ప్రెస్‌రివ్యూ: పాఠశాలలు, వసతి గృహాల్లో ముక్కిన బియ్యం.. కుళ్లిన కూరలు

  • 27 జూలై 2018
Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్‌లోని పలు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలు, వసతి గృహాల్లో ముక్కిపోయిన బియ్యంతో వండిన అన్నాన్ని విద్యార్థులకు వడ్డిస్తున్నట్టు విజిలెన్స్‌, మానిటరింగ్‌ విభాగం అధికారులు గుర్తించారని 'ప్రజాశక్తి' ఓ కథనం ప్రచురించింది.

67 బృందాలుగా విడిపోయిన అధికారులు 12 జిల్లాల్లోని 118 గురుకుల పాఠశాలలు, వసతిగృహాల్లో ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చేపట్టిన ఈ తనిఖీల్లో పలు పాఠశాలలు, వసతి గృహాల నిర్వహణలో అనేక లోపాలున్నట్టు గుర్తించారు.

పరిశుభ్రత పూర్తిగా లోపించిందని వారి పరిశీలనలో స్పష్టమైంది. ఎక్కువ శాతం గురుకులాలు, హాస్టళ్లకు నాణ్యత లేని సరుకులు సరఫరా అవుతున్నట్లు గుర్తించారు.

కొన్ని చోట్ల కుళ్లిన కూరగాయలను వినియోగిస్తున్నారు. బూజు పట్టిన బెల్లంతోనే రాగి జావ తయారు చేస్తున్నారు. బాలికలకు కొన్ని చోట్ల స్నానాల గదులకు, మరుగు దొడ్లకు తలుపులూ లేవు.

తూర్పుగోదావరి జిల్లాలో ఐదుగురు బాలికలు రక్త హీనతతో బాధపడుతున్నట్టు గుర్తించారు. ఒక పాఠశాలలో విధులు నిర్వహించాల్సిన ఉపాధ్యా యులకు బదులు వేరే వారు ఉపాధ్యాయులుగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

బయోమెట్రిక్‌లో ఉన్న వివరాలు, రికార్డుల్లో ఉన్న వివరాలు తారుమారుగా ఉన్నట్టు తేలింది అని 'ప్రజాశక్తి' రాసింది.

Image copyright PA
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

ఆరు నెలల్లో 1.8 కోట్ల కేసుల బీర్లు తాగేశారు

తెలంగాణలో లిక్కర్‌ కిక్‌.. రికార్డులు బ్రేక్‌ చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాల జోరు కొనసాగుతోంది అంటూ 'సాక్షి' ఓ కథనం రాసింది.

రాష్ట్రంలో ఈ ఏడాది ప్రారంభం నుంచీ ప్రతి నెలా మద్యం అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. జనవరి నుంచి ఇప్పటివరకు రూ.6,231 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్‌ గణాంకాలు చెపుతున్నాయి.

గత ఆరు నెలల్లో రూ.4,376.76 కోట్ల లిక్కర్, రూ.1,855.03 కోట్ల విలువైన బీర్లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు రూ.900 కోట్లు ఎక్కువ.

గడిచిన పదేళ్లలోనే ఇదే రికార్డు అని ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు.

ఆరు నెలల్లో 90 లక్షలకుపైగా లిక్కర్‌ కేసులు అమ్ముడుపోయాయని, రూ.4,376 కోట్ల ఆదాయం వచ్చిందని గణాంకాలు చెపుతున్నాయి.

1.8 కోట్ల కేసుల బీర్లు అమ్మడం ద్వారా టీపీబీసీఎల్‌కు రూ.1,855 కోట్లు సమకూరాయని 'సాక్షి' వివరించింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

హెడ్‌ కానిస్టేబుల్‌ ఆస్తి 7 కోట్లు

రూ. ఏడు కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టిన ఓ హెడ్ కానిస్టేబుల్‌ను గురువారం ఏసీబీ అధికారులు పట్టుకొన్నారని 'ఆంధ్రజ్యోతి' ఓ కథనం ప్రచురించింది.

కడప జిల్లా ప్రొద్దుటూరులో సుదీర్ఘకాలం పనిచేసిన హెడ్ కానిస్టేబుల్ చిన్నవీరయ్య, నాలుగేళ్ల క్రితమే బ్రహ్మంగారిమఠం పీఎస్‌కు మారారు. ఈ రెండు ప్రాంతాల్లో చిన్నవీరయ్య సాగించిన దందాలపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు.

గురువారం ప్రొద్దుటూరులోని ఆయన నివాసంలో సోదాలు జరిపారు. ఈ క్రమంలో ప్రొద్దుటూరు, బెంగళూరు సహా అనేక చోట్ల ఆయనకు ఇంటి స్థలాలు, పొలాలు, ఇళ్లు, వ్యవసాయ భూములు ఉన్నట్టు గుర్తించారు.

ఇంట్లో నగదు, బంగారు వస్తువులు, ఒక బైకు, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ గుర్తించారు. ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.7 కోట్లకు పైగానే ఉంటుందని ఏసీబీ డీఎస్పీ నాగరాజు వివరించారు.

కడప, బెంగళూరు తదితర ప్రాంతాల్లోనూ చిన్నవీరయ్యకు ఉన్న ఆస్తుల గురించి ఆరా తీస్తున్నామని తెలిపారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

విజయేంద్ర ప్రసాద్ Image copyright Viswa-Vijayendra-prasad/FB

మూడు భాషల్లో.. పది కథలు

బాక్సాఫీస్‌ దగ్గర భారీ విజయాలు నమోదు చేసుకున్న చిత్రాలకు కథలు అందించిన ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్‌ ఇప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్‌ ఇంటర్నేషనల్‌తో ఆయన పది సినిమాలకు కథలు రాసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని 'సాక్షి' ఓ కథనం ప్రచురించింది.

"తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాలు చేస్తాం. కోటి రూపాయల నుంచి వంద కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాలు ఉంటాయి. కొత్తవాళ్లను ప్రోత్సహించాలన్నది కూడా మా ముఖ్య ఉద్దేశం. ఈ పది సినిమాల్లో కొత్తవాళ్లతో తీసే సినిమాలూ ఉంటాయి. రానున్న రెండు సంవత్సరాల్లో ఈ సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది'' అని విజయేంద్రప్రసాద్ అన్నారు.

ఇదిలా ఉంటే.. ఓ హిందీ చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహించనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ పది చిత్రాల్లో ఆ సినిమా ఒకటన్నది పలువురి అభిప్రాయం. ఇదే విషయం గురించి విజయేంద్రప్రసాద్‌ని అడిగితే - ''ఈరోస్‌తో సుకుమార్‌ సినిమా చేయనున్నది వాస్తవమే. సుకుమార్‌ సుముఖంగానే ఉన్నారు. అయితే ఈ పది సినిమాల్లో అది ఒకటి కాదు. వేరే సినిమా'' అని చెప్పారని సాక్షి పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)