ప్రెస్‌రివ్యూ: ముస్లిం మహిళలూ! హిందూ యువకులను పెళ్లి చేసుకోండి- సాధ్వీ ప్రాచి

ఫొటో సోర్స్, PTI
ముస్లిం మహిళలు హిందూ యువకులను పెళ్లి చేసుకోవాలంటూ సాధ్వీ ప్రాచి వ్యాఖ్యానించినట్లు నమస్తేతెలంగాణ కథనం పేర్కొంది. ఈ కథనంలో..
ట్రిపుల్ తలాఖ్, నిఖా హలాల నుంచి తప్పించుకోవాలంటే ముస్లిం మహిళలు హిందూ యువకులను పెళ్లి చేసుకోవాలంటూ హిందుత్వ నేత సాధ్వీ ప్రాచీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
వాటికి వ్యతిరేకంగా పోరాడుతున్న బరేలీ ముస్లిం యువతి నిదా ఖాన్ సహా ఇతర ముస్లిం మహిళలను కలుస్తాననీ, హిందుత్వను ఆమోదించాల్సిందిగా వారిని కోరతానని ఆమె అన్నారు.
రాహుల్ గాంధీ అసందర్భ నిర్ణయాలతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మెజార్టీ రాదన్నారు. అందుకే రాహుల్‌కు పెళ్లి చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించాలని ఆమె చెప్పినట్లు నమస్తేతెలంగాణ కథనం పేర్కొంది.
ఫొటో సోర్స్, Raja Singh/Facebook
దేశంలోకి అక్రమంగా చొరబడిన రోహింజ్యాలను, బంగ్లాదేశీయులను కాల్చిపారేయాలని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నట్లు ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించింది. అందులో..
దేశంలోకి అక్రమంగా చొరబడిన రోహింజ్యాలను, బంగ్లాదేశీయులను కాల్చిపారేయాలని, అప్పుడే దేశం క్షేమంగా ఉంటుందని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.
'రోహింజ్యాలు, బంగ్లాదేశీ అక్రమ వలసదారులు భారత్‌ను విచ్ఛిన్నం చేయాలని కుట్ర పన్నుతున్నారు. ఓట్ల కోసం వాళ్లను కాంగ్రెస్ పెంచి పోషించింది. అస్సాంలో అక్రమంగా ఉంటున్న 40 లక్షల మందిని వెనక్కి పంపాలి. మర్యాదగా వెళ్లని వారికి తుపాకీతో సమాధానం చెప్పాలి' అని రాజాసింగ్ అన్నట్లు ఆంధ్రజ్యోతి కథనం వెల్లడించింది.
ఫొటో సోర్స్, Getty Images
స్వదేశీ ఉత్పత్తులకు డిమాండ్ పెంచాలనే యోచనతో ప్రభుత్వం ఆన్లైన్ ఆఫర్లను తగ్గించే ముసాయిదాను రూపొందిస్తున్నట్లు నవతెలంగాణ కథనం పేర్కొంది. అందులో..
ప్రభుత్వం ఈ-కామర్స్ ముసాయిదా పాలసీలో ఆఫ్‌లైన్, ఆన్లైన్ ధరలకు పెద్దగా తేడా లేకుండా నిబంధనలను రూపొందిస్తోంది.
వ్యాపారుల ఒత్తిడి మేరకే ప్రభుత్వం ఈ ముసాయిదా రూపొందిస్తున్నట్లు భావిస్తున్నారు.
ఆన్లైన్లో ఎక్కువగా అమ్ముడవుతున్న విదేశీ ఉత్పత్తులను తగ్గించి, స్వదేశీ ఉత్పత్తులకు డిమాండ్ పెంచాలనే ప్రభుత్వం ఈ ముసాయిదాను తయారు చేస్తోంది.
ఈ-కామర్స్ సంస్థలతో పాటు ఆహారపదార్థాల డెలివరీ సంస్థలు, పేటీఎం, పాలసీబజార్ వంటి ఆర్థిక సంస్థల సేవలను ప్రభుత్వం ఈ ముసాయిదాలో చేర్చే అవకాశం ఉందని నవతెలంగాణ కథనంలో పేర్కొన్నారు.
పిల్లలకు హార్మోన్ ఇంజెక్షన్లు
ఆడపిల్లలను ఎత్తుకొచ్చి వారిని వ్యభిచారం కూపంలోకి దింపుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సాక్షి కథనం పేర్కొంది. ఆ కథనంలో..
పిల్లలకు మాయమాటలు చెప్పి ఎత్తుకొచ్చి, వారిని వ్యభిచార కూపంలోకి దింపుతున్న ముఠా గుట్టు రట్టైంది.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్టలో సాగిస్తున్న ఆ దందాను పసిగట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ముఖ్యంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద భిక్షాటన చేసే ఆడపిల్లలను లక్ష్యంగా చేసుకుని వీరు ఈ దందా నిర్వహిస్తున్నారు.
శరీర అవయవాలు పెరిగేందుకు, పెద్ద వయస్సు ఉన్నవాళ్లలా కనిపించేందుకు వారికి ఇంజెక్షన్లు కూడా ఇస్తున్నట్లు గుర్తించారని సాక్షి కథనం పేర్కొంది.
ఫొటో సోర్స్, Getty Images
ఇకపై లంచం ఇచ్చేవారికీ జైలు శిక్ష తప్పదు. అలాంటి వారికి గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలుశిక్ష విధించడానికి ఉద్దేశించిన చట్టానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేసినట్లు ఈనాడు కథనంలో పేర్కొన్నారు. అందులో...
ఇకపై లంచం ఇచ్చేవారికీ జైలు శిక్ష తప్పదు. వారికి గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలుశిక్ష విధించడానికి ఉద్దేశించిన నూతన చట్టానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు.
అయితే రాజకీయ నాయకులు, అధికారులు, బ్యాంకర్లు తదితరులకు ఈ చట్టం కొంతమేర రక్షణ కల్పిస్తుంది.
అలాంటివారిపై ఏదైనా విచారణ చేపట్టాలంటే సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు అధికార వర్గాల నుంచి ముందుగా ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది.
బలవంతపు పరిస్థితుల్లో లంచం ఇవ్వాల్సి వచ్చినవారిని రక్షించేలా చట్టంలో ఒక నిబంధన చేర్చినట్లు ఈనాడు కథనం పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)