#లబ్‌డబ్బు: భారత ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర

  • 4 ఆగస్టు 2018
బైకుల మీద మహిళలు Image copyright Getty Images

ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర ఎంత ఉందనే దాని మీద ఆ దేశ ప్రగతి ఆధారపడి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

కార్మిక రంగంలో కూడా మహిళల భాగస్వామ్యం పురుషులతో సమానంగా ఉన్నప్పుడు దేశ ఆర్థిక వృద్ధి రేటు జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుంది. ఇంతకీ, భారత ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర ఎలా ఉంది? ఈ వారం 'లబ్‌డబ్బు'లో చూద్దాం.

ప్రపంచంలోని ముఖ్యమైన 145 దేశాల ఆర్థికాభివృద్ధిలో మహిళల పాత్రకు సంబంధించిన జాబితాను గమనిస్తే.. భారత దేశం 139వ స్థానంలో ఉంది.

ఒకవేళ కార్మిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పురుషులతో సరిసమానంగా ఉంటే భారత దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 27 శాతానికి చేరుకుంటుంది. ఇది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అధికారిక గణాంకాలు చెబుతున్న మాట.

మెక్ కెంజీ గ్లోబల్ సంస్థ విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం మహిళలు.. పురుషులతో సమానంగా ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములైతే 2025 కల్లా భారత దేశ జీడీపీ 77,000 కోట్ల డాలర్లు దాటుతుందని అంచనా.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: భారత ఆర్ధిక వ్యవస్థలో మహిళల పాత్ర ఎలా ఉంది?

ఇదంతా వినడానికి బాగానే ఉంది.. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందన్నది ముఖ్యం.

కేంద్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం దేశంలో సంఘటిత రంగంలో 53.26 శాతం పురుషులుంటే 25.5 శాతం మహిళలున్నారు. గ్రామాలతో పోల్చి చూస్తే పట్టణాలలో ఈ సంఖ్య కొద్దిగా మెరుగ్గా కనిపిస్తోంది.

ఇక మొత్తం శ్రామిక మహిళల్లో దాదాపు 63 శాతం మంది వ్యవసాయ రంగంలోనే ఉన్నారు. దేశం మొత్తంలో సంఘటిత క్షేత్రంలో మహిళలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం హిమాచల్‌ ప్రదేశ్, అట్టడుగు స్థానంలో ఉన్నది దిల్లీ.

Image copyright Getty Images

2011 లెక్కల ప్రకారం దేశంలో చదువు పూర్తి చేసి కెరీర్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే సమయంలోనే చాలా మంది అమ్మాయిల వివాహాలు అయిపోతున్నాయి.

అంతేకాదు, ప్రపంచ బ్యాంకు చెబుతున్న లెక్కల ప్రకారం, భారతదేశంలో ఏదో ఒక సమయంలో ఉద్యోగాలను వదిలేసే మహిళల శాతం చాలా ఎక్కువగా ఉంది. ఒక్కసారి వదిలేశాక చాలామంది మహిళలు తిరిగి ఉద్యోగాలలో చేరట్లేదు.

ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు చేస్తున్న మహిళలు వేతనాల విషయంలో లింగ వివక్ష, లైంగిక వేధింపులు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. సమాజం, ప్రభుత్వం, ప్రైవేటు రంగ సంస్థలు కలిసి ఈ సమస్యలకు పరిష్కారమార్గం వెతకాల్సిన అవసరం ఉంది. అప్పుడే మహిళలు ప్రగతిని సాధించగలరు, దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధిస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)