ఇద్దరమ్మాయిలు.. ఒక చిన్న విమానం.. లక్ష్యం 23దేశాలు.. గడువు 100 రోజులు

  • 2 ఆగస్టు 2018
ఆరోహి, కీథియర్ Image copyright SOCIAL ACCESS COMMUNICATION PVT LTD

‘ఎగిరిపోతే ఎంత బావుంటుంది’.. అని పాడుకోవడానికి బానే ఉంటుంది. కానీ ఈ ఇద్దరమ్మాయిలు నిజంగానే ఎగిరిపోవడంలో సంతోషాన్ని వెతుకున్నారు. వాళ్లలో ఒకరు 21ఏళ్ల ఆరోహి పండిట్. మరొకరు 23ఏళ్ల కీథియర్ మిస్కిటా.

వీళ్లిద్దరూ ‘మాహి’ అనే ఓ చిన్న స్పోర్ట్స్ ప్లేన్‌లో ప్రపంచాన్ని చుట్టేయడానికి బయల్దేరారు. కేవలం 100 రోజుల్లోనే వీళ్లు ఈ సాహసాన్ని పూర్తి చేయడానికి సిద్ధమయ్యారు. పంజాబ్‌లోని పటియాలా ఎయిర్‌ బేస్ నుంచి ఆదివారంనాడు వీళ్ల ప్రయాణం మొదలైంది.

వీళ్లు ఎక్కడ ఉండాలి? ఫ్లయిట్ ఎక్కడ పార్క్ చేయాలి? ఏ మార్గంలో ప్రయాణించాలి?.. లాంటి విషయాలను గ్రౌండ్ స్టాఫ్ నిర్ణయిస్తుంది. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఏంటంటే.. వీళ్ల ప్రయాణాన్ని గైడ్ చేసే గ్రౌండ్ స్టాఫ్ అందరూ కూడా మహిళలే.

అంతా సవ్యంగా జరిగితే భారత్‌ నుంచి చిన్న విమానంలో ప్రపంచాన్ని చుట్టేసిన తొలి మహిళలుగా వీళ్ల పేర్లు చరిత్రలో నిలిచిపోతాయి.

వీళ్ల విమానానికి ‘మాహి’ అనే పేరు పెట్టడంతో చాలామంది అది క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీని సూచించేందుకు పెట్టారని అనుకుంటున్నారు. కానీ మాహి అంటే భూమి అని, అందుకే ఆ పేరు పెట్టామని ఈ మిషన్ డైరెక్టర్ దేవకన్య ధార్ చెబుతున్నారు.

Image copyright SOCIAL ACCESS COMMUNICATION PVT LTD
చిత్రం శీర్షిక ఆరోహి(ఎడమ), కీథియర్

మాహి ప్రత్యేకతలు

దేశంలో రిజిస్టర్ అయిన తొలి లైట్ వెయిట్ స్పోర్ట్స్ విమానం ‘మాహి’నే.

దీని ఇంజిన్ మారుతీ బలేనో కారు ఇంజినంత శక్తిమంతమైంది. ఇది 215కి.మీ.ల వేగంతో గాల్లో ప్రయాణిస్తుంది.

ఇందులో కేవలం 60లీటర్ల ఇంధనం మాత్రమే పడుతుంది. కాబట్టి, ఆగకుండా ఒకసారి నాలుగున్నర గంటలు మాత్రమే ఇది ప్రయాణించగలదు.

దీని కాక్‌పిట్‌లో కేవలం ఇద్దరు మాత్రమే పడతారు. అంటే.. దాని వైశాల్యం ఓ ఆటో సీటంతే ఉంటుంది. అందుకే ఎక్కువ సేపు ఇందులో కూర్చొని ప్రయాణించడం కూడా కష్టమే. ఒకవేళ ఏదైనా అనుకోనిది జరిగితే ప్యారచూట్ల సాయంతో కిందకు దూకే సౌకర్యం కూడా ఉంది.

Image copyright SOCIAL ACCESS COMMUNICATION PVT LTD
చిత్రం శీర్షిక మాహి

ఆరోహి, కీథియర్‌లు వంద రోజుల్లో మూడు ఖండాల్లోని 23 దేశాలను చుట్టేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీళ్లు పటియాలా నుంచి ఆగ్నేయాసియా మీదుగా జపాన్, రష్యా, కెనడా, అమెరికా, గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, యూరప్‌లను చుట్టి వస్తారు.

వీళ్లిద్దరూ దేశంలోనే లైట్ స్పోర్ట్స్ ఎయిర్‌క్రాఫ్ట్ లైసెన్స్ పొందిన మొదటి వ్యక్తులు. ఇద్దరూ ముంబై ఫ్లయింగ్ క్లబ్ నుంచి బ్యాచిలర్స్ ఆఫ్ ఏవియేషన్ డిగ్రీ పూర్తి చేశారు.

ఆరోహి బాల్యంలో ఓసారి ఓ మహిళ పైలట్‌గా ఉన్న విమానంలో ప్రయాణించారు. భవిష్యత్తులో తాను కూడా పైలట్ కావాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఆమె కల నెరవేరింది.

ఈ సాహసంలో భాగమైన మరో యువతి కీథియర్. నలుగురు అక్క చెల్లెళ్లలో ఆమే పెద్ద. తమ కుటుంబంలో మొట్టమొదటి పైలట్ కీథియరే.

వీళ్లిద్దరూ కలిసి ఏప్రిల్‌ నుంచి తమ యాత్రకు సన్నద్ధమవడం మొదలుపెట్టారు.

Image copyright SOCIAL ACCESS COMMUNICATION PVT LTD

ఈ యాత్రకు వాళ్లు మిషన్ ‘డబ్ల్యుఈ’ (WE) అని పేరు పెట్టారు. అంటే ‘విమెన్ ఎంపవర్‌మెంట్’(మహిళా సాధికారత). ‘బేటీ బచావో, బేటీ బడావో’ పథకం కింద ప్రభుత్వం కూడా ఈ మిషన్‌కు సహాయం చేస్తోంది.

‘మహిళల స్వేచ్ఛను, సాధికారతను ప్రకటించడానికి ఇంతకంటే మంచి మార్గం ఉండదేమో’ అని ప్రోగ్రాం డైరెక్టర్ దేవకన్య అంటున్నారు. వాళ్లు వెళ్లిన ప్రతి దేశంలో ‘అమ్మాయిలను రక్షించాలి, అమ్మాయిలను చదివించాలి’ అనే సందేశాన్ని వినిపిస్తారని ఆమె చెప్పారు.

ఈ యాత్ర నేపథ్యంలో క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బుని సేకరించి దాన్ని పేద యువతుల వైమానిక శిక్షణకు ఉపయోగిస్తామని దేవకన్య చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం