భారత క్రికెట్‌లో ఇమ్రాన్ ఖాన్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు?

  • 27 జూలై 2018
ఇమ్రాన్ ఖాన్ Image copyright facebook/ImranKhanOfficial

పాకిస్తాన్‌లో జరిగిన తాజా ఎన్నికల్లో పాక్ మాజీ క్రికెటర్, రాజకీయవేత్త ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఈ సారి అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరిస్తుందని అంటున్నారు.

ఇమ్రాన్ ఖాన్.. పాక్ ప్రధాని పదవి చేపడుతారంటున్న తరుణంలో ఆయన కాలంలో ఆడిన భారత్ మాజీ క్రికెటర్లతో బీబీసీ మాట్లాడింది.

Image copyright Getty Images

భారత మాజీ క్రికెట్ కెప్టెన్, ఆల్ రౌండర్ కపిల్‌దేవ్ ఇమ్రాన్ ఖాన్ గురించి మాట్లాడుతూ,

''నాకు చాలా సంతోషంగా, గర్వంగానూ ఉంది. సుదీర్ఘ కాలం మనతో ఆడిన వ్యక్తి ఇప్పుడు రాజకీయాల్లో రాణిస్తూ ప్రధానమంత్రి కాబోతుండటం ఆనందంగా ఉంది. '' అని పేర్కొన్నారు.

ఇమ్రాన్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా చూపించిన నైపుణ్యాలు ప్రధానమంత్రి పదవికి ఉపయోగపడుతాయా అని కపిల్‌ని అడగ్గా.. ''ఇప్పుడే కదా ఆయన గెలిచింది. ఆయన పాలన తీరు గురించి చెప్పాలంటే ముందు కాస్త సమయం ఇవ్వాలి. అతను బాగానే పరిపాలిస్తాడని అనుకుంటున్నా.'' అని అభిప్రాయపడ్డారు.

''మేం మరీ అంత సన్నిహితులం కాదు. కానీ, చాలా ఏళ్ల నుంచి ఆయన బాగా తెలుసు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి నాకు పెద్దగా తెలియదు.'' అని ఇమ్రాన్‌తో తనకున్న అనుబంధాన్ని కపిల్ వివరించారు.

''బీబీసీ ద్వారా నేను ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నా. ఓ క్రికెటర్ దేశంలోనే అత్యున్నత పీఠం ఎక్కడం గొప్ప విషయం.'' అని అన్నారు.

ఇమ్రాన్ .. అప్పుడు ఇప్పుడు

పాక్ కెప్టెన్‌గా ఇమ్రాన్ ఉన్నప్పుడే మణిందర్ సింగ్ తొలిసారి భారత్ తరఫున పాక్‌పై ఆడారు.

''ఆయన పాక్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు అన్నీ ఆయనే నిర్ణయించేవారు. కెప్టెన్‌గానే కాదు, సెలెక్టర్‌గా, అడ్మినిస్టేటర్‌గా అన్ని పాత్రలూ పోషించేవారు. కానీ, అది పూర్తిగా భిన్నమైన విషయం. '' అని చెప్పారు.

''కెప్టెన్‌గా ఆయన 15 లేదా 16 మందికి సూచనలిచ్చి ఉంటారు. కానీ, దేశాన్ని నడపించడం క్రికెట్ జట్టును నడిపించటానికంటే భిన్నమైనది. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, పాక్‌లో ప్రభుత్వాన్ని ఆర్మీనే నడిపిస్తుంటుంది. ఆర్మీ జోక్యం లేకుండా ఇమ్రాన్ దేశాన్ని ఎలా పరిపాలిస్తారో చూడాలి.'' అని మణిందర్ అభిప్రాయపడ్డారు.

Image copyright Getty Images

'క్యాన్సర్ ఆస్పత్రి ఇమ్రాన్‌కు పేరు తీసుకొచ్చింది'

''కొత్త పాత్రకు ఆయన క్రికెట్ కెప్టెన్సీ నైపుణ్యం తోడ్పడుతుంది. ఆయన ఎప్పుడూ సానుకూలంగానే ఆలోచిస్తారు. అది చాలా సహాయపడుతుంది. కానీ, రాజకీయాలు భిన్నమైనవి.'' అని మదన్ లాల్ పేర్కొన్నారు.

''పేద రోగుల కోసం ఆయన క్యాన్సర్ ఆస్పత్రి స్థాపించారు. దీంతో పాకిస్తాన్ ప్రజల్లో ఆయనకు మంచి పేరు వచ్చింది.'' అని ఆయన చెప్పారు.

ఇంతకీ భారత్‌ క్రికెట్‌లో ఇమ్రాన్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని మేం మదన్ ‌లాల్‌ను అడగ్గా..

''సునిల్ గవాస్కర్, కపిల్ దేవ్‌లాంటి కొందరు భారత క్రికెటర్లు ఆయనకు మంచి సన్నిహితులు'' అని మదన్ లాల్ సమాధానం ఇచ్చారు.

ఇవికూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)