మీ ఫోన్‌లో మీకు తెలీకుండానే ఆధార్ ఫోన్ నంబర్ సేవ్ అయి ఉందా... ఒక్కసారి చూసుకోండి

  • 3 ఆగస్టు 2018
యూఐడీఏఐ నంబర్

ఉదయం నిద్ర లేచి మీ మొబైల్ చూసుకుంటే, అందులో మీకు తెలీకుండానే ఎవరో ఒకరి ఫోన్ నంబర్ సేవ్ చేసి కనిపిస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం చాలామంది భారతీయుల పరిస్థితి అలానే ఉంది.

ఆ జాబితాలో మీరూ ఉన్నారేమో తెలుసుకోండి. మీ ఫోన్ కాంటాక్ట్ బుక్‌లో UIDAI పేరుతో మీకు తెలీకుండానే ఓ కాంటాక్ట్ సేవ్ అయి ఉందేమో ఒక్కసారి చూడండి. దాన్ని తెరవగానే అందులో 1800-300-1947 అనే నంబర్ కనిపిస్తుంది.

ఆ నంబరును అన్ని ఫోన్లలో ఎవరు సేవ్ చేశారో, ఎందుకో చేశారోననేది మిస్టరీగా మారింది.

ఈ నంబర్ చూడ్డానికి ఆధార్ హెల్ప్ లైన్ నంబర్‌లా కనిపిస్తుంది. కానీ డయిల్ చేసి చూస్తే ఆ నంబర్ పనిచేయట్లేదనే జవాబు వస్తుంది. ఈ నంబర్ ఎన్నాళ్ల నుంచి ఫోన్లలో ఉందనేది స్పష్టంగా తెలీదు. కానీ శుక్రవారం ఎలియట్ ఆండర్సన్ అనే వ్యక్తికి చెందిన ‘@fs0c131y’ అనే ట్విటర్ హ్యాండిల్ నుంచి వచ్చిన ఓ ట్వీట్ దీనిపై చర్చకు తెరతీసింది.

‘ఆధార్ కార్డు ఉన్నా, లేకపోయినా, ఎంఆధార్ ఉన్నా లేకపోయినా మీ ఫోన్ నంబర్ చాలామంది కాంటాక్ట్ లిస్ట్‌లో కనిపిస్తుంది. ఆ విషయం వాళ్లకు కూడా తెలీదు. ఇలా ఎందుకు జరిగిందో చెప్పగలరా?’ అని ఎలియట్ ‘యుఐడీఏఐ’ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.

ఈ ట్విటర్ హ్యాండిల్‌ నుంచి గతంలోనూ ఆధార్ గోప్యతకు సంబంధించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.

పుకార్లు, భయాలు, నిజాలు

  • యుఐడీఏఐ నంబర్ కేవలం ఆండ్రాయిడ్ ఫోన్లలోనే సేవ్ అవుతోందని కొందరు చెబుతున్నారు. కానీ, ఐఫోన్లలోనూ ఇది కనిపిస్తోంది.
  • సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయడం వల్ల ఇలా జరిగి ఉంటుందని ఇంకొందరు అంటున్నారు. కానీ, అలా జరగడం అసాధ్యమని రితేష్ భాటియా అనే టెక్ నిపుణుడు చెప్పారు.
  • ఆధార్ కార్డు ఉన్న వాళ్లకే ఇలా జరుగుతోందని భావిస్తున్నారు. కానీ ఆధార్ లేని వాళ్ల ఫోన్లలోనూ ఈ నెంబర్ కనిపిస్తోంది.
  • రెండేళ్లకంటే పాత ఫోన్లలో ఈ నంబర్ కనిపించట్లేదని ఇంకొందరు చెబుతున్నారు. కానీ, పాత ఫోన్లలో కూడా ఇది కనిపిస్తోంది.

ప్రభుత్వ సూచన మేరకు టెలికాం ఆపరేటర్లే ఇలా నంబర్‌ను సేవ్ చేశారనే అభిప్రాయం నెలకొంది. కానీ ఆధార్ కార్డులను నిర్వహించే ‘యూఐడీఏఐ’ సంస్థ దీనిపై స్పష్టతనిస్తూ... ‘మేం మా నంబర్‌ను సేవ్ చేయమని ఎవరికీ ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదు’ అని చెప్పింది.

మొబైల్ ఫోన్ల తయారీదారులకు కానీ, నెట్‌వర్క్ ప్రొవైడర్లకు కానీ ఇలా నంబర్‌ను సేవ్ చేయమని చెప్పలేదని, పైగా అక్కడ ఉన్నది తమ టోల్ ఫ్రీ నంబర్ కూడా కాదని యూఐడీఏఐ సంస్థ తన అధికారిక ట్విటర్ హ్యాండిల్ ద్వారా తెలిపింది.

కొంతమంది ఇది హ్యాకింగ్ ఫలితమని కూడా భావిస్తున్నారు. ‘ఇదే కానీ నిజమైతే, ఏజెన్సీలు మీకు తెలీకుండా మీ ఫోన్లో ఏదైనా నిక్షిప్తం చేయొచ్చు, మరేదైనా సమాచారం తీసుకోవచ్చు’ అని ప్రభు చావ్లా అనే సీనియర్ పాత్రికేయులు ట్వీట్ చేశారు.

ఇది మొబైల్ ఆపరేటర్ల పని కావచ్చేమోనని ముంబయికి చెందిన రితేష్ భాటియా అనే టెక్నికల్ ఎక్స్‌పర్ట్ అభిప్రాయపడ్డారు. ‘సిమ్ కార్డు కొన్నప్పుడు అందులో ‘పోలీస్’, ‘అంబులెన్స్’ లాంటి కొన్ని నంబర్లు కనిపిస్తాయి. కాబట్టి వాళ్లే ఈ నంబర్లు సేవ్ చేసే అవకాశం ఉండొచ్చు’ అని రితేష్ అన్నారు.

ఈ విషయంపై టెలికాం ఆపరేటర్లతో బీబీసీ మాట్లాడింది. అయితే, ఏ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ కూడా ఫోన్లలో తెలీని నంబర్‌ను సేవ్ చేయలేదని ‘సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ తెలిపింది.

2017లోనే అనివర్ అరవింద్ అనే ట్విటర్ యూజర్ ఈ అంశం గురించి ట్వీట్ చేశాడు. కానీ ప్రస్తుతం దీనిపైన విస్తృతంగా చర్చ జరుగుతోంది.

అటు యూఐడీఏఐ, ఇటు టెలికాం ఆపరేటర్లు.. రెండు వర్గాలూ ఈ పనితో తమకు సంబంధం లేదని చెబుతున్నాయి. అలాంటప్పుడు మరి ఈ నంబర్‌ను ఫోన్లలో సేవ్ చేస్తోంది ఎవరు?

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

నన్నయ విశ్వవిద్యాలయంలో లైంగిక వేధింపుల ఆరోపణలు, సీఎం జగన్‌కు లేఖ, ప్రొఫెస‌ర్ సస్పెన్షన్

యుద్ధభూమిలో అమ్మానాన్న మృతి.. చిక్కుకుపోయిన విదేశీ చిన్నారులు.. వీళ్లు ఇళ్లకు చేరేదెలా

అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినం: భారత్‌లో పేదరికం తగ్గుతోందా

‘ఆర్టీసీ కార్మికులతో చర్చల్లేవ్’ - ప్రెస్ రివ్యూ

సెల్ఫీలతో ఇబ్బంది పెడతారు, నంబర్ అడిగి.. ఫ్రెండ్‌షిప్ చేస్తావా అంటారు: తేజస్ ఎక్స్‌ప్రెస్ 'ట్రెయిన్ హోస్టెస్‌'

ఉత్తర కొరియాలో అత్యంత ఎత్తైన పర్వతాన్ని గుర్రంపై ఎక్కిన కిమ్

బీబీసీ 100 వుమన్: ఈ జాబితాలో భారతీయులు ఎంత మంది?

అయోధ్య కేసులో విచారణ పూర్తి, తీర్పు రిజర్వులో ఉంచిన సుప్రీంకోర్టు