చెర్రీ: హైదరాబాద్‌లో పుట్టిన అతి చిన్న పసిపాప.. ప్రిమెచ్యూర్ బేబీల జీవితాలకు కొత్త ఆశ

  • 26 జూలై 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionచెర్రీ: దక్షిణాసియాలోనే అతి చిన్న పసిపాప

రిధిమ అనే పాపాయి పుట్టుక చాలా మందికి కొత్త ఆశలు కలిగించింది. చెర్రీ అని ముద్దుగా పిలుచుకుంటున్న ఈ పాప ఈ ప్రపంచాన్ని చూసేలా చేయడానికి ఆమె తల్లితండ్రులు నితిక అజ్మానీ, సౌరబ్ అజ్మానీలు ఛత్తీస్‌గఢ్ నుంచి హైదరాబాద్ వరకూ వచ్చారు.

ఈ పాప పుట్టక ముందు ఈ దంపతులకు నాలుగుసార్లు అబార్షన్లు అయ్యాయి.

"మేం మళ్లీ బాధ అనుభవించదల్చుకోలేదు. ప్రతిసారీ డాక్టర్లు మా ఆయనకు ఆప్షన్లు ఇచ్చేవారు. నన్ను లేదా నా బిడ్డను ఎవరో ఒకరినే కాపాడగలం అని. ప్రతిసారీ నా భర్త నన్నే కాపాడమని డాక్టర్లకు చెప్పేవారు. కానీ ఈసారి మేం అందుకు సిద్ధంగా లేం. మాకు పాప కావల్సిందే" అని తన ఒడిలోని పాపతో ఆడుకుంటూ చెప్పారు నితిక.

అయితే నెలలు నిండకుండా పుట్టిన ప్రతి చిన్నారీ బతకడానికి అవకాశం దక్కడం లేదు. ఈ ఫిబ్రవరిలో యూనిసెఫ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం శిశు మరణాల విషయంలో.. 52 దిగువ మధ్య ఆదాయ దేశాల్లో భారత్ 12వ స్థానంలో ఉంది. 2015-16 సంవత్సరానికి గానూ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక కూడా అలాంటి లెక్కలే చెబుతోంది.

నెలలు నిండిన తరువాత కడుపులోనూ, పుట్టిన వెంటనే నెలలోపూ (నియోనేటల్, పెరినేటల్) చనిపోవడం, ఐదేళ్ల లోపు చిన్నారుల మరణాల విషయంలో భారతదేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చాలా ఎక్కువ తేడా ఉంది.

2017 డిసెంబరు నాటి లెక్కల ప్రకారం 1000 గర్భాలకు 36 మంది శిశువులు కడుపులోనే చనిపోతుంటే, మరో 30 మంది శిశువులు మొదటి నెలలోనే చనిపోతున్నారు. ఐదేళ్లలోపు చనిపోయే వారి సంఖ్య వెయ్యికి 41 వరకూ ఉంది.

ఈ మూడు రకాల మరణాల్లోనూ పరిస్థితి పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో దారుణంగా ఉంది. ధనికుల కంటే పేదల్లోనే ఎక్కువ మరణాలు కనిపిస్తున్నాయి. గర్భస్థ మరణాల విషయంలో ఎక్కువ ఆదాయం ఉన్నవారిలో మరణాలు వెయ్యికి 21 ఉంటే, తక్కువ ఆదాయం ఉన్న వారిలో వెయ్యికి 48 ఉన్నాయి.

జాతీయ ఆరోగ్య మిషన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం నియోనేటల్ మరణాలకు ముఖ్య కారణం నెలలు నిండకుండా శిశువు పుట్టటం. 2015లో 44% శిశు మరణాలకు ఇదే కారణమని ఆ నివేదిక పేర్కొంది.

