గ్రౌండ్ రిపోర్ట్: దిల్లీలో ముగ్గురు చిన్నారుల ఆకలి చావులు చెబుతున్నది ఏంటి?

  • 27 జూలై 2018
ఢిల్లీలో ఆకలి చావులు Image copyright BHUMIKA RAI/BBC
చిత్రం శీర్షిక తండ్రి మంగల్ సింగ్‌తో సుక్కా, పారుల్, మానసి

తూర్పు దిల్లీ మండావలీలో ఆకలితో ముగ్గురు చిన్నారులు చనిపోయారు. పిల్లల పోస్టుమార్టం రిపోర్టు కూడా దానిని స్పష్టం చేసింది.

వీరిలో పారుల్ వయసు నాలుగేళ్లు, సుక్కా వయసు రెండేళ్లు అయితే, మానసి వయసు 8 నెలలే.

ముగ్గురు ఆడపిల్లల తండ్రి మంగల్ సింగ్ ఇప్పుడు ఎక్కడున్నారో, ఎప్పుడు వస్తారో అక్కడ ఎవరికీ తెలియడం లేదు. చిన్నారుల తల్లి బీనా అక్కడ ఉన్నారు. కానీ ఆమె ఏం మాట్లాడలేకపోతున్నారు. స్థానికులు ఆమె మానసిక స్థితి సరిగాలేదని చెబుతున్నారు.

బీనా బాత్రూం కంటే చిన్నదిగా ఉన్న ఒక గదిలో నారాయణ్ యాదవ్ అనే ఒక వ్యక్తితోపాటూ కూర్చుని ఉన్నారు. నారాయణ్ ఆమె భర్త మంగల్ స్నేహితుడు.

చిన్న చిన్న షాపుల్లో వంటలు చేసుకునే నారాయణ్ తన స్నేహితుడు మంగల్, అతడి కుటుంబాన్ని గత శనివారం తనతోపాటూ మండావలీలోని ఆ గదికి తీసుకొచ్చారు.

"మంగల్ రిక్షాను ఎవరో ఎత్తుకెళ్లారు. తన దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. ఇంటి యజమాని అతడిని బయటకు వెళ్లగొట్టాడు. ఆరోజు బాగా వర్షం పడుతుండడంతో వాళ్లను నా గదికి తీసుకొచ్చా. రెండు మూడు రోజులు ఉంచుకో, నేను డబ్బు సంపాదించుకుని రాగానే, వారిని తీసుకెళ్తానని మంగల్ చెప్పాడు" అని నారాయణ్ చెప్పారు.

అంతకు ముందు మంగల్, అతడి కుటుంబం మండావలీలో వేరే ప్రాంతంలో ఒక గుడిసెలో ఉండేది.

"తను ఒక గ్యారేజీ దగ్గర ఉండేవారు. రిక్షా తొక్కితే ఎంత వస్తుంది. అప్పుడప్పుడు మాత్రమే ఇంటి యజమానికి డబ్బులు ఇచ్చేవారు. కానీ ఈసారి మాత్రం యజమాని అతణ్ణి ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. తన భార్య కూడా ఏ పనీ చేసే స్థితిలో లేదు" అని నారాయణ్ వివరించారు.

మంగల్ "నాకు స్నేహితుడు కాదు తమ్ముడు" అంటారు నారాయణ్. కానీ ప్రస్తుతం అతను ఎక్కడున్నారో, తనకూ తెలీడం లేదని నారాయణ్ చెప్పారు.

Image copyright BHUMIKA RAI/BBC
చిత్రం శీర్షిక బీనాతో నారాయణ్ యాదవ్

పిల్లలకు అనారోగ్యం

మండావలీలో నారాయణ్ ఉంటున్న ఇల్లు రెండంతస్తుల భవనం. అందులో 30కి పైగా కుటుంబాలు ఉంటున్నాయి. అక్కడున్న అందరూ పిల్లలు చనిపోవడం గురించి తమకు తెలియదని అంటున్నారు.

నారాయణ్ గది, ఆ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంది. అందులో ఒక గదికి, ఇంకో గదికి మధ్య ఐదడుగులే ఉంటుంది. కానీ అక్కడ పిల్లలు ఆకలితో చనిపోవడం మాత్రం ఎవరికీ కనిపించలేదు.

వారి గదికి పక్కనే ఉండే ఒక మహిళ బీబీసీతో మాట్లాడుతూ.. "వాళ్లు వచ్చినట్టు తెలుసు, గది ఎప్పుడూ మూసే ఉండేది. అందుకే అలా ఎప్పుడు జరిగిందో నాకు తెలీనేలేదు" అన్నారు.

పేరు రాయకూడదనే షరతుతో ఆ ఇంటి యజమాని భార్య "వాళ్లు శనివారం నారాయణ్ ఇంటికి వచ్చారు. పిల్లలకు అప్పటికే అనారోగ్యంగా ఉంది, వాంతులు కూడా చేసుకుంటున్నారు. వాళ్లను డాక్టరుకు చూపించమని కూడా చెప్పా. కానీ ఆ తర్వాత ఇలా జరిగిపోయింది" అన్నారు.

Image copyright BHUMIKA RAI/BBC
చిత్రం శీర్షిక పోస్టుమార్టం రిపోర్టులో ఒక పేజీ

ఈ కేసులో పిల్లల పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది. అందులో మృతికి కారణం ఆకలి, పోషహాకార లోపమే అని పేర్కొన్నారు.

నారాయణ్ కూడా ఆ మాటను ఒప్పుకున్నారు. "వాళ్లందరూ జబ్బు పడ్డారు. ఒక్కోసారి ఏదైనా తినేవారు, ఒక్కోసారి ఏం ఉండేది కాదు" అన్నారు.

"సోమవారం సాయంత్రం మేమంతా కలిసి అన్నం, పప్పు తిన్నాం. బహుశా ఆకలి ఎక్కువయ్యే పిల్లలు చనిపోయుంటారు. మంగళవారం నేను పనికెళ్లలేదు. మధ్యాహ్నం చూసేసరికే ముగ్గురు పిల్లలూ పడిపోయి ఉన్నారు. లేవడం లేదు, కళ్లు మూసుకుపోయాయి" అని నారాయణ్ వివరించారు.

ఇంటి యజమాని కొడుకు ప్రదీప్ మంగళవారం మధ్యాహ్నం నారాయణ్ పరిగెత్తుకుని తన దగ్గరికి వచ్చారని చెప్పారు.

"నారాయణ్ తన స్నేహితుడి కుటుంబాన్ని తీసుకొచ్చాడని మాకు తెలుసు. కానీ, మేం ఏం అనలేదు. మంగళవారం మధ్యాహ్నం నారాయణ్ మా దగ్గరికి వచ్చాడు. పిల్లలు స్పృహతప్పారని చెప్పాడు. అందరూ పిల్లలను తీసుకుని లాల్ బహదూర్ శాస్త్రి ఆస్పత్రికి వెళ్లాం. అక్కడ పిల్లలు ప్రాణాలతో లేరని చెప్పారు.’’ అని ప్రదీప్ తెలిపారు.

మండావలీ పోలీస్ స్టేషన్లో అధికారి సుభాష్ చంద్ర మీనా "నాకు మధ్యాహ్నం 1.30కు ఆస్పత్రి నుంచి ఫోన్ వచ్చింది, చనిపోయిన ముగ్గురు పిల్లల్ని తీసుకొచ్చారని ఫిర్యాదు చేశారు" అని చెప్పారు.

సర్ గంగారామ్ ఆస్పత్రి డాక్టర్ నరేష్ బంసల్ "ఒక రోజు ముందు ఆహారం తీసుకున్నా.. ఎక్కువ సమయం నుంచి ఏం తినకపోవడంతో వీళ్లు చనిపోయారు. ఇది ఆకలి, పోషకాహార లోపం వల్లే జరిగింది" అన్నారు.

Image copyright BHUMIKA RAI/BBC

మాట్లాడని తల్లి

నారాయణ్ ఉండే ఆ చిన్న గది బయట చాలా మంది గుమిగూడారు. వారిలో ఎక్కువ మంది బీనాకు 'మతిస్థిమితం' తప్పిందని మాకు చెప్పారు. ఆమె ఏం మాట్లాడలేదన్నారు.

అక్కడున్న కొందరు మాత్రం "తన పిల్లలు చనిపోయారనే విషయం వినే నిశ్శబ్దంగా ఉన్న ఈ తల్లి, ఇంకేం మాట్లాడుతుందిలే" అంటూ విమర్శించారు.

కానీ అక్కడున్న ప్రతి వ్యక్తీ పిచ్చిదంటున్న ఆమె నోటి నుంచి కూడా ఏదైనా వినాలనుకుంటున్నట్టు మాకు అనిపించింది.

ఇంట్లో వెలుతురు రావడానికి ఒక ఖాళీ ఉంది. కానీ మేం అక్కడికి చేరుకునేసరికే అక్కడ మీడియా అంతా దానిని కప్పేసింది. లోపలికి వెళ్లడానికి ఎవరికీ అనుమతి లేదు. నిజానికి ఆ గదిలోకి చూడాలంటే ఉన్న ఒకేఒక దారి ఆ వెలుతురు వచ్చే రంధ్రం ఒక్కటే.

ఎందుకంటే గదిలోకి రావడానికి ఉన్న ఒకే దారిని జనం కమ్మేశారు.

ఆ చిన్న గదిలో నారాయణ్‌తోపాటు ఒక మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నారు. బయట పోలీసులతోపాటూ మరో 50 మంది వరకూ ఉన్నారు. లోపలున్న వాళ్లకు ఊపిరాడటం లేదు. దాంతో పోలీసులు అప్పుడప్పుడూ తలుపు కాస్త తెరుస్తూ, మూస్తూ ఉన్నారు.

బీనా నిజంగానే ఏమీ మాట్లాడ్డం లేదు. కొన్నిసార్లు ఏదైనా అడిగితే "ఈరోజు ఉదయం నుంచీ చాయ్ మాత్రమే తాగా" అంటున్నారు.

మంగల్ గురించి ఏమీ తెలీడం లేదని నారాయణ్ చెప్పాడు. "తను వస్తాడో లేదో తెలియడం లేదు. పిల్లలు చనిపోయారు. ఆమెను మీరు చూస్తూనే ఉన్నారు. ఎవరూ రానంత వరకూ ఈమెను నా దగ్గరే ఉంచుతా. ఈమెకు తెలిసినవాళ్లు కూడా ఎవరూ లేరు. నేను కూడా వదిలేస్తే ఎక్కడికెళ్తుంది" అన్నాడు

పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఈ కుటుంబం ఎన్నో ఏళ్ల క్రితమే దిల్లీ వచ్చి ఇక్కడే ఉంటోంది..

Image copyright BHUMIKA RAI/BBC

రేషన్ కార్డు కూడా లేదు...

మంగల్ సింగ్ దగ్గర రేషన్ కార్డు కూడా లేదని నారాయణ్ చెప్పారు. "రేషన్ కార్డు తీసుకోవడానికి కూడా డబ్బులు కావాలి. తన దగ్గర తిండి తినడానికే డబ్బుల్లేవు, రేషన్ కార్డు ఎలా వస్తుంది" అని నారాయణ్ ప్రశ్నించారు.

కానీ ఇక్కడ ఈ సమస్య మంగల్, నారాయణ్‌ది మాత్రమే కాదు. మండావలీలోని ఆ భవనంలో ఉంటున్న సుమారు 30 కుటుంబాల్లో ఎక్కువ మంది దగ్గర రేషన్ కార్డు లేదు.

వాళ్లను అదే విషయం అడిగితే "రేషన్ కార్డు తీసుకోవడం అంటే అంత సులభం కాదు, ఒక్కోసారి ఇంటి యజమాని తన ఐడీ, ఫొటో ఇవ్వడు, ఒక్కోసారి అధికారులు డబ్బులు అడుగుతారు" అని చాలామంది చెప్పారు.

బిల్డింగ్ యజమాని కొడుకు ప్రదీప్‌ తన సమస్య చెప్పారు. "ఇక్కడున్న వాళ్లవి ప్రభుత్వ ఉద్యోగాలు కాదు. కొందరు కూలీలైతే, కొందరు తోపుడు బండ్లు, వేరే పనులు చేసుకుంటారు. కొందరు రెండు నెలలు ఉండడానికి వస్తే, కొందరు ఒకటి, రెండు వారాలు ఉండడానికి వస్తుంటారు. ఇక్కడ అద్దె కూడా 1000 నుంచి 1500 వరకూ ఉంటుంది. అంత అద్దెకు రెంట్ అగ్రిమెంట్ కూడా ఇవ్వలేం కదా. మా ఐడీ ఇవ్వడానికి కూడా భయంగా ఉంటుంది". అని చెప్పారు.

Image copyright BHUMIKA RAI/BBC

ఆ గది దగ్గర గుమిగూడిన జనం..

పిల్లలు చనిపోయిన గది దగ్గరకు వచ్చి చూసేవారు అంతకంతకూ పెరిగారు. ఆ గదిలో ఉన్న బీనా, నారాయణ్‌ను కలిసేందుకు మీడియాను అనుమతించలేదు. కానీ, ఉన్నతాధికారులు, నేతలు రాగానే మాత్రం ఆ తలుపు తెరుచుకునేది.

తలుపు తెరుచుకోగానే, నేతలు లోపలికి వెళ్లేవారు తర్వాత మళ్లీ తలుపు మూసుకునేది. ఆయన బయటికి రాగానే బైట్ ఇస్తారు. ఆ కాసేపు మాత్రం అక్కడ కలకలం తగ్గేది.

బీనా, నారాయణ్‌ను కలిసిన దిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ ఈ కేసుపై రాజకీయాలు చేయద్దన్నారు. కానీ వ్యవస్థ నిర్లక్ష్యం మాత్రం కచ్చితంగా ఉందని అన్నారు. అక్కడి పరిస్థితిని పరిశీలించాలని కేజ్రీవాల్‌కు స్వయంగా చెబుతానన్నారు.

ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ నేత, దిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ శిసోడియా కూడా నారాయణ్, బీనాను కలిశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తున్నట్టు చెప్పారు. బీనాకు మెరుగైన చికిత్స అందిస్తామన్నారు.

Image copyright BHUMIKA RAI/BBC

మండావలీలో ముగ్గురు పిల్లలు ఆకలితో మృతి చెందినా, ఈ ఘటనపై రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. కానీ ఈ విషాదం జరిగిన ఈ ప్రాంతంలో ఆరోగ్యకరమైన జీవనం మాత్రం అసాధ్యంగా అనిపిస్తోంది.

ప్రధాన రహదారి నుంటి ఈ ఇంటి దగ్గరికి చేరుకోడానికి ఎన్ని గల్లీల నుంచి వెళ్లాలో.. అవి కేవలం మూడు నాలుగు అడుగుల వెడల్పే ఉన్నాయి. డ్రైనేజీ నీళ్లు పొంగి ఈ వీధులన్నీ నిండిపోయాయి.

ఇక్కడ ముక్కు మూసుకునేంత దుర్గంధంలో, వీధులకు రెండు వైపులా అన్ని కుటుంబాలు ఎలా జీవిస్తున్నాయో ఊహించడం కూడా కష్టం.

వీధుల్లో పేరుకుపోయిన చెత్త, గుంతలు దాటుకుంటూ నారాయణ్ ఇంటి వరకూ చేరుకోవాలి.

గది విషయానికి వస్తే, అక్కడ ఉన్న చాలా భవనాల్లో చిన్న చిన్న గదుల ఇళ్లే ఉంటాయి. అక్కడ ఒక గదిలో ముగ్గురు, నలుగురున్న కుటుంబం నివసిస్తుంది. ఆ గదుల్లో ఊపిరి ఆడాలాన్నా తలుపు తెరిచి ఉంచాల్సి ఉంటుంది.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు