కరుణానిధి: ప్రపంచంలో అత్యంత సుదీర్ఘమైన సీరియల్ ఈయన రాసిందే

  • 8 ఆగస్టు 2018
కరుణానిధి Image copyright Getty Images
చిత్రం శీర్షిక కరుణానిధి

కరుణానిధి 2 లక్షలకు పైగా పేజీలు రాశారు.

ఆయన తన పార్టీ అధికారిక పత్రిక ‘మురసోలి’లో రాస్తున్న ‘ఉన్‌పిరప్పు’ (ఓ సోదరుడా...) లేఖల సీరియల్.. ప్రపంచంలో న్యూస్‌పేపర్ సీరియళ్లలో అతి సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న సీరియల్.

సీఎంలకు పంద్రాగస్టున జెండా ఎగరేసే హక్కు కరుణ వల్లే దక్కింది.

ఎన్నికల్లో వ్యక్తిగతంగా ఓటమి ఎరుగని నాయకుడు కరుణానిధి

కరుణానిధి 1947 నుంచి 2011 వరకూ దాదాపు 64 సంవత్సరాల పాటు సినిమాలకు సంభాషణలు రాశారు.

భారతదేశ స్వాతంత్ర్యానికి ముందు రాజకీయ జీవితం ప్రారంభించిన నాయకుల్లో కరుణ ఒకరు.


మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: కరుణానిధి జీవితంలో అరుదైన ఘట్టాలు

కరుణానిధి.. ‘కళైంజర్’ అని తమిళులు ప్రేమగా పిలుచుకుంటారు. అంటే కళాకారుడు అని అర్థం. తమిళనాడును సామాజికంగా, ఆర్థికంగా ప్రగతిపథంలో నడిపించడంలో ఆయన కృషి ఎంతో ఉంది.

భారత రాజకీయాల్లో కరుణానిధి విజయాలు ప్రబలమైనవి. సీనియర్ రాజకీయ నాయకుల్లో ఆయన ఒకరు. ఐదుసార్లు రాష్ట్ర ముఖ్యముంత్రిగా పనిచేశారు. ఆరు దశాబ్దాలకు పైగా శాసనసభ్యుడిగా ఉన్నారు. వ్యక్తిగతంగా ఎన్నడూ ఓటమి చవిచూడలేదు.

ముత్తువేల్ కరుణానిధి 1924 జూన్ 3న తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు.

ఆయనకు చిన్నప్పటి నుంచే రచనలపై ఆసక్తి పెరిగింది. జస్టిస్ పార్టీ నాయకుల్లో ఒకరైన అళగిరిసామి ప్రసంగాలకు ఆకర్షితుడై రాజకీయాల వైపు మళ్లారు.

చిత్రం శీర్షిక కరుణానిధి, అన్నాదురై

జస్టిస్ పార్టీ నాయకుడు, మద్రాస్ ప్రెసిడెన్సీ మాజీ ముఖ్యమంత్రి అయిన ‘పనగల్ కింగ్’ రామరాయానింగార్ గురించి స్కూల్‌లో చదువుకున్న 50 పేజీల పాఠ్య పుస్తకం కరుణానిధికి స్ఫూర్తినిచ్చింది.

టీనేజ్‌లోనే ఉద్యమాల్లోకి వచ్చారు. నాటి మద్రాస్ ప్రెసిడెన్సీలో ‘హిందీ’ పాఠ్యాంశాలు తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నారు.

కరుణానిధి 17 ఏళ్ల వయసులోనే రాజకీయంగా చాలా క్రియాశీలంగా మారారు. ‘తమిళ్ స్టూడెంట్స్ ఫోరమ్’ అనే విద్యార్థుల సంఘాన్ని స్థాపించారు. చేతిరాతతో నడిచే ఒక మేగజీన్‌కు సంపాదకత్వం వహించారు. 1940ల ఆరంభంలో తన గురువు సీఎన్ అన్నాదురైని కలిశారు.

‘పెరియార్’ ఇ.వి.రామసామికి చెందిన ద్రవిడ కళగం(డీకే) నుంచి అన్నాదురై వేరుపడి ద్రవిడ మున్నేట్ర కళగం(డీఎంకే) స్థాపించినప్పుడు ఆయనకు కరుణానిధి చాలా సన్నిహితుడయ్యారు. అప్పటికి ఆయన వయసు పాతికేళ్లే. ఆయనను డీఎంకే ప్రచార కమిటీ సభ్యుడిగా తీసుకున్నారు.

చిత్రం శీర్షిక కరుణానిధి, ఎంజీఆర్

అదే కాలంలో.. తమిళ సినిమా ‘రాజకుమారి’కి మాటల రచయితగా సినిమా రంగంలోకీ ప్రవేశించారు కరుణానిధి. అందులోనూ విజయవంతంగా రాణించారు. ముఖ్యంగా ఆయన రాసే సంభాషణలు ప్రగతిశీలంగా, సామాజిక మార్పును ప్రబోధించేవిగా ఉండేవి.

కరుణానిధి రాసిన శక్తివంతమైన సంభాషణలతో 1952లో విడుదలైన ‘పరాశక్తి’ సినిమా తమిళ సినీ రంగంలో ఒక మైలురాయిగా నిలిచింది. ఆ శక్తివంతమైన సంభాషణలు మూఢనమ్మకాలు, మతవిశ్వాసాలు, ప్రబలంగా ఉన్న సామాజిక అంతరాలపై పదునైన ప్రశ్నలు సంధించాయి.

కల్లాకుడి అనే ప్రాంతం పేరును ‘దాల్మియాపురం’ అని మార్చటాన్ని నిరసిస్తూ జరిగిన ఆందోళనలో పాల్గొన్నందుకు కరుణానిధిని ఆరు నెలలు జైలులో పెట్టారు. ఆ పరిణామంతో పార్టీలో ఆయన శక్తివంతుడిగా ఎదగటం మొదలైంది. తన ఆలోచనలను బలంగా చాటడానికి ఆయన ‘మురసోలి’ వార్తాపత్రికను మళ్లీ ప్రచురించటం ప్రారంభించారు. (ఆ పత్రికే డీఎంకే అధికారిక వార్తాపత్రికగా మారింది.)

మలైక్కల్లన్, మనోహర్ తదితర సినిమాలతో కరుణానిధి.. సినీ సంభాషణల రంగంలో శిఖరాగ్రానికి చేరుకున్నారు.

చిత్రం శీర్షిక అన్నాదురై, ఎంజీఆర్, పెరియార్ రామసామిలతో కరుణానిధి

ఎన్నికల్లో ఓటమి ఎరుగని నాయకుడు

1957 నుంచి కరుణానిధి ఎన్నికల్లో పోటీ చేయటం ప్రారంభించారు. మొదటి ప్రయత్నంలోనే కులిత్తాలై ఎంఎల్‌ఏగా గెలిచారు. చివరిసారిగా 2016లో తిరువారూర్ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచారు. ఆయన స్వస్థలం ఆ నియోజకవర్గం పరిధిలోనే ఉంది. మొత్తంగా 13 ఎన్నికల్లో పోటీచేసిన కరుణానిధి అన్నిసార్లూ గెలిచారు.

1967లో డీఎంకే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినపుడు.. ముఖ్యమంత్రి అన్నాదురై, నెడుంచెళియన్‌ల తర్వాత అత్యంత సీనియర్ మంత్రి కరుణానిధే. మొట్టమొదట డీఎంకే మంత్రివర్గంలో ఆయనకు పబ్లిక్ వర్క్స్, రవాణా మంత్రిత్వశాఖలు అప్పగించారు.

ఆయన రవాణా మంత్రిగా ప్రైవేటు బస్సులను జాతీయం చేశారు. మారుమూల గ్రామాలన్నిటినీ బస్సు సదుపాయంతో అనుసంధానించటం ఆరంభించారు. ఆయన సాధించిన ముఖ్యమైన విజయాల్లో ఇది ఒకటిగా పరిగణిస్తారు.

1969లో ఆయన గురువు అన్నాదురై మరణించినపుడు.. కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు. ఇది తమిళనాడు రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలికింది.

ముఖ్యమంత్రిగా మైలురాళ్లు...

కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యాక ఆ ప్రభుత్వం భూగరిష్ట పరిమితిని 15 ఎకరాలకు తగ్గించింది. విద్య, ఉద్యోగాల్లో వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లను 25 శాతం నుంచి 31 శాతానికి పెంచింది. అన్ని కులాల వారినీ ఆలయాల పూజారులుగా చేయటానికి మార్గం వేస్తూ చట్టం చేసింది.

అన్ని అధికారిక ఉత్సవాలు, స్కూల్ అసెంబ్లీల ఆరంభంలో తమిళ జాతీయగీతం ఆలాపనను ప్రవేశపెట్టింది.

19వ శతాబ్దానికి చెందిన తమిళ నాటక రచయిత ‘మనోన్మణియమ్ సుందరానార్’ రాసిన గేయాన్ని తమిళ జాతీయగీతంగా చేశారు. తల్లిదండ్రుల ఆస్తుల్లో మహిళలకూ సమాన హక్కులు కల్పిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేశారు.

కరుణానిధి హయాంలో రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ సరఫరా పూర్తిగా ఉచితం చేశారు. అత్యంత వెనుకబడిన కులాలు (మోస్ట్ బాక్‌వర్డ్ క్యాస్ట్స్) అనే కొత్త వర్గాన్ని ఆయన సృష్టించారు. ఆ వర్గం వారికి ఉద్యోగాలు, విద్యా రంగాల్లో 20 శాతం రిజర్వేషన్ ఇచ్చారు. ఇది.. వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల వారికి ఇస్తున్న రిజర్వేషన్లకు అదనం.

ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన 19 సంవత్సరాల్లో.. చెన్నైలో మెట్రో రైలు, రూపాయికే కిలో బియ్యం పంపిణీ, స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్, ఉచిత ప్రజా ఆరోగ్య బీమా పథకం, దళితులకు ఉచిత ఇళ్లు, చేతితో లాగే రిక్షాల నిషేధం వంటివి.. చరిత్రాత్మక పరిణామాలు.

కరుణానిధి ‘సమత్తువపురం’ అనే ఒక నమూనా హౌసింగ్ కాలనీ పథకాన్ని ప్రవేశపెట్టారు. అందులో దళితులు, ఇతర కులాల వారు కుల వివక్షలను విడనాడి కలిసి నివసించాలనే షరతుతో ఉచిత ఇళ్లు కేటాయించారు.

రిజర్వేషన్లలో పాత్ర...

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లపై మండల్ కమిషన్ సిఫారసులను వి.పి.సింగ్ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం అమలు చేయటంలో కరుణానిధి రాజకీయంగా కీలక పాత్ర పోషించారు.

అర్థశతాబ్దపు కరుణానిధి నాయకత్వంలో డీఎంకే రెండు సార్లు భారీ చీలికలను చవిచూసింది. తమిళ సినీ హీరో ఎం.జి.రామచంద్రన్.. డీఎంకే నుంచి తన మద్దతుదారులతో చీలిపోయి అన్నా డీఎంకే స్థాపించి ఆ మరుసటి సంవత్సరమే అధికారంలోకి వచ్చారు.

1993లో వైకో సారథ్యంలోని వర్గం డీఎంకే నుంచి విడిపోయి ఎండీఎంకే పార్టీని ఏర్పాటు చేసింది. ఈ చీలిక సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శులు చాలా మంది కొత్త పార్టీలో చేరిపోయారు. ఈ రెండు చీలకల సమయంలోనూ కరుణానిధి పార్టీని తిరిగి బలోపేతం చేసి మళ్లీ అధికారంలోకి రాగలిగారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక వి.పి.సింగ్ సారథ్యంలోని నేషనల్ ఫ్రంట్‌లో తన పార్టీని భాగస్వామిగా చేయటం ద్వారా కరుణానిధి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు

జాతీయ రాజకీయాల్లో..

వి.పి.సింగ్ సారథ్యంలోని నేషనల్ ఫ్రంట్‌లో తన పార్టీని భాగస్వామిగా చేయటం ద్వారా కరుణానిధి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ కూటమి 1989లో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. కరుణానిధి నాయకత్వంలోని డీఎంకే 1989 లోను, తిరిగి 2009లోను, 2014లోను కేంద్ర ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉంది.

ప్రత్యేకించి.. మన్మోహన్‌సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న మొదటి యూపీఏ ప్రభుత్వంలో తమిళనాడు నుంచి 12 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు. టెలికమ్యూనికేషన్స్ శాఖ వంటి కీలక పదవుల డీఎంకేకు లభించాయి. ఏళ్ల తరబడి కేంద్ర ప్రభుత్వంలో నామమాత్రపు ప్రాతినిధ్యం ఉన్నదానితో పోలిస్తే ఇది చాలా గణనీయమైన మార్పు.

కానీ.. కేంద్ర ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉన్నందుకు కరుణానిధి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా.. బీజేపీతో డీఎంకే జట్టు కట్టటం, ఆ తర్వాత బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటంపై రాష్ట్రంలో చాలా వ్యతిరేకత ఎదురైంది.

ప్రభుత్వాల్లోను, పార్టీలోనూ కరుణానిధి కుటుంబ సభ్యుల ప్రాబల్యం కూడా విమర్శలకు కారణమైంది. శ్రీలంకలో అంతర్యుద్ధం చివరి దశల్లో ఉన్న 2009లో అక్కడి తమిళ ప్రజలను కాపాడేలా.. తను భాగస్వామిగా ఉన్న కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవటంలో విఫలమయ్యారన్న విమర్శలనూ కరుణానిధి ఎదుర్కోవాల్సి వచ్చింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక సోనియాతో కరుణానిధి

రాష్ట్రాల స్వయంప్రతిపత్తి కోసం..

భారతదేశంలో రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలని కరుణానిధి ఆది నుంచీ బలంగా వాదించేవారు. ఆ లక్ష్యాన్ని సాధించటానికి క్రియాశీల చర్యలూ చేపట్టారు. ఆయన ప్రభుత్వం 1969లో జస్టిస్ రాజమన్నార్ నేతృత్వంలో కేంద్ర - రాష్ట్ర సంబంధాల పరిశీలన కమిటీని ఏర్పాటు చేసింది.

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎటువంటి సంబంధాలు ఉండాలన్నది ఆ కమిటీ సిఫారసు చేసింది. దేశంలో స్వతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే హక్కు.. కరుణానిధి కృషి వల్లే లభించింది.

చిత్రం శీర్షిక శివాజీ గణేశన్‌తో కరుణానిధి

సినీ, రచనా రంగాల్లో కృషి..

కరుణానిధి 1947 నుంచి 2011 వరకూ దాదాపు 64 సంవత్సరాల పాటు సినిమాలకు సంభాషణలు రాశారు. ఈ విషయంలో మరే రాజకీయ నాయకుడూ ఆయనతో సరితూగరు.

సినిమాలతో పాటు టీవీ సీరియళ్లకు కూడా కరుణానిధి మాటలు రాశారు. ఆయన జబ్బుపడేంతవరకూ కూడా.. మత సంస్కర్త జీవితం మీద తీస్తున్న టెలీ సిరియల్ ‘రామానుజం’ కోసం సంభాషణలు రాస్తున్నారు.

రచయితగా, పాత్రికేయుడిగా కరుణానిధి కృషి అద్భుతమైనది. ఆయన 2 లక్షలకు పైగా పేజీలు రాశారు. ఆయన తన పార్టీ అధికారిక పత్రిక ‘మురసోలి’లో రాస్తున్న ‘ఉదాన్‌పిరప్పి’ (ఓ సోదరుడా...) లేఖల సీరియల్.. ప్రపంచంలో న్యూస్‌పేపర్ సీరియళ్లలో అతి సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న సీరియల్.

ఒక శకం ముగిసింది...

భారతదేశ స్వాతంత్ర్యానికి ముందు రాజకీయ జీవితం ప్రారంభించిన నాయకుల్లో అతికొద్ది మంది మాత్రమే ఇప్పుడు జీవించి ఉన్నారు. అతి అతి కొద్ది మందిలో కరుణానిధి ఒకరు. ఆ విధంగా చూస్తే ఆయన మరణం ఒక శకానికి ముగింపు వంటిది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)