కరుణానిధి కన్నుమూత

కరుణానిధి

ఫొటో సోర్స్, Kalaignar89/facebook

ద్రావిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీ అధ్యక్షుడు.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఇకలేరు. ఆయన మృతి చెందారని కావేరి ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.

94 ఏళ్లు పూర్తయిన కరుణానిధి కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. గత 11 రోజులుగా ఆయన కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆయన చనిపోయిన వార్త ప్రకటించడానికి ముందు తమిళనాడు రాష్ర్ట వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. చెన్నైలోని కావేరి ఆస్పత్రి వద్ద భద్రతాబలగాలను పెద్దఎత్తున మోహరించారు.

‘మరణ వార్త విన్నాక బాధేసింది’: రాష్ట్రపతి

కరుణానిధి మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన ట్విటర్ ఖాతాలో స్పందించారు. ‘కలైంగర్’ పేరుతో అందరికీ ఇష్టుడు కరుణానిధి. ఇలాంటి వ్యక్తులు ప్రజా జీవితంలో చాలా అరుదుగా కనిపిస్తారు’’ అని ట్వీట్ చేశారు.

‘సీనియర్ మోస్ట్ నాయకుడిని కోల్పోయాం’: ప్రధాని మోదీ

కరుణానిధి మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. భారతదేశంలో ఒక సీనియర్ నాయకుడు కరుణానిధి అని ప్రధాని ట్వీట్ చేశారు.

‘అంత్యక్రియల్లో కేసీఆర్ పాల్గొంటారు’: తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం

కరుణానిధి మృతి పట్ల కేసీఆర్ సంతాపం తెలిపినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా.. ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ కరుణానిధి అంత్యక్రియల్లో పాల్గొంటారు. బుధవారం చెన్నైకు బయలుదేరి, తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున కరుణానిధికి నివాళులు అర్పిస్తారు’’ అని తెలిపింది.

‘ఇది కరుణానిధి శకం’: చంద్రబాబు

తాను నమ్మిన సిద్ధాంతాలను నిజ జీవితంలో ఆచరించిన ఆయన జీవితకాలం తమిళనాట కరుణానిధి శకంగా మిగిలిపోతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ట్విటర్ ఖాతాలో స్పందించారు.

రజనీ కాంత్ స్పందిస్తూ.. ‘‘ఇది నా జీవితంలో చీకటి రోజు.. ఈరోజును నేను ఎప్పుడూ మరచిపోలేను’’ అని తమళంలో ట్వీట్ చేశారు.

తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ట్విటర్ వేదికగా కరుణానిధి మృతి పట్ల సంతాపం తెలిపారు. ‘ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నా’ అని ట్వీట్ చేశారు.

‘భారత్ గొప్ప బిడ్డను కోల్పోయింది’: రాహుల్

‘తమిళ రాజకీయాల్లో 6 దశాబ్దాల ప్రయాణంలో తనదైన ముద్ర వేసిన కరుణానిధిని.. తమిళ ప్రజలు ఎంతగానో ప్రేమించారు. తమ అభిమాన నాయకుడిని కోల్పోయిన లక్షలాది మంది అభిమానులకు నా సానుభూతి తెలుపుతున్నా’ అని రాహుల్ ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, Kauvery Hospital

ఫొటో క్యాప్షన్,

కరుణానిధి చనిపోయారని ధృవీకరిస్తూ కావేరి ఆస్పత్రి విడుదల చేసిన ప్రకటన

ముత్తువేల్ కరుణానిధి 1924 జూన్ 3వ తేదీన తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు.

ఆయనకు చిన్నప్పటి నుంచే రచనలపై ఆసక్తి పెరిగింది. జస్టిస్ పార్టీ నాయకుల్లో ఒకరైన అళగిరిసామి ప్రసంగాలకు ఆకర్షితుడై రాజకీయాల వైపు మళ్లారు.

‘భారతదేశ స్వాతంత్ర్యానికి ముందు రాజకీయ జీవితం ప్రారంభించిన నాయకుల్లో అతికొద్ది మంది మాత్రమే ఇప్పుడు జీవించి ఉన్నారు. కొన్ని క్షణాల క్రితం వరకూ కరుణ కూడా వారిలో ఒకరు. ఆ విధంగా చూస్తే ఆయన మరణం ఒక శకానికి ముగింపు వంటిది’ అని బీబీసీ తమిళ ప్రతినిధి మురళీధరన్ కాశీవిశ్వనాథన్ అభిప్రాయపడ్డారు.

కరుణ ఐదుసార్లు రాష్ట్ర ముఖ్యముంత్రిగా పని చేశారని, ఆరు దశాబ్దాలకు పైగా శాసనసభ్యుడిగా ఉన్నారని, వ్యక్తిగతంగా ఎన్నడూ ఓటమి చవిచూడలేదని మురళీధరన్ చెప్పారు.

వీడియో క్యాప్షన్,

వీడియో: కరుణానిధి జీవితంలో అరుదైన ఘట్టాలు..

గత కొన్ని రోజులుగా కరుణానిధి ఆరోగ్యం క్షీణించింది. ఆయన నివాసంలోనే వైద్యులు చికిత్స అందించారు. ఆ తర్వాత చెన్నైలోని కావేరీ హాస్పిటల్‌కు కరుణను తరలించి, ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు.

గత రెండేళ్లుగా ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. ఆయన కుమారుడు, రాజకీయ వారసుడు అయిన స్టాలిన్.. 2017లో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు.

డీఎంకే వ్యవస్థాపకులు అన్నాదురై మరణానంతరం.. 1969లో కరుణానిధి మొదటిసారి తమిళనాడుకు ముఖ్యమంత్రి అయ్యారు. మరణించే సమయానికి.. తిరువవూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కరుణానిధి ఉన్నారు.

ఫొటో క్యాప్షన్,

కొద్ది రోజుల కిందట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధిని పరామర్శించిన వెంకయ్యనాయుడు (పాత చిత్రం)

కరుణానిధికి సంబంధించిన అరుదైన విషయాలు

సీఎంలకు పంద్రాగస్టున జెండా ఎగురేసే హక్కు కరుణ వల్లే దక్కింది.

కరుణానిధి 2 లక్షలకు పైగా పేజీలు రాశారు.

ఆయన తన పార్టీ అధికారిక పత్రిక ‘మురసోలి’లో రాస్తున్న ‘ఉదాన్‌పిరప్పి’ (ఓ సోదరుడా...) లేఖల సీరియల్.. ప్రపంచంలో న్యూస్‌పేపర్ సీరియళ్లలో అతి సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న సీరియల్.

ఎన్నికల్లో వ్యక్తిగతంగా ఓటమి ఎరుగని నాయకుడు కరుణానిధి

కరుణానిధి 1947 నుంచి 2011 వరకూ దాదాపు 64 సంవత్సరాల పాటు సినిమాలకు సంభాషణలు రాశారు.

భారతదేశ స్వాతంత్ర్యానికి ముందు రాజకీయ జీవితం ప్రారంభించిన నాయకుల్లో కరుణ ఒకరు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)