‘తెలుగు రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు తగ్గాయి’ కానీ..
- అరుణ్ శాండిల్య
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
తెలుగు రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు తగ్గినట్లు కేంద్రం వెల్లడించింది. 2015లో దేశవ్యాప్తంగా సగటున ప్రతి రోజూ 22 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా.. 2016లో ఆ సంఖ్య 17కి తగ్గినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
2015లో దేశవ్యాప్తంగా 8,007 మంది రైతులు బలవన్మరణం పాలవగా, 2016లో ఆ సంఖ్య 6,351కి తగ్గింది.
ఆంధ్రప్రదేశ్‌లో 2015లో 516 మంది, 2016లో 239 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
తెలంగాణ విషయానికొస్తే 2015లో 1358 మంది కర్షకులు ప్రాణాలు తీసుకోగా, 2016లో ఆ సంఖ్య 632కి తగ్గింది.
ఫొటో సోర్స్, Getty Images
2016లో రోజుకు 14 మంది రైతు కూలీలు ప్రాణాలు తీసుకున్నారు.
రైతుకూలీల ఆత్మహత్యలు పెరిగాయి
అయితే, ఇందుకు భిన్నంగా.. రైతుల ఆత్మహత్యలు తగ్గిన పలు రాష్ట్రాల్లోనూ రైతు కూలీల ఆత్మహత్యలు పెరిగాయి. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, సిక్కిం, త్రిపుర, ఉత్తర్‌ప్రదేశ్‌లతో రైతులు, రైతు కూలీల ఆత్మహత్యలు రెండూ తగ్గాయి.
తెలంగాణలో 2015లో 42 మంది రైతు కూలీలు బలవన్మరణానికి పాల్పడగా 2016లో ఆ సంఖ్య 13కి తగ్గింది.
ఆంధ్రప్రదేశ్‌లో 2015లో 400 మంది, 2016ల 565 మంది రైతు కూలీలు ప్రాణాలు తీసుకున్నారు.
దేశవ్యాప్తంగా చూసుకుంటే 2015లో 4,595 మంది.. 2016లో 5,019 మంది రైతు కూలీలు బలవన్మరణం పాలయ్యారు.
ఈ లెక్కన 2015లో సగటున ప్రతిరోజూ 13 మంది, 2016లో రోజుకు 14 మంది రైతు కూలీలు ప్రాణాలు తీసుకున్నారు.
ఫొటో సోర్స్, Loksabha.nic.in/bbc
2015, 2016లో రైతుల, రైతు కూలీల ఆత్మహత్యల వివరాలు
మొత్తంగా 10 శాతం తగ్గుదల
కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి రైతుల, రైతు కూలీల ఆత్మహత్యలను విడిగా నమోదు చేయడం ప్రారంభించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని 'జాతీయ నేర గణాంక నమోదు సంస్థ'(ఎన్సీఆర్బీ) నమోదు చేసే 'ప్రమాద మరణాలు, ఆత్మహత్యలు' విభాగంలోనే విడిగా రైతుల, రైతు కూలీల ఆత్మహత్యలనూ రికార్డు చేస్తోంది.
ఈ గణాంకాల ప్రకారం అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, త్రిపుర మినహా మిగతా రాష్ట్రాల్లో 2015తో పోల్చితే 2016లో రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయి.
కేంద్రపాలిత ప్రాంతాల విషయానికొస్తే 2015లో ఎక్కడా రైతుల ఆత్మహత్యలు లేవు. 2016లో అండమాన్ నికోబార్ దీవుల్లో ముగ్గురు, పుదుచ్చేరిలో ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఫొటో సోర్స్, KONDALREDDY/FACEBOOK
ఆత్మహత్య చేసుకున్న భర్త ఫొటోలతో దిల్లీలో ఆందోళన చేసిన తెలుగు రాష్ట్రాల మహిళలు.
ఈ గణాంకాల ప్రకారం చూస్తే 2016లో రైతులు, రైతుకూలీల మొత్తం ఆత్మహత్యలు అంతకుముందు ఏడాది కంటే 10 శాతం మేర తగ్గాయి. కేవలం రైతుల వరకే చూస్తే 21 శాతం తగ్గుదల నమోదైంది. కానీ, రైతు కూలీల బలవన్మరణాలు మాత్రం 9 శాతం పెరిగాయి.
2007 తరువాత పదేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే 2016లోనే రైతుల ఆత్మహత్యలు తక్కువగా నమోదయ్యాయి. 2009లో అత్యధికంగా 17,368 నమోదయ్యాయి.
ఫొటో సోర్స్, Getty Images
ఇవీ ప్రధాన కారణాలు
రుణాలు, పూర్తిగా నష్టాల్లో కూరుకుపోవడం, వ్యవసాయ సమస్యలు రైతుల ఆత్మహత్యలకు కారణం కాగా.. కుటుంబ సమస్యలు, అనారోగ్య కారణాలు ప్రధానంగా రైతుకూలీలను బలవన్మరణాలకు పాల్పడేలా చేశాయని ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది.
మరోవైపు దేశంలో వ్యవసాయరంగ వృద్ధిరేటు అత్యంత అస్థిరంగా ఉందని నివేదికలు చెబుతున్నాయి..
వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధి రేటు 2012-13లో 1.5 శాతం ఉండగా.. 2013-14లో 5.6 శాతం, 2014-15లో - 0.2, 2015-16లో 0.7, 2016-17లో 4.9 శాతం ఉండడమే దీనికి ఉదాహరణ.(ఆధారం: 2017-18 ఆర్థిక సర్వే-ముందస్తు అంచనాల ప్రకారం)
ఫొటో సోర్స్, Getty Images
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల్లో 66 శాతం బీపీఎల్, అంత్యోదయ అన్నయోజన కార్డులున్నవారే.
అట్టడుగు వర్గాల రైతులే అధికం..
కేంద్ర వ్యవసాయ శాఖ సూచనతో బెంగళూరులోని ఆగ్రో ఎకనమిక్ రీసెర్చి సెంటర్ రైతుల ఆత్మహత్యలపై 13 రాష్ట్రాల్లోని 46 జిల్లాల్లో అధ్యయనం చేసి గత ఏడాది నివేదిక ఇచ్చింది. అధ్యయనంలో భాగంగా వీరు 528 బాధిత కుటుంబాలను కలిశారు. దీని ప్రకారం.. బాధిత కుటుంబాల్లో అత్యధికం నిరుపేద రైతులే. వారి రేషన్ కార్డులే వారి సామాజిక ఆర్థిక స్థితిని చెబుతున్నాయి.
దేశవ్యాప్తంగా చూస్తే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల్లో 66 శాతం బీపీఎల్, అంత్యోదయ అన్నయోజన కార్డులున్నవారే.
ఆంధ్రప్రదేశ్‌లోని బాధిత కుటుంబాల్లో 93.3 శాతం బీపీఎల్, అంత్యోదయ అన్న యోజన కార్డులున్న నిరుపేదలు.
ఏపీ తరువాత తెలంగాణ(86 శాతం), కర్ణాటక(86 శాతం), తమిళనాడు(80 శాతం) ఉన్నాయి.
మహిళా రైతుల ఆత్మహత్యల శాతం తెలంగాణలో ఎక్కువగా నమోదైంది. గుజరాత్, తమిళనాడు ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి.
ఫొటో సోర్స్, Getty Images
ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల్లో 25 శాతం ఇళ్లలో ఇతర కుటుంబసభ్యులు తీవ్ర మానసిక కుంగుబాటుకు గురయ్యారు.
కుదేలవుతున్న కుటుంబాలు
రైతు ఆత్మహత్య తరువాత ఆయా కుటుంబాలు కుదేలవుతున్నాయని 'ఆగ్రో ఎకనమిక్ రీసెర్చి సెంటర్' నివేదిక స్పష్టం చేస్తోంది. ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా ఆ కుటుంబాలు పూర్తిగా నష్టపోతున్నాయని తేల్చింది.
బాధిత కుటుంబాల్లో చాలావరకు ఆత్మహత్య చేసుకున్న ఆ రైతు కష్టంపై ఆధారపడి బతికినవే. దాంతో, ఆత్మహత్య అనంతరం ఆయా కుటుంబాలు తీవ్ర ప్రభావానికి లోనయ్యాయని నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా 34 శాతం బాధిత కుటుంబాలది ఇదే పరిస్థితి.
రైతుల ఆత్మహత్యల తరువాత 21 శాతం కుటుంబాలు వ్యవసాయాన్ని వదులుకున్నాయని, 14 శాతం కుటుంబాల్లో పిల్లల చదువు ఆగిపోయిందని, 8 శాతం కుటుంబాలు ఏకంగా ఉన్న భూమిని అమ్ముకున్నాయని నివేదిక స్పష్టం చేసింది.
అంతేకాదు.. 6 శాతం బాధిత కుటుంబాలకు ఇల్లు, ఇతర ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 25 శాతం కుటుంబాల్లో ఇతర కుటుంబసభ్యులు తీవ్ర మానసిక కుంగుబాటుకు గురైనట్లు వెల్లడైంది. 11.5 శాతం కుటుంబాల్లో పిల్లల వివాహాలు చేయలేని పరిస్థితి ఏర్పడింది.
బాధిత కుటుంబాల నుంచి సూచనలు
ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలు ఈ సమస్య పరిష్కారానికి చేసిన సూచనలను 'ఆగ్రో ఎకనమిక్ రీసెర్చి సెంటర్' నివేదికలో పొందుపరిచారు.
వ్యవసాయ పరిస్థితులు, ప్రభుత్వ పథకాలు, సామాజిక-ఆర్థిక నేపథ్యాలు వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉండడంతో విభిన్నమైన సూచనలు వచ్చాయి.
రుణ సౌకర్యం అందుబాటులోకి రావాలని.. వ్యవసాయ బీమా, పంటలు నష్టపోయినప్పుడు పరిహారం చెల్లింపు పక్కాగా జరగాలని అత్యధికులు సూచించారు.
వీటితో పాటు నీటిపారుదల సదుపాయం, మద్దతు ధర పెంపు వంటి సూచనలూ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని బాధిత కుటుంబాల సూచనలు
* తక్కువ వడ్డీ రేటుతో రుణాలు, పంటలకు అధిక గిట్టుబాటు ధరలు
* పాడి పరిశ్రమకు మద్దతు
* కౌలు రైతులకూ తక్కువ వడ్డీతో రుణాలు
* ప్రత్యామ్నాయ ఆదాయ వనరుల కల్పన
తెలంగాణలో..
* వ్యవసాయానికి నీటి సౌకర్యం పెంచాలి. ప్రత్యామ్నాయ ఆదాయ వనరుల కల్పన.
* రైతుల పొలాల్లో ప్రభుత్వమే ఉచితంగా బోరుబావులు తవ్వించాలి.
* కౌలు రైతులు సహా అందరికీ తక్కువ వడ్డీకి రుణాలు దొరకాలి.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.