‘తిలక్ ఇంకొన్నాళ్లు బతికుంటే భారత్-పాకిస్తాన్‌లు విడిపోయేవి కాదు’

ఫొటో సోర్స్, PIB
భారత స్వతంత్ర పోరాట హీరోల్లో ఒకరిగా పేరున్న బాలగంగాధర్ తిలక్ జయంతి నేడు. తిలక్ 1856 జూలై 23న జన్మించారు. 1920 ఆగస్ట్ 1న తుదిశ్వాస విడిచారు. మహాత్మాగాంధీకి ముందు అంతటి పేరున్న జాతీయ స్థాయి నేత తిలక్ అని చాలామంది భావిస్తారు. తిలక్ ఈ తరానికి చెందిన అత్యుత్తమ జననేత అని ఆయనకు శ్రద్ధాంజలి ఘటించే సమయంలో స్వయంగా మహాత్మాగాంధీనే అన్నారు.
కానీ ప్రస్తుతం రాజకీయ నేతలు, పార్టీలు ఆయనకు దూరమవుతున్నట్లు కనిపిస్తోంది. తిలక్ రాజద్రోహానికి పాల్పడినట్లు కూడా కొందరు ఆరోపిస్తారు.
నిజంగా తిలక్ హిందూవాద నాయకుడా?
తిలక్‌ను హిందూవాద నేతగా పేర్కొనడం చాలా బాధాకరమని ‘100 ఇయర్స్ ఆఫ్ తిలక్-జిన్నా ప్యాక్ట్’ పుస్తక రచయిత సుధీంద్ర కులకర్ణి అంటున్నారు.
‘తిలక్ హిందుత్వ భావజాలానికి పెద్ద అభిమాని కాదు. వామపక్షాలు ఆయన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాయి.
భారత్‌లో హిందువుల జనాభా చాలా ఎక్కువ. అందుకే వినాయక చవితి, శివాజీ జయంతిలను ఘనంగా జరపడం ద్వారా ప్రజలందరినీ ఒక్కటి చేసి బ్రిటిష్ రాజ్యానికి వ్యతిరేకంగా వారిని సంఘటితం చేయాలని ఆయన భావించారు.
అంతే తప్ప, అది ముస్లిం వ్యతిరేకత నుంచి పుట్టిన ఆలోచన ఎంతమాత్రం కాదు.
మొహర్రం లాంటి కార్యక్రమాల్లో కూడా తిలక్ పాల్గొన్నారు. లఖ్‌నవూలో జరిగిన సభలో మాట్లాడుతూ బ్రిటిష్ పాలనను అంతమొందించడమే తన లక్ష్యమని తిలక్ చెప్పారు. ఆ క్రమంలో అధికారం ముస్లింల చేతుల్లోకి వెళ్లినా తనకేం అభ్యంతరం లేదని, వాళ్లు కూడా మనవాళ్లేనని ఆయన అన్నారు. అలాంటి వ్యక్తిపై హిందూవాది అన్న ముద్ర వేయడం తప్పు’ అని సుధీంద్ర అభిప్రాయపడ్డారు.
ఫొటో సోర్స్, Getty Images
బాలగంగాధర్ తిలక్ 1908 నుంచి 1914వరకు మాండలే(ప్రస్తుత మయన్మార్) జైల్లో రాజద్రోహానికి సంబంధించిన కేసులో శిక్ష అనుభవించారు.
ఇద్దరు యూరోపియన్ మహిళల హత్యకు కారణమయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విప్లవకారులు ఖుదీరాం బోస్, ప్రఫుల్ చాకీలకు అనుకూలంగా తిలక్ తన పత్రిక ‘కేసరి’లో కథనం రాయడంతో పాటు, వెంటనే స్వరాజ్యం ప్రకటించాలని కూడా కోరారు.
దాంతో ఆయనపై రాజద్రోహానికి పాల్పడుతున్నారనే అభియోగాలు నమోదయ్యాయి. దిన్షా దావర్ అనే పార్సీ జడ్జి ఈ కేసును విచారించారు. ఆ సమయంలో న్యాయవాదిగా ఉన్న మహమ్మద్ అలీ జిన్నా, తిలక్ తరఫున బలంగా వాదించారు. ఆయన ఎలాంటి తప్పూ చేయలేదని నిరూపించే ప్రయత్నం చేశారు.
కానీ జిన్నా ప్రయత్నం ఫలించలేదు. దిన్షా తిలక్‌కు ఆరేళ్ల జైలు శిక్ష విధించారు.
‘చాలామంది మహనీయులలానే తిలక్‌కు కూడా జీవితంలో ఎదురైన ఎన్నో అనుభవాలు ఆయన ఆలోచనలను మార్చేశాయి. జైలు శిక్షను అనుభవించడానికి ముందున్న తిలక్ వేరు, తరువాతి తిలక్ వేరు. జైలు నుంచి బయటకు వచ్చాక ఆయన ఆలోచనలూ, రాజకీయ ప్రణాళికలూ మారిపోయాయి’ అని సుధీంద్ర తెలిపారు.
ఫొటో సోర్స్, Hulton Archive
జిన్నా ఇంటి నుంచి బయటకు వస్తున్న గాంధీ
‘ఆయన బతికుంటే పరిస్థితి మరోలా ఉండేది’
బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం పొందిన 70 ఏళ్ల తరవాత కూడా భారత్-పాక్‌లు విభజన తాలూకు సమస్యల్ని అనుభవిస్తూనే ఉన్నాయి.
అదే లోకమాన్య తిలక్ మరి కొన్నాళ్లు బతికుండి ఉంటే భారత భవిష్యత్తు మరోలా ఉండేదని సుధీంద్ర కులకర్ణి అన్నారు.
‘తిలక్ ఇంకొన్నాళ్లు జీవించి ఉంటే భారతదేశం విభజన తాలూకు గాయాల నుంచి తప్పించుకొని ఉండేది. దానికి కారణం 1916లో జరిగిన తిలక్-జిన్నా ఒప్పందమే. అందులో హిందూ-ముస్లింల ఐక్యత, రాజకీయాల్లో రెండు వర్గాల భాగస్వామ్యం గురించి కొన్నిసూత్రాలను రూపొందించారు. ఆ సూత్రాలు అమలై ఉంటే భారత్-పాక్‌లు విడిపోయి ఉండేవి కాదు. ఒకవేళ విడిపోయినా భారత్‌కు ఇన్ని సమస్యలు తలెత్తేవి కావు’ అని సుధీంద్ర అన్నారు.
జిన్నా.. తిలక్‌కు దగ్గర, గాంధీకి దూరం
జిన్నాను చాలామంది ముస్లిం నాయకుడిగానే చూస్తారు. కానీ, జిన్నా తనను తాను ఎప్పుడూ కేవలం ముస్లిం నాయకుడిగా భావించలేదని సుధీంద్ర అంటారు.
‘మతాన్ని రాజకీయాల్లోకి తీసుకురావాలని జిన్నా అనుకోలేదు. అందుకే, గాంధీ ఖిలాఫత్ ఆందోళనకు మద్దతివ్వడానికి ఆయన ముందుకు రాలేదు.
కానీ, ఇదే జిన్నా తిలక్ చివరి రోజుల్లో ఆయనకు చాలా దగ్గరయ్యారు. ఇద్దరూ కలిసి రాజకీయాల్లో హిందూ-ముస్లిం భాగస్వామ్యం గురించి కొన్ని సూత్రాలను రూపొందించారు. కానీ 1920లో తిలక్ చనిపోయాక, జిన్నా క్రమంగా కాంగ్రెస్ రాజకీయాలకు దూరమవుతూ వచ్చారు.
ఇవి కూడా చదవండి
- BBC Special: విశాఖ రైల్వే జోన్ వస్తుందా, రాదా? వస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటి?
- బంగారం, వజ్రాల గనులున్నా.. ఈ దేశంలో పేదరికం పోవట్లేదు
- ముత్తులక్ష్మి రెడ్డి: దేశంలో తొలి మహిళా ఎమ్మెల్యే.. దేవదాసీ వ్యవస్థపై పోరాడిన మొదటి డాక్టర్
- సోనియా గాంధీ గౌను ఇందిర రక్తంతో తడిచిపోయింది..
- అప్పుడు బంగారం వేట.. ఇప్పుడు కోబాల్ట్ రష్
- కరుణ ఎన్ని రోజులు సీఎంగా ఉన్నారో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)