అభిప్రాయం: వీళ్లకు కావల్సింది భార్యలా? లేక బ్యూటీ క్వీన్‌లు, వంట మనుషులా?

  • వందన
  • బీబీసీ ప్రతినిధి

స్కూల్లో, కాలేజీల్లో కంప్యూటర్ దొరకడమే కష్టంగా ఉండే రోజుల నాటి మాట ఇది. 1998లో ఒకసారి కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు భారత్‌లో పెళ్లి ప్రకటనల గురించి బీబీసీ వెబ్‌సైట్లో రాసిన వ్యాసం అనుకోకుండా నా కంటపడింది.

నాకు బాగా గుర్తు.. ఆ కథనంలో ఓ వ్యక్తి తన పెళ్లి ప్రకటన ఇలా ఇచ్చినట్లు ఉంది.

‘అబ్బాయి ధైర్యవంతుడు, వర్జిన్. వయసు 39 సంవత్సరాలు కానీ చూడటానికి మాత్రం నిజంగా 30ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తాడు. 180సెంటీమీటర్ల ఎత్తు. తెల్లగా అందంగా ఉంటాడు. పూర్తి శాకాహారి. మందు, సిగరెట్లు అలవాటు లేవు. అమెరికాలో ఉద్యోగం చేశాడు. దక్షిణ దిల్లీలో పెద్ద బంగ్లా కూడా ఉంది’ అంటూ రాసుంది.

కానీ తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయిలో అతడు కోరుకుంటోంది ఒక్కటే. ‘అమ్మాయి చాలా అందంగా ఉండాలి, వయసు 30 ఏళ్లకు మించకూడదు’ అని.

ఇది 20ఏళ్ల కిందటి మాటే అయినా, ఇప్పుడు కూడా పెళ్లి ప్రకటనలు ఇంచు మించు ఇలానే ఉంటుండటం చాలా బాధకరం.

గతవారం బెంగళూరులో ఇలాంటి పెళ్లి ప్రకటననే ఓ మ్యాట్రిమోనీ సంస్థ ఇచ్చింది. ఆ సంస్థ నిర్వహించే వివాహ పరిచయ వేదికలో పాల్గొనలాంటే అబ్బాయిలు జీవితంలో అత్యున్నత ‘విజయం’ సాధించినవారై ఉండాలి. అదే అమ్మాయిలకైతే రెండు ఆప్షన్లు. వాళ్లు విజేతలైనా అయ్యుండాలి, లేకపోతే చాలా అందంగానైనా ఉండాలి.

ఫొటో క్యాప్షన్,

చాలామందికి కోపం తెప్పించిన పత్రికా ప్రకటన

ఈ ప్రకటన చాలా మందికి కోపం తెప్పించింది. ప్రకటనపైన నిరసనలు వెల్లువెత్తడంతో చివరికి ఆ సంస్థ క్షమాపణ చెప్పింది.

ఈ మధ్య కాలంలో నాకు పెళ్లి ప్రకటనలను చూస్తుంటే చిర్రెత్తుకొస్తోంది. ఇంకా చెప్పాలంటే, ప్రకటనల కంటే అందులో వధువులకు ఉండాల్సిన లక్షణాల చిట్టాను చూస్తేనే ఎక్కువ కోపమొస్తోంది. అమ్మాయి అందంగా, సౌమ్యంగా, నాజూగ్గా ఉండాలి. ఉద్యోగం చేయాలి లేదా ఇంటిపట్టునే ఉండాలి అంటూ పెద్ద జాబితా రాసుకొస్తున్నారు.

గత ఇరవై ఏళ్లలో పెళ్లి ప్రకటనల్లో మార్పు వచ్చిన మాట నిజమే. అప్పట్లో పత్రికల్లో ప్రకటనలు ఇచ్చేవారు. ఇప్పుడు మొబైల్ యాప్స్‌లో కూడా ఇస్తున్నారు. ఇప్పుడైతే అబ్బాయి-అమ్మాయిల ఫొటోలు కూడా పెడుతున్నారు.

అమ్మాయిలు చీరలు, చుడీదార్లు, జీన్స్, సూట్లు... ఇలా రకరకాల దుస్తులు వేసుకుంటే ఎలా ఉంటారో చూపే ఫొటోలను కూడా పెడుతున్నారు.

ఇన్నేళ్లు గడిచినా అమ్మాయి అందంగా, సన్నగా ఉండాలనే ప్రకటనలు మాత్రం మారలేదు. కాకపోతే ఇప్పుడు అబ్బాయిల్లానే అమ్మాయిలు కూడా సంపాదించాలని కోరుకుంటున్నారు.

ఒక మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ఏకంగా ‘పర్ఫెక్ట్ మేడ్-టు-ఆర్డర్ దుల్హన్ (పెళ్లికూతురు)’ అని తన ట్యాగ్‌లైన్ పెట్టుకుంది. ‘మీ అన్ని డిమాండ్లకూ సరిపోయే పెళ్లి కూతుళ్లు మా దగ్గరున్నారు’ అని ఆ సంస్థ హామీ ఇస్తోంది.

పెళ్లి కూతురు ఏమైనా డిజైనర్ వస్తువా, వినియోగదార్ల డిమాండ్లకు తగ్గట్లు ఉండటానికి?

ఫొటో క్యాప్షన్,

ఓ వెబ్‌సైట్లో అమ్మాయిలను విభజించిన క్యాటగిరీలు

‘ఇంటిపట్టున ఉండేవాళ్లు, వంట బాగా చేసేవాళ్లు, తెల్లగా ఉండేవాళ్లు, సంస్కారవంతమైన వాళ్లు, ఇంగ్లిష్ మాట్లాడేవాళ్లు, పొదుపు చేసేవాళ్లు, లో మెయిన్‌టెనెన్స్’.. ఇలా ఆ వెబ్‌సైట్‌లో పెళ్లికూతుళ్లను కేటగిరీల వారీగా విభజించారు.

ఇలా ప్రకటనలు ఇచ్చేవాళ్లు మనకు తెలీకుండా మన చుట్టుపక్కల చాలామంది ఉన్నారు.

అసలు పెళ్లంటే..?

చట్టపరంగా కానీ, అధికారికంగా కానీ ఇద్దరు వ్యక్తులు ఒక్కటవ్వడమే పెళ్లి అని ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ చెబుతోంది.

కానీ ఈ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో కనిపించే భాషను చూస్తుంటే, ఎక్కడైనా సమానంగా ఉండే వధూవరులు దొరికే అవకాశం కనిపిస్తోందా?

పెళ్లికి ముందే అమ్మాయిలను, అబ్బాయిలను ఈ సంస్థలు విభజిస్తూ, ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన లక్షణాల గురించి ప్రస్తావిస్తున్నాయి. అలాంటప్పుడు సమాన స్థాయిలో ఉండే వధూవరులు ఇక్కడ ఎలా దొరుకుతారు?

బహుశా ఇలాంటి ప్రకటనలపై నిరసన తెలిపేందుకేనేమో.. 2015లో ఇందూజా పిళ్లై అనే యువతి తన తల్లిదండ్రులు ఇచ్చిన పెళ్లి ప్రకటనకు వ్యతిరేకంగా తానే సొంతంగా మరో ప్రకటన ఇచ్చారు.

తన తల్లిదండ్రులు ప్రకటన ఇవ్వడంపై ఇందూజాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఆ ప్రకటనలో చెప్పిన విషయాలకూ, తన అసలు స్వభావానికీ ఏమాత్రం పొంతన లేదని ఆమె చెబుతారు.

ఫొటో క్యాప్షన్,

ఇందూజా పిళ్లై

‘నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను కాను. నేను కళ్లద్దాలు పెట్టుకుంటా. దానివల్ల కొంత ఫ్యాషన్‌కు దూరంగా ఉన్నట్టు కనిపిస్తా. నాకు టీవీ చూడటం అస్సలు ఇష్టం లేదు. నేనెప్పటికీ నా జుట్టు పెంచుకోను. నేను జీవితాంతం కలిసుండదగ్గ అమ్మాయినే’ అని ఇందూ తాను సొంతంగా ఇచ్చిన ప్రకటనలో రాశారు.

ఈ ప్రకటనల ఉచ్చు నుంచి బయటపడేందుకే కాబోలు.. కొన్ని నెలల క్రితం జ్యోతి అనే యువతి నేరుగా తన ఫేస్‌బుక్ పేజీలోనే పెళ్లి ప్రకటన ఇచ్చారు. ‘నాకిప్పటిదాకా పెళ్లి కాలేదు. నా స్నేహితులెవరికైనా మంచి అబ్బాయి తెలిస్తే చెప్పండి. నాకు ఎలాంటి డిమాండ్లు లేవు. కుల, జాతక పట్టింపులు లేవు. మా అమ్మానాన్నా చనిపోయారు. నేను ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో డిగ్రీ చేశా. నా వయసు 28’’ అని జ్యోతి తన ఫేస్‌బుక్ వాల్‌ పైన పోస్ట్ చేశారు.

ఏప్రిల్‌లో జ్యోతి పెట్టిన ఈ పోస్ట్ వైరలయింది. 6100 మంది దీన్ని షేర్ చేశారు. దాదాపు 5వేల మంది కామెంట్ చేశారు.

ఫొటో క్యాప్షన్,

జ్యోతి పెట్టిన ప్రకటన ఫేస్‌బుక్‌లో వైరల్‌గా మారింది

జ్యోతి కోసం ఫేస్‌బుక్‌లో వెతకడం మొదలుపెడితే, గత నెలలో ఆమె తన పెళ్లయినట్లు పోస్ట్ చేసిన ఫొటో కనిపించింది.

వైబ్‌సైట్లు, పత్రికల్లో కనిపించే ఈ ప్రకటనల్లోని భాషను గమనిస్తే ఇప్పటికీ తల్లిదండ్రులు పాతకాలపు ఆలోచనల నుంచి బయటకు రాలేదని అర్థమవుతోంది.

ఆ ప్రకటనలు చదువుతుంటే వీళ్లకు భార్య కావాలా? లేక బ్యూటీ క్వీనో, వంట మనిషో కావాలా? అనే సందేహం వస్తుంది. ఎందుకంటే చాలా ప్రకటనల్లో ‘అందంగా ఉండి వంట కూడా వచ్చిన అమ్మాయి కావాలి’ అనే కనిపిస్తుంది.

అదే అబ్బాయిల విషయంలో అయితే, కులం, ఉద్యోగం గురించిన వివరాలు మాత్రమే ఉంటాయి. మహా అయితే అబ్బాయి మాంసం తినడనో, మందు తాగడనో పెడతారు.

ఈ ప్రకటనల్లో ఎప్పటికి మార్పు వస్తుందో చూద్దామని నేను వీటిని కత్తిరించి నా స్ర్కాప్ బుక్‌లో పెట్టుకుంటున్నాను.

అప్పటి-ఇప్పటి ప్రకటనల్ని గమనిస్తే అబ్బాయిలకు ప్రభుత్వ ఉద్యోగం ప్లేస్‌లో ఎంఎన్‌సీ ఉద్యోగం అని వచ్చి చేరుంటుంది. అమ్మాయిల విషయంలో మాత్రం అదే అందం, వంట ప్రస్తావన. కావాలంటే ఓసారి ఆదివారం పెళ్లి ప్రకటనల పేజీ తెరిచి చూడండి.

ఈ కాలం వాళ్ల కోసం టిండర్, బబుల్ లాంటి కొన్ని యాప్స్ వచ్చాయి. కానీ వాటిని నమ్మొచ్చో లేదోనన్న చర్చ కూడా జరుగుతూనే ఉంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)