విశాఖకు రైల్వే జోన్: ఈ జోన్‌ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

  • 31 జూలై 2018
రైలు ప్రయాణికురాలు Image copyright Getty Images

ఆంధ్ర రాష్ట్రానికి కొత్త రైల్వే జోన్ వివాదం వేడెక్కింది. రైల్వే జోన్ తప్పకుండా వస్తుంది అని రాజ్యసభలో రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించడంతో కొత్త ఆశలు మొదలయ్యాయి. అంతలోనే హోంశాఖ సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్‌తో గందరగోళం ఏర్పడింది.

అఫిడవిట్‌ను వక్రీకరించారని, రాజ్‌నాథ్ చెప్పిందే జరుగుతుందని బీజేపీ అంటోంది. అఫిడవిట్‌పై పోరాడతామని ప్రతిపక్షాలు అంటున్నాయి.

అసలు విశాఖ రైల్వే జోన్ రావాలంటే ఏం జరగాలి?

విశాఖ డివిజన్‌ను దక్షిణ మధ్య రైల్వేలో కలపాలన్న డిమాండ్.. ఇప్పుడు ప్రత్యేక జోన్‌గా ఎలా మారింది?

అసలు జోన్ వస్తే ఎవరికి ఏం లాభం? జోన్ విశాఖ కేంద్రంగా ఉంటే ఉపయోగకరమా? లేక విజయవాడ కేంద్రంగా ఉంటే మేలా?

ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ విశ్లేషణాత్మక కథనంలో..

ఈ డిమాండ్ ఎందుకు వచ్చింది?

విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్‌ను దక్షిణ మధ్య రైల్వేలో కలపాలన్న డిమాండ్ ఉండేది. దానికి కారణం వాల్తేరు డివిజన్ భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పుతీర(ఈస్ట్ కోస్) రైల్వేలో ఉండడం వల్ల విశాఖ నగరానికి ప్రాధాన్యత దక్కకపోవడం.. రైళ్లలోని సీట్ల కోటా తగ్గిపోవడం, అన్ని రైళ్లూ భువనేశ్వర్ నుంచి మొదలై, భువనేశ్వర్ వరకూ నడవడం వంటి సమస్యలు.

ఆంధ్ర, తెలంగాణల్లోని ఏదైనా ప్రాంతం నుంచి ఉత్తరాంధ్రకు రైలు వేయాలంటే భువనేశ్వర్ నుంచి అనుమతులు రావాల్సి వచ్చేది. దీంతో ఆ డివిజన్‌ను సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వేలో కలపాలన్న డిమాండ్ ఉండేది.

Image copyright Getty Images

2014 రాష్ట్ర విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త జోన్ ఏర్పాటు ప్రస్తావన ఉంది. ఆ చట్టం 13వ షెడ్యూల్‌లో మౌలిక వసతుల ఉప శీర్షిక కింద 7వ పాయింట్లో.. "కొత్తగా ఏర్పడే ఆంధ్ర రాష్ట్రంలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటును భారతీయ రైల్వే పరిశీలించాలి" అని పేర్కొన్నారు.

విశాఖపట్నం (వాల్తేరు) డివిజన్ కేంద్రాన్ని దక్షిణ మధ్య రైల్వేలో కలపాలన్న ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో.. విశాఖ కేంద్రంగా కొత్త జోన్ పెట్టాలనే డిమాండ్ రావడం, ముఖ్యమంత్రి చంద్రబాబు దాన్ని సమర్థిస్తూ ప్రకటనలు చేయడం, ఉత్తరాంధ్ర ఎంపీలు ఆ విషయాన్ని ప్రత్యేకంగా తీసుకోవడంతో విశాఖ డివిజన్ విలీనం డిమాండు కాస్తా 'విశాఖ జోన్' ఏర్పాటు డిమాండుగా మారింది.

Image copyright Getty Images

కొత్త జోన్ ఏర్పాటుపై అనేక అనుమానాలు వస్తోన్న సమయంలో, విభజన హామీలపై చర్చ సందర్భంగా ఇటీవల రాజ్యసభలో రాజనాథ్ సింగ్ ఒక ప్రకటన చేశారు. "రైల్వే జోనుకు సంబంధించి క‌మిటీ సిఫారసులు వ్య‌తిరేకంగా ఉన్నాయి. అందుకే ఈ విష‌యాన్ని మేం మ‌ళ్ళీ ప‌రిశీలిస్తున్నాం. మేం అనుకుంటే దాన్ని వ‌దిలేయ‌వ‌చ్చు కూడా. కానీ మేం మాట నిల‌బెట్టుకోవాల‌నుకుంటున్నాం. అందుకే మ‌ళ్లీ ప‌రిశీలించాల‌ని క‌మిటీకి చెప్పాం. క‌చ్చితంగా జోన్ ఏర్పాటు చేస్తామ‌ని మాకు న‌మ్మ‌కం ఉంది. అక్క‌డ జోన్ ఏర్పాటు చేసితీరుతాం" అన్నారు.

దాంతో జోన్ కోసం పోరాడుతున్న వారిలో ఆశలు చిగురించాయి. కానీ ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. మూడు రోజుల తర్వాత కేంద్ర హోంశాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో 'జోన్ ఏర్పాటు చేయడం కష్టం' అనే అర్థం వచ్చేలా పేర్కొంది. "జోన్ నిర్వహణ యోగ్యం కాదు కాబట్టి.. దాన్ని ఏర్పాటు చేయడం చాలా కష్టం" అని ఆ అఫిడవిట్‌లో తెలిపారు.

ఇప్పుడు గొడవంతా రాజనాథ్ ప్రకటన, ఈ అఫిడవిట్ చుట్టూ తిరుగుతోంది.

నిజంగా నిపుణులు ఇచ్చే నివేదికలకు రైల్వేలో అంత విలువ ఉంటుందా? లోతుగా పరిశీలిస్తే అసలు సంగతులు వేరే ఉన్నాయి.

Image copyright Getty Images

రాజకీయమే ముఖ్యం

రైల్వేకి సంబంధించిన కీలక నిర్ణయాలు రాజకీయపరమైన ఒత్తిళ్లతోనే సాధ్యపడతాయనేది బహిరంగ రహస్యం.

1996 తర్వాత కొత్తగా 8 రైల్వే జోన్లు ఏర్పాటు చేశారు. రాం విలాస్ పాశ్వాన్ రైల్వే మంత్రిగా ఉండగా తన సొంత నియోజకవర్గం హాజీపూర్ కేంద్రంగా తూర్పు మధ్య రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నారు. మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు కోల్‌కతా మెట్రో (లోకల్ ట్రైన్స్ - హైదరాబాద్ ఎంఎంటీఎస్ వంటిది)కి ఒక జోన్ హోదా ఇప్పించారు. దీంతో కోల్‌కతా కేంద్రంగా మూడు రైల్వే జోన్లు వచ్చాయి. ఇదే అంశంపై రైల్వేలకు సంబంధించి పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ఉన్నతాధికారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "మోదీ తలచుకుని జోన్ ఇవ్వాలని అనుకుంటే తప్ప ఏపీకి జోన్ రాదు. రైల్వేకి సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ ప్రధాని కార్యలయమే తీసుకుంటోంది. ఇప్పటి వరకు ఏపీకి ప్రత్యేక జోన్ గురించి ప్రధాని కార్యాలయం నుంచి ఎలాంటి సమాచారం లేదు..’’ అని అని ఆ అధికారి వివరించారు.

కొత్త జోన్ల ఏర్పాటు ముమ్మాటికీ రాజకీయ నిర్ణయమే అంటున్నారు రైల్వే యూనియన్ నాయకులు. "జోన్ల ఏర్పాటు అనేది ఎప్పుడూ మంత్రివర్గ ఆమోదంతో జరగలేదు. అది కేవలం రైల్వే మంత్రి నిర్ణయం మేరకు జరిగిపోతుంది" అన్నారు దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శంకర రావు.

"కొత్త జోన్ విశాఖ వారి ఆకాంక్ష. చాలా జోన్లను రాజకీయ ప్రాతిపదిక మీదనే ఏర్పాటు చేశారు. పాశ్వాన్, నితీశ్ ఉన్నప్పుడు అలాగే జరిగాయి" అని శంకర రావు వ్యాఖ్యానించారు.

Image copyright Getty Images

జోన్‌తో వచ్చే ప్రయోజనాలేంటి?

రాష్ట్రంలో కొత్త రైల్వే జోన్ వస్తే అద్భుతాలేమీ జరగవు. కానీ కచ్చితంగా ఎంతో కొంత మేలు ఉంటుందనేది ఎక్కువ మంది నిపుణుల అభిప్రాయం.

"జోన్ వల్ల విశాఖకు మంచి జరుగుతుంది. ఎందుకంటే, తూర్పు తీర రైల్వేలో ఉండడం వల్ల విశాఖ అభివృద్ధి కావడం లేదు. విశాఖ నుంచి కొత్త రైలు వేయాలని అడిగితే వారు ఒప్పుకోకుండా.. భువనేశ్వర్ నుంచి వేయాలంటున్నారు. మరో విషయం విశాఖ ఎక్కువ ఆదాయం తెచ్చే డివిజన్. ఏడాదికి రూ. 4,500 కోట్ల ఆదాయం వస్తోంది. భారతీయ రైల్వేలో అత్యధిక ఆదాయం తెచ్చే డివిజన్లలో విశాఖ రెండు లేదా మూడో స్థానంలో ఉంది. విశాఖ కేంద్రంగా జోన్ వల్ల ప్రజల ఆకాంక్షలు తీర్చినట్టు అవుతుంది. ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది" అని శంకర రావు అభిప్రాయపడ్డారు.

అయితే కొత్త జోన్ రావడం వల్ల స్థానికులకు కొత్తగా ఉద్యోగ అవకాశాలు పెరగవు. ఎందుకుంటే రైల్వేలో నియామకాలు జాతీయ స్థాయిలోనే జరుగుతాయి. ఏ రాష్ట్రం వారు ఎక్కడైనా ఉద్యోగం చేయవచ్చు. కానీ పరోక్షంగా ఉపాధి కోద్దిగా పెరిగే అవకాశం ఉంది.

ఇక జోన్ల వారీగా నిధులు కేటాయించే పద్ధతి కూడా రైల్వేలో లేదు. ఫలానా జోన్ ఇంత ఆదాయం తెచ్చిపెట్టింది కాబట్టి, ఇంత మొత్తం నిధులు ఇవ్వాలని లేదు. కేంద్రం నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది. కాకపోతే జనరల్ మేనేజర్ పరిధిలో కొన్ని నిధులు ఉంటాయి. స్టేషన్ల అభివృద్ధికి వాటిని వినియోగించవచ్చు. అలాగే కొత్త రైళ్ల విషయంలో జీఎంల సిఫారసులు ఉంటాయి.

Image copyright Getty Images

విశాఖా? విజయవాడా?

రాష్ట్ర విభజన తర్వాత కొత్త జోన్ వస్తే విజయవాడ లేదా గుంటూరులోనే అనుకున్నారు చాలా మంది రైల్వే ఉద్యోగులు. కానీ అనూహ్యంగా డిమండ్ విశాఖ వైపు మళ్లింది. అయితే.. జోన్ ప్రధాన కార్యాలయం రాష్ట్ర రాజధానిలోనే ఉండడం వల్ల ఎక్కువ లాభాలు ఉంటాయనేది ఒక సీనియర్ రైల్వే ఉద్యోగి మాట.

"జోన్ రాజధాని దగ్గర ఉంటే జనరల్ మేనేజర్ పని సులువు అవుతుంది. రాష్ట్రం నుంచి రవాణా మంత్రి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉంటాడు. రవాణా మంత్రి, ముఖ్యమంత్రులతో చర్చలు జరపడం సులువవుతుంది. అలాగే జోన్‌కి మధ్యలో ఉంటే ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే అక్కడకు వెళ్లే వెసులుబాటు ఉంటుంది. అలా కాకుండా ఒక మూలన ప్రధాన కార్యాలయం ఉంటే కష్టం. అలా అని ఇప్పుడు మేం చెబితే వినరు. పైగా ఉద్యోగులకు ఎక్కడైనా ఒకటే. ఒకసారి హైదరాబాద్ వదలాలి అనుకున్నప్పుడు ఏ ఊరైనా ఒకటే కదా" అని ఆ ఉద్యోగి వ్యాఖ్యానించారు.

విశాఖ- విజయవాడల విషయంలో దేని అనుకూలత దానికున్నాయి. అలాగే ప్రతికూలతలూ కొన్ని ఉన్నాయి.

దేశంలోనే అతిపెద్ద రైల్వే జంక్షన్లలో విజయవాడ ఒకటి. ఒక జోనల్ ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు కావాల్సిన మౌలిక వసతులు ఇక్కడున్నాయి. రాయలసీమకు కూడా దగ్గర అవుతుంది. విశాఖలో కూడా వందల ఎకరాలు రైల్వే స్థలాలు ఉన్నాయి.

Image copyright facebook

ఆంధ్ర - తెలంగాణ పక్కాగా చెరో జోన్‌లో ఉంటాయా?

మొదట్లో రైల్వే జోన్లను రాష్ట్రాలు, ప్రాంతాలు, భాషల వారీగా కాకుండా ట్రాక్/రూట్ వారీగా అవసరం కోసం విభజించారు. తర్వాత మెల్లిగా రాజకీయాలు ప్రవేశించాక నాయకుల ఆసక్తులను బట్టి జోన్లు ఏర్పాటు అవుతూ వచ్చాయి. ఇప్పటికీ ఈ జోన్ పరిధిలో ఈ రాష్ట్రం మాత్రమే వస్తుందని కానీ, ఈ రాష్ట్రం మొత్తం ఈ జోన్‌లోనే ఉంటుందని కానీ స్పష్టంగా చెప్పలేం. ప్రస్తుతం ఉత్తరాంధ్ర ప్రాంతం తూర్పు తీర రైల్వే పరిధిలో ఉండగా, మిగిలిన ఆంధ్రా, తెలంగాణలు దక్షిణ మధ్య రైల్వేలో ఉన్నాయి.

దక్షిణ మధ్య రైల్వే 1966లో ఏర్పాటైంది. అప్పట్లో హుబ్లి, విజయవాడ డివిజన్లను దక్షిణ రైల్వే నుంచి, షోలాపూర్, సికింద్రాబాద్ డివిజన్లను మధ్య(సెంట్రల్) రైల్వే నుంచి తీసుకొచ్చి ఈ జోన్ ఏర్పాటు చేశారు. తర్వాత 1977లో షోలాపూర్‌ని తిరిగి మధ్య రైల్వేలో చేర్చి, దక్షిణ రైల్వే నుంచి గుంతకల్లును తీసి దక్షిణ మధ్య రైల్వేలో కలిపారు.

తరువాత సికింద్రాబాద్ డివిజన్ నుంచి కొన్ని భాగాలు తీసి 1978లో హైదరాబాద్ డివిజన్‌ను, తరువాత 1998-2003 మధ్య నాందేడ్, గుంటూరు డివిజన్లనూ ఏర్పాటు చేశారు. హుబ్లి డివిజన్‌ను కొత్తగా ఏర్పాటు చేసిన నైఋతి రైల్వేలో కలిపారు.

ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు ఉన్నాయి.

తూర్పు తీర(ఈస్ట్ కోస్ట్) రైల్వే జోన్ 1996లో ప్రారంభమైంది. 2003 నుంచి పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభించింది. ఇందులో ఒడిశాలోని సంబల్ పూర్, ఖుర్దా రోడ్, ఆంధ్రప్రదేశ్‌లోని వాల్తేరు డివిజన్లున్నాయి.

Image copyright Getty Images

రైల్వే నిర్మాణం - తెలుగు రాష్ట్రాల పరిధిలోకి వచ్చే వివిధ రైల్వే డివిజన్లు

(ట్రాకులు, లైన్లు, సెక్షన్లు కాకుండా ప్రాంతాల పేర్లు ఇచ్చాం)

రైల్వే శాఖ కింద రైల్వే బోర్డు ఉంటుంది. బోర్డు కింద జోన్లు ఉంటాయి. జోన్లను డివిజన్లుగా విభజించారు. ప్రస్తుతం భారతీయ రైల్వేలో 17 జోన్లు, 73 డివిజన్లు ఉన్నాయి.

ఒక జోన్‌లో కనీసం 3 డివిజన్లు ఉండాలి. రెండు పెద్ద స్టేషన్ల మధ్య ట్రాక్‌ని సెక్షన్ అంటారు. రూటు, స్టేషన్ల వారీగా డివిజన్ సరిహద్దులు ఉంటాయి. డివిజన్‌ను డివిజనల్ రైల్వే మేనేజర్ (డిఆర్ఎం), జోన్‌ను జనరల్ మేనేజర్ (జిఎం) చూస్తారు. రైల్వే బోర్డు సభ్యులు, చైర్మన్ మొత్తం యాజమాన్యం చూస్తారు.


డివిజన్ పేరు ఏర్పాటు పరిధి
విజయవాడ 1956లో చెన్నై కేంద్రంగా ఉన్న దక్షిణ రైల్వేలో భాగంగా ఏర్పాటు చేశారు.1966లో సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో కలిపారు. విజయవాడ, ఏలూరు, సామర్లకోట దువ్వాడ, గుడివాడ, మచిలీపట్నం, భీమవరం, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, కృష్ణపట్నం
గుంటూరు 1997లో ఏర్పాటైంది. 2003 నుంచి పూర్తి స్థాయిలో పనిచేస్తోంది. యాదాద్రి, నల్గొండ జిల్లాల్లోని భాగాలు, ఆంధ్రలోని గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాలోని భాగాలు.ఆంధ్రలో 484 కి.మీ ఉండగా, తెలంగాణలో 144 కిమీ లైను ఉంది.
హైదరాబాద్ 1978లో ఏర్పాటైంది. గద్వాల, కర్నూల్, డోన్, రాయచూర్ నిజామాబాద్, బోధన్ వంటి ప్రాంతాలుంటాయి.
సికింద్రాబాద్ నిజాం రైల్వే నుంచి భారతీయ రైల్వేకు మారినప్పటి నుంచీ ప్రత్యేక డివిజన్ గా ఉంది. సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, బల్లార్ష, జగిత్యాల, బీబీనగర్, డోర్నకల్, సింగరేణి, వికారాబాద్, మణుగూరు.
గుంతకల్లు 1956లో దక్షిణ రైల్వేలో భాగంగా ఏర్పాటు చేయగా, 1977లో దక్షిణ మధ్య రైల్వేలో కలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడులోని ప్రాంతాలు కూడా ఉన్నాయి.ఆంధ్రలో 1302 కి.మీ, కర్ణాటకలో 142 కి.మీ, తమిళనాడులో 7 కి.మీ లైన్ ఉంది.గుత్తి, రేణిగుంట, ఎర్రగుంట్ల, గుంతకల్లు, ఆదోని, తిరుపతి, కడప స్టేషన్లు కూడా ఈ డివిజన్ పరిధిలోనివే.
వాల్తేరు(వాల్తేరు విశాఖలోని ఒక ప్రాంతం. విశాఖ డివిజన్‌గా పేరు మార్చాలనే డిమాండ్ ఉంది.) 1952 వరకూ బెంగాల్- నాగ్‌పూర్ రైల్వేలో భాగంగా ఉండేది, తరువాత తూర్పు రైల్వేలో భాగం అయింది.1955లో ఆగ్నేయ రైల్వేలో కలిసింది.తిరిగి 2003లో తూర్పు తీర రైల్వేలో కలిపారు. విశాఖపట్నం, పలాస, విజయనగరం, కొత్తవలస, రాయగడ, కోరాపుట్, బొబ్బిలి వంటి ప్రాంతాలుంటాయి.ఆంధ్రతో పాటూ ఒడిశా, చత్తీస్‌గఢ్ ప్రాంతాలు కూడా ఈ డివిజన్‌లో ఉన్నాయి.

Image copyright Getty Images

డివిజన్ల సరిహద్దులు ఎలా?

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారికి వాల్తేరు, గుంతకల్లు, విజయవాడ, గుంటూరు ప్రాంతాలతో కూడిన జోన్ కావాలి. అప్పుడు సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్‌ డివిజన్లు మిగులుతాయి.

కానీ పైన పేర్కొన్న వివరాల ప్రకారం చూస్తే పక్కాగా ఒక జోన్‌లో ఆంధ్రప్రదేశ్, ఒక జోన్‌లో తెలంగాణ ఉండదు. అలా కావాలంటే డివిజన్ల సరిహద్దులు మార్చాల్సి వస్తుంది.

• గుంటూరు డివిజన్‌ తెలంగాణలోని మిర్యాలగూడ వరకూ ఉంటుంది. కర్నూలు హైదరాబాద్ డివిజన్‌లో ఉంటుంది. ఒడిశా, మధ్య ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు వాల్తేరు డివిజన్‌లో ఉంటాయి. పక్కాగా రాష్ట్ర సరిహద్దుల ప్రకారమే కావాలంటే ఇవన్నీ మార్చాలి. దాన్ని కేంద్రం ఎంత వరకూ ఒప్పుకుంటుందో తెలీదు.

• వాల్తేరు డివిజన్‌ను తూర్పు తీర రైల్వే నుంచి తొలగించడాన్ని ఒడిశా వ్యతిరేకిస్తోంది. ఒకవేళ ఈ డివిజన్‌ను కొత్త జోన్‌లో కలిపితే తూర్పు తీర రైల్వేకు మరో కొత్త డివిజన్ ఇవ్వాలి. అంటే ఆగ్నేయ మధ్య రైల్వే లేదా తూర్పు రైల్వేల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. లేదా మరో కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలి.

• ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో ఉన్న నాందేడ్ డివిజన్‌ను మధ్య రైల్వేలో కలపాలని శివసేన డిమాండ్ చేస్తోంది. కానీ ఈ డిమాండ్ అంత తీవ్రంగా లేదు.

ప్రస్తుతానికి ఆంధ్రులను సంతృప్తి పరచడం కోసం డివిజన్ల సరిహద్దులు మార్చకుండా కేవలం జోన్ల ఏర్పాటుకే పరిమితమవుతుందా? లేక రాష్ట్రాల సరిహద్దుల ప్రకారం డివిజన్ల సరిహద్దులూ మారుస్తుందా? అసలు కొత్త జోన్ ఇస్తారా? ఇవ్వరా? అనే ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు