BBC SPECIAL: ‘దేశంలో అతిపెద్ద మారణకాండను నేను ఆరోజే చూశాను’

  • ఎస్.ఆర్.దారాపురీ, ఐపీఎస్ (విశ్రాంత)
  • బీబీసీ కోసం
గువాహటిలో ఆందోళన

భారత చరిత్రలోనే అతిపెద్ద మారణహోమాల్లో ఒకటి 1983లో అస్సాంలో జరిగింది. వేలాది ప్రజల ప్రాణాల్ని తీసిన ఆ శత్రుత్వం ఇప్పటికీ కొనసాగుతోంది.

నాకు 36వ బెటాలియన్ పీఏసీ, కమాండెంట్‌గా పోస్టింగ్ వచ్చిన రోజులవి. ఆ సమయంలో అస్సామీలు కాని వారికి వ్యతిరేకంగా రాష్ట్రంలో తీవ్రమైన ఆందోళన జరుగుతోంది. నిజానికి 1979 నుంచే ఆందోళన కొనసాగుతున్నా 1983 నాటికి అది మరింత ఉధృతమైంది.

అస్సాంకు చెందని వారిని ఆ రాష్ట్రం నుంచి బయటకు పంపించాలన్నదే ఆ ఆందోళన వెనకున్న ప్రధాన కారణం. అస్సామీలు కానివారిలో ఎక్కువగా బెంగాలీ ముస్లింలు ఉన్నారు. వాళ్లకు తోడు ఉత్తర్ ప్రదేశ్, నేపాల్, భూటాన్‌లకు చెందిన వారు కూడా కొందరు అక్కడ స్థిరపడ్డారు.

అప్పుడు అస్సాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆ ఆందోళన కారణంగానే రాష్ట్రంలో బంద్‌తో పాటు కర్ఫ్యూ కూడా విధించారు. కర్ఫ్యూ ప్రశాంతంగా కొనసాగుతున్న సమయంలో 1983 ఫిబ్రవరిలో అక్కడ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ నిర్ణయించారు.

ఈ ఎన్నికలను 1979 ఓటరు జాబితా ఆధారంగానే జరిపించాలని భావించారు. కానీ ఆ జాబితాలో బెంగాలీ ముస్లింలు కూడా అత్యధిక సంఖ్యలో ఉండటంతో దానిపైన ఆసు (ఆల్ అస్సామ్ స్టూడెంట్స్ యూనియన్), ఏజీపీ (ఆల్ అస్సామ్ గణ సంగ్రామ్ పరిషత్)లు అభ్యంతరాలు చెప్పాయి.

ఆ ఎన్నికలను బహిష్కరించాలని ఆ రెండు సంఘాలూ పిలుపునిచ్చాయి. దాంతో ఈ రెండు సంఘాలకు చెందిన నాయకులందరినీ పోలీసులు అరెస్టు చేశారు.

1983 జనవరిలో ఎన్నికల కోసం 8 బృందాలను తీసుకొని అస్సాం వెళ్లాలని నాకు ఆదేశాలందాయి. ఆందోళనకారులు ఉన్నపళంగా కర్ఫ్యూకు పిలుపునిస్తారని, అప్పటికప్పుడు దుకాణాలను మూసేసి, వాహనాల రాకపోకలను ఆపేస్తారని చెప్పారు. బంగ్లాదేశీ ముస్లింలు, హిందువులకు చెందిన దుకాణాలపైన కూడా వాళ్లు తరచూ దాడులకు పాల్పడుతుంటారని అక్కడి డీఏస్పీ నాతో చెప్పారు.

ఒకట్రెండు రోజుల తరవాత నాకు స్థానిక అస్సామీ వ్యాపారులతో మాట్లాడే అవకాశం దొరికింది. వాళ్లంతా బెంగాలీ మాట్లాడేవాళ్లందరినీ బంగ్లాదేశీయులుగానే జమ కడతారని నాకు అర్థమైంది. అస్సామీ వ్యాపారులంతా బెంగాలీలపై చాలా కోపంగా ఉన్నట్లు కనిపించింది.

బెంగాలీలు తమ భూములు కబ్జా చేశారని, వాళ్ల సంఖ్య క్రమంగా పెరిగిపోతోందని స్థానిక వ్యాపారులు చెప్పారు. దానివల్ల కొన్నాళ్ల తరవాత తమ సొంతగడ్డపై తామే మైనార్టీలుగా మిగిలిపోతామేమోనని వాళ్లు భయపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్లను అక్కడి నుంచి పంపించాల్సింది పోయి, వాళ్లకు ఓటు హక్కు కల్పించి, వాళ్లను ఓటు బ్యాంకులా వాడుకుంటోందని అస్సామీ వ్యాపారులు ఆరోపించారు. వలసదారుల వల్ల తమ అస్థిత్వం, సంస్కృతీ సంప్రదాయాలను కూడా కోల్పోతున్నట్లు వాళ్లు చెప్పారు.

అస్సాంలో ఎక్కువగా అహోం తెగకు చెందిన ప్రజలే ఉన్నారు. వాళ్లంతా కలిసి మరుసటి నెల జరగబోయే ఎన్నికలను వ్యతిరేకించబోతున్నట్లు తెలిసింది. మరోపక్క బెంగాలీ ముస్లింలు కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నట్లు, వాళ్లు ఎన్నికల్లో పాల్గొనబోతున్నట్లు తెలిసింది.

బెంగాలీ ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో వాళ్లపై దాడులు జరిగే అవకాశం ఉందని మాకనిపించింది. అందుకే ఎక్కువగా పీఏసీ పోస్టులను అక్కడే ఏర్పాటు చేశాం. కానీ జరిగిన దారుణాన్ని ఆ పోస్టులు ఆపలేకపోయాయి.

ఓ రోజు రాత్రి హాథీకాల్ ప్రాంతంలోని బెంగాలీ ముస్లింల ఇళ్లపై ఆందోళనకారులు దాడి చేశారు. కనిపించిన ప్రతి ఇంటికీ నిప్పు పెట్టారు. ఆడవాళ్లు, పిల్లలు అన్న తేడాలేకుండా దొరికిన వారందరినీ నరికి ఆ మంటల్లోనే వేశారు. ఎవరికీ తప్పించుకునేందుకు వీలు కాలేదు. సుమారు 50మంది ఆ మారణకాండలో చనిపోయారు.

ఆ సమాచారం అందగానే నేను హాథీకాల్ వెళ్లాను. అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి నాకు నోట మాట రాలేదు. ఇళ్లన్నీ కాలిపోయి ఉన్నాయి. అప్పటికే స్థానిక పోలీసులు అక్కడి నుంచి మృతదేహాలను తొలగించారు. కానీ జంతువుల కళేబరాలు మాత్రం ఆ మంటల్లో ఇంకా కాలుతూనే ఉన్నాయి.

పోలీసు ఉద్యోగంలో ఉంటూ రకరకాల కారణాల వల్ల చనిపోయిన వారి శరీరాలు చాలానే చూశాను. కానీ అలాంటి హత్యాకాండను చూస్తానని మాత్రం నేనెప్పుడూ అనుకోలేదు.

ఆ రోజంతా అన్నం తినలేకపోయా. నిత్యం ఆ ఘటనే కళ్లముందు కదలాడేది. ఆ తరవాత అలాంటి ఘటనలు కొన్ని జరిగినా ఆ స్థాయిలో మాత్రం నష్టం వాటిల్లలేదు. ఎన్నికల రోజు వచ్చాక అస్సాం అధికారులు అక్కడ ఎన్నికల డ్యూటీ చేయడం తమ వల్ల కాదని చెప్పారు. దాంతో దిల్లీ, బిహార్ నుంచి సిబ్బందిని రప్పించారు.

ఆ అధికారులందరికీ ఇన్సూరెన్సులు చేయించి వాళ్లను విమానాల్లో అస్సాం చేర్చారు. తమకు ఇష్టంలేకపోయినా బలవంతంగా తమను అస్సాం తీసుకొచ్చారని, తాము ప్రాణాలతో తిరిగి వెళ్తామో లేదోనని భయమేస్తోందని వాళ్లు చెప్పారు. ‘మరేం ఫర్వాలేదు, మేమున్నాం’ అని వాళ్లకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినా వాళ్లలో భయం తగ్గలేదు.

ఎన్నికల రోజున పోలింగ్ సిబ్బందిని సురక్షితంగా బూత్‌లకు తీసుకెళ్లే బాధ్యత మేమే తీసుకున్నాం. కాసేపటికే సిబ్బందిని తరలిస్తున్న కొన్ని వ్యాన్లు పంక్చరైనట్లు సమాచారం అందింది. ఎన్నికలను వ్యతిరేకిస్తున్న వాళ్లే కర్రలకు మేకులు కొట్టి సిబ్బంది వాహనాలు వెళ్లే దారిలో పాతిపెట్టారని, దాని వల్లే వాహనాలు పంక్చరయ్యాయని తరవాత తెలిసింది.

కొన్ని పోలింగ్ బూతుల్లో తేనెటీగల్ని వదలడం, బురద జల్లడం లాంటి పనులు కూడా చేశారు. దాంతో ఆ బూతుల్లో ఆరుబయటే కూర్చొని పోలింగ్ నిర్వహించారు.

పోలింగ్ రోజున ఓటర్లపైన కూడా దాడులు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో ఆందోళనకారులపై మా సిబ్బంది కాల్పులు కూడా జరిపారు. దాంతో ఒక వ్యక్తి మరణించాడు. దాన్ని బట్టి ఆ ఎన్నికలు ఎంత హింసాత్మకంగా జరిగాయో అర్థం చేసుకోవచ్చు.

ఆ ఎన్నికల్లో కేవలం 32శాతం ఓట్లే నమోదయ్యాయి. 108 సీట్లలో 90 సీట్లను కైవసం చేసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

కనీవినీ ఎరుగని విషాదం

అస్సాంలో నేను డ్యూటీలో ఉండగానే నౌగావ్ జిల్లాలోని నెల్లి గ్రామంలో 1983 ఫిబ్రవరి 18న మరో దారుణ మారణ హోమం జరిగింది. ఎన్నికలు ముగిసిన నాలుగు రోజుల తరవాత 13 గ్రామాలకు చెందిన స్థానికులు తుపాకులు, కత్తులు పట్టుకొని నౌగావ్‌‌లోని ముస్లింల బస్తీపైన దాడులకు తెగబడ్డారు.

నేను కలలో కూడా ఊహించని దారుణమైన మారణకాండ అది. ఉదయం 8 గంటలకు మొదలైన ఆ ఊచకోత మధ్యాహ్నం 3 వరకూ కొనసాగింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆ దాడిలో 1800 మంది చనిపోయారు. కానీ అనధికారిక లెక్కల ప్రకారం కనీసం 3వేల మంది చనిపోయారు. ఈ మారణహోమం తరవాత అస్సాం వ్యాప్తంగా బెంగాలీ మాట్లాడేవాళ్లలో భయందోళనలు పెరిగిపోయాయి.

ఆ దాడికి ఫిబ్రవరి 15 నుంచే ప్రణాళికలు రచిస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయని, కానీ ఎవరూ ఎలాంటి చర్యా తీసుకోలేదని తేలింది. ఈ విషయంలో ఏ అధికారినీ శిక్షించిన దాఖలాలు కూడా లేవు.

ఆ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు అస్సాంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో బెంగాలీ ముస్లింలు కూడా స్థానికుల ఇళ్లపై దాడులు చేశారు. ఇంకొన్ని ప్రాంతాల్లో గిరిజనులు కూడా హింసకు పాల్పడ్డారు. బెంగాలీ ముస్లింలను అక్కడి నుంచి తరిమేయాలన్నదే ఈ హింస అంతటికీ కారణం.

జనవరిలో ఎన్నికల ప్రస్తావన మొదలైన నాటి నుంచి నేను 8 నెలల పాటు అస్సాంలోనే ఉన్నా. నాకు తెలిసినంత వరకు ఆ సమయంలో అస్సామీలు, బెంగాలీ మాట్లాడే ముస్లింలు-హిందువులు మధ్య పెరిగిన దూరం, శత్రుత్వ భావన ఇప్పటికీ కొనసాగుతోంది.

2004లో నేను రిటైరయ్యాక, అస్సాంలో ఎన్ఆర్‌సీ (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్)కి సంబంధించిన ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ బృందంలో భాగంగా నేను మరోసారి అస్సాం వెళ్లాను. అస్సాం మాజీ ముఖ్యమంత్రులు తరుణ్ గొగోయ్, ప్రఫుల్ల మహంతాను కలిశాను.

వాళ్లతో పాటు ఎన్ఆర్‌సీకి సంబంధించిన పనుల్లో ఉన్న అనేక సంస్థల సభ్యులతోనూ మేం చర్చించాం.

వీడియో క్యాప్షన్,

అసోంలో 40 లక్షల మంది భారత పౌరసత్వం కోల్పోయే అవకాశముంది.. ఎందుకు?

ఈ నిజ నిర్ధరణ పనులు జరిగే క్రమంలో చాలామందితో మాట్లాడి మేం ఈ విషయాలను కనుగొన్నాం:-

1. స్థానికులు బంగ్లాదేశీ అనే ట్యాగ్ నుంచి విముక్తి పొందే అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని పార్టీలు ఎన్ఆర్‌సీ ప్రక్రియను స్వాగతించాయి.

2. ఎన్ఆర్‌సీ సిద్ధం చేయడానికి అనుసరించిన ప్రక్రియలో చాలా లోపాలున్నాయి.

3. ఎన్ఆర్‌సీ సేవా కేంద్రాల్లో పనిచేసే ఎక్కువమంది ఉద్యోగులు అస్సామీలు. బంగ్లా భాష మాట్లాడేవారిపై పక్షపాత ధోరణితో వారి కేసులను సానుభూతితో చూడడం లేదు. చిన్న చిన్న లోపాల కారణంగా వారి దరఖాస్తులను రద్దు చేశారు.

4. అస్సాంలో 1997లో ఎన్నికల కమిషన్ అవలంబించిన డీ-ఓటర్ పద్ధతి చట్టవిరుద్ధమైంది.

5. పౌరులను డీ-ఓటరుగా ప్రకటించి లేదా విదేశీ ట్రిబ్యునల్ ద్వారా విదేశీయుడనే అభిప్రాయం వ్యక్తమైతే వారిని అరెస్టు చేసి జైల్లో వేయడం తప్పు. ప్రస్తుతం అస్సాంలో సుమారు 1900 మంది జైళ్లలో ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది వివాహిత మహిళలే. వారితోపాటు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఈ జైళ్లలో సౌకర్యాలు కూడా దారుణంగా ఉన్నాయి.

6. 2016లో అస్సాంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక, విదేశీ ట్రిబ్యునల్‌లో జ్యుడీషియల్ అధికారుల స్థానంలో ఐదేళ్లు ప్రాక్టీస్ చేసిన 30 మంది న్యాయవాదులను నియమించారు. వీరిలో చాలామందికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ (ఆర్ఎస్ఎస్)తో సంబంధాలున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.

7. గువాహటి హైకోర్టులో విదేశీయులుగా ఖరారు చేసిన పౌరుల కేసులు ఎన్నో ఏళ్లుగా ఒకే జడ్జి - ఉజ్జల్ భుయా విచారిస్తున్నారు. ఆయన నిష్పక్షపాతంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ బెంచిలో రొటేషన్ ప్రకారం జడ్జిలను ఎందుకు మార్చడం లేదనే ప్రశ్న ఎదురవుతోంది. దీనిపై ఫిర్యాదులు రావడంతో జులై 4న ఆయన్ను ఆ స్థానం నుంచి తప్పించారు.

8. పౌరసత్వం పొందాలంటే పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని సాక్ష్యంగా గుర్తిస్తామని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఎన్ఆర్‌సీ మాత్రం ఇది చెల్లదని చెబుతూ, వేరే సాక్ష్యాలు అడుగుతోంది.

9. విదేశీ ట్రిబ్యునల్‌కు హాజరు కావాలని నోటీసు అందలేదని, లేదా ఆలస్యంగా అందిందని చాలా మంది పౌరులు ఫిర్యాదు చేస్తున్నారు. దాంతో తాము సమయానికి ట్రిబ్యునల్ ముందు హాజరు కాలేకపోయామని, ఫలితంగా పరిస్థితులు ప్రతికూలంగా మారాయని చాలామంది చెప్పారు.

వీడియో క్యాప్షన్,

‘మేం భారతీయ పౌరులమని ఎలా నిరూపించుకోవాలి?’

పై అంశాలన్నీ గమనిస్తే ఎన్‌ఆర్‌సీ ఆపరేషన్‌కు అన్ని పక్షాలూ అనుకూలమనే తెలుస్తోంది. కానీ దానిని రూపొందించే ప్రక్రియలో లోపాలతో పాటు అందులో పనిచేస్తున్న ఎక్కువ మంది ఉద్యోగులు అస్సామీలు కావడంపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

దీని ఫలితంగా జులై 30న జారీ అయిన కొత్త ఎన్‌ఆర్‌సీ ముసాయిదాలో 40,07,707 మందిని జాబితా నుంచి తొలగించారు. అది చాలా పెద్ద సంఖ్య.

విదేశీయులపై జరిగే ఎలాంటి విచారణలూ వీరిపై ఉండవని, పౌరసత్వం విషయంలో చివరి సెటిల్‌మెంట్ వరకూ వారి పౌరసత్వం అలాగే ఉంటుందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అనడం కూడా వింతగా అనిపిస్తోంది. ఎందుకంటే, అదే హోంమంత్రి ఎన్‌ఆర్‌సీని ప్రచురించే రెండు రోజుల ముందు మాట్లాడుతూ భారతదేశంలో అతిపెద్ద జైలు నిర్మాణం అస్సాంలో జరుగుతోందని చెప్పారు. దాన్నిబట్టి చూస్తే... ఆయన వారికి భరోసా ఇస్తున్నారని అనుకోవాలా? లేక భయపెడుతున్నారని అనుకోవాలా? దీనికితోడు బీజేపీ నేతలు అమిత్ షా, కైలాష్ విజయ్ వర్గియాలు వారిని తరచూ చొరబాటుదారులుగా పేర్కొంటున్నారు.

ఇది లక్షలాది ప్రజల జీవన్మరణ సమస్య అని మనం గుర్తుంచుకోవాలి. నాకు ఈరోజు కూడా బంగ్లా భాషీయుల్లో 1983 నెల్లి ఊచకోత తర్వాత ఏర్పడిన అదే భయం, నిరాశ కనిపిస్తోంది. ఈ భయం, నిరాశ, ఆక్రోశం ప్రతీకారంగా ఎక్కడ మారుతుందోనని ఆందోళనగా కూడా ఉంది.

ఈ విషయంలో హిందూ-ముస్లిం రాజకీయాలు జరిగితే, మొదటి నుంచీ అశాంతితో రగిలే ఈశాన్య భారతంలో సమస్య మరింత పెరుగుతుంది. ఆ ఆందోళన ఈశాన్య భారతంలో మరో కశ్మీరుకు జన్మనిచ్చేలా ఉండకూడదు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)