సేల్స్ గర్ల్స్: మాకు కుర్చీలు లేవు, బాత్రూమ్స్ లేవు
- దీప్తి బత్తిని
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
"యాజమాన్యం మాకు టాయిలెట్ సౌకర్యం కల్పించాలనే చట్టం ఏదీ లేదు. మేము బాత్రూమ్ వాడుకోవడం అనేది మా సూపర్వైజర్ మూడ్ మీద ఆధారపడి ఉంటుంది."
టాయిలెట్ సౌకర్యం గురించి హైదరాబాద్‌లోని ఒక మాల్లోని కాస్మటిక్ స్టోర్‌లో పని చేస్తున్న హరిణి చెప్పిన మాటలివి.
కేరళ మహిళా కార్మికులు 8 ఏళ్లు పోరాడి షాపుల్లో 'కూర్చునే హక్కు'(రైట్ టు సిట్)ను సంపాదించుకున్నారు. కేరళ షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాన్ని ఈ మేరకు సవరించబోతున్నారు. ఇంతవరకు షాపుల్లో పని చేసేవారు కూర్చునే అవకాశం ఉండేది కాదు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో పనిచేసే మహిళా కార్మికులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేసింది బీబీసీ. అయితే ఇక్కడ కూడా కనీస సౌకర్యాల విషయంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి.
హైదరాబాద్‌లో ఎన్నో మాల్స్, రకరకాల దుకాణాలు ఉన్నాయి. వాటిల్లో పెద్ద సంఖ్యలో మహిళలు - సేల్స్, సెక్యూరిటీ, హౌస్‌కీపింగ్.. ఇలా అనేక రకాల పనులు చేస్తున్నారు.
ఫొటో సోర్స్, Getty Images
"ఇక్కడ పని చేసేవాళ్లలో చాలామంది హైదరాబాద్ వాళ్లం కాదు. ఉద్యోగం కోసం నేను విశాఖపట్టణం నుంచి వచ్చాను. ఇక్కడ నేను పదేళ్ల నుంచి పని చేస్తున్నాను." అని చెప్పారు హరిణి. ఆమె సేల్స్‌వుమెన్‌గా పని చేస్తున్నారు.
సేల్స్‌లో పని చేసేవారికి ఉండే సౌకర్యాలు ఆయా సంస్థను బట్టి మారిపోతాయని ఆమె తెలిపారు.
"నేను మొదట్లో సికింద్రాబాద్ జనరల్ బజార్‌లోని బట్టల దుకాణంలో పని చేసేదాన్ని. అది చాలా చిన్న షాపు. అక్కడ మేం ఐదుగురు అమ్మాయిలం పని చేసేవాళ్లం. అక్కడ వంతులవారీగా అరగంట పాటు భోజనానికి వెళ్లేవాళ్లం. అదొక్కటే మాకు విరామం.''
''టాయిలెట్‌కి వెళ్లాలంటే అర కిలోమీటర్ దూరంలో ఉన్న యజమాని ఇంటికి వెళ్లాల్సి వచ్చేది. అక్కడ మా కోసం ఒక బాత్రూమ్ నిర్మించారు. మేం రెండు, మూడుసార్లు మాత్రమే టాయిలెట్‌కి వెళ్లే అవకాశం ఉండేది" అని గుర్తు చేసుకున్నారు హరిణి.
మాల్లో జీతం బావున్నా కానీ, ఉద్యోగం మాత్రం కష్టంగా ఉందని చెప్పారామె.
"చిన్న షాపులో కస్టమర్లు లేకపోతే కూర్చోవచ్చు. కానీ మాల్లో మేం కూర్చోడానికి కుర్చీలులాంటివేమీ ఉండవు. కస్టమర్లు లేకపోతే గోడకు జారబడతాం. కుర్చీలు కేవలం ట్రయల్ రూముల దగ్గర మాత్రమే ఉంటాయి. అవీ కస్టమర్ల కోసమే. మేం మా తోటి వర్కర్లను చూస్తుండమని చెప్పి ట్రయల్ రూముల్లోకి వెళ్లి కాస్త ఊపిరి పీల్చుకునే వాళ్లం. పీరియడ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేస్తాం. కూర్చోవడం అనేది కస్టమర్ సర్వీస్పరంగా మంచిది కాదని మాకు చెబుతారు" అన్నారు హరిణి.
ఫొటో సోర్స్, Getty Images
మగ, ఆడ అందరికీ కలిపి 4 బాత్రూమ్లే
టాయిలెట్లు శుభ్రంగా లేకపోవడం మరో సమస్య అని హరిణి స్నేహితురాలు జయ తెలిపారు. ఆమె మరో బ్రాండెడ్ స్టోర్‌లో పనిచేస్తున్నారు.
"ఈ మాల్లో మొత్తం 120 మంది సేల్స్ పని చేస్తున్నాం. ఆడ, మగ.. అందరికీ కలిపి మొత్తం 4 టాయిలెట్లే ఉన్నాయి. అలాంటప్పుడు అవి ఎలా శుభ్రంగా ఉంటాయి? కస్టమర్ల టాయిలెట్లు ఉంటాయి కానీ వాటిలోకి వెళ్లడానికి మాకు అనుమతి ఉండదు. అప్పుడప్పుడు కంపు కొట్టే ఆ టాయిలెట్లు వాడలేక కష్టమర్ల టాయిలెట్లలోకి వెళుతుంటాం" అని చెప్పారు జయ.
ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే ప్రాంతంలోని మరో మాల్లో సౌకర్యాలు చూస్తే, సంస్థసంస్థకూ మధ్య సౌకర్యాలు మారతాయని హరిణి చెప్పిన మాట నిజమే అనిపించింది.
ఆ మాల్లో సిబ్బందికి ప్రత్యేకమైన ప్రార్థనా గది, భోజనాల గది, సేల్స్ మెన్/వుమెన్‌కు వేర్వేరు టాయిలెట్లు ఉన్నాయి.
ఫొటో సోర్స్, Getty Images
మాల్లోని ఒక పెర్ఫ్యూమ్ షాపులో పనిచేసే సోనియా "మిగతాచోట్లతో పోలిస్తే ఇక్కడ మంచి సౌకర్యాలు ఉన్నాయి. కానీ మేం చాలా సార్లు మా షిఫ్ట్ టైం కంటే ఎక్కువసేపు పని చేయాల్సి ఉంటుంది.'' అని తెలిపారు.
''మీరు మాల్స్‌లో గమనిస్తే, సేల్స్ పర్సన్స్ ఎప్పుడూ నుంచునో లేదా గోడకు ఆనుకునో ఉండడం కనిపిస్తుంది. ఇంతకు ముందు పని చేసిన నగల షాపులో కస్టమర్లు లేనప్పుడు కూర్చోవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా విరామం అంటూ కూడా ఏమీ లేదు" అని వివరించారు.
ఫొటో సోర్స్, Getty Images
భోజనం బ్రేక్‌లోనే బాత్రూమ్కు..
అమీర్‌పేటలో సేల్స్‌గర్ల్‌గా పని చేసే మరో యువతి తన పేరు వెల్లడించకూడదనే షరతుపై మాతో మాట్లాడటానికి ఒప్పుకున్నారు.
"నేనో చిన్న షాపులో పనిచేస్తా. అక్కడ బాత్రూమ్ కూడా లేదు. మేం భోజనం చేయడానికి ట్రయల్ రూమ్‌నే వాడతాం. 20 నిమిషాల్లో తినేస్తాం. బ్రేక్ టైమ్‌లోనే తొందరగా వెళ్లి పబ్లిక్ టాయిలెట్ వాడుకుంటాం. తరచుగా టాయిలెట్‌కు వెళ్లే అవకాశం లేనందువల్ల నాకు చాలాసార్లు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది'' అని వివరించారామె.
సేల్స్‌లో పని చేసే మహిళలందరివీ దాదాపు ఒకేరకమైన సమస్యలు. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వీరికి బలమైన సంఘమంటూ లేదు.
ఫొటో సోర్స్, Getty Images
చట్టంలో ఎక్కడా లేదు
1988 నాటి 'ఆంధ్రప్రదేశ్ షాపులు, ఎస్టాబ్లిష్మెంట్ చట్టం' ప్రకారం ఏ ఉద్యోగి అయినా 8 గంటలు పని చేయాలి. ఓవర్‌టైమ్ వారానికి 6 గంటలు దాటకూడదు. ఒకవేళ షిప్టు 5 గంటల కంటే ఎక్కువ సేపు ఉంటే ఆ ఉద్యోగికి గంట విరామం ఇవ్వాలి. ఈ చట్టాన్ని రాష్ర్ట విభజన తర్వాత తెలంగాణ షాపులు, ఎస్టాబ్లిష్మెంట్ చట్టంగా మార్చారు.
అయితే ఆ చట్టంలో టాయిలెట్లు ఉండాలని కానీ, టాయిలెట్‌కు వెళ్లడానికి విరామం ఇవ్వాలని కానీ ఎక్కడా లేదు. ఇప్పటివరకూ టాయిలెట్ అంశంపై ఎవరూ తమను సంప్రదించలేదని తెలంగాణ కార్మికశాఖ ఉపకమిషనర్ శ్యామ్ సుందర్ జాజు చెప్పారు.
"చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉంది. ఈ చట్టం మాల్స్ రాకముందు చేసింది. మాల్ అంటే అనేక షాపుల సముదాయం. కాబట్టి దాన్ని మానిటర్ చేయడం కాస్త కష్టం. అయినా, కొన్ని సౌకర్యాలు కల్పించేలా మేం చర్యలు తీసుకుంటాం. చట్టంలో టాయిలెట్, భోజనం గురించి స్పష్టత లేదు. మాకిప్పటి వరకూ రెస్ట్ గురించి కానీ, టాయిలెట్ల గురించి కానీ ఎటువంటి ఫిర్యాదూ రాలేదు. కేవలం జీతాల చెల్లింపులకు సంబంధిన ఫిర్యాదులు మాత్రమే వచ్చాయి'' అని వివరించారు శ్యామ్‌సుందర్.
అయితే రోజువారీ కూలీ కోసం అడ్డాల దగ్గర జమ అయ్యే కార్మికుల నుంచి మాత్రం టాయిలెట్ సౌకర్యం కోసం విజ్ఞప్తులు వచ్చినట్టు ఆయన తెలిపారు.
పని ప్రదేశాల్లో టాయిలెట్ సమస్యలపై తగిన చర్యలు తీసుకోవడానికి జీహెచ్ఎంసీ, ఇతర ప్రభుత్వశాఖలతో కలసి పనిచేయాల్సి ఉంటుంది అని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)