నెలలు నిండకుండా పుట్టిన రిధిమను రెయిన్‌బో హాస్పిటల్లో వైద్యులు 125 రోజులు పర్యవేక్షణలో ఉంచారు. నెలలు నిండకుండా పుట్టిన పిల్లల తల్లిదండ్రులకు ఇది ఒక స్ఫూర్తి అని అక్కడి వైద్యులు పేర్కొన్నారు.

"శిశువుల్లో నియోనేటల్ మరణాలకు కారణాలు అనేకం. వాటిని ఎదుర్కొనే విధానం కూడా ఉండాలి. ప్రతి శిశువుకి జీవించే అవకాశం కల్పించాలి. ఇప్పటికే కొన్ని ఉన్నాయి కానీ చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని వారందరూ కలిసి ప్రయత్నిస్తే నియోనేటల్ మరణాలను గణనీయంగా తగ్గించవచ్చు" అని డాక్టర్ జె. విజయానంద్ అభిప్రాయపడ్డారు.

నెలలు నిండకుండా పుట్టే పిల్లల్లో వచ్చే సమస్యలకు తల్లి తీసుకునే పోషకాల లోపం కూడా కారణమే అని అంటున్నారు నిపుణులు.

తల్లి శారీరక బలం, ఎదుగుదల కూడా ముఖ్యమే అని హైదరాబాద్‌లోని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ పి. బాలాంబ బీబీసీ ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు.

"ఇదీ కారణం అని చెప్పలేము. కొన్నిసార్లు తల్లి గర్భాశయం సహకరించకపోవడం కూడా ఒక కారణం కావచ్చు" అని ఆమె చెప్పారు.

అయితే భారతదేశంలో 28 వారాలకే 400 గ్రాముల బరువుతో పుట్టే శిశువును కాపాడిన రికార్డు ఉన్నా.. అలా నెలలు నిండకుండా పుట్టే శిశువుకు ఉండే జీవితపు నాణ్యత కూడా ఆలోచించాల్సిన అంశమని అంటున్నారు డాక్టర్ బాలాంబ.

"ప్రతి శిశువుకి బతికే అవకాశం ఇవ్వాలి. కానీ అది సరిపోదు. నెలలు నిండకుండా పుట్టే శిశువుకి నిత్యం పర్యవేక్షణ అవసరం. ఇది ఆ శిశువు జీవిత కాలం కూడా కావచ్చు’’ అని ఆమె చెప్తున్నారు.

‘‘ఒక ప్రాణం కాపాడటమనేది మాత్రమే ఏకైక ప్రాధాన్యం కాకూడదు. నెలలు నిండకుండా పుట్టే శిశువుకి అనేక ఆరోగ్య సమస్యలు రావచ్చు. కళ్ళకు సంబంధించి, ఎదుగుదలకి సంబంధించి, మాట రాకపోవడం ఇలా అనేక సమస్యలు రావచ్చు. అందరికీ ఇలా దీర్ఘకాల చికిత్సకై ఖర్చు పెట్టే స్తోమత ఉండదు" అని అంటున్నారు డాక్టర్ బాలాంబ.

జాతీయ ఆరోగ్య మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ‘స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్స్’ (ఎస్ఎన్‌సీయూ) ఏర్పాటు చేశారు. ఇలాంటి ఒక ఎస్‌ఎన్‌సీయూ నల్గొండ జిల్లాలో ఉంది. నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు కావలసిన సదుపాయాలు ఇక్కడ ఉన్నాయంటున్నారు డాక్టర్ దామెర యద్దయ్య.

‘‘ఇది జిల్లా స్థాయిలో ఉండటం వల్ల ఇక్కడికి వచ్చే వారిలో ఆర్థిక స్తోమత లేని వారే ఎక్కువ. అంతేకాక మేం ఇప్పటివరకు చాలా మంది చిన్న పిల్లలని కాపాడగలిగాం" అని ఆయన చెప్పారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: గుక్కపెట్టి ఏడ్చినా అమ్మ వచ్చేనా?

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం