సెల్‌ఫోన్లు ఎందుకు పేలుతున్నాయి? ప్రమాదాన్ని ముందే గుర్తించవచ్చా?

 • అరుణ్ శాండిల్య
 • బీబీసీ ప్రతినిధి
పేలిన స్మార్ట్‌ఫోన్

ఫొటో సోర్స్, Reuters

స్మార్ట్ ఫోన్ల వాడకం పెరుగుతున్న కొద్దీ వాటితో ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి.

అసలు స్మార్ట్ ఫోన్ ఎందుకు పేలుతుంది? ఫోన్ల తయారీలో లోపం వల్లనా? లేక వినియోగదారులు చేసే పొరపాట్లే అందుకు కారణమా?

ఫోన్లు పేలడానికి ఈ రెండూ కారణాలే అంటున్నారు నిపుణులు.

కొన్ని రకాల స్మార్ట్ ఫోన్లు చిన్నపాటి లోపాల కారణంగా గతంలో పేలిపోయిన సంఘటనలను వారు గుర్తు చేస్తున్నారు. అదేసమయంలో స్మార్ట్ ఫోన్ యూజర్‌లు చేసే చిన్నచిన్న పొరపాట్లూ ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతున్నాయంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

బ్యాటరీ ఎందుకు పేలుతుంది?

స్మార్ట్ ఫోన్లు పేలడానికి ప్రధాన కారణం అందులోని బ్యాటరీ. లిథియం అయాన్ బ్యాటరీలతో ఎక్కువగా ఇలాంటి సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు.

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్లలో ఎక్కువగా ఈ రకం బ్యాటరీలనే వినియోగిస్తున్నారు.

వీటిలో లిథియంతో పాటు ధన అయాన్ క్యాథోడ్‌, రుణ అయాన్ ఆనోడ్ ఉంటాయి. ఈ రెండింటినీ వేరు చేస్తూ కర్బన ద్రవం ఎలక్ట్రోలైట్ ఉంటుంది. ధన, రుణ అయాన్లు ఒకదానికొక‌టి తాకితే ర‌సాయ‌న చ‌ర్య జ‌రిగి పేలుడు సంభ‌విస్తుంది. అందుకే రెండింటినీ ఎలక్ట్రోలైట్లతో వేరు చేస్తారు.

వీడియో క్యాప్షన్,

ఈ యాప్స్ ఉంటే మీ ఫోన్ హ్యాక్ అయినట్లే...

బ్యాటరీని ఛార్జ్ చేసినప్పుడు అయాన్లు ఒకే దిశ‌లో ప్ర‌వ‌హిస్తుంటాయి. చార్జింగ్ ప్లగ్ తీసేయగానే అవి విద్యుత్‌ను రెండు వైపులా ప్రసారం చేస్తాయి.

అయితే, ''క్యాథోడ్, ఆనోడ్‌ల మధ్య కర్బన ద్రవంలోంచి లిథియం కదులుతూ ఉంటుంది. క్విక్ ఛార్జింగ్ పద్ధతుల్లో బ్యాటరీని ఛార్జి చేసేటప్పుడు అధిక వేడి ఉత్పత్తి అయి ఆనోడ్‌పై లిథియం పేరుకుపోతుంది. దానివల్ల షార్ట్ సర్క్యూట్ జరుగుతుంద''ని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఎనర్జీ స్టోరేజ్ నిపుణులు క్లేర్ గ్రే తెలిపారు.

బ్యాటరీలను ఒక నిర్దిష్ట ఓల్టేజి విద్యుత్‌తో చార్జి చేసేలా తయారుచేస్తారని, అలాకాకుండా, క్విక్ చార్జర్లతో వేగంగా చార్జ్ చేసేందుకు ప్రయత్నిస్తే ప్రమాదాలు జరగవచ్చని క్లేర్ అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

క్లేర్ ఇంకా ఏం చెబుతున్నారంటే..

 • కొందరు ఫోన్‌ను చార్జింగ్‌లో పెట్టేసి అలా వదిలేస్తుంటారు. దానివల్ల 100 శాతం చార్జింగ్ పూర్తయిన తరువాత కూడా ఇంకా విద్యుత్ సరఫరా అవుతుంటుంది. అయాన్లలో విద్యుదావేశం పెరిగి వేడెక్కి మండిపోతుంది.
 • బ్యాటరీలకు తగినట్లుగానే దాని చార్జర్లనూ తయారుచేస్తారు. ఫోన్‌తో పాటు వచ్చే చార్జర్ కాకుండా వేరేవి వాడినప్పుడు కూడా ఓల్టేజిల్లో హెచ్చుతగ్గులు కలిగి బ్యాటరీ వేడెక్కే ప్రమాదాలకు దారి తీయొచ్చు.
 • ఇవే కాకుండా, స్మార్ట్ ఫోన్ కిందపడినప్పుడు ఒక్కోసారి అందులోని బ్యాటరీ దెబ్బతినొచ్చు. అప్పుడు బ్యాటరీ లోపలి భాగాల్లో చీలికలు ఏర్పడినా, లేదంటే అమరికలో మార్పులు వచ్చినా షార్ట్ సర్క్యూట్‌ జరిగి మండిపోవడానికి కారణం కావొచ్చు.
 • నాణ్యత లేని బ్యాటరీలు వాడినప్పుడూ ఈ సమస్య రావొచ్చు. బ్యాటరీలో లోపలి భాగాల మధ్య కంటికి కనిపించని లోహ రేణువులు వంటివి ఉంటే అవి ఘటాల మధ్య ఘర్షణ జరగడానికి ఆస్కారమిస్తాయి.
 • ల్యాప్‌టాప్‌లలో 6, 12 ఘటాలను కలిపి బ్యాటరీలుగా వాడుతారు. అధిక శక్తి కోసం ఎక్కువ ఘటాలను కలిపి వాడడం అధిక వేడి ఉత్పత్తయ్యేలా చేస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images

ప్రమాదాన్ని ముందే గుర్తించవచ్చా?

బ్యాటరీ విఫలం కావడానికి ముందు ఒక్కోసారి కొన్ని సంకేతాలు కనిపిస్తాయని మొబైల్ ఫోన్ల సమస్యలకు పరిష్కారం చూపించే వెబ్‌సైట్ గీక్ స్క్వాడ్ చెబుతోంది.

బ్యాటరీ పూర్తిగా పనిచేయడం మానేయడానికి ముందు కానీ, పేలడానికి ముందు కానీ అది ఉబ్బుతుందని ఈ వెబ్‌సైట్ సూచిస్తోంది.

అయితే, అన్నిసార్లూ ఇలా జరక్కపోవచ్చని.. ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే ఒక్కోసారి వాటితో ప్రమాదం రావచ్చని కూడా ఈ వెబ్‌సైట్‌లో రాసుకొచ్చారు.

ఒకవేళ బ్యాటరీలు ఉబ్బినట్లు కనిపిస్తే వెంటనే వాటిని ఫోన్ నుంచి తొలగించాలని సూచిస్తున్నారు.

ఫొటో సోర్స్, BELGA_DPA

ఇవి పాటిస్తే సురక్షితం

 • ఫోన్‌తో పాటు వచ్చిన చార్జర్‌నే వినియోగించాలి.
 • ఛార్జింగ్ పూర్తయిన తరువాత ప్లగ్‌ నుంచి తొలగించాలి.
 • పడుకునేటప్పుడు పక్కనే ఫోన్ పెట్టుకుని ఛార్జింగ్ పెట్టొద్దు.
 • ఛార్జింగ్ సమయంలో ఫోన్‌కి ఉండే తొడుగు(కేస్) తొలగించడం మంచిది.
 • ఫోన్ బాగావేడిగా ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే చార్జింగ్ ఆపేయాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)