BBC Special: పోతురాజు - బోనాల పండుగలో ఈ వేషం ఎవరు వేస్తారు?

  • 29 జూలై 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: పోతురాజు, విన్యాసాలు

బోనాల పండుగలో ఒళ్లంతా పసుపు పూసుకుని చేతిలో కొరడా పట్టకుని.. బోనం వెంట నడుస్తూ చిత్ర విన్యాసాలు చేసే పోతురాజులు ఎందుకు ఈ వేషం వేస్తారు? ఎలా తయారవుతారు? పోతురాజు అవ్వాలంటే ఉండాల్సిన అర్హతలేంటి?

గోల్కొండ కోటపై ఉన్న ఎల్లమ్మ (జగదాంబ మహంకాళి) గుడి దగ్గర పోతురాజు వేషం వేసిన జంగ్ శివ, వెర్రోజు రామాచారిలతో బీబీసీ మాట్లాడింది. షేక్ పేట నాలా దగ్గర ఉండే 25 ఏళ్ల శివ దాదాపు తొమ్మిదేళ్ల నుంచి ఈ వేషం వేస్తున్నట్టు చెప్పారు. తన కుటుంబంలో ఎవరూ పోతురాజులు లేకపోయినప్పటికీ ఆసక్తితో ఈ వేషం వేయడం మొదలుపెట్టారు.

పోతురాజు గ్రామదేవతకు సోదరుడని స్థానికుల నమ్మకం. పోతురాజుకు సంబంధించిన పద్దతులు గ్రామాలు, ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. సాధారణంగా అమ్మవారి గుడి బయట పోతురాజు విగ్రహం పెడుతుంటారు. హైదరాబాద్ నగరంలో పోతురాజు సంస్కృతి సజీవంగా ఉండడంతో పాటూ, పెరుగుతూ, కొత్త కొత్తగా మారుతోంది.

"గోల్కొండలో చాలా మంది పోతురాజులను చూసే వాడిని. మా తాతల కాలం నుంచీ గోల్కొండ అమ్మవారిని తీసుకువస్తాం. నేను కూడా అమ్మవారిని తీసుకు వస్తా అని ఇంట్లో అడిగాను. కానీ చిన్నాపిల్లాడినని వద్దన్నారు. అప్పుడు పోతురాజు వేషం వేస్తాను అని ఇంట్లో అడిగాను. మా అమ్మ ఒకరోజు ఏమీ చెప్పలేదు. తరువాత, నీకు ఎవరు ఉంటారు? ఏమైనా జరిగితే ఎవరు చూస్తారు అని ప్రశ్నించారు. నేను చూసుకుంటానని మా గురువు జన్నె పరమేశం గారు చెప్పారు. మా వాళ్లు గుడిలో మాట్లాడి అవకాశం ఇప్పించారు. ఒకసారి లంగర్‌ హౌజ్‌లో వేశా. నాకు చాలా మంచిగ అనిపించింది. చాలా మంచి జరిగింది." అంటూ తాను ఎలా పోతురాజుగా మారిందీ చెప్పుకొచ్చారు శివ.

చిత్రం శీర్షిక శివ

"మొదటిసారి వేషం వేసినప్పుడు అంతా అయోమయంగా ఉండేది. అందరూ స్టెప్పులు వేస్తున్నారు. నేను కొత్తగా వచ్చానని ముందుకు తోశారు. నేను బాగా సిగ్గుపడ్డాను. రెండోసారి నుంచి సిగ్గు వదిలేసి కొనసాగించాను. మొదటిసారి బట్టలు విప్పడం, షార్ట్ వేసుకోవడం సిగ్గు అనిపించింది. ఫ్రెండ్స్, తెలిసిన వాళ్లు వస్తే దాచుకునే వాడిని. రెండోసారి నుంచి భక్తి పెరిగింది. వాళ్ల మధ్య సిగ్గుపడకుండా పోతురాజు వేషం మొదలుపెట్టా." అని శివ వివరించారు.

శివ ఒక సంస్థలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. బోనాలు జరిగే ఆషాఢ మాసం మొత్తం సెలవు పెట్టేసి పోతురాజుగా ఉంటారు. మిగిలిన ఏడాది అంతా డ్రైవింగ్ పనే. తమ ప్రాంతంలో లేదా తమ కుటుంబం చేసే ఉత్సవంలో పోతురాజు ఉండాలనుకున్న వాళ్లు పోతురాజులను ముందుగా సంప్రదించి, డబ్బు, తేదీలు మాట్లాడుకుని బుక్ చేసుకుంటారు.

42 ఏళ్ల వెర్రోజు రామాచారి 12 ఏళ్లుగా ఈ వేషం వేస్తున్నారు. ఈయన వండ్రంగి పనిచేస్తూ, ఆషాఢంలో మాత్రం ఆసక్తి కొద్దీ పోతురాజు వేషం వేస్తున్నారు.

"ఇష్టంతో వేషం వేస్తున్న. మంచిగ అనిపించింది. దీనికి వంశం, కులం ఏముండదు. కొందరికి ఈ వేషం కలిసొస్తుంది. కొందరికి కలిసిరాదు. మాకు కలిసొచ్చింది, వేస్తున్నాం. ఫస్ట్ టైమ్ అంటే.. ఫ్రెండ్స్ వెంబడి తిరిగేవాడిని. వాళ్లు వేసేవాళ్లు. వాళ్లతో పాటూ వేయాలని ఇంట్రెస్టొచ్చింది. వేశాను. అప్పటి నుంచీ నాకు కలిసొచ్చింది" అని చెప్పారు రామాచారి.

ఉపవాసం:

పోతురాజు వేషం వేసే రోజు శివ ఉపవాసం ఉంటారు. ఉదయాన్నే స్నానం చేసి అలంకరణ సామాగ్రిని తమ ఇంట్లో వేసిన పటం దగ్గర ఉంచి పూజ చేసి ఆ సామాగ్రితో వేషం వేయాల్సిన గుడి లేదా ఇంటికి వెళ్లి అక్కడ అలంకరించుకుంటారు. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి వేషం తీసేసిన తరువాత మాత్రమే భోజనం చేస్తారు. మధ్యలో పళ్లరసాలు, గ్లూకోజ్ లేదా మంచినీళ్లు మాత్రం తాగుతారు.

"అందరూ ఉపవాసం ఉండరు. కొందరు మాత్రమే చేస్తారు. ఇంకొందరు మందు తాగుతారు. ఉపవాసం ఉంటే మంచిది. చూసేవాళ్లకు మంచి అభిప్రాయం కలుగుతుంది. ఒక్కపొద్దు ఉండి భక్తితో వేషం వేశారు. భక్తితో కోల మన మెడలో వేశాడు అని అభిప్రాయం ఉంటుంది. కానీ చాలా మంది చేయరు. పోతురాజు గురించి ప్రాక్టికల్‌గా తెలిసిన వాళ్లే చేస్తారు" అంటూ తన పద్ధతి చెప్పుకొచ్చారు శివ.

"నేను ఏదైనా శాకాహారం తీసుకుని వేషం వేస్తా. వేషం వేసాక ఏమీ తినను. శక్తి కోసం మంచినీళ్లు, గ్లూకోజ్‌ తాగుతాను. సామాను, పసుపు దింపే వరకూ (వేషం తీసేసే వరకూ) మందు తీసుకోం. కొందరు ముందుగానే మందు తాగి తరువాత వేస్తారు. మేం అలా కాదు. స్నానం చేసిన తరువాతే. కొందరు వేషంలోనే తాగుతారు. ఎవరి ఇష్టం వారిది. మాకిలా మంచిగుంది. అమ్మవారు దారి చూపిస్తోంది." అన్నారు రామాచారి.

అలంకరణ:

దాదాపు కేజీ పసుపునకు అరకిలో నూనె కలిపి ఆ మిశ్రమాన్ని శరీరానికి పట్టించుకుంటారు. అయితే పోతురాజుల అలంకరణ ఒకప్పటికీ, ఇప్పటికీ చాలా మారింది.

ఒకప్పుడు కేవలం పసుపు పూత, పెద్ద కుంకుమ బొట్టుకే పరిమితమైన అలంకరణ ఇప్పుడు రకరకాల రంగులకు, రకరకాల ఆకృతులకు మారింది.

"కుంకుమ, చెమ్కీలు పెట్టుకోవడం పాత స్టైల్. అప్పట్లో మేకప్ తెలీదు. పసుపు, కుంకుమతో రెడీ అయ్యేవారు. గత 8 ఏళ్ల నుంచి ఈ కొత్తవి వచ్చాయి. లైట్‌గా బొట్టు మంచిగా సెట్ చేద్దాం అనుకున్నాం. అలా అలా మేకప్ వచ్చేసింది. ఒకసారి ట్రై చేశా. గంభీరంగా వస్తోంది. భరతనాట్యం వాళ్ల దగ్గరకు వెళ్లాను ఫస్ట్. (అక్కడి మేకప్ ఆర్టిస్టును) మేకప్ వేయమని అడిగి ట్రై చేశా. ఆయన వేశాడు. చాలా బాగా వచ్చింది. అందరూ ఫోకస్ చేశారు. మెల్లిగా అదే కొనసాగించాను. మేకప్ మన్ కి డబ్బులు ఇవ్వాలి. అందుకే నాకు ఎక్కువ డబ్బులు వచ్చే దగ్గర మేకప్ వేసుకుంటాను. కొన్నిచోట్ల కుంకుమ, చెమ్కీలతో అలంకరించుకుంటాను." అన్నారు శివ.

"అప్పట్లో పసుపు మాత్రమే ఉండేది. పసుపు, కుంకుమ అంతే. లేటెస్టుగా పెయింట్ వచ్చింది. పెయింట్ చాలా ప్రాబ్లమ్. నేను ఇప్పటిదాకా పెయింట్ వాడలేదు. పెయింట్ రాత్రి పూట మండుతుంది. అది ఎనామిల్ రంగు కదా. నేను పసుపు, కుంకుమ మాత్రమే వాడుతా" అన్నారు రామాచారి.

అయితే ఎటువంటి మేకప్ అయినా 10-12 గంటలు ఎండలో, వానలో, చెమటతో తిరిగితే చెరిగిపోతుంది. అందుకే వీరు నేరుగా పెయింట్ (చెక్క, ఇనుముకు వాడే రంగు)తో మేకప్ చేసుకుంటున్నారు. దీనివల్ల చర్మానికి, ఇతర ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయని తెలిసినా ఇది కొనసాగిస్తున్నారు.

పోతురాజుల కష్టాలు

చాలా ప్రాంతాల్లో పోతురాజుల మధ్య ఆధిపత్య గొడవలుంటాయి. ఒకరి ప్రాంతంలో మరొకరు వేషం వేయడాన్ని ఒప్పుకోరు.

"ఈ ఏరియాకు నేను సీనియర్ పోతురాజును. నన్నుకాదని బయటి నుంచి వేరే వాళ్లను తెస్తారా అంటూ జెలసీ ఫీలవుతారు. వాళ్లను ఎలా అయినా ఫెయిల్ చేసేయాలని కక్ష ఉంటుంది. గొడవ చేస్తారు. నువ్వు వేషం వేయవద్దంటారు."

"అంతేకాదు.. మనం ఆ ఏరియాలో వేషం వేయడం నచ్చని వారు నిమ్మకాయలో గుండుసూదులు పెట్టి కాలి కింద పెడతారు. ఆ నిమ్మకాయ తొక్కితే సూదులు కాళ్లలో గుచ్చుకుంటాయి. నాకు పఠాన్ చెరువు, లింగంపల్లి దగ్గర ఒకసారి అలాగే జరిగింది. కొందరు మంట పుట్టించే పదార్థాలను మాపై చల్లుతారు. ఇంకొందరు తాగేసి వచ్చి, డాన్స్ చేస్తారు. బూట్లు, చెప్పులు వేసుకుని.. డాన్స్ చేస్తూ మా కాలు తొక్కేస్తారు. కింద కంకర, పైన షూతో తొక్కేస్తే కాలు చిదిగిపోతుంది. కొందరు మంత్రాలు చేసిన నిమ్మకాయలు వేస్తారనే అనుమానం ఉంది. దానివల్ల చెడు జరుగుతుందని భయం. ఆ భయం ఇంకా కొనసాగుతోంది." అని చెప్పుకొచ్చారు శివ.

"అందుకే చుట్టూ 7-8 మంది కుర్రాళ్లను పెట్టుకుంటాం. ఇలాంటివి జరగకుండా వాళ్లు చూసుకుంటారు. మాకు వచ్చే డబ్బులను బట్టి వాళ్లకు 300 నుంచి 700 వరకూ ఇస్తా. ఇక టిఫిన్లు, భోజనాలు పెట్టాలి."

పోతురాజులకు చాలా ఖర్చులుంటాయి. పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, గుమ్మడికాయలు, మేకప్ మ్యాన్, మేకప్ ఖర్చు, పూలదండలు.. ఇవన్నీ కొనాలి. చుట్టూ ఉండే కుర్రాళ్లకు కూడా డబ్బులివ్వాలి.

"దాదాపు 5 వేలకు పైనే ఖర్చు అవుతుంది. అన్నిసార్లూ డబ్బుల కోసం చేయం. పేరున్న గుళ్ల దగ్గరా, మా గురువు గారు పిలిచిన సందర్భాల్లో డబ్బులతో సంబంధం లేకుండా పోతురాజు వేషం వేస్తా అన్నారు శివ."

సాధారణంగా పోతురాజులు వేషం వేసినందుకు 5 వేల నుంచి 25 వేల వరకూ తీసుకుంటారు. ఈ మొత్తం రకరకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది.

కొరడా ఎందుకు?

ఆ కొరడాను ఈరకోల అంటారు. పోతురాజుల విషయంలో రకరకాల నమ్మకాలుంటాయి. పోతురాజులు తమ మెడలో ఈరకోల వేస్తే, కోలతో కొడితే మంచి జరుగుతుందని, వ్యాధులు తగ్గుతాయనీ, భయం ఉండదనీ భక్తుల నమ్మకం. అందుకే అందరూ పోతురాజుకు మొక్కుతారు. కొందరు పోతురాజులు దీన్ని భక్తిశ్రద్ధలతో, కొందరు ఉల్లాసంతో చేస్తారు.

"పోతురాజు వస్తున్నాడంటే భయంతో గల్లీల్లోకి ఎల్లిపోతుండె. కొట్టడం లాంటివి జరుగుతాయని భయం. కానీ కోలను మెడలో వేస్తే ఆరోగ్యానికి మంచిదని నమ్మకం. దాని వల్ల (మనసులో) భయం పోతుంది. కోల పవిత్రమైనది. అది చెడును నివారిస్తుంది. కొందరు కోల మెడలో వేసి, డబ్బులు ఇచ్చే వరకూ తీయకపోవడం వంటివి చేస్తారు. అలా డబ్బు అడగడం తప్పు. నేను కోల వేసినా డబ్బులు అడగ. ఇస్తే తీసుకుంటాను. అంతేకానీ, అన్నా ఇంత ఇవ్వండి అని ఫోర్స్ చేయను. కొందరు తెల్ల బట్టలు వేసుకుంటారు. వాళ్లు తాకవద్దు అనుకుంటారు. కానీ మందు తాగిన వాళ్ళు డబ్బుల కోసం కోల వేసి లాగేస్తారు" అన్నారు శివ.

పోతురాజు ఆట

పోతురాజులంటే ముందు గుర్తొచ్చేది వారి ఆటే.. కొరడా ఝుళిపిస్తూ వారు చేసే వీరంగం చూడ్డానికి జనం గుమిగూడతారు. పోతురాజు ఆట కూడా ఒక ప్రత్యేక కళ అన్నది శివ అభిప్రాయం. ఇప్పుడు ఆ ఆట స్థానంలో కొత్త డాన్స్ కూడా వచ్చింది.

"లంగర్ హౌజ్‌లో పోతురాజు సత్తయ్య అనే ఆయన ఉండేవారు. ఆయన దగ్గర పోతురాజు ఆట నేర్చుకున్నాను. నేను పుట్టక ముందు నుంచీ ఆయన పోతురాజు వేషం వేస్తున్నారు. ఆయనను గమనించి దేవుడిని తన పెయ్యిలోకి (శరీరంలోకి) ఎలా తెచ్చుకుంటుందీ చూశా. స్టెప్స్ కూడా చాలా వరకూ ఫాలో అయ్యా. అది మైండ్‌లో ఫిక్స్ చేసుకుని చేశా. ఆయన కూడా ఒకసారి నేర్పారు. ఇలా కాదు అలా చేయాలి అని చూపించి చెప్పాడు."

"(కొందరు) ఈ మధ్య కొత్తగా డాన్స్ నేర్చుకుంటున్నారు. స్నేక్ డాన్స్, జిగ్ జాగ్ డాన్స్ చేస్తున్నారు. అది పోతురాజు ఆట కాదు. గలీజ్‌గా ఆడుతున్నారు. నెత్తిమీద బోనం ఎత్తుకుని కిందకు పడిపోయినట్టు, పతంగ్ తెగిపోయినట్టు, ఆ డాన్స్ అర్థం కావడం లేదు. పోతురాజ ఆట ప్రత్యేకమైనది. కానీ కొందరు చేసేది చూసే ప్రజలకు మంచిగా అనిపించడం లేదు. ఆడవాళ్లు చూడలేకపోతున్నారు. వాళ్లు ఆట చూపించే స్టైల్, లేడీస్ దగ్గరకు బోనం తీసుకెళ్లినట్టు, శివసత్తులను టీజ్ చేసినట్టు చేస్తున్నారు. దానివల్ల విలువ లేకుండా పోతుంది."

పోతురాజులకు చాలా ఎనర్జీ కావాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎక్కడా అలసిపోకుండా ఎక్కడా తగ్గకుండా ఆడుతూనే ఉంటారు. కొందరు రోజుల తరబడి ఇలానే చేస్తారు. కొందరు మందు తాగుతారు. కొందరు తాగరు. కొందరు ఉపవాసం ఉండి వేషం వేస్తారు. కొందరు ఉండరు.

"అమ్మవారు నాకు శక్తినిచ్చినట్టు అనిపిస్తుంది. వరుసగా రోజుల తరబడి పోతురాజు వేషం వేస్తాను. ఇప్పటి వరకూ అలసిపోవడం, నొప్పుల వల్ల విశ్రాంతి తీసుకోవడం వంటివి జరగలేదు" అని తన అనుభవం చెప్పారు శివ.

"పూర్వం పోతురాజుల ఆట, పాట, పద్దతులు వేరు. పూర్వం వాళ్లకు నాకు తేడా ఉంది. నాకూ ఇప్పటి వాళ్లకూ తేడా ఉంది. వాళ్ల నుంచి కొద్దిగా నేర్చుకున్నా. ఇప్పటోళ్లు వేరే మల్ల. అప్పట్లో పోతురాజులు మందు తాగేవారు కాదు. ఎవర్నీ కొట్టేవారు కాదు. పోతురాజు అమ్మవారి తమ్ముడు. ఆయన ఒక దేవుడు. జనాలు పోతురాజును అరే తురే అనేవాళ్లు కాదు. స్వామీ అని కానీ పోతురాజు అని కానీ పిలిచేవారు. కానీ ఇప్పుడు అరే తురే అంటున్నారు. నా చిన్నతనంలో పోతురాజులు ఒక్కపొద్దు (ఉపవాసం) ఉండేవారు. తినేవాళ్లు కాదు. అప్పట్లో పోతురాజు అంటే భయం ఉండేది కానీ, ఇప్పుడు ఆ భయం లేదు. అది పోతురాజులే స్వయంగా చేసుకుంటున్నారు. అప్పుడు కొద్దిగా నిష్టతో చేసేవారు. ఓం నమ: శివాయ అంటూ బ్యాండు కొట్టేప్పుడు ఎవరూ పోతురాజుకు ఎదురు వెళ్లే వాళ్లు కాదు. ఇప్పుడు అందరూ ఎదరు వెళ్తారు. ఆడనీయరు, ఉరకనీయరు, పరుగెత్తనీయరు" అంటూ అప్పటికీ ఇప్పటికీ పోతురాజు సంస్కృతిలో వచ్చిన మార్పులు చెప్పారు రామాచారి.

గావు పట్టడం

కోడి లేదా మేకను అమ్మవారికి బలిగా నోటితో కొరుకుతారు. దీన్నే గావు పట్టడం అంటారు. శివ దాదాపు మూడేళ్ల నుంచి గావు పడుతున్నారు.

"అమ్మవారికి పోతురాజు యాట (వేట - మేక) నోటితో గావుపట్టి ఆమెకు శాంతి పరుస్తారు. ఆమె రక్తం చూడాలి. పోతురాజు నోటిలో రక్తం చూస్తే ఆమె శాంతి పడుతుంది. ఆమెకు పోతురాజు వేట గావు పట్టడం చాలా ఇష్టం. ఇది పూర్వీకుల నుంచీ జరుగుతోంది. వేట, గుమ్మడికాయ, నిమ్మకాయ కూడా గావు పడతాం." అని స్థానిక విశ్వాసాలను వివరించారు శివ.

"దేవుడు వచ్చినాక నేనింక మనుషుల్లో ఉండనన్నమాట. ఆమెకు ఇష్టమైన పని అమ్మవారు చేయిస్తుంది. అక్కడ మా గురువుగారు జిన్నె ఒగ్గు పరమేశం గారు పోతురాజు దండకం చెబుతారు. దేవుడు వచ్చే పదాలు, పోతురాజు దండకం అలగ్ (వేరుగా, ప్రత్యేకంగా) ఉంటుంది. వాటిని బ్యాండ్ తో పలికిస్తారు. అప్పుడు వెంబడే పూనకం వస్తుంది. వితిన్ సెకన్స్‌లో ఏం చేస్తానో నాకు తెలియదు. అంటే వాళ్లు గావు పట్టాల్సిందాన్ని చూపిస్తారు. ఇస్తారు. ఏం తీసుకోవాలో ఆ పూనంలో నాకు అర్థమవుతుంది. ముందుగానే ఇప్పుడు నువ్వు యాట గావు పడుతున్నావు అని చెప్తారు. తరువాత దేవుడి పదాలు చెప్తారు. వెంటనే ఆటోమేటిగ్గా పూనకం వచ్చేస్తుంది."

"గావు అయిపోయిన తరువాత ఏంచేశానా అని చూసుకుంటా. ఒళ్ళంతా చూసుకోవడం లాంటిది చేస్తా. అప్పుడప్పుడు ముంగటి పండ్లు నొప్పి పుడతాయి. అయితే ఎక్కడపడితే అక్కడ గావుపట్టను. ఎక్కడైతే నాకు చేయాలి అనిపిస్తదో అక్కడ చేస్తా. ప్రఖ్యాత దేవలయాలతో పాటూ, కొత్తగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చేసిన చోటు గావు పట్టడం తప్పనిసరి. అటువంటి చోట్ల చేస్తా."

మొదటిసారి గావు పట్టడం గురించి ప్రశ్నించినప్పుడు దాన్నెంతో గొప్ప విజయంగా, వివరించుకుంటూ వచ్చారు శివ.

ఎవరు పోతురాజు వేషం వేస్తారు?

"పోతురాజు వేషాలు కొందరు ఆసక్తితో వేస్తారు. కొందరు వంశపారంపర్యంగా వేస్తారు. అందులోనూ కొందరు దేవుడు వచ్చేవారు (పూనకం) ఉంటారు. మా ఇంట్లో నేనే మొదలు. ఇంతకు ముందు ఎవరూ చేయలేదు. పోతురాజు వేషం ఫలానా వాళ్లే వేయాలని రూల్ ఏమీ లేదు. ఆసక్తి ఉన్న ఎవరైనా వేయవచ్చు. ఫలానా కులం అని కూడా లేదు. అన్ని కులాల వాళ్లూ వేయవచ్చు. కానీ కింది కులాల వాళ్లే ఎక్కువ" అన్నారు శివ.

"మేం రజకులం. చాకలి, మంగళి, మాదిగ వంటి కులాలను పనిబాటలోళ్లు అంటారు. మేం అమ్మవారికి సేవకులం. మేం ఒక పాలకులం. చాకలి వారు అమ్మవారిని ఎత్తుకోవడం, చాకలు పెట్టడం, అమ్మవారి బట్టలు ఉతకడం వంటివి చేస్తాం. ఆషాఢ మాసంలోనే చేస్తాం. మిగిలిన నెలలో అక్కడ ఉండదు."అన్నారు శివ.

"దానికి కులం అనేది ఏమీ లేదు. అసలు ఇది వేసేది మంగళి. అసలు వాళ్లదే ఇది. కానీ మిగతావారు ఎవరైనా వేయవచ్చు. ఇది మాది (మా కులం) అని ఏమీ లేదు" అన్నారు రామాచారి. రామాచారి విశ్వకర్మ కులం నుంచి వచ్చారు.

"కొందరికి రాగి పత్రాలు ఉంటాయి. కొన్ని గుళ్లలో రాగి పత్రం మీద ఫలానా వారు ఇక్కడ పోతురాజు వేషం వేస్తారు అని రాసుంటుంది. అటువంటి గుళ్లు ఆ పోతురాజుల బాగోగులు చూసుకుంటుంటాయి. ఈ మధ్య కొత్త ట్రెండ్ ఏంటంటే కొందరు ఇంటి దగ్గర ఖాళీగా ఉంటారు. వారికి మంచి హైట్ మంచి పర్సనాలిటీ ఉంటుంది. చీప్ అండ్ బెస్ట్ అని పోతురాజు వేషం వేస్తున్నారు. వాళ్లకు సాయంత్రానికి 2-3 వేల దాకా డబ్బులు వస్తాయి, మందు ఫ్రీగా వస్తుంది అని చేస్తారు" అంటూ వివరించారు శివ.

పోతురాజులు చాలా పద్దతిగా, భక్తితో ఉండాలన్నది శివ నమ్మకం. "పోతురాజు వేషం ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. దీక్షతో చేయాలి. తప్పులు చేస్తే మంచిగ ఉండదు. వారికున్న ఆనందం కూడా పోతుంది."

కుటుంబం

శివ తండ్రి మినీ ట్రాలీ నడుపుతారు. తల్లి ఇస్త్రీ షాపు నిర్వహిస్తున్నారు. ఇంటర్ తరువాత శివ చదువు కొనసాగించలేదు. తన ఇంట్లో కార్యక్రమాలు, ఉత్సవాలు చూసి ఆకర్షితుడై ఈ వేషం మొదలుపెట్టారు.

"కొందరు నీకెందుకు పోతురాజు వేషం అన్నారు. నేను ఇష్టంతో చేస్తున్నా అని చెప్పా. అంతేకాదు, ఈ వేషం వేయడం మొదలుపెట్టాక మా ఆర్థిక పరిస్థితి బాగుపడింది. గతంలో మేం పేదరికం అనుభవించాం. ఇప్పుడు మా పనులు మేం చేసుకుంటూ సంతోషంగా ఉన్నాం."

"ఇక నా స్నేహితులు, నేను వేషం వేసిన మొదటి ఏడాది బాగా సతాయించారు. రెండో ఏడు నుంచి వాళ్లు చాలా సపోర్ట్ చేశారు. మా గ్యాంగ్‌లో ఒక పోతురాజు ఉన్నాడు అని చెప్పుకోవడం, నా వీడియోలు యూట్యూబ్లో పెట్టడం లాంటివి చేశారు."

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం