తెలుగు రాష్ట్రాల్లో 91 శాతం ఇళ్లలో టీవీ

  • 27 జూలై 2018
టెలివిజన్ Image copyright Getty Images

తెలుగు రాష్ట్రాల్లో టీవీలున్న ఇళ్ల సంఖ్య పెరిగింది. రెండేళ్ల కిందట తెలుగు రాష్ట్రాల్లోని 80 నుంచి 90 శాతం గృహాల్లో టీవీలు ఉండగా ఇప్పుడది 91 శాతం దాటిందని బార్క్ ఇండియా తెలిపింది.

బార్క్‌ ఇండియా తాజా నివేదిక ప్రకారం దక్షిణ భారతంలోని అన్ని రాష్ట్రాల్లోనూ 91 శాతానికి పైగా ఇళ్లలో టీవీ సెట్లు ఉన్నాయి.

రెండేళ్ల కిందట కేవలం తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో మాత్రం ఈ పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు కూడా ఆ మూడు రాష్ట్రాల సరసన చేరాయి.

అత్యల్పంగా ఝార్ఖండ్, బిహార్‌లలో 30 శాతం కంటే తక్కువ గృహాల్లో మాత్రమే టెలివిజన్ సెట్‌లు ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 30 నుంచి 45 శాతం గృహాలకే టీవీలున్నాయి.

ఉత్తరాదిలో దిల్లీ మినహా ఎక్కడా ఈ శాతం 90కి మించలేదు. కాగా దేశవ్యాప్తంగా చూసుకుంటే సగటున 66 శాతం ఇళ్లలో టెలివిజన్ సెట్లున్నాయి. 2016 కంటే ఇది 2 శాతం అధికం. 2001 జనాభా లెక్కలతో పోల్చితే ఈ సంఖ్య రెట్టింపైనట్లు. 2001లో దేశంలోని 32 శాతం ఇళ్లలో టీవీలున్నాయి.

Image copyright BARCINDIA

భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లలో టెలివిజన్ల సంఖ్య పట్టణాలకన్నా వేగంగా పెరుగుతోందని ఈ సర్వే తెలిపింది.

స్మార్ట్ ఫోన్ల యుగంలోనూ ఇళ్లలో బుల్లి తెరగా పిలుచుకునే టెలివిజన్ ప్రాబల్యం విస్తరిస్తోందని.. బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా 2018 సర్వేలో వెల్లడించింది.

భారతదేశంలో టెలివిజన్‌లు ఉన్న ఇళ్ల సంఖ్య నిరుటితో పోలిస్తే 7.5 శాతం పెరిగింది.

ఇది దేశంలో ఇళ్ల పెరుగుదల కన్నా అధికం. ఇళ్ల పెరుగుదల రేటు 4.5 శాతంగా ఉంది.

ఇండియాలో ప్రస్తుతం 29.8 కోట్ల ఇళ్లు ఉండగా.. అందులో 19.7 కోట్ల ఇళ్లలో టీవీ సెట్లు ఉన్నాయి.

ఇంకా దాదాపు 10 కోట్ల టీవీలు పెరగటానికి అవకాశం ఉందని బార్క్ ఇండియా వ్యాఖ్యానించింది.

Image copyright Getty Images

దేశంలో మూడు లక్షల ఇళ్లను నమూనాగా తీసుకుని ఈ అధ్యయనం నిర్వహించినట్లు ఈ సంస్థ తెలిపింది.

ఫీల్డ్-వర్క్/ డాటా కలెక్షన్, క్షేత్రస్థాయిలో పని, సమాచార సేకరణ మినహా.. ఈ అధ్యయనంలో నమూనా, అంచనాల రూపకల్పన, సమాచార నాణ్యత తనిఖీ, సాఫ్ట్‌వేర్ వంటి ఇతర ప్రధాన పనులన్నీ స్వయంగానే చేసినట్లు బార్క్ చెప్పింది.

దేశంలో మధ్య తరగతి కుటుంబాల పెరుగుదల, ఫ్లాట్ టీవీ స్క్రీన్ల సంఖ్య పెరగటం.. ఈ సర్వేలో వెల్లడైన రెండు ముఖ్యాంశాలుగా పేర్కొంది.

Image copyright Getty Images

బార్క్ ఇండియా 2018 సర్వేలో వెల్లడైన కొన్ని ఆసక్తికరమైన అంశాలు:

  • నిరుడు 7.80 కోట్ల మందిగా ఉన్న టీవీ వీక్షకుల సంఖ్య 7.2 శాతం పెరిగి 83.6 కోట్లకు చేరింది. అయితే ఈ ఏడాది 29వ వారంలో టీవీ వీక్షణ పెరుగుదల.. దీనికి ముందు నాలుగు వారాలతో పోలిస్తే 12 శాతంగా ఉంది.
  • పట్టణ ప్రాంతాల్లో కన్నా గ్రామీణ ప్రాంతాల్లో టీవీ ఇళ్ల సంఖ్య పెరుగుదల ఎక్కువగా ఉంది. పట్టణాల్లో ఈ పెరుగుదల 4 శాతంగా ఉంటే.. గ్రామాల్లో 10 శాతంగా ఉంది.
  • అలాగే టీవీ వీక్షణ పెరుగుదల కూడా పట్టణాలకన్నా గ్రామాల్లో కొంచెం ఎక్కువగా ఉంది. పట్టణాల్లో 10 శాతం పెరిగితే.. గ్రామాల్లో 13 శాతం పెరిగింది.
  • టీవీని వీక్షించే వ్యక్తులు సగటున అందుకోసం వెచ్చించే సమయం కూడా 3 శాతం పెరిగింది.
  • ప్రస్తుతం ఒక వ్యక్తి సగటున 3:44 గంటలు టీవీ వీక్షిస్తున్నారు.
Image copyright Getty Images
  • అయితే.. ఈ పెరుగుదల గ్రామాలకన్నా కూడా పట్టణ ప్రాంతంలో ఎక్కువగా ఉంది. సగటు టీవీ వీక్షణ సమయం పట్టణాల్లో 5 శాతం పెరిగితే (4:06 గంటలు).. గ్రామాల్లో 2 శాతం పెరిగింది (3:27 గంటలు).
  • 2016 సర్వేతో పోలిస్తే.. టీవీ సొంతంగా కలిగివున్న వ్యక్తుల సంఖ్య పెరుగుదల రేటు పురుషుల కన్నా (6.9 శాతం) మహిళల సంఖ్య (7.5 శాతం) స్వల్పంగా ఎక్కువగా ఉన్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది.
  • మొత్తంగా ప్రస్తుతం టీవీ చూసే పురుషుల సంఖ్య 42.9 కోట్లుగా ఉంటే.. మహిళల సంఖ్య 40.7 కోట్లుగా ఉంది.
  • టీవీ వీక్షణలో సైతం.. ఈ ఏడాది 29వ వారంలో పురుషుల కన్నా (11 శాతం) మహిళలు (12 శాతం) టీవీ చూడటంలో పెరుగుదల ఒక్క శాతం ఎక్కువగా ఉంది.
Image copyright Getty Images

’’మారుతున్న భారత ముఖచిత్రాన్ని బీఐ 2018 సర్వే ద్వారా మేం చూపగలిగాం. అయితే.. కంటెంట్ రూపకర్తలు, ప్రకటనకర్తలు ఇరువురూ ప్రేక్షకులను చేరుకోవటానికి టీవీయే అత్యంత ప్రభావవంతమైన వేదిక అనేది మాత్రం మారలేదు’’ అని బార్క్ ఇండియా సీఈఓ పార్ధో దాస్‌గుప్తా పేర్కొన్నారు.

కుటుంబ సమేతంగా వీక్షించే దేశమన్న పేరుని ఇండియా కొనసాగిస్తోందనటానికి.. టీవీ ఉన్న ఇళ్ల సంఖ్య పెరుగుదలే నిదర్శనమని పేర్కొన్నారు.

ఇవి కూడా చూడండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)