అబ్దుల్ కలాం ఆఖరి రోజు ఏం జరిగింది?

  • 27 జూలై 2018
కలాం Image copyright Getty Images

చివరి క్షణం వరకూ దేశం కోసం.. సమాజ శ్రేయస్సు కోసం.. యువత భవిష్యత్తు కోసం తపించారు భారత మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ డాక్టర్. ఏపీజే అబ్దుల్ కలాం.

ఆయన 83 ఏళ్ల వయసులో 2015 జూలై 27న మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని ఐఐఎంలో ఉపన్యాసం ఇస్తూ హఠాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురై తుదిశ్వాస విడిచారు.

అందుకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన వ్యక్తి ఆయనకు అనుచరుడిగా, సలహాదారుగా పనిచేసిన శ్రీజన్‌ పాల్ సింగ్.

ఆ రోజు కలాం ఆఖరి ఘడియలు ఎలా గడిచాయి? దిల్లీ నుంచి షిల్లాంగ్ ప్రయాణంలో ఏం జరిగింది? కలాం చివరి మాటలేంటి? అన్న విషయాలన్నింటినీ శ్రీజన్‌ పాల్ ఫేస్‌బుక్‌లో 2015 జూలై 28న గుర్తుచేసుకున్నారు.

కలాం మూడో వర్థంతి సందర్భంగా ఆ విషయాలు శ్రీజన్ మాటల్లోనే..

జులై 27న మధ్యాహ్నం 12 గంటలకు మా రోజు ప్రారంభమైంది. గువహాటి వెళ్లే విమానంలో డాక్టర్. కలాం 1ఎ, నేను 1సీ నంబర్ సీట్లలో కూర్చున్నాం.

అప్పుడు ఆయన డార్క్ కలర్ 'కలాం సూట్' వేసుకున్నారు. కలర్ చాలా బాగుంది! అన్నాను. అయితే.. ఆయన మీద నేను చూసే చివరి రంగు అదే అవుతుందని మాత్రం ఊహించలేకపోయాను.

వర్షాకాల వాతావరణంలో ఆ విమాన ప్రయాణం రెండున్నర గంటల పాటు సాగింది. వాతావరణ పరిస్థితుల కారణంగా విమానం ఊగుతుంటే నేను ఇబ్బంది పడ్డాను. ఆయన మాత్రం ధైర్యంగా ఉన్నారు. నేను ఆందోళనగా కనిపించినప్పుడల్లా.. కిటికీ కిందికి దించి "ఇక నీకు ఎలాంటి భయమూ ఉండదు" అని అనేవారు.

ఆ తర్వాత గువహాటి నుంచి ఐఐఎం షిల్లాంగ్ చేరుకునేందుకు మరో రెండున్నర గంటలు కారులో ప్రయాణించాం.

Image copyright facebook.com/SrijanPalSingh
చిత్రం శీర్షిక అబ్దుల్ కలాంతో శ్రీజన్ పాల్ సింగ్

ఈ ఐదు గంటల ప్రయాణంలో మేం అనేక అంశాల గురించి చర్చించాం. గత ఆరేళ్లుగా అలా కొన్ని వందల సార్లు ఇద్దరమూ కలిసి సుదీర్ఘ విమాన ప్రయాణాలు చేశాం. అన్నింటిలాగే ఈ ట్రిప్ కూడా చాలా ప్రత్యేకమైనది.

ఈ సారి జరిగిన మూడు చర్చలు "మా ఆఖరి ప్రయాణపు జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి."

పంజాబ్‌లో జరిగిన మిలిటెంట్ల దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడంపై కలాం తీవ్రంగా కలత చెందారు. ఐఐఎం షిల్లాంగ్‌లో మాట్లాడేందుకు 'భూగోళాన్ని నివాసయోగ్యంగా మలచటం' అనే అంశాన్ని ఎంచుకున్నారు.

పంజాబ్‌లో దాడిని ఆ అంశంతో అన్వయిస్తూ.. మనిషి సృష్టించే శక్తులే అత్యంత ప్రమాదకరం అనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

"హింస, కాలుష్యం, మనుషుల నిర్లక్ష్యపూరిత వైఖరి ఇలాగే కొనసాగితే.. మరో 30 ఏళ్లలో మనం భూగోళాన్ని వీడాల్సి రావచ్చు. ఈ సమస్యకు మీరే పరిష్కారం కనుగొనాలి. భవిష్యత్‌ ప్రపంచం మీదే" అన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక రాష్ట్రపతి భవన్ మొఘల్ గార్డెన్స్‌లో అబ్దుల్ కలాం

మేం చర్చించిన రెండో అంశం దేశం గురించి.

ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన పార్లమెంటులో ప్రతిష్ఠంభన నెలకొనడంపై ఆయన రెండు రోజులుగా బాధపడుతున్నారు.

"నా పదవీ కాలంలో రెండు ప్రభుత్వాలను చూశాను. పార్లమెంటులో ప్రతిష్ఠంభన ఎప్పుడూ ఇలాగే కొనసాగుతూనే ఉంది. అది ఏమాత్రం సరైంది కాదు. మార్పు రావాల్సిన అవసరం ఉంది" అని కలాం అన్నారు.

ఇదే అంశంపై ఐఐఎం షిల్లాంగ్ విద్యార్థులకు అసైన్‌మెంట్ రూపొందించాలని నాకు సూచించారు. పార్లమెంటు మరింత ఫలవంతంగా, ఉత్సాహవంతంగా పని చేయటానికి మూడు మార్గాలను సూచించేలా ప్రశ్నలు ఉండాలని చెప్పారు.

అయితే తర్వాత కలాం మాట్లాడుతూ.. "ఈ విషయాల మీద నా దగ్గరే ఎలాంటి పరిష్కారాలు లేనప్పుడు, విద్యార్థుల్ని ఎలా అడగగలను?" అన్నారు. ఈ చర్చనంతా మేమిద్దరమూ కలిసి రాస్తున్న పుస్తకం 'అడ్వాంటేజ్‌ ఇండియా'లో పొందుపరచాలని అనుకున్నాం.

Image copyright Getty Images

మానవతా మూర్తి

నేను గుర్తుచేసుకోవాల్సిన మూడో విషయం.. కలాంలోని మానవతా మూర్తిని ప్రతిబింబించేది.

ఆరు కార్ల కాన్వాయ్‌లో మేం షిల్లాంగ్ వెళ్తున్నాం. అన్నింటికంటే ముందు వెళ్తున్న ఓపెన్‌ టాప్ జిప్సీలో ముగ్గురు సైనికులు ఉన్నారు. వారిలో ఇద్దరు కూర్చుని ఉండగా.. బక్కపలుచగా ఉన్న ఒక అతను మాత్రం తుపాకీ పట్టుకుని నిల్చున్నారు.

గంటసేపు అయినా ఆయన అలాగే నిలబడి ఉన్నారు. దాంతో ఆయన్ను చూసి కలాం చలించిపోయారు. 'ఆయన ఎందుకు అలా నిల్చున్నారు? అలసిపోతారు. ఇది శిక్షించడం కాదా? ఆయన్ను కూర్చోమని వైర్‌లెస్ మెసేజ్ పంపగలవా? అని అడిగారు.

భద్రతను పర్యవేక్షించడంలో భాగంగా ఆయన అలా నిలుచుని ఉంటారని కలాంకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాను. కానీ.. ఆయన ఊరుకోలేదు. దాంతో వైర్‌లెస్ ద్వారా సందేశం పంపేందుకు ప్రయత్నించాను. సాధ్యం కాలేదు. మరో గంటన్నర సేపు మా ప్రయాణం సాగింది. ఆ లోపు ఆ సైనికుడిని కూర్చోబెట్టాలంటూ కలాం మూడుసార్లు నన్ను అడిగారు. కానీ.. నాకు సాధ్యం కాలేదు.

చివరికి ఆయనకు ఎలాగైనా కృతజ్ఞతలు చెప్పాలని ఉందని కలాం అన్నారు. దాంతో షిల్లాంగ్ చేరుకున్న తర్వాత భద్రతా అధికారుల సాయంతో ఆ సైనికుడిని గుర్తించి తీసుకొచ్చాం. కలాం ఆయన చేయ్యి పట్టుకుని "రెండు గంటలకుపైగా అలాగే నిల్చున్నావు అలసిపోలేదా?' నా కోసం అంతగా కష్టపడినందుకు మీకు ధన్యవాదాలు. నా వల్ల మీరు ఇబ్బంది పడినందుకు క్షమించండి" అన్నారు.

అందుకు ఆ సైనికుడు స్పందిస్తూ.. 'సర్‌, మీ కోసం ఆరు గంటలైనా నిలుచునేందుకు నేను సిద్ధం' అని చెప్పారు.

Image copyright facebook.com/SrijanPalSingh
చిత్రం శీర్షిక సైనికుడికి కృతజ్ఞతలు చెబుతున్న కలాం

ఆ తర్వాత సమావేశ ప్రాంగణానికి చేరుకున్నాం.

"ఎప్పుడూ విద్యార్థులు తన కోసం ఎదురుచూడకూడదు" అని కలాం చెబుతుండేవారు. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మైక్‌ని, కంప్యూటర్‌ను సిద్ధం చేశాను.

కోటుకు మైకు పిన్ను పెడుతున్నప్పుడు ఆయన నవ్వుతూ.. ఫన్నీ గయ్‌! అన్నీ సరిగా చేశావా? అన్నారు. నేను నవ్వుతూ 'యెస్' అన్నాను. అవే ఆయన నాతో మాట్లాడిన చివరి మాటలు.

ప్రసంగం ప్రారంభించారు. నేను ఆయన వెనకే కూర్చున్నాను. ఒక వాక్యం తర్వాత మరో వాక్యం ప్రారంభించడానికి ఎక్కువ సేపు సమయం తీసుకుంటున్నారు.

దాంతో ఆయన వైపు చూశాను. ఆయన ఒక్కసారిగా కూలబడిపోయారు. వెంటనే పైకి లేపాము. డాక్టర్ వచ్చేలోపు మేం చేయాల్సిందల్లా చేశాం. కళ్లు మూడొంతులు మూశారు. ఆయన తలను ఒక చేతితో పట్టుకుని.. ఆయన్ను బతికించుకునేందుకు చేయాల్సిందల్లా చేశాను.

ఆయన పిడికిలి బిగ్గరగా, వంకర పోయాయి. అప్పటికీ ఆయన ముఖం మీద మృదుత్వం కనిపిస్తోంది. కళ్లలో చలనం ఆగిపోయింది. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తన బాధను వ్యక్తం చేయలేదు.

కొన్ని నిమిషాల్లో సమీపంలోని ఆసుపత్రికి చేరుకున్నాం. ఆ తర్వాత కొన్ని నిమిషాలకే మిస్సైల్ మ్యాన్ మనల్ని విడిచివెళ్లిపోయారని తెలిసింది. చివరిగా ఆయన పాదాన్ని తాకాను.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఎక్కువగా విద్యార్థులతో ముచ్చటించేందుకు, వారిలో స్ఫూర్తి నింపేందుకు అబ్దుల్ కలాం ప్రయత్నించేవారు.

యువతకు స్ఫూర్తి

శాస్త్రవేత్తగా, మేధావిగా, భారత రాష్ట్రపతిగా డాక్టర్. ఏ.పీ.జే అబ్దుల్ కలాం చేసిన సేవలు నిరుపమానం. భారతదేశ క్షిపణి సాంకేతికతకు ఆద్యుడైన కలాం.. యువతలో స్ఫూర్తిని నింపేదుకు ఎప్పుడూ పరితపించేవారు.

అందుకే దేశంలో ఎక్కడికెళ్లినా ఎక్కువగా విద్యార్థులు, యువతతో ముచ్చటించేందుకు, వారిని చైతన్యపరిచేందుకు ప్రయత్నించేవారు.

ఆయన ఆత్మకథ 'వింగ్స్ ఆఫ్ ఫైర్' పుస్తకం ఎంతోమందిలో స్ఫూర్తి నింపిందని చెప్పొచ్చు.

అత్యున్నత పదవి అధిష్టించినప్పటికీ నిరాడంబర జీవితం గడిపిన ఆయన గొప్ప మానవతావాదిగా పేరుపొందారు.

Image copyright facebook.com/SrijanPalSingh
చిత్రం శీర్షిక శ్రీజన్ పాల్ సింగ్

ఎవరీ శ్రీజన్‌ పాల్ సింగ్?

ఐఐఎం (అహ్మదాబాద్) పూర్వ విద్యార్థి అయిన శ్రీజన్‌ పాల్ సింగ్ తన గురువు అబ్దుల్ కలాం అని చెబుతారు.

కలాంకి అత్యంత సన్నిహితుడిగా, సలహాదారుడిగానూ పనిచేశారు.

2009 నుంచి ఆయన కలాంతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొనేవారు.

అబ్దుల్ కలాం, శ్రీజన్‌పాల్ సింగ్‌ కలిసి 'అడ్వాంటేజ్ ఇండియా: ఫ్రమ్ ఛాలెంజ్ టు ఆపర్చునిటీ' అనే పుస్తకం రచించారు. అదే కలాం చివరి రచన.

కలాం ఆశయాల సాధన కోసం 'డాక్టర్. ఏ.పీ.జే అబ్దుల్ కలాం సెంటర్' పేరుతో ఏర్పాటు చేసిన ఓ స్వచ్ఛంద సంస్థకు సీఈవో, సహవ్యవస్థాపకుడిగా శ్రీజన్ పాల్ సింగ్ ఉన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)