యాదగిరిగుట్ట: ‘బాలికలను కొనుక్కొచ్చి, హార్మోన్లు ఎక్కించి, వ్యభిచారంలోకి దించుతున్నారు’

  • 2 ఆగస్టు 2018
నిందితులు
చిత్రం శీర్షిక యాదగిరి గుట్టలో బాలికల కిడ్నాప్ కేసులో నిందితులు

బయటి నుంచి కొనుక్కొచ్చిన చిన్న పిల్లలకు ఎదుగుదల కోసం బలవంతంగా హార్మోన్లు ఎక్కించి వ్యభిచారంలోకి దింపుతున్న వైనం యాదగిరిగుట్టలో వెలుగులోకి వచ్చింది.

వ్యభిచార గృహాల వద్ద బాలికలు దొరకడం ఇప్పుడు సంచలనంగా మారింది.

బయటి నుంచి పిల్లలను కొని వారికి హార్మోన్లు ఎక్కించి, ఈ వృత్తిలోకి దించుతున్నారు.

యాదగిరిగుట్టలో వ్యభిచార గృహాలు పూర్వం నుంచీ ఉన్నాయి. కొన్ని కుటుంబాలు ఈ వృత్తిని కొనసాగిస్తున్నాయి. పోలీసులు దాడులు చేయడం, పునరావాసం కల్పించడంతో, కొందరు ఆ వృత్తిని వదలి పెట్టడం, కొంత కాలం తరువాత మళ్ళీ వెనక్కి వచ్చే అదే వృత్తిలో కొనసాగుతున్నారు.

ఇక్కడ ఉన్నవారే కాకుండా కొందరు కొత్తగా కూడా ఇక్కడికి వస్తున్నారు. .

అయితే, ఇక్కడ బయటి నుంచి పిల్లలను కొనుక్కొని వచ్చి, వారిని పెంచి, హింసించి వ్యభిచారంలోకి దించుతున్నారన్న సంగతి బయటపడడం ఇదే మొదటిసారి.

చిత్రం శీర్షిక యాదగిరిగుట్ట పోలీసులు

తాజా కేసు ఇలా వెలుగులోకి..

వ్యభిచార వృత్తిలో ఉన్న ఒక మహిళ తన కూతురుగా చెప్పుకునే అమ్మాయిని దారుణంగా కొట్టడాన్ని స్థానికులు చూశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆ దెబ్బలు చూసిన వారంతా కన్న పిల్లలను ఇలా ఎవరూ కొట్టరు అన్న అనుమానంతో విచారించారు. ఆ పాపను కొట్టిన మహిళను పోలీసులు గట్టిగా విచారించే సరికి 'ఇలాంటి పిల్లలు తన దగ్గరే కాదని మరికొందరి దగ్గర కూడా ఉన్నారని' ఆమె పోలీసులకు చెప్పింది.

మరొకరిని విచారిస్తే ఇంకొకరి పేరు చెప్పారు. ఇలా మొత్తం 11 మంది పిల్లలు జూలై 30న వ్యభిచార గృహాల వద్ద దొరికారు.

మరికొందరు అదృశ్యమయ్యారు. వారి గురించి ప్రయత్నం చేయగా, గురువారం భువనగిరి దగ్గర మరో నలుగురు పిల్లలు దొరికారు.

ఇలా ఇప్పటి వరకూ మొత్తం 15 మంది పిల్లలు దొరికారు. వారిలో 14 ఏళ్ల అమ్మాయి ఒకరు ఉండగా, మిగిలిన వారంతా పదేళ్ల లోపు బాలికలే.

15 మంది పెద్ద వాళ్లను అరెస్టు చేశారు. అందులో ముగ్గురు మగ వాళ్లు మిగిలిన 12 మంది మహిళలు. మరో ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి పరారీలో ఉన్నట్టు పోలీసులు చెప్పారు. పిల్లలను హైదరాబాద్‌లోని ఒక స్వచ్ఛంద సంస్థ సంరక్షణలో ఉంచారు.

వీరిపై బాలికలను ఎత్తుకెళ్లడం, మానవ అక్రమ రవాణా, వ్యభిచారం కోసం మైనర్లను అమ్మడం, వ్యభిచారం కోసం మైనర్లను కొనడానికి సంబంధించిన సెక్షన్లతో పాటూ, పిల్లలపై హింసకు సంబంధించిన పోక్సో చట్టం, మానవ అక్రమ రవాణాకు సంబంధించిన ఇతర చట్టాల కింద కేసులు పెట్టారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక హార్మోన్ ఇంజెక్షన్లు ప్రతీకాత్మక చిత్రం

ఒక్కో అమ్మాయికి రూ.25వేల హార్మోన్ ఇంజెక్షన్లు

ఈ కేసులో హార్మోన్ ఇంజెక్షన్ల పాత్ర గురించి పోలీసుల విచారణ ఇంకా కొనసాగుతోంది. పిల్లలు తొందరగా ఎదగడం కోసం వారికి హార్మొన్ ఇంజెక్షన్లు చేయిస్తున్నట్టు నిందితులు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. మరీ చిన్నపిల్లలకు కాకుండా, 11 ఏళ్లు దాటిన అమ్మాయిలకు ఈ ఇంజెక్షన్లు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఒక్కో అమ్మాయికి ఈ ఇంజెక్షన్ ఇవ్వడానికి సుమారు 25 వేల రూపాయలు తీసుకుంటాడని పోలీసులు చెబుతున్నారు.

అదుపులో ఆర్‌ఎంపీ

స్థానికంగా ఉండే నరసింహం అనే ఆర్ఎంపి డాక్టరును అదుపులోకి తీసుకున్నారు. అతను హెర్నియా, ట్యుబెక్టమీ, డెలివరీలు చేస్తుంటాడు. అతని నుంచి మహిళలకు డెలివరీ సందర్భంగా వాడే ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే హార్మోన్లకు సంబంధించి ఏ డాక్టరు ఈ ఇంజెక్షన్లు చేస్తున్నారు, ఏఏ ఇంజెక్షన్లు వాడుతున్నారు అనేదానిపై ఇంకా విచారణ కొనసాగుతోంది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: అనంతపురం, కడప జిల్లాల నుంచి అక్రమ రవాణాకు గురైన మహిళల ఆవేదన

పిల్లలు ఎలా వచ్చారు?

"దొరికిన పిల్లలు తెలుగు మాట్లాడుతున్నారు. వాళ్లు ఎక్కడి నుంచి వచ్చారు? ఎత్తుకొచ్చారా? లేక కొని తెచ్చారా అనేది స్పష్టంగా చెప్పలేం.'' అని యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాసాచార్యులు బీబీసీతో చెప్పారు.

''ఈ పిల్లలందర్నీ ఆరేడు నెలల వయసులో తెచ్చారు కాబట్టి వారికి సొంత వాళ్లు ఎవరనేది తెలిసే అవకాశం కూడా లేదు. మా ప్రాథమిక విచారణ ప్రకారం పేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలను లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు ఇచ్చి కొంటున్నారు. వీరు కాకుండా కొందరు అనాథ పిల్లలను కూడా చేరదీస్తున్నారు. వారికి టీనేజ్ వచ్చే వరకూ పెంచుతున్నారు. తరువాత వారికి తొందరగా పెద్ద మనిషి అయ్యేలా ఇంజెక్షన్లు ఇచ్చి వ్యభిచారంలోకి దించాలనేది వ్యూహం" అని ఆయన బీబీసీకి వివరించారు.

"శంకర్, యాదగిరి అనే ఇద్దరు ఇందులో ప్రధాన నిందితులు. శంకర్ చనిపోయాడు. యాదగిరి పీడీ యాక్టు కింద జైల్లో ఉన్నాడు. వీళ్లంతా ఎప్పటి నుంచో బయటి నుంచి పిల్లలను తీసుకువచ్చి తమ పిల్లల్లా పెంచుతున్నారు. ఇందులో యాదగిరి అనే వ్యక్తికి దాదాపు ఐదు కోట్ల రూపాయలు విలువైన ఆస్తులుంటాయి. వారి వ్యాపార తీవ్రత ఎలా ఉంటుందనే విషయాన్ని దాన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే యాదగిరి సహా మొత్తం ఐదుగురిపై పీడీ యాక్టు పెట్టాం. వాళ్లు ఏడాది వరకూ జైలు నుంచి విడుదల కారు" అని ఏసీపీ వివరించారు.

"మేం వేరే ఉపాధి చూపించినా ఆ పని మానడం లేదు. కేసులు పెట్టినా వినడం లేదు. అందుకే పీడీ యాక్టు ప్రయోగించాం. ఇప్పుడు సిఆర్‌పిసి సెక్షన్ 133 కింద వారి ఇళ్లను కూడా సీజ్ చేస్తున్నాం" అని ఏసీపీ చెప్పారు.

వ్యభిచారం నిర్వహిస్తోన్న ఇంటిని మూడేళ్ల వరకూ సీజ్ చేసే అధికారం అధికారులకు ఉంటుంది. దానిపై కోర్టులో అప్పీలుకు వెళ్లే అవకాశం కూడా లేదు.

Image copyright Getty Images

నియంత్రణ ఎలా?

అన్ని ప్రభుత్వ శాఖలూ సమన్వయంతో పనిచేసి, నిరంతరం ఫోకస్ పెడితే ఇలాంటి ముఠాలను అరికట్టవచ్చంటున్నారు పోలీసులు. గతంలో తాము చేసిన ప్రయత్నాలు ఫలించినా, వారు తిరిగి తమ వృత్తిలోకి వెళ్లిపోయారని వివరిస్తున్నారు.

"మేం ఉపాధి చూపించినా వాళ్లు ఆగడం లేదు. వాళ్లు విలాస జీవితాలకు అలవాటు పడ్డారు. తక్కువ శ్రమతో ఎక్కువ డబ్బు రావడం ఒక కారణం. నేను 2005-06లో నల్లగొండ ఎస్పీగా ఉన్నప్పుడు వీరిపై పనిచేశాను. ఆసరా పథకం కింద కలెక్టరు ప్రతీ ఒక్కరికీ పునరావాసం కల్పించారు. కలెక్టర్, విద్యాశాఖ, ఎన్జీవోలు, హెల్త్ డిపార్ట్‌మెంట్, వెల్ఫేర్ డిపార్టుమెంటు.. ఇలా అందరం కలసి పనిచేశాం. అప్పట్లో బ్రిడ్జి స్కూలు పెట్టి ఈ వృత్తిలో ఉన్న వారి 21 మంది పిల్లలు, ఇతర పిల్లలతో స్కూలు నడిపాం.

యువతకు యాదగిరిగుట్ట గుడిలో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు ఇప్పించాం. అమ్మాయిలకు 3 నెలల ట్రైనింగ్ ఇచ్చి కొందరికి ఉద్యోగాలు ఇప్పించాం. కొందరికి కలెక్టర్ లోన్ ఇప్పించారు. మధ్య మధ్యలో కేసులు పెట్టాం. రెండేళ్ల పాటూ దాదాపు 90 శాతం వ్యభిచారాన్ని నియంత్రించాం. మళ్లీ క్రమంగా పెరిగిపోయింది" అని రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ వెల్లడించారు.

Image copyright Getty Images

"అప్పట్లో పిల్లల్ని కొనడం అనేది లేదు. పిల్లల్ని ఇదే మొదటిసారి చూడ్డం. సంప్రదాయంగా కొన్ని కులాలు ఇందులో ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు ఈ వృత్తికి ఫేమస్. ఇక్కడ ఒత్తిడి పెడితే వేరే ప్రాంతంలోని తమ బంధువుల ఇళ్లకు వెళతారు. అక్కడ చేస్తారు. తరువాత అక్కడి నుంచి ఇక్కడకు వస్తారు. మానవ అక్రమ రవాణా పద్ధతులు మారుతున్నాయి. బ్రోతల్ తరహా వ్యభిచారం తగ్గి ఆన్ లైన్ వ్యభిచారం పెరుగుతోంది. చిన్న పిల్లలు అయితే డబ్బు ఎక్కువ రావచ్చు, కస్టమర్లు ఎక్కువ మంది రావచ్చు అనే ఉద్దేశాలు వారికి ఉండుంటాయి. ఇప్పుడు ఒక కులం వారే ఉన్నారని కూడా చెప్పలేం. అందరూ వస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కొందరు తమ పిల్లలను మంచి ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో చదివిస్తూ, బయటి వారితో ఇలాంటివి చేయించేవారు" అని భగవత్ వివరించారు.

"మేం శాస్త్రీయంగా గమనించిన ఒక విషయం చెబుతా. ఎప్పుడైతే వ్యభిచారాన్ని 90 శాతం అదుపులోకి తెచ్చామో, అక్కడ నేరాల సంఖ్య కూడా తగ్గింది. మీరు యాదగిరిగుట్టు పోలీస్ రికార్డ్స్ చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. వ్యభిచార గృహాలు ఉంటే నేరాల శాతం పెరుగుతుంది. అన్నిరకాల వారు వస్తారు. యాంటీ సోషల్ బిహేవియర్ కంట్రోల్ చేయాలి. ఇలాంటి కేసులు ఒకసారి కేసు పెట్టి చేతులు దులుపుకుంటే కాదు. నిరంతరం ఫాలో అప్ చేయాలి. ఇది కేవలం పోలీసులే కాదు, అన్ని శాఖల సమన్వయంతో చేయాలి. అప్పుడే నియంత్రించగలం. ఇప్పటికే ఉన్నవారిని ఆపడం ఒక ఎత్తు అయితే కొత్తగా అటు వెళ్లే వారిని రాకుండా చూడాలి. అది కీలకమైన విషయం" అంటూ వివరించారు మహేశ్ భగవత్.

మిస్సింగ్ కేసులతో లింక్

చిన్న పిల్లలు మిస్సింగ్, కిడ్నాప్ కేసులతో ఇటువంటి ముఠాల ప్రమేయం ఎంతనే విషయంపై స్పష్టమైన అంకెల్లేవు. కేంద్ర ప్రభుత్వ నేర గణాంకాలు ఉన్నప్పటికీ, వాస్తవ పరిస్థితులతో వాటిని పోల్చితే తేడాలు ఎక్కువ ఉంటాయి.

ఎన్సీఆర్బీ డేటా ప్రకారం.. 2016లో భారతదేశంలో 8,132 మానవ అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి. 23 వేల మంది వరకూ బాధితులున్నారు. అందులో సగానికిపైగా 18 ఏళ్లలోపు వారే ఉన్నారు. ఈ సంఖ్య 2015 కంటే 18 శాతం ఎక్కువ. అంతేకాదు అక్రమ రవాణాలో 90 శాతం వ్యభిచారానికి సంబంధించిన అవసరాలకోసమే పిల్లల్ని తరలిస్తున్నారు. ఇదే అంశంపై ఆంధ్రలో 239, తెలంగాణలో 229 కేసులు నమోదయ్యాయి. కానీ పోలీసు రికార్డుల ప్రకారం అక్రమ రవాణా కేసుల్లో 90 శాతం కోర్టుల్లో నిలబడడం లేదు. దీంతో నిందితులు సులభంగా తప్పించుకుంటున్నారు. 2014 జూన్ నుంచి 2018 జూన్ వరకూ తెలంగాణలో మొత్తం 1397 అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి. 1413 మంది నిందితులను అరెస్ట్ చేసి, 2184 బాధితులను రెస్క్యూ చేశారు. వారిలో 21 మంది బాలురు, 210 బాలికలు కలిపి మొత్తం 231 మైనర్లు ఉన్నారు.

తాజా యాదగిరిగుట్ట కేసు నేపథ్యంలో ఇంకా తేలని మిస్సింగ్ కేసులు, కిడ్నాప్ కేసుల్లో ఎందరు పిల్లలు ఇటువంటి ముఠాల బారిన పడ్డారన్న లెక్కలు స్పష్టంగా లేవు. ఇప్పుడు దొరికిన పిల్లలు మిస్ అయినట్టు లేదా కిడ్నాప్ అయినట్టు ఎక్కడైనా ఫిర్యాదులు నమోదయ్యాయా అనేది పరిశీలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

(ఇది పోలీసులు, స్థానికులుతెలిపిన వివరాల ఆధారంగా రాసిన కథనం)

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: భారత్‌లో వ్యభిచార కూపంలో చిక్కుకుంటున్న నేపాలీ యువతులు

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)