గుజరాత్: బ్రెజిల్‌కు ఆనాడు ఆవుల్ని, ఎద్దుల్ని ఇచ్చి.. ఇప్పుడు వీర్యం అడుగుతోంది

సుమారు ఆరు దశాబ్దాల క్రితం.. 1960ల్లో బ్రెజిల్ నుంచి ఒక రైతు భారతదేశానికి వచ్చారు. గుజరాత్‌లోని గిర్ ప్రాంతం ఆవులు కావాలని ఆనాటి భావనగర్ మహారాజును కోరారు. రైతు కోర్కెను మన్నించిన మహారాజు ఐదు ఆవుల్ని, మూడు ఎద్దుల్ని ఇచ్చారు. ఆ రైతు పేరు సెల్సొ గర్జియా సిడ్. ఆ రాజు పేరు వజ్సుర్ కచర్.
బ్రెజిల్ రైతు వాటిని తమ దేశానికి తీసుకెళ్లాడు. ఐదు ఆవులు, మూడు ఎద్దులు ఆ దేశంలో ‘శ్వేత విప్లవం’ తీసుకొచ్చాయి. స్థానిక హోలిస్టీన్ అని పిలిచే పశు సంపద, భారతీయ గిర్ ఎద్దుల సంపర్కంతో సరికొత్త ఆవు జాతి పుట్టుకొచ్చింది. దానిపేరే గిరోలాండో. ప్రస్తుతం బ్రెజిల్ దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం పాలల్లో 80 శాతం పాలు ఇచ్చేది ఈ గిరోలాండో జాతి ఆవులేనని బ్రెజిలియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ కార్పొరేషన్‌కు చెందిన పరిశోధకుడు మార్కోస్ ద సిల్వ బీబీసీకి చెప్పారు.
నాడు ఆవుల్ని, ఎద్దుల్ని ఇచ్చి.. ఇప్పుడు వీర్యం అడుగుతున్నాం
బ్రెజిల్లో గిర్ జాతి ఆవుల ద్వారా భారీ స్థాయిలో వ్యాపారం జరుగుతోందిప్పుడు. గత 20 ఏళ్లలో అయితే దేశ పాల ఉత్పత్తి సామర్థ్యం నాలుగు రెట్లు పెరిగింది. ఆరోగ్యంగా ఉన్న ఒక్కో ఆవు రోజుకు 60 లీటర్ల వరకూ పాలిస్తోందని స్థానికులు చెబుతున్నారు.
భారతదేశంలో ఇప్పుడు గిర్ జాతి ఆవులు, ఎద్దుల సంఖ్య తగ్గుతోందని గుజరాతీయులు అంటున్నారు. బ్రెజిల్లో గిర్ జాతి సృష్టించిన విప్లవం నేపథ్యంలో గిర్ జాతి పశువుల పట్ల భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఆ దేశం నుంచి వీర్యాన్ని తెచ్చుకోవాలని పలు రాష్ట్రాలు నిర్ణయించాయి.
కానీ, గుజరాతీయులు మాత్రం ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
భావనగర్ మహారాజు నుంచి తీసుకెళ్లిన ఐదు ఆవులు, మూడు ఎద్దులు బ్రెజిల్లో ‘శ్వేత విప్లవం’ తీసుకొచ్చాయి
భారత్‌లో గిర్ జాతిపై ఎందుకంత నిర్లక్ష్యం?
రెండేళ్ల కిందట గుజరాత్ ప్రభుత్వం బ్రెజిల్ నుంచి 10 వేల వీర్యం డోసుల్ని దిగుమతి చేసుకోవాలని నిర్ణయించినట్లు వార్తలు వెలువడటంతో రాష్ట్ర వ్యాప్తంగా అదొక చర్చనీయాంశం అయ్యింది.
గుజరాత్‌కు గర్వకారణంగా భావించే గిర్ ఆవులను బ్రెజిల్ దేశం కాపాడుకున్నంతగా, ఆలనా పాలనా చూసుకున్నంతగా గుజరాత్ రాష్ట్రం చూసుకోలేదు. అందుకే ఆరు దశాబ్దాల తర్వాత బ్రెజిల్ నుంచి గిర్ వీర్యాన్ని తెచ్చుకోవాలని ఆలోచించింది. కేవలం గుజరాత్ మాత్రమే కాదు మరికొన్ని రాష్ట్రాలు కూడా బ్రెజిల్ నుంచి గిర్ జాతి వీర్యం దిగుమతి చేసుకోవాలని చూస్తున్నాయి. వాటిలో హరియాణా ఒకటి.
‘‘బ్రెజిల్లో ఒక్కో ఆవు రోజుకు 60 నుంచి 75 లీటర్ల పాలిస్తోంది. భారతదేశంలో ఆవుల్ని సరిగ్గా పట్టించుకోలేదు. దీంతో భారతీయ ఆవులు ఇప్పుడు ఆ స్థాయిలో పాలు ఇవ్వటంలేదు. అందుకే బ్రెజిల్ సాంకేతికతను అందిపుచ్చుకోవాలని హరియాణా ప్రభుత్వం నిర్ణయించింది. బ్రెజిల్ నుంచి వీర్యం దిగుమతి చేసుకునేందుకు అవసరమైన పత్రాలపై సంతకం చేసింది. ఆ వీర్యాన్ని తెచ్చి హరియాణాలో పాల ఉత్పత్తిని పెంచుతాం’’ అని హరియాణా పశు సంవర్ధక శాఖ మంత్రి ఓం ప్రకాశ్ ధన్కర్ బీబీసీతో అన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
బ్రెజిల్ గిర్ వర్సెస్ గుజరాత్ గిర్
కాగా, ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావటంతో గుజరాత్ ప్రభుత్వం మాత్రం బ్రెజిల్ నుంచి గిర్ వీర్యాన్ని దిగుమతి చేసుకోవటంపై పునరాలోచనలో పడింది.
‘‘బ్రెజిల్ నుంచి గిర్ వీర్యాన్ని దిగుమతి చేసుకోవటంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. దీనిపై గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నాయి’’ అని గుజరాత్ పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ కచియా పటేల్ బీబీసీకి వెల్లడించారు.
బ్రెజిల్ నుంచి వీర్యాన్ని దిగుమతి చేసుకోవాలన్న గుజరాత్ ప్రభుత్వ ఆలోచనను సత్యజిత్ కుమార్ కచర్ వ్యతిరేకిస్తున్నారు. ఈయన 1960ల్లో బ్రెజిల్ రైతుకు ఐదు ఆవులు, మూడు ఎద్దులు ఇచ్చిన భావనగర్ రాజు వజ్సుర్ కచర్ వంశీయుడు.
‘‘ముఖ్యమంత్రి, పశు సంవర్ధక శాఖ మంత్రిని మేం కలిశాం. బ్రెజిల్ నుంచి గిర్ జాతి వీర్యాన్ని దిగుమతి చేసుకోవాలన్న ప్రతిపాదనలు విరమించుకోవాలని కోరాం’’ అని సత్యజిత్ కుమార్ కచర్ బీబీసీకి తెలిపారు.
‘‘గిర్ జాతి ఆవుల గురించి తెలియనివాళ్లే బ్రెజిల్ నుంచి వీర్యం తెచ్చుకోవాలని ఆరాటపడుతున్నారు. అసలు బ్రెజిల్‌కు గిర్ జాతిని ఇచ్చిందే మనం. దాని శుద్ధత గురించి అర్థమైన వాళ్లు, దాని గురించి తెలిసిన వాళ్లు ఎవ్వరూ కూడా బ్రెజిలియన్ గిర్ జాతి వీర్యం తీసుకోవాలని చూడరు. గిర్ జాతి పశువులు గుజరాత్‌కు గర్వకారణం’’ అని గిర్ పెంపకందార్ల సంఘం అధ్యక్షుడు బీకే ఆహిర్ అన్నారు.
ఇవి కూడా చూడండి:
- భారతీయ మహారాజు కానుకగా ఇచ్చిన ఆవులు, ఎద్దులు బ్రెజిల్ దశ మార్చాయి. ఇలా..
- కొడుకులను దాచారని తల్లికి జైలు శిక్ష: తీర్పుపై స్పెయిన్‌లో తీవ్ర వ్యతిరేకత
- భారత్‌లోని చర్చిల్లో కన్ఫెషన్ ప్రక్రియకు తెరపడుతుందా?
- అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్: సెకండ్ హ్యాండ్ పుస్తకాలు అమ్ముకునే స్థాయి నుంచి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎలా అయ్యారు?
- హిందూమతం స్వీకరించి, ఆవుల్ని ఆదుకుంటున్న జర్మన్ మహిళ
- రామేశ్వరం: మందిరమైనా.. మసీదైనా.. లోపలికెళితే ఒకేలా ఉంటాయిక్కడ
- ఎక్కడ ఉంటే ఎక్కువ ఆరోగ్యం? పల్లెల్లోనా, పట్టణాల్లోనా?
- హిందూమతం స్వీకరించి, ఆవుల్ని ఆదుకుంటున్న జర్మన్ మహిళ
- వియత్నాం హిందువులు : ఒకప్పుడు రాజ్యాలు ఏలారు.. ఇప్పుడు కనుమరుగవుతున్నారు
- ప్రాణాలు నిలుపుకోడానికి.. మతం మారుతున్నారు!
- ప్రపంచంలో ‘పవిత్రమైన’ ఏడు మొక్కలు
- టర్కీ: ఇస్లాంను తిరస్కరిస్తున్న యువత
- అస్సాం: ‘అడవుల్ని ఆక్రమిస్తున్న టీ తోటలు’.. మనుషుల్ని చంపుతున్న ఏనుగులు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)