వోగ్ మ్యాగజీన్ కవర్ పేజీపై షారూఖ్ ఖాన్ కుమార్తె.. సినీ జనుల ఆగ్రహం ఎందుకు?

  • 3 ఆగస్టు 2018
షారూఖ్ కూతురి మేగజీన్ కవర్ పేజీ Image copyright CONDE NAST

బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ 18 ఏళ్ల కూతురి ఫొటో తమ కవర్ పేజీపై వేయాలన్న వోగ్ ఇండియా మ్యాగజీన్ నిర్ణయం తీవ్ర విమర్శలకు కారణమయ్యింది.

సుహానా ఖాన్‌కు కవర్ పేజీపై ఉండే అర్హత లేదని సోషల్ మీడియాలో చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ స్థానంలో ఉండడానికి ఆమె ఎలాంటి ఘనకార్యం చేయలేదని పోస్టులు పెట్టారు.

ప్రతిష్టాత్మకంగా భావించే వోగ్ కవర్ పేజీపై సాధారణంగా తమ కేరీర్లో ఉన్నత స్థానానికి చేరిన టాప్ మోడల్స్, నటీమణులు, గాయనీమణుల ఫొటోలు వేస్తారు.

సుహానాఖాన్ తనను తాను "విద్యార్థిని, సినీ అభిమాని, భవిష్యత్తు తార"గా వర్ణించుకుంది.

తండ్రి కింగ్ ఆఫ్ బాలీవుడ్ కావడంతో బంధుప్రీతి వల్లే సుహానాను కవర్ పేజీపై వేశారని చాలా మంది ఫిర్యాదు చేశారు.

చాలాకాలం నుంచి షారూక్ ఖాన్ స్నేహితురాలుగా ఉన్న వోగ్ ఫ్యాషన్ డైరెక్టర్ అనైతా ష్రాఫ్ అదాజానియా ఈ ఫ్యాషన్ షూట్‌ చేయించారు.

ఇది సుహానాకు తొలి ఫొటోషూట్, ఇంటర్వ్యూ.

వోగ్ మ్యాగజైన్ తమ ఇన్‌స్టాగ్రాం ఖాతాలో ఆమెను 'న్యూ గర్ల్ ఆన్ ది బ్లాక్' అని వర్ణించింది. దీనికి 37 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.

దీనిపై తీవ్రంగా స్పందించిన వారిలో నటి కావాలని ప్రయత్నిస్తున్న వారూ ఉన్నారు. తమ అనుభవాలను వర్ణించారు.

ఈ వ్యతిరేకత గురించి సుహానా స్వయంగా తన ఇంటర్వ్యూలో చెప్పింది. ద్వేషించే వారు ద్వేషిస్తారని, కానీ వాటి గురించి తను ఏమాత్రం ఆందోళన చెందనని తెలిపింది.

"అది చికాకు కలిగిస్తుంది, కానీ మిగతా వారికి (నాకంటే) పెద్ద సమస్యలు ఉన్నాయని, నాకు నేను సర్ది చెప్పుకుంటా"నని వెల్లడించింది.

షారూఖ్ ఖాన్ వోగ్ బ్యూటీ అవార్డ్స్ వేదికపై ఈ కవర్ పేజీని ఆవిష్కరించారు. దీనిని ఒక అర్హతగా చూడరనే ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు.

"నాకు అన్నీ సవ్యంగా జరిగాయి. కానీ పిల్లలు, పిల్లలే. మారుతున్న ఈ ప్రపంచంలో కొన్నిసార్లు వారికి ఇంకాస్త సౌకర్యం ఇవ్వడానికి, వారి విశ్వాసం, విలువ పెంచడానికి మనకు స్నేహితుల సాయం అవసరం అవుతుంది. అందుకే, నా కూతురిని కవర్ పేజీపై వేసిన వోగ్‌కు నేను ధన్యవాదాలు చెప్పాలని అనుకుంటున్నా.’’

"ఈమె షారూక్ ఖాన్ కూతురు కాబట్టే ఈ అర్హత సాధించిందని ఎవరూ అనుకోరనే ఆశిస్తున్నా. థాంక్యూ, ఈ కవర్ పేజీపై చోటిచ్చి మీరు ఆమెపై ఉంచిన బాధ్యత.. నా కూతురు కావడంతో ఆమెకు వచ్చిన కొన్ని అర్హతలను దూరం చేయబోతోంది" అని ఆయన అన్నారు.

తన పిల్లలు వారి లక్ష్యాలు అందుకోవడానికి తమదైన శైలిలో పనిచేయడం చూడాలని అనుకుంటున్నట్టు షారూక్ ఆ మ్యాగజీన్‌తో చెప్పారు.

"మాకు చాలా మంచి స్నేహితులు ఉన్నారు. వాళ్లు నా పిల్లలను కూడా తమ పిల్లల్లాగే చూస్తారు. వాళ్లంతా ఆమెను సినిమాల్లో లాంచ్ చేయాలని చాలా సంతోషంగా ఉన్నారు. కానీ నేను నా పిల్లలను స్టార్స్‌లా చూడాలని అనుకోవడంలేదని వాళ్లకు చెబుతూనే వచ్చా. మంచి నటులు అనిపించుకున్నాక వాళ్లను లాంచ్ చేయాలని అనుకున్నా" అని షారూక్ తెలిపారు.

నటి కావడానికి ప్రయత్నించే ముందు చదువు కొనసాగిస్తానని, యూనివర్సిటీకి వెళ్లాలని అనుకుంటున్నట్టు సుహానా తన ఇంటర్వ్యూలో చెప్పింది. కవర్ పేజీ ఆఫర్ అంగీకరించే ముందు తల్లిదండ్రులు తనను బాగా ఆలోచించి, నిర్ణయం తీసుకోవాలని చెప్పినట్టు వివరించింది.

"అమ్మానాన్న ఈ ఆఫర్ గురించి నాకు చెప్పినపుడు ఉద్వేగంగా అనిపించింది" అని సుహానా తెలిపింది.

"నేను అది తెలీగానే, సరే అనేద్దామని అనుకున్నా. కానీ వాళ్లు ఒకసారి ఆలోచించుకోమని, ఇది జనాల్లోకి వెళ్తుందని చెప్పారు. ఈ అనుభవం నుంచి నేను ఆత్మవిశ్వాసం పొందాలని, దాన్ని కోల్పోకూడదని అన్నారు".

సుహానాకు చాలా మంది అండగా నిలిచారు. ఆమెపై ఇలా ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఈ ఫొటోషూట్ చేసిన ఫొటోగ్రాఫర్ ఎర్రికోస్ ఆండ్రూ సుహానాకు చాలా మంచి భవిష్యత్తు ఉందని భావిస్తున్నారు.

"ఆమె కెమెరా ముందు ఎంత సహజంగా ఉందంటే.. అది చూసి అక్కడ ప్రతిఒక్కరికీ మతిపోయింది. నేను ఇలాంటి టాలెంట్ చాలా అరుదుగా చూశాను. ఎందుకంటే చాలా మంది ఇలాంటి వాటికి టాలెంట్ కూడా కావాలని అనుకుంటారు. కానీ ఈ అమ్మాయికి ముందు ముందు చాలా మంచి భవిష్యత్తు ఉంది. నాకు కనిపిస్తోంది".

వోగ్ ఇండియాను ప్రచురించే కాండే నాస్ట్ నుంచి బీబీసీ కామెంట్ కోరింది. వారి నుంచి ఇంకా స్పందన రాలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు