'ఆడపిల్లవి, ఈ పని ఎలా చేస్తావు?' అన్నారు. కానీ 4 వేల దహన సంస్కారాలు నిర్వహించాను

  • 31 జూలై 2018
జయలక్ష్మి

కాటికాపరి పదం వినగానే ఒక పురుషుడు కళ్ల ముందు మెదులుతాడు. ఆ స్థానంలో ఒక మహిళను ఊహించుకోగలరా? మహిళలు కాటి కాపరిగా ఉంటేనే కదా ఊహకందడానికి అనకండి. అలాంటి ఓ మహిళను మీకు పరిచయం చేస్తున్నాం.

ఆమె పేరు జయలక్ష్మి. అనకాపల్లి శ్మశానవాటికలో కాటికాపరిగా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఏకైక మహిళా కాటికాపరి ఈమె.

ఇప్పటిదాకా 4వేల మృతదేహాలకు ఆమె దహన సంస్కారాలు నిర్వహించారు.

మగాళ్లకే కాదు.. ఆడవాళ్లకు కూడా ధైర్యం ఉంటుందని చెబుతోన్న జయలక్ష్మి గురించి మరిన్ని వివరాలు ఈ వీడియోలో చూడండి.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionకాటికాపరి జయలక్ష్మి స్మశాన జీవితం కోసం ఏం చెబుతున్నారు?

గతంలో జయలక్ష్మి భర్త కాటికాపరిగా పని చేసేవారు. ఆయన చనిపోయాక కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. అప్పటికింకా పిల్లలు చిన్నవారు.

పిల్లల బాగు కోసం తన భర్త వృత్తిని తాను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు జయలక్ష్మి.

కానీ ఈ పని చేయడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. తన భర్త వృత్తిని తానే కొనసాగిస్తానంటూ.. అధికారులను సంప్రదించారు జయలక్ష్మి.

'నువ్వు ఆడపిల్లవి.. ఈ పని నువ్వెలా చేస్తావు?' అని అధికారులు ప్రశ్నించారు. అందుకు సమాధానంగా..

''నేను ఈ పని చేయగలను. ఆ పని నాకు ఇప్పించండి. ఒకవేళ సరిగా చేయకపోయినా, నావల్ల ఏ తప్పు జరిగినా ఉద్యోగం నుంచి తీసేయండి అన్నాను.'' అలా 2002లో జయలక్ష్మి ఈ వృత్తి చేపట్టారు.

''ఆ తర్వాత.. నేను ఈ పని చేయడం చూసి, వాళ్లే నాకు దండం పెట్టారు'' అని జయలక్ష్మి బీబీసీతో అన్నారు.

నా మనవడు చనిపోయాక ఏ చిన్నపిల్లాడి శవాన్ని చూసినా ఏడుపొచ్చేది

ఈ పని చేయడానికి జయలక్ష్మి చాలా కష్టపడుతున్నారు. తన పెద్ద మనవడు చనిపోయాక ఈ వృత్తి తనకు కష్టంగా అనిపించినా, పట్టు విడువకుండా కాటికాపరిగానే కొనసాగుతున్నారు.

''నా మనవడు చనిపోయినపుడు చాలా బాధపడ్డాను. ఏ చిన్నబాబుకు దహన సంస్కారాలు చేయాల్సి వచ్చినా తట్టుకోలేక ఏడ్చేస్తాను. చివరికి ధైర్యం తెచ్చుకుని, కన్నీళ్లు తుడుచుకుంటూనే వారికి దహన సంస్కారాలు చేస్తాను. పిల్లాడ్ని కోల్పోయిన వారిక్కూడా ధైర్యం చెప్పి పంపుతాను'' అని జయలక్ష్మి అన్నారు.

తన వృత్తి గురించి ఆమె మనుమలు, మనుమరాళ్లు.. ''అమ్మమ్మా.. ఇయ్యాల ఎన్ని బాడీలు వచ్చాయి?'' అని ఆరా తీస్తారని జయలక్ష్మి చెప్పుకొచ్చారు.

తన వృత్తి గురించి మాట్లాడుతూ.. ''మగాళ్లకు మాత్రమే ధైర్యం ఉంటుందని అంటారు. కానీ ఆడవాళ్లకు కూడా ధైర్యం ఉంటుంది. ఇప్పుడు నేను ఈ పని చేస్తున్నాను కదా..'' అని అన్నారు.

ఇవి కూడా చదండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు