"కొత్తగా వచ్చే చట్టం గురించి తలుచుకుంటేనే భయమేస్తోంది"

  • 26 జూలై 2018
బిల్లుపై అభ్యంతరం Image copyright Getty Images

"నాకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ అడ్రస్‌కు వెళ్తా. అక్కడ తనతో సెక్స్‌లో పాల్గొంటా, ఆ తర్వాత ఎవరి దారి వారిదే. మళ్లీ కాల్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూడాలి. తర్వాత రోజు కూడా అలాగే గడిచిపోతుంది. ఒక్కోసారి ఎదురుచూపులు, ఒక్కోసారి పని ఉంటుంది. ఇదంతా మా పొట్టగడవడం కోసమే. నెలకు బహుశా 10 రోజులు పని దొరుకుతుంది. మిగతా రోజులు ఖాళీగా ఉండాల్సిందే"

ఒక సెక్స్ వర్కర్‌గా తన ఇష్ట ప్రకారం జీవనోపాధి పొందుతున్న కుసుమ్ తన గురించి ఎలాంటి దాపరికాలు లేకుండా మాట్లాడతారు.

"చట్టం దృష్టిలో నేను ఎలాంటి తప్పూ చేయడం లేదు. కానీ కొత్తగా వచ్చే మానవ అక్రమ రవాణా చట్టం గురించి తలుచుకుంటే నాకు భయమేస్తోంది. ఈ చట్టం వల్ల నా జీవితం సాఫీగా ఉండదేమో అనిపిస్తోంది" అని కుసుమ్ చెప్పారు.

ఎయిడ్స్ మాటపై అభ్యంతరం

"జనం మమ్మల్ని దేశమంతా ఎయిడ్స్ వ్యాపించే మెషిన్లు అనుకుంటున్నారు. కొత్త చట్టంలో మా గురించి నేరుగా ఏం చెప్పడం లేదు. కానీ దానిలో ఒక దగ్గర... అక్రమ రవాణా చేసిన వారిలో ఎవరైనా ఎయిడ్స్ వ్యాపింపజేస్తే వారికి కూడా చట్టం వర్తిస్తుందని చెప్పారు. అంటే అది మావైపే చూపిస్తోందని స్పష్టమవుతోంది. లేదంటే మానవ అక్రమ రవాణా చట్టంలో ఎయిడ్స్ మాట ఎందుకు పెట్టాలి?" అని కుసుమ్ కోపంగా అన్నారు.

Image copyright Getty Images

మానవ అక్రమరవాణా చట్టం

పబ్లిక్ ట్రాఫికింగ్ (ప్రివెన్షన్, ప్రొటెక్షన్ అండ్ రిహాబిలిటేషన్) బిల్, 2018లో అక్రమ రవాణా గురించి ప్రభుత్వం కొత్తగా కొన్ని అంశాలను పొందుపరిచింది.

బలవంతంగా పనిచేయించడం, భిక్షమెత్తించడం, వయసుకు ముందే శారీరక ఎదుగుదల కోసం హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వడం, దురుద్దేశంతో పెళ్లి చేసుకుని, తర్వాత మహిళలను, పిల్లలను అక్రమంగా రవాణా చేయడం వంటి వాటిని ఈ చట్టంలో తీవ్రంగా పరిగణించారు.

కొత్త బిల్లులోని కొత్త నిబంధనల ప్రకారం:

  • బాధితులు, ఫిర్యాదుదారులు, సాక్షుల గుర్తింపు గోప్యంగా ఉంచుతారు.
  • 30 రోజుల లోపు బాధితులకు మధ్యంతర పరిహారం, ఛార్జిషీటు దాఖలు చేసిన తర్వాత 60 రోజుల్లో పూర్తి పరిహారం ఇస్తారు.
  • ఏడాది లోపు న్యాయస్థానంలో విచారణలు పూర్తి చేస్తారు.
  • అక్రమ రవాణా చేస్తూ పట్టుబడితే కనిష్టంగా పదేళ్లు, గరిష్టంగా జీవిత ఖైదు, లక్ష రూపాయల జరిమానా విధిస్తారు.
  • మొదటిసారి మానవ అక్రమ రవాణాలో ప్రమేయం ఉంటే ఆస్తుల జప్తు చేస్తారు.
  • నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)ని యాంటీ ట్రాఫికింగ్ బ్యూరోగా చేస్తారు.

అంతే కాదు, ఈ బిల్లులో బాధితుల కోసం మొదటిసారి పునరావాస నిధి కూడా ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా బాధితులకు శారీరక, మానసిక చికిత్స అందిస్తారు, సురక్షిత నివాసం కల్పిస్తారు.

Image copyright AINSW

పునరావాసంపై అభ్యంతరం

కొత్త నిబంధనల గురించి కుసుమ్ దగ్గర బీబీసీ ప్రస్తావించినపుడు, ఆమె " ముందు మా జీవనోపాధి లాక్కోండి, తర్వాత పునరావాసం కల్పిస్తామని చెప్పండి. ఇదేం న్యాయం" అన్నారు.

"ప్రభుత్వాలు కల్పించే పునరావాసం గురించి ఎవరికి తెలీదు చెప్పండి. మమ్మల్ని అభివృద్ధి గృహాల్లో ఎక్కడో ఒక మూల పడేస్తారు. అక్కడ మా బాగోగులు పట్టించుకునేవారు ఎవరూ ఉండరు. మమ్మల్ని సరిదిద్దడం అంటే అలాగేనా"? అని ప్రశ్నించారు.

కుసుమ్ సెక్స్ వర్కర్ మాత్రమే కాదు, ఆల్ ఇండియా నెట్‌వర్క్ ఆఫ్ సెక్స్ వర్కర్స్ (ఏఐఎన్ఎస్‌డబ్ల్యూ) అధ్యక్షురాలు కూడా.

ఆల్ ఇండియా నెట్‌వర్క్ ఆఫ్ సెక్స్ వర్కర్స్ ప్రకారం దేశంలో సుమారు 10 లక్షల మంది సెక్స్ వర్కర్లు ఉన్నారు. వీరిలో సుమారు 80 శాతం మంది తమ ఇష్ట ప్రకారం ఈ వృత్తిలో ఉన్నారు.

Image copyright Getty Images

ప్రభుత్వం ఈ చట్టం చేసే ముందు ఎలాంటి పరిశోధన, అధ్యయనం చేయలేదని (ఏఐఎన్ఎస్‌డబ్ల్యూ) ఆరోపిస్తోంది.

ఈ బిల్లుపై మరికొన్ని అభ్యంతరాలు కూడా ఉన్నాయి.

వాటి ప్రకారం:

బిల్లులో 10 కొత్త కమిటీలు ఏర్పాటు చేశారు. వీటిలో కొన్ని మొదట్నుంచీ ఉన్నాయి. ఇవి అక్రమ రవాణాను అడ్డుకోవడంలో సహకరించడానికి బదులు, దీన్లో మరిన్ని సమస్యలు వచ్చేలా చేస్తున్నాయి.

అక్రమ రవాణాను అడ్డుకోడానికి ఐపీసీలో మొదట్నుంచీ సెక్షన్ 370 లాంటి చాలా చట్టాలు ఉన్నాయి. బంధించి పనిచేయించడంపై కూడా చాలా చట్టాలు ఉన్నాయి. ఈ కొత్త చట్టం వల్ల ఎవరికీ ప్రయోజనం కనిపించడం లేదు.

ట్రాన్స్‌జెండర్లు, సెక్స్ వర్కర్‌లకు ఈ కొత్త చట్టం వచ్చిన తర్వాత మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

Image copyright Getty Images

ట్రాన్స్‌జెండర్ల మద్దతు కూడా లేదు

బిహార్‌లోని హిజ్రా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు రేష్మా కూడా అదే మాట అంటున్నారు.

"ట్రాన్స్‌జెండర్ల గురించి కూడా కొత్త చట్టంలో స్పష్టంగా ఏదీ చెప్పలేదు. మా దగ్గర శతాబ్దాలుగా గురు-శిష్యుల సంప్రదాయం ఉంది. అందులో శిష్యుడు ఒక గురువు నుంచి ఇంకో గురువు దగ్గరకు వెళ్తే, ఆ సమయంలో డబ్బు ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దాన్ని కూడా మానవ అక్రమ రవాణాకు సంబంధించిన అంశంలాగే చూస్తారు, పోలీసులు మమ్మల్ని మరింత ఇబ్బంది పెడతారు" అని ఆమె చెప్పారు.

కానీ తమ అభ్యంతరాల గురించి హిజ్రాలు, సెక్స్ వర్కర్ల సంఘాలు ప్రభుత్వంతో చెప్పుకున్నాయా?

Image copyright Getty Images

"ఈ అంశం గురించి మేం మేనకా గాంధీని కలిశాం. ఎంపీలను కలిశాం. కొంతమంది ఎంపీలు మా తరఫున మంత్రికి లేఖ కూడా రాశారు. కానీ ఏవీ ఫలించలేదు. ఇప్పుడు ఈ చట్టం ఆమోదం పొందితే, మాకు చెడు రోజులు దాపురించినట్టే అనుకోవాలి" అన్నారు రేష్మా.

నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో గణాంకాల ప్రకారం 2016లో మొత్తం 8132 మానవ అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి. 2015లో ఇవి 6877 మాత్రమే ఉన్నాయి. రాష్ట్రాలవారీగా చూస్తే 2016లో ఎక్కువ మానవ అక్రమ రవాణా కేసులు పశ్చిమ బెంగాల్‌లో నమోదయ్యాయి. రెండో స్థానంలో రాజస్థాన్, మూడో స్థానంలో గుజరాత్ ఉన్నాయి.

ఇన్ని అభ్యంతరాలు వస్తున్నా.. ప్రభుత్వం మాత్రం ఈ వర్షాకాల సమావేశాల్లోనే బిల్లుపై ఆమోదముద్ర వేయించాలని భావిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)