికి పైగా కట్టలేదంటూ, ఆ భవనానికి నోటీసులు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

అలహాబాద్‌ చౌక్ ప్రాంతంలోని 34, జవహర్ స్వ్కేర్‌ మొదటి అంతస్తులో రెండు గదుల కాంగ్రెస్ కమిటీ కార్యాలయం ఉంది.

బీబీసీ ఆ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలను కలిసి మాట్లాడినపుడు, సమాచార లోపం వల్లనే ఇది జరిగిందని వారు వివరించారు.

దీనిని ఖాళీ చేయాలనే నోటీసు కంటే దీని చరిత్రకు ఇక తెర పడుతుందేమోనని స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల్లో దిగులు ఏర్పడింది.

సన్నటి మెట్ల దారిలో వెళ్లాక ఒక పెద్ద హాల్లో కూర్చునే ఏర్పాటు ఉంది. కాంగ్రెస్ పురాతన కార్యాలయాల్లో ఉన్నట్టే నేలపైన వేసిన పరుపులు, వాటిపై తెల్లటి దుప్పట్లు పరిచి ఉన్నాయి.

కార్యాలయంలో గోడలపై నేతల చిత్రపటాలు, అప్పటి నేతల పేర్లు ఉన్నాయి.

ఆ కార్యాలయంలో ఉన్న కాంగ్రెస్ నేతలను కలిసి బీబీసీ ఈ విషయం గురించి అడిగినపుడు, అద్దె చెల్లించడంలో ఎలాంటి సమస్య లేదని, సమాచార లోపం వల్లే ఇది జరిగిందని వారు వివరించారు.

ఫొటో సోర్స్, BBC/SAMIRATMAJ MISHRA

ఫొటో క్యాప్షన్,

నగర కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు అభయ్ అవస్తి

1932లో నిర్మాణం

నగర కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు అభయ్ అవస్తి, ''ప్రస్తుతం వివాదం కోర్టులో ఉంది. ఈ భవనం యజమాని మాకు నోటీసు పంపారు. ఈ విషయాన్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి, ఏఐసీసీకి తెలియజేశాం. అక్కడ నుంచి అద్దె వస్తే సరి. లేదంటే మేమే చందాలు వేసుకుని అద్దె చెల్లిస్తాం'' అన్నారు.

అలహాబాద్ నగర కాంగ్రెస్ కమిటీ 1932లో ఏర్పాటైందని అభయ్ తెలిపారు. దేశంలోని అతి పురాతన పార్టీ కార్యాలయం ఇదేనని ఆయన వెల్లడించారు.

''అప్పట్లో కాంగ్రెస్ సమావేశాలు స్వరాజ్ భవన్‌లో జరిగేవి. 1905లో మోతీలాల్ నెహ్రూ దానిని దానంగా ఇచ్చేశారు. కానీ అది ఒక ట్రస్ట్ ఆస్తిగా ఉండేది. అంటే కాంగ్రెస్ సమావేశాల కోసమే మోతీలాల్ నెహ్రూ దానిని ఇచ్చారు. కానీ కార్యాలయంగా మాత్రం అన్నిటికంటే మొదట ఈ భవనాన్నే నిర్మించారు" అని అభయ్ తెలిపారు.

భారత స్వాతంత్ర్యోద్యమ సమయంలో భారత రాజకీయాలకు అలహాబాద్ కేంద్రంగా ఉండేది. నగరంలోని చౌక్ ప్రాంతం మరీ ప్రత్యేకం. ఆ కారణం వల్లే కాంగ్రెస్ కమిటీ కార్యాలయానికి దగ్గర్లో సోషలిస్ట్ పార్టీ కార్యాలయం, ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం ఆ రెండు కార్యాలయాల పరిస్థితీ కాంగ్రెస్ కార్యాలయ పరిస్థితిలాగే ఉంది.

ఫొటో సోర్స్, BBC/SAMIRATMAJ MISHRA

ఇక అద్దె బకాయిల విషయానికి వస్తే..గతంలో ఈ భవనం యజమానిగా ఉన్న వ్యక్తి దాన్ని వేరొకరికి విక్రయించారు. బహుశా దాని వల్లే ఇంత వివాదం తలెత్తి ఉండవచ్చు.

''గతంలో దీని యజమాని హృదయ్‌నాథ్ మెహరోత్రా. 1983లో ఖాళీ చేయాలని నోటీసు ఇచ్చారు. దీనిని హైకోర్టులో సవాలు చేయడంతో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పు వచ్చింది.'' అని కాంగ్రెస్ పార్టీ తరపున కోర్టులో వాదిస్తున్న న్యాయవాది అజయ్ శుక్లా వివరించారు.

‘‘అయితే తర్వాత మెహరోత్రా ఆ ఇంటిని ఎవరికి విక్రయించారో తెలీదు. ఇటీవలే కార్యాలయం ఖాళీ చేయాలంటూ కాంగ్రెస్‌కు మరోసారి నోటీసు వచ్చింది. కాంగ్రెస్ నేతలు దాని ప్రస్తుత యజమానిని కలిసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నోటీసులు రాజ్‌కుమార్ సారస్వత్, బిల్లు పుర్వార్ అన్న వ్యక్తుల పేరిట వచ్చాయని, ఆ ఇంటిని వారికి అమ్మినట్టు తెలుస్తోంది’’ అని అజయ్ శుక్లా తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ కార్యవర్గసభ్యులు కూడా అద్దె బకాయిల విషయం పెద్దది కాదని, సమాచారలోపం వల్లనే ఇది జరిగిందని అంటున్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత ఎర్షాదుల్ హక్, ''మొత్తం బకాయిలు రూ.50 వేల వరకు ఉన్నాయి. దీని గురించి మేం కేంద్ర, రాష్ట్ర కమిటీలకు రాశాం. అక్కడి నుంచి ఇంకా బదులు రాలేదు. అయితే కార్యకర్తలంతా చందాలు వేసుకుని అద్దె చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు'' అన్నారు.

ఫొటో సోర్స్, BBC/SAMIRATMAJ MISHRA

అయితే ఇంతటి చరిత్రాత్మక కార్యాలయానికి నోటీసులు వచ్చేంత వరకు వెళ్లడంపై పార్టీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్ కుమార్ వర్మ, ''ఇక్కడ కూర్చున్న ఎంతో మంది నేతలు ఎన్నో ఉన్నత పదవులు అధిష్టించారు. అలాంటి కార్యాలయానికి ఈ పరిస్థితి రావడం బాధాకరం. తల్చుకుని ఉంటే ఇక్కడ మేమే సొంతంగా ఒక కార్యాలయం కూడా కట్టుకుని ఉండేవాళ్లం'' అన్నారు.

నిజానికి కాంగ్రెస్ కమిటీ కార్యాలయాన్ని కొనుగోలు చేసి, దానిని మ్యూజియంగా మార్చాలన్నది కొందరు స్థానిక కాంగ్రెస్ నేతల అభిమతం.

ఫొటో సోర్స్, BBC/SAMIRATMAJ MISHRA

నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అభయ్ అవస్తి, ''ఇందిర, ఫిరోజ్ గాంధీలు కలిసింది కూడా ఇక్కడే అని, ఇక్కడే వారిద్దరూ దగ్గరయ్యారని అంటారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా ఈ కార్యాలయం విప్లవ, రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా ఉండేది'' అని తెలిపారు.

కాంగ్రెస్‌కు ఇక్కడ ఎన్ని చరిత్రాత్మక జ్ఞాపకాలు ఉన్నా, వాస్తవం ఏమిటంటే - అద్దె చెల్లించని కారణంగా దానికి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. భవిష్యత్తులో అలాంటిది జరగకుండా, అది పార్టీ వద్దే ఉండాలని, దానిని పార్టీ వారసత్వ కట్టడంగా పరిరక్షించుకోవాలని పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.